వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధునిక కవుల ఆయువుపట్లు-కాళోజి

By Staff
|
Google Oneindia TeluguNews

ఆపరేషన్‌ టేబుల్‌పైని కవిత్వం నగ్నదృశ్యం ఇది. శ్రీశ్రీ, దేవులపల్లిల భాషని కాదని లిఖిత రూపంలో చాలా వైవిధ్యంగా, సులభంగా కవిత్వం రాసినవాడు కాళోజి. సంస్కృత పదాలని కాకుండా, ఆ వాక్య నిర్మానం కాకుండా ఆ వ్యాకరణానికి దూరంగా తెలుగులో 'జాతి కవిత్వాన్ని' వ్రాసి వేమనని తలపించి, జానపదుణ్ని తలకెత్తిన కాళోజికి ఎందుకు కవిత్వ చరిత్రలో చోటు లేదు?

ఆయన కూడా కావాలని ఎన్నడూ అడగలేదు. ఆయన అభిమానులూ పట్టించుకోలేదు. కాని అరవై ఏళ్ల కాలం ఒక ప్రశ్నని సంధిస్తే ఏం జవాబు వస్తుంది?
ఏడు కవిత్వ సంపుటాల్ని 'అమూల్యంగా' (వెల పెట్టకుండా) అందించాడు. కవిత్వాన్ని పాఠ'గుడిసె'కి చేర్చినాడు. విమర్శకులకీ, పండితులకీ అందించే ఉద్దేశం లేదు. అట్టహాసాల కృత్రిమత్వం లేదు. వ్యాపార పత్రికా ప్రచార సహకారోద్దేశాలు లేవు. సాదాసీదా కవిత్వం. కాళోజి కవిత్వానికి ఆ గుణాల వల్లే గౌరవం అధికమవుతూ వుంది. ఒక ప్రత్యేకత సంతరించుకుంది. వేమన ఆధునిక కాలంలో పుడితే ఎలా రాస్తాడో కాళోజి కవిత అలా వుంటుంది.

'వేమన కవిత్వం' అనలేం. ఎందుకో అనబుద్ధి కాదు. కవిత్వ పదం ఇక్కడ సంకుచితం. కాళోజి కవిత్వం అన్నప్పుడూ అలాగే వుంటుంది. ప్రధాన స్రవంతి కవిత్వాని కన్నా భిన్నమైనది. అందుకే ఈ పోలిక తేబుద్ధి కాదు.

ఏ పోలికలతో నన్నయ కవితారీతిని, వసుచరిత్ర కవిత్వాన్ని వేమన కవితతో పోల్చగలం?
వసు చరిత్రనీ, రఘు వంశాన్ని పోల్చగలం. కాని వాటితో సుంకర సత్యనారాయణ కవిత్వాన్ని పోల్చలేం. కాళోజి కవితని తిరుపతి వేంకటకవులతో, విశ్వనాథ సత్యనారాయణతో, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రులతో పోలిక తేలేం. ఎందుకంటే కాళోజి కవిత వీళ్లందరి కవిత్వాని కంటే భిన్నమైనది; విలక్షణమైనది.

ఏమిటీ విలక్షణత?
కడుపు నిండని వాళ్ల కోసం రాసే కడుపు నిండా తిని, ఒంటి నిండా బట్ట కట్టి, సినిమా రంగంలో లక్షలు ఆర్జిస్తూ, లక్షలు పోగొట్టుకుంటూ కూడా నిరుపేదల కవే అవుతాడు. తాగుబోతు ముండాకోరు అయి జల్సా చేస్తూ పార్ట్‌టైం విప్లవ కవిత్వం రాసేవాడు విప్లవ కవి కాగలడు; అవుతాడు. ఎందుకంటే సంస్కృతంలో, వైదిక భావనలతో రాస్తాడు కాబట్టి. అవన్నీ విదుల్చుకుని విలువల కోసం పడుపు విందులని కాదనడం, నటించకుండా తానున్నట్లు తన వలెనే కవిత రాయడం కష్టం. వంద వైరుధ్యాలున్నా శ్రీశ్రీ విప్లవ కవి కావడానికి కారణం అతను కొత్త ధోరణికి ఆద్యుడు. ఈ ఆద్యతని ఎలా గుర్తించాం? అతని 'మార్గ కవితా రీతి'ని బట్టి. ఎన్ని 'దందాలు' చేసినా మార్గ కవిత్వ రీతిలో వుంటే అతను కవే. 'దేశీ రీతి'లో రాస్తే ఆనాడు వేమన కవి కాలేదు; ఇవాళ కాళోజి కవి కాలేదు. ప్రజాస్వామ్య యుగంలో కూడా ఇది ఎలా సాధ్యం? అంటే తెలుగు కవిత్వ విమర్శకి ప్రజాస్వామ్య భావన ఒంటబట్టలేదని తెలుస్తోంది. దేశీరీతిలోరాసేవాడు తక్కువ అనే భావన. ఆ విలువలతో చూస్తే కాళోజిలో హిపోక్రసీ కనిపిస్తుంది కొందరికి. అవును, హిపోక్రసీ వుందనే కవిగా ఏ పదవి, ఎన్ని అవార్డులు అందుకున్నాడు? ఎన్ని సెంట్ల భూమి కొన్నాడు? ఎన్ని అంతస్థులు కట్టాడు? కవిగా ఎంత ప్రమోట్‌ అయ్యాడు? పేపర్లలో ఎన్ని ఫోజులిచ్చాడు? అలా అనేవాళ్లే పెద్ద హిపోక్రాట్లు. ఆనాడు సురవరం ప్రతాప రెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి, ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావుల వంటి వారితో సాహచర్యం చేశాడు. గాడిచర్ల హరి సర్వోత్తమరావు గ్రంధాలయోద్యమాన్ని ముందుకు నడిపించాడు. ఆయనతో 'గ్రంథాలయోద్యమ ఆస్థాన కవి' అనిపించుకున్నాడు. ఆనాడు గ్రంథాలయం ఏర్పాటు చేయడమంటే 'బాంబుల ఫ్యాక్టరీ' పెట్టడమే కదా! నైజాం కాలంలో ఉర్దూ భాషాధిపత్యం కింద హైదరాబాద్‌లోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం 1910 ఏర్పాటయింది. రాజరాజ నరేంద్ర భాషానిలయం 1904లో హనుమకొండలో ఏర్పాటయింది. విచిత్రం ఏమంటే, విశాలాంధ్ర విశాలాంధ్ర ఏర్పడి మేడిపండైన ఈ కాలంలో అవి ఎంతో విద్రోహానికి గురై ప్రభుత్వ గ్రాంట్లు లేక మూత పడ్డాయి. వీటిదే కాదు ఆంధ్రదేశంలోని ఎన్నో గ్రంథాలయాల పరిస్థితి ఇదే. పండితుల కోసమే కాకుండా ప్రజల కోసం గ్రంథాలయాలు వుండాలనే ఆలోచన కలిగినవాడు కాళోజి. ఆర్య సమాజంలో కార్యకర్తగా వుండి కాంగ్రెస్‌ తీర్థం తీసుకున్నా అందులోనూ ప్రతిపక్ష పాత్రే వహించాడు.

ఆధిపత్యాలని వ్యతిరేకించడమే కాళోజి తత్వం! ఈ తత్వం సంస్థలకీ, చాలా మంది కుహనా ప్రజాతంత్రవాదులకీ, సొంత ప్రయోజనాల కోసమే విప్లవాలు అనుకునే ప్రొఫెషనల్‌ రెవెల్యూషనరీలకీ మింగుడు పడడం లేదు. మనిషి స్వేచ్ఛ కోసం ఒక శతాబ్దమంతా పోరాటాలు జరిగాయి. కొత్త తాత్వికులు పుట్టారు. దేశాలు స్వేచ్ఛ పొందాయి. జాతులు విముక్తం అయ్యాయి. ఇప్పుడు స్వేచ్ఛని సంస్థల ఆలోచనల ఆధిపత్యానికి బలి చేయడం సరైంది కాదనే సత్యాన్ని మరిచారు. అప్పుడు కూడా కాళోజి ఓటు వేయడం వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించింది. బలవంతంగా వద్దనడం గానీ, వేయమనడం గానీ సరైంది కాదని బాహాటంగా బల్ల గుద్ది చెప్పాడు. చెప్పినందుకు- అలా చెప్పగలిగిన వ్యక్తి వున్నందుకు గర్వించాలి. కాని జరిగిందేమిటి? ఒక రకం నిర్లిప్తత పాటించారు కాళోజి పట్ల! ఐనా మాన్‌మన్‌ మనిషి. కలేజా వున్న మనిషి కాళోజి.

అవును, రెండు జిల్లాల భాష మొత్తం ఆంధ్రదేశం మీద పెత్తనం చెలాయిస్తే సరైంది కాదని చెప్పాడు. యాసలు భాషకి శ్వాసలు కావాలని వావిలాల గోపాలకృష్ణయ్య చేత చెప్పించినవాడు. భాషాధిపత్యం సోదరుల మనోభావాలను దెబ్బ తీయకూడదని ఆనాటి నుండి మడికొండ సభ వరకూ ఎలుగెత్తిన కవి కాళోజి.

సామ్రాజ్య వాద విష సంస్కృతి దాడిని ఏక కంఠంతో ఖండిస్తాడు. యాభై ఏళ్ల అనుభవం ఓడిపోతే విశాలాంధ్ర కన్నా విడిగా వుండడమే సోదరత్వాన్ని కాపాడుకునే సాధనమైతే దాన్నే అనుసరిద్దాం అంటాడు. అవిభాజ్య కుటుంబాలే వర్తమానం ఆటుపోట్లకి చిన్న కుటుంబాలవుతున్న తరుణంలో పాత ఆలోచనలు సరికావని ముద్దుగా బుద్ధులు చెప్పే కవి. అందుకే ఆయనను అఖిల భారత చిన్న రాష్ట్రాల సమాఖ్య ఆస్థానకవి అన్నా తప్పు లేదు. మడికొండ గ్రామ సన్మానసభ డప్పు వాద్యకారుడి జానపద కళా ప్రదర్శనతో ప్రారంభమైంది.

కృష్ణానదికావల వున్న కనకదుర్గమ్మ కథని ఐదు రోజులు పాడే ఈ వరంగల్‌ జిల్లా జానపద కళాకారుడు ఏ ప్రాంతం వాడు? అతను తెలుగువాడు. అక్కడి దేవత కథని వేలాది ఏళ్లుగా ఇక్కడ ఎలా చెబుతున్నాడు? ఇంత కాలం వరకు ఈ కళని ఎవరు ఎందుకు చూడలేదు? ఈ కథల్ని అర్థం చేసుకోవాలి. ఈ కళాకారులు పొట్ట చేత పట్టుకుని సూరత్‌కో, భీవాండికో, ముంబాయి కాంక్రీట్‌ వనంలో కూలీగానో పోతున్నారు. ఎక్కడ మన ఆటాపాటా, సంగీతం? అందుకే కాళోజి తన చేతుల మీదుగా ఆ కళాకారుణ్ని ఇక్కడ సన్మానించాడు. మడికొండ ప్రజలతో సన్మానింపబడుతూ ఒక రకంగా తిరిగి వారికే సన్మానం చేశాడు.

కవిత్వం అంటే పద్యం కాదని శ్రీశ్రీ, ఆరుద్ర చెప్పారు. కాని, శ్రీశ్రీ, ఆరుద్రలు రాసిన కవిత్వం ప్రజా కవిత్వం కాదని కాళోజి 'నా గొడవ'లోని ప్రతి కవితా తేల్చి చెబుతుంది. అందుకే ఇద్దరే ప్రజాకవులు- ఒకరు వేమన, మరొకరు కాళోజి. మార్గ కవిత్వం ముసుగుని ఛేదిస్తే ఆధునిక కవుల అసలు రహస్యం కూడా తేలిపోతుంది. దాని సాహిత్య వ్యవస్థ రహస్యం, ఆయువు పట్లు అర్థమవుతాయి. కుల ఆధిపత్యం భాషలో, వ్యాకరణంలో ఎలా దాక్కుని పని చేస్తుందో తెలుస్తుంది. దళిత బహుజన మైనారిటీ కవులూ, రచయితలూ, కళాకారులూ ఈ అంశంపైన దృష్టి సారించాల్సి వుంది. దేశీయతని అవమాన పరిచే సంస్కృతం, ఆంగ్లంలు కుమ్మక్కయిన విధానాన్ని కాదని వాటి ఇతరేతర ప్రభావాలకు తలొగ్గకుండా వ్యతిరేకించినప్పుడే సామ్రాజ్యవాద సంస్కృతిని వ్యతిరేకించగలం. ఎంతో మంది నిజమైన వేమనలు, కాళోజీలు మనకున్నారో బయటపడుతుంది. వాళ్లని గుర్తించడమే నిజమైన దేశభక్తి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X