వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగంబర కవిత్వం: ఆదిపర్వం

By Staff
|
Google Oneindia TeluguNews

(తెలుగు సాహిత్యంలో దిగంబర కవితోద్యమం ఒక షాక్‌ ట్రీట్‌మెంట్‌. తెలుగు సాహిత్య రంగాన్ని ఒక కుదుపు కుదిపిన ఈ ఉద్యమం ప్రాదుర్భావం గురించి దిగంబర కవుల్లో ఒకరైన భైరవయ్య మాటల్లోనే.....)

1965 మార్చి నెలాఖరు. మెడ్రాసు నుంచి తిరిగి వచ్చాను. ఒక రోజు పొద్దుటే హెచ్‌.ఎం. కేశవరావు వచ్చాడు. ''ఈ సాయంత్రం అసెంబ్లీలాన్‌లో సమావేశం ఉంది. చాలా ముఖ్యమైనటువంటిది. తప్పకుండా రా'' అన్నాడు.

నాకు హైద్రబాద్‌లో సాహిత్య ప్రపంచంతో పరిచయం 'నవత' ఆవిర్భావింతో జరిగింది. 'నవత' త్రైమాసిక పత్రికకి నేను సంపాదకుడిగా వుండేవాడిని, ముఖ్య సంపాదకుడు శ్రీశ్రీ. 'నవత' పత్రిక పెట్టాలన్న ఆలోచన శిష్టా జగన్నాథానికి, నాకు వచ్చింది. అతనే నన్ను 'సాధనా సమితి'కి పరిచయం చేశాడు. సాధానా సమితి సమావేశాలలోనే నగ్నముని, నిఖిలేశ్వర్‌, చెరబండరాజుల పరిచయం అయ్యింది. అప్పుడు వాళ్ల పేర్లు ఎమ్‌.హెచ్‌. కేశవరావు, కె. యాదవరెడ్డి, బద్దం భాస్కర రెడ్డి. అక్కడి నుంచి ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ సమావేశాలకి ఆహ్వానం వచ్చింది. అక్కడ జ్వాలాముఖి (వి. రాఘవాచారి) పరిచయం అయింది. అక్కడికి కుందుర్తి కూడా వచ్చేవాడు. ఆ సమావేశాలు నారాయణగుడాలో ఉన్న అరిపిరాల విశ్వం ఇంట్లో అయ్యేవి.

సరే, నేను ఆనాటి సాయంత్రం అసెంబ్లీ లానుకు చేరాను. అక్కడ నగ్నముని, నిఖిలేశ్వర్‌, జ్వాలాముఖి, చెరంబడరాజు, మహాస్వప్న, జి. సుబ్రహ్మణ్యమ్‌ వున్నారు.

నగ్నముని పథకాన్ని వివరించడం ప్రారంభించాడు. నాటి సాహితీ ప్రపంచంలో స్తబ్దత, రాజకీయ అనిశ్చలత మొదలైన విషయాలు చాలా మా చర్చలో వచ్చాయి. దీన్ని తొలగించడానికి ఏదైనా చెయ్యాలి. అది మామూలు సున్నితమైన విధానాల్లో వుండకూడదు అనుకున్నాం.

షాక్‌ ట్రీట్‌మెంటు ద్వారా తప్ప ఈ స్తబ్దత తొలగదని నిర్ణయం చేసుకున్నాం. కులాన్ని ప్రతిబింబించే రెడ్డి, శాస్త్రి, ఆచారి లాంటి పదాల్ని విడిచిపెట్టాలని, కొత్త పేర్లు అందుకనుగుణంగా పెట్టుకోవాలని అనుకున్నాం. కాలమానం అవీ మార్చడం, షాక్‌ ట్రీట్‌మెంటులో ఒక భాగమే.

దిగంబర కవితా వుద్యమం ప్రారంభం కావడానికి ముందే, నగ్నముని, మహాస్వప్న, నిఖిలేశ్వర్‌ లబ్ద ప్రతిష్టులు. సాహిత్య బలంతో కన్నా 'నవత' కార్యకర్తగా నేను నలుగురి నోళ్లలో నలుగుతూ వుండేవాడిని. ప్రథమ సంపుటి ప్రచురణ భారాన్ని నగ్నమునే భరించాడు. ఈ తరువాత నుంచి అందరం ప్రతి నెలా పది రూపాయల చొప్పున వేసుకున్నాం.

దిగంబర కవితా ఉద్యమానికి నాయకులంటూ ఏ ఒక్కరూ లేరు. అది సామూహికం అయినా ఆద్యుడు నగ్నముని అన్నది నిర్వివాదాంశం. అతడు సూత్రధారి. సంధాన కర్త. మా అందర్నీ కూడగట్టింది అతను. చాలా మటుకు దిగంబర కవితా వుద్యమానికి రూపకల్పన చేసింది అతను. అది చారిత్రక సత్యం. కాదనడం చరిత్రని కాదనడమే.

దిగంబర కవితా ఉద్యమం క్రమంగా పుంజుకుంది. ''అది ఒక ఫార్స్‌'' అన్న వాళ్లే, అందులో వున్న తీవ్రమైన కవితా శక్తిని గుర్తించక తప్పలేదు. నేటికీ దిగంబర కవులు కవులు కారు. వాళ్లలో కవిత్వం లేదని మహానుభావులున్నారు. ఏం చేస్తాం. ఎవరి కూపస్థం వారిది.

మేమందరం ఆబిడ్స్‌లోని 'కింగ్‌ సర్కిల్‌' హోటల్లో ఎక్కువగా కలుసుకునేవాళ్లం. అభిప్రాయాలు, భేదాభిప్రాయాల చర్చలు అన్నీ అక్కడే జరిగాయి. మూడో సంపుటి వెలువడిన తర్వాత అభిప్రాయభేదాలు వెలుగులోకి వచ్చాయి.

వ్యక్తి స్వేచ్ఛ, ప్రత్యేకించి ఏ రాజకీయపరమైన పార్టీకి కాని దిగంబర కవితోద్యమం ప్లాట్‌ఫారమ్‌ కాకూడదన్నది ఆ వుద్యమానికి ప్రాతిపదిక. దానికి భిన్నంగా జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌, చెరబండరాజు వామపక్ష రాజకీయాల వైపు మళ్లి, వుద్యమాన్ని ఆ మార్గం మళ్లించాలని నిశ్చయించుకున్నారు. దానికి నేనూ, మహాస్వప్న, కొంత వరకు నగ్నముని అంగీకరించలేదు. అవసరమైనప్పుడు సపోర్డు చెయ్యడమే తప్ప కట్టుబడి వుండకూడదని, విమర్శించే హక్కు పోగొట్టుకోకూడదని మా వాదన. అందుకు జ్వాలాముఖి వాళ్లు అంగీకరించలేదు. అప్పటికి నక్సల్‌బరీ వుద్యమం వ్యాప్తి చెందింది. జ్వాలాముఖి, నిఖిల్‌, చెరబంబరాజు దాని వైపు ఆకర్షింపబడ్డారు. వ్యక్తిగత స్వేచ్ఛ, విమర్శించే హక్కు వదులుకోకూడదనే మా అభిప్రాయంతో వారు ఏకీభవించలేదు. అందువల్ల దిగంబర కవులు విడిపోవడం జరిగింది. అప్పటికి 'విరసం' ప్రాదుర్భావానికి రంగం సిద్ధం చెయ్యబడింది. నేనూ మహాస్వప్న తప్ప మిగతా వాళ్లు విరసం ఏర్పాటుకి దోహదం చేశారు. అదీ సంగతి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X