వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్ట్-16

By Staff
|
Google Oneindia TeluguNews

''మీ శాఖకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయం పత్రికలకు చెప్పేశాను'' అన్నాడు ముఖ్యమంత్రి. ఆయన ముందు మాట్లాడడానికి పార్టీ నాయకులు గానీ, మంత్రులు గానీ సాహసించరు. విజయేందర్‌ రెడ్డి ముఖం పాలిపోయింది. ఆ వార్తేమిటో కూడా తెలియదు ఆయనకు. అయినా ఒక్క మాట మాట్లాడలేదు. విలేకరులతో పాటు ఆయన వెనుదిరిగాడు. ముఖ్యమంత్రి పై అంతస్థుకు వెళ్లిపోయాడు. ఇంతకీ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనేమిటనేది విజయేందర్‌ రెడ్డికి సందేహం. విలేకరులను అడగితే తల కొట్టేసినట్లుంటుందనేది ఆయనకు తెలుసు. పరిస్థితిని గమనించిన రాంరెడ్డి విజయేందర్‌ రెడ్డి దగ్గరకు వెళ్లాడు.

''నక్సలైట్ల అణచివేతకు గ్రేహౌండ్స్‌ పేర ప్రత్యేకంగా పోలీసు యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. దీని వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయేమో'' అన్నాడు రాంరెడ్డి విజయేందర్‌ రెడ్డి. రాంరెడ్డి విషయం తనకు చెప్పాలని ఆ మాటన్నాడనేది విజయేందర్‌ రెడ్డికి అర్థమైంది.

''మనం చేసేదేం ఉంది. చూద్దాం'' అన్నాడు విజయేందర్‌ రెడ్డి. తాను అన్న ఈ మాటలు పత్రికలో రాయొద్దని చెప్పాడు రాంరెడ్డికి. రాజకీయాల్లోకి ప్రవేశించి తెలంగాణ పర్యటన చేస్తున్న సందర్భంలో ''నక్సలైట్లే అసలైన దేశభక్తులు'' అని ప్రకటించిన ముఖ్యమంత్రే వారి అణచివేతకు గ్రేహౌండ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం మింగుడు పడని విషయమే అయినా వాస్తవం అది. వాస్తవాలు చేదుగానూ, నమ్మశక్యం కాకుండానూ ఉంటాయి. ఆలంకారిక పద ప్రయోగాలు, నటనలు, పగటి కలలు మనకు ఇష్టం. ఆ కలలన్నీ అద్దాల్లా బద్దలవుతుంటే కాళ్ల కింది నేల కదులుతున్నట్లు ఉంటుంది.

మర్నాడు ముఖ్యమంత్రి ప్రకటన పెద్ద పెద్ద అక్షరాలతో పత్రికల మొదటి పేజీల్లో అచ్చయింది. అంతే ఒక్కసారిగా పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు కదిలాయి. వీధుల్లోకి వచ్చాయి. వారం రోజుల పాటు పెద్ద యెత్తున ఆందోళనలు చెలరేగాయి. దాంతో ముఖ్యమంత్రి వెనక్కి తగ్గకతప్పలేదు. గ్రేహౌండ్స్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.

దాంతో అంతా సద్దుమణిగింది. పెనుగాలుల స్థానే చల్లగాలులు వీచినట్లు హాయి.
................. ........................... .........................

విజయేందర్‌ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఆయన పోలీసు, ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. విజయేందర్‌ రెడ్డి సమావేశం జరుగుతున్న హాల్‌ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నాడు. ఆయనను చూసి ముఖ్యమంత్రి 'రండి' అంటూ ఆహ్వానించాడు. సమావేశం ముగింపు దశలో ఉందనేది విజయేందర్‌ రెడ్డికి అర్థమైంది. నిర్ణయం కూడా జరిగిపోయిందనేది తెలిసింది. సమావేశం అంతా జరిగిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పై గదిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత డిజిపి వచ్చి విజయేందర్‌ రెడ్డికి విషయం చెప్పాడు. ఈ సమావేశం వివరాలు ఏ మాత్రం బయటకు పొక్కలేదు. మండలాధ్యక్షుడ్ని నక్సలైట్ల నుంచి విడిపించడానికి ప్రభుత్వం ఏం చేయబోతుందనే విషయం పత్రికలవారికి కూడా అంతు చిక్కడం లేదు.

ముఖ్యమంత్రి పత్రికలవారితో మాట్లాడనని చెప్పారు. దీంతో హాల్‌ నుంచి బయటకు వచ్చిన విజయేందర్‌ రెడ్డిని విలేకరులు చుట్టుముట్టారు. విజయేందర్‌ రెడ్డి పక్కనే డిజిపి ఉన్నాడు. ''విడుదలకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఇది చాలా సున్నితమైన విషయం. చాలా జాగ్రత్తగా డీల్‌ చేయాల్సి వుంటుంది'' అని విజయేందర్‌ రెడ్డి విలేకరులకు చెప్పేసి వెళ్లిపోయాడు. డిజిపి కూడా అదే మాట చెప్పాడు. లోపాయికారిగా ఆరా తీయడానికి విలేకరులు ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది.

నక్సలైట్లు ఒక మండలాధ్యక్షుడ్ని కిడ్నాప్‌ చేసి విడుదలకు ప్రభుత్వానికి షరతులు పెట్టడమంటే సామాన్యమైన విషయం కాదు. పెద్ద సంచలనం. రాష్ట్రమంతటా ఎడతెగని ఉత్కంఠ. క్రైం, సస్పెన్స్‌ సీరియల్‌ చూస్తున్నంత ఉత్కంఠ. సామాజిక జీవితంలోనూ ఇంత ఉత్కంఠ, సస్సెన్స్‌ ఉంటుందని తెలుగు సమాజానికి దాదాపుగా మొదటిసారి అనుభవంలోకి వచ్చిన సంఘటన ఇది.

వారం రోజులు గడిచింది. మండలాధ్యక్షుడు విడుదల కాలేదు. ప్రభుత్వం ఆయన విడుదలకు ఏం చేసిందో ఎవరికీ తెలియదు. ఒకరోజు తూర్పున సూర్యుడు కళ్లు తెరవక ముందే నడిరోడ్డుపై గడ్డ కట్టిన రక్తం మడుగులో మండలాధ్యక్షుడి శవం. అంతే రాష్ట్రమంతా అట్టుడికిపోయింది. ప్రభుత్వంపై విమర్శల మీద విమర్శలు వచ్చి పడ్డాయి. కనీవినీ ఎరుగని సంచలన సంఘటన విషాదంగా ముగిసింది.
................. ............................. ..........................

రాంరెడ్డి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఈ పది, పన్నేండేళ్లలో ఎంత తేడా వచ్చిందో అతను ప్రత్యక్షంగా చూశాడు. ఎందుకిలా మారిపోయింది. ఇందులో ఉన్న మర్మమేమటి? తినగ తినగ వేము తియ్యనుండు అని వేమన చెప్పాడే గానీ చేయగ చేయగ పనులు పాతబడిపోవు అని అనలేదు.

అది మొదలు నక్సలైట్లు కిడ్నాప్‌లకు పాల్పడి తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం పరిపాటి అయింది. అయితే క్రమక్రమంగా వాటి వేడి, వాడి తగ్గిపోతూ వచ్చింది. ఇవాళ్ల మండలాధ్యక్షుడ్ని కిడ్నాప్‌ చేస్తే పెద్దగా ఎవరూ పట్టించుకునే స్థితి లేదు. మండలాధ్యక్షుల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఎక్కడో అక్కడ ఎప్పుడూ స్థానిక రాజకీయ నాయకుల హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఆ వార్తలు పత్రికల్లో ఏ మూలనో సింగిల్‌ కాలమ్‌లో ఒదిగిపోతున్నాయి. లేదంటే జిల్లా ఎడిషన్స్‌లకు పరిమితమవుతున్నాయి.

ఈ మార్పుకు కారణమేమిటి? మొదటి సారి నక్సలైట్లు ఎన్‌కౌంటర్‌లో చనిపోయినప్పుడు కూడా పెద్ద గగ్గోలు. అది నిజమైన ఎన్‌కౌంటరేనని చెప్పుకోవడానికి పోలీసులు, ప్రభుత్వం నానా తంటాలు పడాల్సి వచ్చేది. ఇప్పుడా అవసరం లేకుండా పోయింది. ఈ మార్పు మంచికా చెడుకా? సమాజం పురోగమిస్తున్నట్టా, తిరోగమిస్తున్నట్టా?

ఒక కిడ్నాప్‌ను, రాజకీయ నాయకుడి హత్యను, ఎన్‌కౌంటర్‌ను రొటీన్‌ వ్యవహారంగా మార్చేసిన స్థితికి తెలుగు సమాజం నెట్టివేయబడలేదా?
నిజంగానే ప్రభుత్వం ఆనాడు గ్రే హౌండ్స్‌ దళాల ఏర్పాటను ఉపసంహరించుకున్నట్లు అందరూ నమ్మేశారు. కానీ అవి కొనసాగుతన్నాయనే విషయం ఇవాళ్ల అనుభవంలోకి వస్తోంది. అంతేకాదు, ఇప్పుడు గ్రే హౌండ్స్‌ ప్రాణాలకు తెగించి నక్సలైట్ల కోసం వేట సాగిస్తున్నాయనే విషయం బహిరంగ రహస్యం.

పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఇప్పుడూ ఉన్నాయి. కానీ ఏమీ చేయలేకపోతున్నాయి. ఈ పరిమితులు ఎందుకు ఏర్పడ్డాయి. శరీరాలు ఎందుకు మొద్దెక్కాయి? చేతులు ముడుచుకుని కూర్చోవాల్సిన పరిస్థితికి, ప్రతిస్పందన ఆశించని ప్రకటనలు చేసి ఊరుకునే స్థాయికి ఎందుకు వచ్చాయి? రాంరెడ్డి మెదడులో ఎగిసి పడుతున్న ఆలోచనా తరంగాలు.

అలా ఆలోచిస్తూ ఆఫీసులో కూర్చున్న రాంరెడ్డికి పిడుగు లాంటి సమాచారం వచ్చి పడింది. ఇటువంటి పరిణామం ఊహించిందే కానీ ఈ రకంగా జరుగుతుందనుకోలేదు. తాను ఊహించింది ఒకటి, జరిగింది మరోటి. ఆనాడే మల్‌రెడ్డిని హెచ్చరిద్దామనుకున్నాడు. కానీ అలా హెచ్చరించడం న్యాయం కాదేమోనని మానకున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X