వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణగారు క్షమించు గాక!

By Staff
|
Google Oneindia TeluguNews

'వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ వెన్‌ ఐ వాజ్‌....' అనే కథలుండేవి కావు. యాక్టివ్‌ జర్నలిజం నుంచి తప్పుకున్న చాలా మంది జర్నలిస్టులు తాము చేసిన గొప్ప కార్యాల గురించి, రాసిన వార్తల గురించి యువ జర్నలిస్టుల వద్ద ఏకరువు పెట్టడం పరిపాటి. ఈ సికెనింగ్‌ మైండ్‌ జి. కృష్ణకు లేదు. కానీ, ఆయన మాటలు ఝరీ ప్రవాహాలు. ఆయన మాటల్లోని వ్యంగ్యం పదునైన చురకలు. కొత్తా, పాతా లేదు- ఆయన చాలా విషయాల మీద వ్యంగ్య బాణాలు వదిలే వారు. ఆయన వ్యంగ్యంలోని అంతరార్థం బోధ పరుచుకునే లోపల మరోటి విదిలేవారు. కొత్తవారు మొదట్లో తబ్బిబ్బు కావడం పరిపాటి. మనం చాలా గొప్పవని నమ్మిన విషయాల మీద ఆయన విసుర్లు విసిరేవారు. ఒక ఇంగ్లీష్‌ పత్రిక గురించి మాట్లాడుతూ 'మద్రాసు డైలీ' అనేవాడు. జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి నెట్‌వర్క్‌ గల ఆ ఇంగ్లీష్‌ పత్రిక గురించి ఆయన చేసిన వ్యాఖ్యకు ఎదుటివారు తేరుకోవడం కష్టమే. కానీ, ఆయనతో సాన్నిహత్యం పెరుగుతున్న కొద్దీ ఆయన మాటల్లోని సత్యాలు ఒక్కటొక్కటే అనుభవానికి రావడం గొప్ప అనుభూతి.

యాక్టివ్‌ జర్నలిజం నుంచి తప్పుకున్న తర్వాత తన గురించి తానెప్పుడూ గొప్పలు చెప్పుకున్న సందర్భాలు లేవు. ఎవరైనా ఆ గొప్పతనాన్ని ఆపాదించబోతే ఒప్పుకునేవారు కారు. కానీ, చాలా విషయాలు ఆయన మాటల ద్వారా మనకు అర్థమవుతూ వుండేవి. ఆయనకు తెలుగు సమాజంలోని మొదటి తరం రాజకీయ నాయకులు, సాహితీవేత్తలు, సాంస్కృతిక కార్యకర్తలు- ఒక్కరేమిటి- అన్ని రంగాలవారు చాలా దగ్గరగా తెలుసు. ఆయన రిపోర్టింగ్‌ చేసేవారు కాబట్టి ఆ విస్తృత పరిచయాలు జరిగి వుంటాయి. కానీ, ఆయనెప్పుడూ తన పరిచయాలను స్వలాభానికి వాడుకోలేదు. కటిక దారిద్ర్యంతో కాలం వెళ్లబుచ్చుతూ కూడా ఆయన ఆ పని చేయలేదు. ఆయన అడిగితే సహాయం చేయడానికి ఎంతో మంది ముందుకు వచ్చేవారే. ఆయన వల్ల ఆయన భార్య పడ్డ తిప్పలు అంతా ఇంతా కాదు. నిజానికి, కృష్ణగారి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఆమె గురించి చెప్పకుండా వుండడం పెద్ద తప్పే. ఆయనను పసిపిల్లవాడిలా చూసుకునేది. కృష్ణగారు మరణించిన రోజు ఆమె ఎంత రోదించి వుంటుందో తలుచుకుంటే కళ్ల నీళ్ల పర్యంతమవుతాం. ఆయన విశృంఖలత్వం, ఆర్జనపై చులకన భావం ఆమెను ఎంత బాధ పెట్టి వుంటుందో!

బోసి నవ్వు, తెల్లని పంచె, కుర్తా, చివరి రోజుల్లో తెల్ల తల వెంట్రుకలు ఆయన మనసులోని స్వచ్ఛతను పట్టిచ్చేవి. చివరి వరకు ఆయన తన రాతల మీద ఆధారపడే బతికారు. ఎవరు అడిగినా కాదనుకుండా రాసిచ్చేవారు. హైదరాబాద్‌ గురించి ఆయన రాసిన వ్యాసాలు కళ్లకు అద్దుకునేట్లుంటాయి.

సాధారణంగా రిపోర్టర్లకు, రిపోర్టింగ్‌ నుంచి డెస్క్‌కు వచ్చే వారికి సాహిత్యం గురించి చాలా తక్కువ తెలుస్తుంది. కానీ, కృష్ణకు సాహిత్యం విషయాలు ఎన్ని తెలుసో, సాహితీవేత్తలతో అంత దగ్గరి పరిచయాలు వుండేవి. జర్నలిజం కాదు, తెలుగు సమాజం జి. కృష్ణ మరణం ద్వారా ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది.

ఆయన జీవితాన్ని చూస్తే భయం కూడా వేసేది. మన కుటుంబం పరిస్థితి కూడా ఇంతేనా అని మనసు ఆందోళన చెందేది. ఆయనను వాడుకున్న వాళ్లు చాలా మంది వున్నారు. ఆయన పేరును, ఆయన రాతలను కొల్లగొట్టినవారున్నారు. అందుకు ఆయనకు వారు ఏమి ఇచ్చినా తక్కువే. ఈ రకంగా కూడా మనం ఆయన ద్రోహం చేశాం. ఆయనను ఆయనలా వుండనివ్వలేకపోయాం. మనల్ని కృష్ణగారు క్షమించు గాక!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X