వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కథ ఇక్కడా వుంది!

By Staff
|
Google Oneindia TeluguNews

సురవరం ప్రతాప రెడ్డి తన 'గోలకొండ' పత్రికలో తెలంగాణా కవుల జాబితా ప్రకటించినట్లుగా ఇప్పుడు తెలంగాణా కథారచయితల జాబితా ఒకటి ప్రచురించాల్సిన అవసరం ఏర్పడినట్లే వుంది. తెలంగాణాలో కవులే లేరని ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యకు ప్రతిస్పందనగా సురవరం ప్రతాప రెడ్డి ఆ పని చేశారు. ఇప్పుడు తెలంగాణాలో కథారచయితలే లేరని కొందరు మిడిమిడి విషయ పరిజ్ఞానంతో మాట్లాడుతున్నారు. అందువల్ల కరపత్ర రూపంలోనైనా ఒక జాబితాను ప్రకటించాల్సిన ఆవశ్యకత వచ్చేసింది.

సాహిత్య విమర్శకులు, సంకలనకర్తలు తెలంగాణాలో అల్లం రాజయ్య, బి.యస్‌. రాములు, కొంచెం అటూ ఇటుగా తుమ్మేటి రఘోత్తమరెడ్డి తప్ప తెలంగాణాలో కథారచయితలే లేరనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఒక రకంగా వున్న కథారచయితలను చూడ నిరాకరిస్తున్నారు. తెలంగాణాలో ఈ మధ్యనే కాదు, చాలా కాలం నుంచి కథ వుంది; కథా రచయితలు వున్నారు. సురవరం ప్రతాప రెడ్డి స్వయంగా కథలు రాశారు. మనసుకు హత్తుకుపోయే కథలు ఇరివెంటి కృష్ణమూర్తి కథలున్నాయి. పి.యశోదారెడ్డి ఎవరి కథలకూ తీసిపోని కథలు రాశారు. మాండలికం, తెలంగాణా యాస, తెలంగాణా సామాజిక జీవిత చిత్రణ, కుటుంబ సంబంధాలు- మొత్తం తెలంగాణాకు చిత్రిక కట్టే రచనలు యశోదారెడ్డి చేశారు. నెల్లుట్ల కేశవస్వామి కథల గురించి చెప్పనే అవసరం లేదు. ఆ కథలకున్న జవజీవాలు వర్ణనాతీతం.

కాలువ మల్లయ్య, దేవరాజు మహరాజు, విద్యాసాగర్‌, నందిగం కృష్ణారావు, చంద్ర, ఎన్‌.కె. రామారావు, బోయ జంగయ్య, ముక్తేవి భారతి, చింతపట్ల సుదర్శన్‌- ఇంకా జాబితా ఇచ్చుకుంటూ పోవచ్చు. ఇప్పుడు రాస్తున్నవారు కూడా ఇతర ప్రాంతాల కథారచయితలకు తీసిపోయినవారేమీ కాదు. వీరి కథలు సాహిత్య విలువల విషయంలో తక్కువవి ఏమీ కావు. పులుగు శ్రీనివాస్‌, కె.వి. నరేందర్‌, ఆడెపు లక్ష్మీపతి, భారతి వంటి కథా రచయితలు విస్తృతంగా రాస్తున్నారు.

ప్రధానంగా కవి అయిన జూకంటి జగన్నాథం కూడా కథలు రాశాడు. శేషు రాసిన కథలు కొన్నే అయినా మంచి కథలు రాశాడు. వీరిలో చాలా మందిని కథాసంకలనాలు వేసేవారు, విమర్శకులు పట్టించుకోవడం లేదు. అంతెందుకు, కాళోజి నారాయణరావు కథలు రాశారనే విషయం వరంగల్‌ వారికే తెలియదంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు.

సామాజిక పరిస్థితులను, మానవ సంబంధాలను, సాంస్కృతిక వివక్షను చూపించిన తెలంగాణా కథలను ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం వెతకాల్సి వస్తే, మళ్లీ విప్లవ సాహిత్యం గురించే మాట్లాడాల్సి వస్తుంది. ఇది కొంత బాధాకరమైన విషయమే. తెలంగాణాలో విప్లవ కథ తప్ప మరోటి లేదనే అభిప్రాయం గట్టిగా బలపడిపోయింది. తెలంగాణాకు చెందిన విమర్శకులు కూడా ఈ అభిప్రాయాన్నే ప్రకటించడం కొంచెం విచిత్రమే అనిపిస్తుంది. కానీ, ఇందులో అసహజమేమీ లేదు. విప్లవ సాహిత్యోద్యమం ముందుకు తెచ్చిన అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి రాసేవి మాత్రమే కథలనే ఒక అభిప్రాయం పాదుకుపోయేలా చేసింది. విప్లవ కథలు, విప్లవ కథా సంకలనాలు విరివిగానే వచ్చాయి. ఆ తర్వాత బి.యస్‌. రాములు తాను రాసిన రాజకీయ కథల ద్వారా ప్రచారం పొందాడు. వీటిని మాత్రమే చూస్తున్న విమర్శకులు స్వభావరీత్యా చేసిన కార్యం గురించి గొప్పలు చెప్పుకునే తత్వం లేని ఇతర తెలంగాణా కథారచయితలు తెర వెనుక వున్న రచయితలను చూడ నిరాకరించారు; నిరాకరిస్తున్నారు.

ఇదిలా వుంటే, ప్రాంతీయ వివక్షపై, తెలంగాణాకు జరుగుతున్న అన్యాయంపై కథలు వస్తూనే వున్నాయి. తెలంగాణా రచయితలు వస్తు రీత్యా, శిల్ప రీత్యా తమను తాము వ్యక్తీకరించుకోవడానికి రాసిన కథలు చాలానే వున్నాయి. ఇక్కడి పరిస్థితులకు, సాంస్కృతిక జీవనానికి అద్దం పట్టే కథలూ వున్నాయి. ఆల్‌ కబీర్‌కు పశువులను అమ్ముకోవాల్సిన పరిస్థితి తెలంగాణా రైతుకు రావడంపై కాలువ మల్లయ్య ఓ కథ రాశాడు. కోస్తాంధ్రవారి చేతుల్లో అన్యాయానికి గురవుతున్న వైనంపై పులుగు శ్రీనివాస్‌ 'సంకర విత్తులు' అనే కథ రాశాడు. కోస్తావారికి, తెలంగాణావారికి మధ్య సాంస్కృతిక అసమానతలపై, ఈ అసమానతల వల్ల జీవితం పరుగు పందెంలో తెలంగాణా వ్యక్తులు వెనుకబడిపోతున్న వైనంపై కూడా కథలు వచ్చాయి.

తెలంగాణాకు ఓ ప్రత్యేక సాహిత్య చరిత్రను రాసుకుంటే తప్ప అసలు విషయాలు బయటకు రాని పరిస్థితి వుంది. అంతేకాదు, తెలుగు సాహిత్య చరిత్రనే తిరిగి రాయాల్సిన సమయం వచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X