వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నీటి వెతలు నా రచనలు: బోయ జంగయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

తెలుగు కథా సాహిత్యంలో బోయ జంగయ్యకు ఒక స్థానం వుంది. తనదంటూ ఆయనకో ముద్ర వుంది. బోయ జంగయ్య రచనావ్యాసంగం 1964లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అనేక కవితలు, కథలు రాశారు. తన సాహిత్య నేపథ్యం గురించి ప్రస్తావించినప్పుడు- ''చుట్టూ చూస్తున్న విషయాలు సాటి మనుషుల బాధలే నా కథావస్తువులు'' అని ఆయన చెప్పారు. ''చాకిరి చేస్తూ అవమానాలకు గురవుతున్న నా తోటి మానవులను చూసి ఆత్మ ఘోషిస్తుంది. వాటిని తట్టుకోలేక అరిచిన అరుపులే నా కవిత్వం, నా కథలు, నా సాహిత్యం'' అని బోయ జంగయ్య 'ఇండియా ఇన్ఫో'తో అన్నారు.

సమాజంలోని కింది వర్గానికి చెందిన జంగయ్య అట్టడుగు వర్గాల బాధలను, వేదనలను చూసి వాటికి కారణాలను అన్వేషించే ప్రయత్నం చేశారు. అందుకే ''ఎంతో మంది బాగా బతుకుతున్న ఈ సమాజంలో కొంత మందే కష్టాలకు గురి కావడం, కన్నీరు కార్చడం నన్ను కలచివేసింది. ఈ బాధలకు కారణాలేమిటి, బాధ్యులెవరు అనే ప్రశ్నల పరంపరలే నా రచనలు'' అని చెప్పగలిగారు.

సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన మీరు సాహిత్యంలో ఆ రకంగా వివక్షకు గురయ్యారా? అని ప్రశ్నిస్తే ''అదేం లేదు. బాల్యంలో అవమానాలకు గురైన మాట వాస్తవమే. చదువుతూ ఎదుగుతున్న క్రమంలో నేను ముక్కు సూటిగా ప్రశ్నించడం మొదలు పెట్టాను. అలా ప్రశ్నించినప్పుడు లోలోపల తోటి వాళ్లు ఏమనుకున్నారో గానీ ఎదురు పడ్డప్పుడు మంచిగానే స్వీకరించారు'' అని సమాధానమిచ్చారాయన.

''రచయితగా, కవిగా ఎదుగుతున్నప్పుడు నన్ను ఎవరూ అవమానించలేదు. ఆదరించారు. ఆదరిస్తున్నారు కూడా'' అని నిష్కపటంగా చెప్పిన బోయ జంగయ్య వంద కథలకు పైగా రాశారు. 'జాతర' అనే ఒకే ఒక నవల రాశారు. ''మీరు కథలకు వస్తువును ఎలా ఎన్నుకుంటారు?'' అని అడిగిన ప్రశ్నకు ''జనం బాధలే నా వస్తువులు. కొన్ని నా సొంత అనుభవాలు, కొన్ని చూసినవి, కొన్ని విన్నవి. నేను ఎక్కువగా పుస్తకాలు చదవలేదు. ఉద్యోగరీత్యా మనుషులను ఎక్కువగా చూడడం, వారితో మాట్లాడడం నా సాహిత్యానికి పునాదులు వేశాయి'' అని ఆయన జవాబిచ్చారు.

''మీ సాహిత్యం నెరవేర్చే ప్రయోజనం ఏమిటని అనుకుంటున్నారు?'' అని అడిగితే ''ఇప్పటి సాహిత్యం ప్రశ్నించే తత్వాన్ని నేర్పుతుంది. సామాన్యులు ప్రశ్నించడం నేర్చుకుంటే సమస్యలు కొంత మేరకు తీరినట్లే. భజన సాహిత్యం పోయి అందరికీ అందుబాటులో వుండే సృజన సాహిత్యం వస్తోంది. కాబట్టి నా రచనలు అవసరమైన ప్రయోజనం నెరవేరుస్తున్నట్లే'' అని చెప్పారాయన.

స్త్రీ, దళితవాదాలపై తన అభిప్రాయం వెల్లడిస్తూ- ''సామాజిక రుగ్మతలను బట్టి సాహిత్యం వెలువడుతుంది. మార్పును ఆమోదించక తప్పదు. దళిత, స్త్రీవాద సాహిత్యాలను ఆహ్వానించాల్సిందే. అయితే, ఇలా వస్తున్న సాహిత్యం వెర్రితలలు వేయకుండా చూడాల్సిన బాధ్యత మేధావులపై వుంది'' అని అన్నారు. ఈ సాహిత్యరీతులు ఏ విధమైన వెర్రితలలు వేస్తాయంటారని అడిగితే- ''కులాల వారీగా తిట్టుకోవడం, మహిళలు స్వేచ్ఛ పేరుతో మగవారిని అణచివేసే విధంగా వ్యవహరించడం మంచిది కాదు. కుటుంబ జీవితం విచ్ఛిన్నం కాకూడదు. మహిళలు ఆర్థిక స్వేచ్ఛను పొందాల్సిందే. అవమానాలకు గురి కాకుండా కాపాడుకోవాల్సిందే. అయితే, ఇంతకు ముందటి పురుషాధిపత్యం వలె మహిళల కొత్త ఆధిపత్యం రాకూడదు. వస్తే ప్రమాదం'' అని వివరించారు బోయ జంగయ్య.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X