• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మూడు జాతుల కవులు

By Staff
|

(విరసం సిటీ యూనిట్‌ ప్రచురించిన 'కాగితప్పులి కళ్లలో భయం' అనే కవితా సంకలనంపై వేలూరి వేంకటేశ్వరరావు రాసిన వ్యాసం రెండవ భాగాన్ని ఇక్కడ చదవండి)

ఆఖరిగా, యన్‌. వేణుగోపాల్‌ రాసిన రెండు వ్యాసాలు, కె. శ్రీనివాస్‌ రాసిన మరో రెండు వ్యాసాల గురించి ముచ్చటించి ముగించుదాం.

'కాగితప్పులి కళ్లలో భయం', వేణగోపాల్‌ గారి ఉపోద్ఘాత వ్యాసం. 'ఇది నిజానికి యుద్ధం కాదు'ట. 'నిస్సహాయుల మీద దుర్మార్గమైన దాడి'ట. 'ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ప్రపంచమంతా ఆకలికీ, రోగానికీ, దుఃఖానికీ, హింసకూ ప్రధాన కారణం, ప్రధాన బాధ్యులు అమెరికన్‌ పాలక వర్గాలు. దుర్మార్గానికి మూర్తీభవ రూపం అమెరికన్‌ పాలక వర్గాలు' అంటారు వేణుగోపాల్‌ గారు. వ్యక్తుల ప్రైవేటు నమ్మకాలపై వాదనలు అనవసరం, అవి ఎంత మూర్ఖ నమ్మకాలయినా సరే.

ఈయన ఇంతటితో ఆగరు. సెప్టెంబర్‌ 11 దాడులు, '.... కొన్ని కోట్ల మందిని బలిగొన్న అమెరికన్‌ పాలక వర్గాల మీద కసి రగిలే క్షణాలలో ఒక అనివార్య విషాద ఫలితంగానే అర్థం చేసుకోవాలి'ట బ్రతికించారు. విషాద ఫలితం అని ఒప్పుకున్నారు, ఏ కలలో ఉన్నారో ఏమో. 1918లో అమెరికన్‌ కార్మికులని ఉద్దేశించి లెనిన్‌ రాసిన లేఖలో ఉగ్రవాదంపై శ్రామిక వర్గాలకుండే భిన్నమైన అవగాహన గురించి ఏకరువు పెట్టాడు. పాపం, లెనిన్‌కి స్టాలిన్‌గారు తరువాత చేసిన దురాగాతాలూ, హింసా కాండలూ తెలియవు కదా. పైగా, ఈ రచయిత రాస్తారు, సంఘ పరివార్‌ వాళ్లు ఇస్లాం పట్ల వ్యతిరేకతను వ్యాపింపజేస్తూ, 'తమ న్యాయమైన డిమాండ్ల కోసం కాశ్మీరీలు ఐదు దశాబ్దాలుగా సాగిస్తున్న పోరాటంతో దీన్ని ముడి పెడుతున్నారు',ట. చైనా వారి చేతుల్లో టిబెట్లో బౌద్ధ మతస్థులు పడే హింసలకి ఈ వ్యాఖ్యాత గారి సమాధానం ఏమిటో తెలుసుకోవాలి.

అంతే కాదు. వేణుగోపాల్‌గారికి, ప్రాణభయంతో పారిపోయి వచ్చి హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న వందల మంది కాశ్మీరీ హిందువులెవ్వరూ తెలియకపోవడం విచారకరం. ఈ యుద్ధం మూలంగా, 'ప్రాచ్య దేశాల నలుపు వర్ణం ప్రజల పట్ల శ్వేత జాత్యహంకారం వ్యక్తమవుతోంది' అని చెప్పుతున్నారు. ఈయనగారి రెండో వ్యాసంలో ఉద్రేకం రెండింతలయి, లెక్కలు తెలియని స్థితి వచ్చింది. 'న్యూయార్క్‌లో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శన జరిపిన పది వేల మంది ప్రజలు' కనిపించారు ఈ నీలం కళ్లజోడు, ఎర్రచొక్కా రచయితకి.

ఈ రచయిత రాసిన ఆఖరి వాక్యాలు చూడండి, మావోని నమిలి మింగి రాసిన 'జ్యోతిష్యం'లా కనిపిస్తుంది. 'అమెరికన్‌ సైనికులు పని చేసేది జీతం కోసం. ఎంత మూర్ఖులైనా తాలిబాన్లు, అఫ్గన్‌ ప్రజలు పోరాడేది ఆశయం కోసం, జీవితం కోసం. చరిత్రలో ఎక్కడైనా ఎప్పుడైనా కిరాయి సైనికులదే పరాజయం. ఆశయం కోసం, జీవితం కోసం పోరాడే వాళ్లదే విజయం.

ఇక, శ్రీనివాస్‌గారు రాస్తున్నారు చూడండి, 'నన్ను క్షమించండి, అమెరికన్‌ పౌరులారా, నా దుఃఖం ఒసామా బిన్‌ లాడెన్‌ మీద ఆగ్రహంగా, ద్వేషంగా మారడం లేదు. అతని పద్ధతులు సమర్థించకపోవచ్చును కాని, ఆ మాటను నేను బుష్‌ గొంతుక నుంచి పలకలేను'. ఇంకా '.... ఎవ్వరూ చేయలేని పని-- ఇవాళ అరబిక్‌ పోరాటవాదులు చేయగలిగినందుకు ఒకానొక అస్పష్ట సంభ్రమంలో పడిపోయామే. మా తెలుగు కవి సామ్రాజ్యవాదాన్ని మట్టికాళ్ల మహారాక్షసి అని వర్ణించాడు. లాడెన్‌ ఎవరైతేనేమి, అతని పవిత్ర యుద్ధాలలోని రాజకీయాలేవి అయితేనేమి-- ఆ మట్టికాళ్లను గుర్తు పట్టాడు'. అందుకుగాను, ఈ రచయితకి లాడెన్‌ అంటే విపరీతమైన అభిమానం, వల్లమాలిని ప్రేమానూ.

శ్రీనివాస్‌ గారి రెండో వ్యాసం ఇంత కన్న దుర్భరం, ఇంత కన్నా ఎక్కువ దుర్గంధ భూయిష్టంగా వుంటుంది. 'అఎn్ఘానిస్థాన్‌ మీద దాడి ప్రారంభించిన నువ్వు (అంటే అమెరికా) తెరిచిన దారి ఇంక ఎన్నటికీ మూసుకోదు, -- అని ఆల్‌ కాయెదా అత్యంత కవితాత్మకంగా చేసిన హెచ్చరికలో భవిష్యత్‌ చిత్రపటం దాగి వున్నది. బతకడానికి తాపత్రయపడుతున్న సమాజం నీది, ఆశయం కోసం చావడానికి సిద్ధపడుతున్న జాతి నాది, ఈ యుద్ధంలో నువ్వెప్పటికీ గెలవలేవు'. అంతేకాదు. 'అటు కొలంబస్‌తోనూ, ఇటు వాస్కోడిగామాతోనూ ప్రారంభమయిన శ్వేత జాతీయ క్రైస్తవ వలసవాద మతోన్మాదంతో ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల ప్రజలు తేల్చుకోవలసిన లెక్కలు చాలా వున్నాయి,' అంటూ ముగిస్తాడు తన వ్యాఖ్యానాన్ని.

వేణుగోపాల్‌ గారు, శ్రీనివాస్‌గారు ఇంత విశృంఖలంగా ఇంత స్వేచ్ఛగా, రాజ్యాంగం ఇచ్చిన వాక్స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేస్తూ రాయగలగడం భారతదేశం కాబట్టి చెల్లుతోంది. ఏ అరబ్బు దేశంలోనైనా, రష్యాలోనైనా, లేదా వీళ్లకి స్ఫూర్తినిస్తున్న చైనాలోనైనా, ఇలా రాస్తే జైలు ఖాయం అని వీళ్లకి తెలియకపోతే, అది కేవలం నీతిచంద్రికలో గాడిద మూర్ఖత్వం.

ఎంత మూర్ఖత్వం కాకపోతే, వీళ్లకి మార్క్స్‌ చేసిన చారిత్రక సిద్ధాంతం, అంత కన్నా ఎక్కువగా ఆయన భవిష్యత్తు గురించి చేసిన ఊహలు ఇటీవలి కాలంలో చాలా విపరీతమయిన సందేహాలకి గురి అయ్యాయని, ఇంకా అవుతున్నాయనీ తెలియదు. వందల యేళ్లుగా నమ్ముకున్న భౌతిక శాస్త్ర సిద్ధాంతాలే తారుమారవుతున్న ఈ యుగంలో పేలవమై, 'అలో లక్ష్మణా' అంటూ పరితపిస్తున్న ఒక కుంటుపడ్డ సాంఘిక సిద్ధాంతం పట్టుకొని త్రిశంకుళ్లలా వేలాడటం, ఆ సిద్ధాంతంలో వస్తున్న మార్పును గ్రహించలేకపోవడం తెలివి తక్కువ తనం.

ముగింపుగా....ఈ మూడు రకాల రచయితలకీ ముఖ్య నినాదం, ప్రపంచకంలో ఇన్ని అనర్ధాలకీ అమెరికాయే కారణం. పిడుగుకీ బియ్యానికీ వీళ్లది ఒకే ఒక్క మంత్రం. అది 'అమెరికా సామ్రాజ్యవాదం'. ఏలూరు కాలవలో నీళ్లు బురద బురద కావడానికి, అస్సాంలో భారీ వర్షాలు కురవడానికి, రాజమండ్రి వీధుల్లో ఊరపందులు స్వైర విహారం చెయ్యడానికి, వాజ్‌పాయెగారి కీళ్లవాతానికి, చంద్రబాబు నాయుడు గడ్డంలో తెల్ల వెండ్రుకల కుచ్చుకీ, గోర్బచేవ్‌ తల మీద పెద్ద ఎర్ చకీ, ...ఇంకేదయినా సరే, వీటన్నటికీ అమెరికా సామ్రాజ్యవాదమే కారణం.

వీళ్లకి అరిచి చచ్చినా అర్థం కాని చిన్న విశేషం ఒకటున్నది. అమెరికా ప్రజలు అమెరికన్‌ ప్రభుత్వాన్ని వేళాకోళం చేస్తూ విమర్శించినంత నిశితంగా ఏ ఒక్కరూ వేళాకోళం చెయ్యలేరు, విమర్శించలేరు అన్న చిన్న విషయం. అలా, సదా మూర్ఖత్వంలో మునిగిపోయి వుండటమే వీళ్లకి శ్రేయస్కరం. చాలా కాలం క్రితం విరసం చచ్చిపోయిందని శివసాగర్‌ అన్నారు. ఆ విషయంలో ఎవరి కన్నా ఇంకా సందేహం వుంటే, ఈ పుస్తకం ఆ సందేహాన్ని నివారించేస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X