వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్తబ్దంగా కొత్త సంవత్సరంలోకి...

By Staff
|
Google Oneindia TeluguNews

కాలం రెండు వేల ఏళ్లలోకి ప్రవేశిస్తున్న దశలో, అంటే 1999 డిసెంబర్‌ నెలాఖరులో తెలుగుదలో కవితా సంకలనాలు విరివిగా వెలువడ్డాయి. కొన్ని కథాసంలనాలు కూడా వెలువడ్డాయి. చాలా ఆవిష్కరణ సభలను డాక్టర్‌ సి. నారాయణరెడ్డి, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌. గోపి అలంకరించారు. వీరిద్దరూ డిసెంబర్‌లో సగటున ఒక ఆవిష్కరణ సభలో పాల్గొన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ కాలంలో వెలువడిన పసునూరి శ్రీధర్‌బాబు కవితాసంకలనానికి ఈ ఏడాది కుందుర్తి అవార్డు లభించింది. ఎన్‌.గోపి కవితా సంకలనం 'కాలాన్ని నిద్రపోనివ్వను'కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అంతకు ముందు ఉధృతంగా వచ్చిన దళిత కవిత్వం, స్త్రీవాద కవిత్వం దాదాపుగా మధ్యేమార్గ కవుల దారిలోకి వచ్చేసింది. విప్లవ కవిత్వం తన వాడిని, వేడిని కోల్పోయింది. వర్గ, కుల, లింగ భేదాల వల్ల విడివిడి శిబిరాలుగా వున్న కవులు, సాహితీవేత్తలు ఒకే గొడుగు కిందికి వచ్చారన్న మాట. కవితా భేదాలు అట్లాగే వున్నా ఆచరణ వైరుధ్యాలు సమసిపోయాయి. రెండు వేల సంవత్సరంలో కవుల, సాహితీవేత్తల మధ్య ఆచరణలో సిద్ధాంత వైరుధ్యాలు పూర్తిగా అడుగంటిపోయాయి. కవిత్వం వస్తువేదైనా కానీ కవులు ఒక్కటైపోయారు. అన్ని శిబిరాల కవులతో హైదరాబాద్‌లో ఏర్పాటయిన 'కవిగానం' దీనికి పూర్తిగా అద్దం పడుతుంది. కవి ఒకే కాలంలో దళిత కవి, స్త్రీవాద కవి, తెలంగాణా కవి, విప్లవ కవి అయ్యే ఒక దశ వచ్చేసింది. ఈ స్థితిలో రెండు వేల సంవత్సరం డిసెంబర్‌ నెలలో కూడా విస్తృతంగా కవితా సంకలనాలు వెలువడ్డాయి. ఈ ఆవిష్కరణ సభల్లో ఎన్‌.గోపితో విప్లవ కవిగా ముద్ర పడ్డ కె. శివారెడ్డి వేదికను పంచుకున్నారు. ఏది రాసినా ఫరవా లేదు కవిత్వం రాస్తే చాలు అనే అభిప్రాయం నాటుకుపోయింది. 1999 చివరి దశకం వరకు విప్లవ కవిత్వం పదును తగ్గి, దళిత, స్త్రీవాద, ముస్లిం మైనారిటీ కవిత్వాలు ఏకకాలంలో ఉధృతంగా వచ్చాయి. రెండు వేల సంవత్సరంలో వాటి బలం, ప్రాబల్యం తగ్గిపోయింది. దళిత, స్త్రీవాద, మైనారిటీ ముస్లిం కవులు ముందుకు పోలేని ఓ సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. దాదాపుగా ఈ మూడు రకాల కవిత్వాలు స్టాగ్నేషన్‌కు గురయ్యాయి.

ఈ కవులు ముందుకు పోలేకపోవడానికి ప్రధాన కారణం- ఆ ఉద్యమాలు బలంగా లేకపోవడం. ఉద్యమాలు బలంగా వున్నప్పుడు కవిత్వం ముందుకు సాగుతుంది. ఉద్యమాలు ముందుకు పోలేకపోవడానికి కారణమేమిటో ఆ ఉద్యమ కవిత్వం రాకపోవడానికి కారణం కూడా అదే. స్త్రీ, దళిత, ముస్లిం మైనారిటీ కవులు ఇప్పటి వరకు తమను తాము వ్యక్తీకరించుకున్నారు. పురుష అహంకార సమాజంలో, అగ్రకుల ఆధిపత్యంలో, మెజారిటీ మత ఆధిపత్యంలో తాము నలిగిపోతున్న విషయాలను, తమ హక్కులను కోల్పోతున్న విషయాలను వారి కవిత్వాలు వ్యక్తీకరించాయి. అంటే, మనమీ స్థితిలో వున్నాం, దీన్ని ఎదుర్కుని ముందుకు సాగాలి అనే విషయాన్ని స్పష్టంగా, బలంగా ముందు పెట్టాయి. ఈ ఉద్యమాలు ఎలాగైతే కొంత మంది స్త్రీలు, దళితులు, మైనారిటీలు ఆధిపత్య వర్గాల్లో చేరిపోవడానికి (అంటే, సమాజంలో నిచ్చెనమెట్లు అధిరోహించడానికి) పనికి వచ్చాయో, ఈ కవిత్వాలు కూడా మధ్యేమార్గ కవులు (మెయిన్‌ స్ట్రీం కవులు) పొందుతున్న గుర్తింపును (అవార్డులను, పేరు ప్రతిష్టలను) పొందడానికి ఉపకరించాయి. దీంతో ఇప్పటి వరకు రాస్తున్న కవిత్వం నెరవేర్చాల్సిన ప్రయత్నం నెరవేరింది. ముందుకు పోవడానికి దారి ఏది? అయితే, దీంతో ఆగిపోవాల్సిందేనా? ఈ స్తబ్ధతను దాటే మార్గం వున్నదా?

కవులు కెరియరిస్టులుగా మారిపోయిన దశ ఇది. కవి ప్రతిపక్ష పాత్ర పోషించే దశ దాటిపోయిందన్న మాట. ఇప్పుడొక కొత్త పద్యం రావాలి. లేదా, ఇప్పటి దళిత, ముస్లిం మైనారిటీ, స్త్రీవాద కవులు ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధపడాలి. అవార్డులు, గుర్తింపులు- మొత్తానికి కెరియరిస్టు ధోరణికి స్వస్తి చెప్పాలి. మన కళ్ల ముందే మన కీర్తిప్రతిష్టలు చుక్కలను తాకాలనే తహతహ మానేయాలి. అచ్చులో నిరంతరం పేరు కనిపించాలనే కోరిక నశించాలి.

ఈ మూడు వాదాల కవులు నిర్వర్తించాల్సిన ప్రతిపక్ష పాత్ర ఏమిటన్నప్పుడు- దళిత, స్త్రీ, మైనారిటీ ఉద్యమాల గతి గురించి ఆలోచించక తప్పదు. ఇవి ప్రధానంగా సాంస్కృతిక రంగంలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సి వుంది. ప్రపంచీకరణ, మార్కెట్‌ ఎకానమీ ఉధృతమైన వాతావరణంలో దేశం పరోక్ష వలసలోకి వెళ్లిపోతున్న పరిస్థితిలో దేశీయత వాటికి ప్రాణం పోయాలి. ఈ మూడు ఉద్యమాలు కూడా స్వదేశీ ఉద్యమాన్ని తీసుకోవాల్సి వుంటుంది. ప్రస్తుతం నడుస్తున్న స్వదేశీ ఉద్యమం ఈ ఉద్యమాలు ఒక్కటి కానవసరం లేదు. ఈ మూడు రకాల కవిత్వాలు కూడా ఈ దిశలో సాగాల్సి వుందన్న మాట. మొదటి దశను ఈ మూడు ధోరణులు సమర్థంగానే దాటి వచ్చాయి. ఈ రెండో దశ దగ్గరే అవి కెరియరిస్టు భావాల బలం వల్ల ముందుకు రాలేకపోతున్నాయి. వచ్చే ఏడాదయినా ఈ ఆశలకు చిగురు వేయాలని కోరుకుందాం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X