• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లోపలి నిప్పులు కాల్చేస్తే.....

By Staff
|

రచయిత, జర్నలిస్టు పులుగు శ్రీనివాస్‌ అకాల మరణం తెలుగు సాహిత్య లోకంలోని కొంతమందికైనా పిడుగుపాటు లాంటిది. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన నవంబర్‌ 9వ తేదీ ఉదయం కన్ను మూశాడు. ఈ సమాజంపై నిరసనగానే అతను 'సెలవంటూ' వెళ్లిపోయి ఉంటాడు. కష్టనష్టాల నిప్పుకణికలను కడుపులో దాచుకుని పైకి నవ్వుతూ కనిపించే శ్రీనివాస్‌ వ్యక్తిత్వం చాలా దగ్గరివారికి కూడా అర్థం కాలేదేమో! పైకి కనిపించేది మాత్రమే నిజమనుకుంటే శ్రీనివాస్‌ అర్థం కాడు కూడా. అందుకు కారణం శ్రీనివాస్‌ నడవడిలో స్వాతిశయం అధికంగా కనిపించేది.

ప్రస్తుత ప్రమాణాలతో చూస్తే జర్నలిస్టుగా శ్రీనివాస్‌ పరాజితుడు. అతని వార్తల సూటిదనం, కఠిన వాస్తవాలు కొంత మంది 'పెద్దలకు' కంటగింపుగా మారిన సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల అతను ఎదుర్కున్న ఇబ్బందులు కూడా చాలానే వున్నాయి. దీనివల్ల అతను ఊళ్లు పట్టుకుని తిరగాల్సి వచ్చింది. ఆదిలాబాద్‌, వరంగల్‌, మెదక్‌, హైదరాబాద్‌లలో అతను స్టాఫ్‌ రిపోర్టర్‌గా పని చేశాడు. ఆదిలాబాద్‌లో పని చేసినప్పుడే అనుకుంటా, అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. రెండు కిడ్నీలు చెడిపోయాయి. తన తండ్రి ఇచ్చిన ఒక కిడ్నీతోనే అతను ఇంత కాలం ప్రాణాలను కాపాడుకుంటూ వచ్చాడు. అదీ మొరాయించడంతో చేసేదేమీ లేకపోయింది. ఏడాది క్రితం భార్య కృష్ణతార ఆకస్మిక మృతి కూడా శ్రీనివాస్‌ను విపరీతంగానే కుంగదీసింది. అతను ఈ దిగులునే కాదు, ఏ దిగులునూ నలుగురి వద్ద వ్యక్తం చేయలేదు.

ఆదిలాబాద్‌లో పనిచేస్తున్నప్పుడు అతను కొమురం భీమం భార్య సోంబాయిని కలుసుకోవడానికి చిన్నపాటి యాత్ర చేశాడు. ఆ తర్వాత 'అడవి తల్లి' అనే నవల రాశాడు. ఇది 'మదర్‌ ఫారెస్టు' పేరు ఇంగ్లీషులో వచ్చింది. ఇప్పుడు అదే నవల మరాఠీలో ఒక పత్రికలో సీరియల్‌గా అచ్చవుతోంది. జర్నలిస్టు సృజనాత్మకతను కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు పొతం పెట్టుకుంటూ ఉంటేనే కథలూ నవలలూ రాయగలడు. ఆ గుణం శ్రీనివాస్‌కు ఉన్నట్లు ఆయన రచనావ్యాసంగమే పట్టిస్తుంది.

హైదరాబాద్‌లోని కర్మాగారాల్లో శ్రీనివాస్‌ కార్మికుడిగా పని చేశాడు. వరంగల్‌లోని ధర్మసాగర్‌ మండలం వేలేరు గ్రామంలో జన్మించిన పులుగు శ్రీనివాస్‌ అనంతపురంలో ఇంటర్మీడియట్‌ చదివాడు. అంత దూరం వెళ్లి ఇంటర్‌ చదవాల్సిన అవసరం అతనికి ఎందుకు ఏర్పడిందో అతను ఎన్నడూ చెప్పలేదు. అయితే అక్కడే అతని కథారచనకు పునాదులు పడ్డాయి. చిలుకూరి దేవపుత్ర, బండి నారాయణస్వామి వంటి రచయితల సాంగత్యంలో అతను తన కథారచనను ప్రారంభించాడు. కార్మికుడిగా తనకున్న అనుభవంతో అతను కథలు రాయడం మొదలుపెట్టాడు. ఆ కథలతో 'బోనస్‌' అనే పుస్తకం వచ్చింది.

ఆ తర్వాత చాలా కాలం కథలు రాయడం మానేశాడు. ' ఉదయం' దినపత్రికలో అతను కొన్ని జిల్లాల్లో స్టాఫ్‌ రిపోర్టర్‌గా పనిచేసి హైదరాబాద్‌కు బదిలీ అయి వచ్చాడు. ఆ తర్వాత అతను తిరిగి కథలు రాయడం మొదలుపెట్టాడు. ఆ కాలంలోనే కొంత మంది జర్నలిస్టులం కలిసి తొమ్మిది కథలతో 'నవకథ' అనే కథా సంకలనం తెచ్చాం. అందులో శ్రీనివాస్‌ కూడా ఉన్నాడు. అప్పటి నుంచి అతని కథారచన నిరాటంకంగా కొనసాగింది. 'కార్మికకథలు', 'సంకరవిత్తులు' అనే కథా సంకలనాలు వచ్చాయి. జిల్లాల్లో రిపోర్టర్‌గా గడించిన అనుభవంతో, అప్పుడు సేకరించిన విషయాలతో 'అన్నలు' అనే నవల రావాడు. అతను కవిత్వం జోలికి పోలేదు.

అతను 'ఉదయం'లోనే కాకుండా 'ఆంధ్రజ్యోతి', 'సుప్రభాతం' పత్రికల్లో పనిచేశాడు. 'సుప్రభాతం' సామాజిక, రాజకీయ వారపత్రికలో అతను 'టీపాయింట్‌' అనే కాలమ్‌ను ఏడాది పాటు కొనసాగించాడు. సమకాలీన సమస్యలపై, సమాజంలోని తలకిందుల విలువలపై ఇద్దరు మిత్రులు సంభాషణరూపంలో సాగిన రచన ఇది. ఇటీవలే 'టీ పాయింట్‌' పుస్తకం వచ్చింది. 'ఔ... పిలగా' అనే కాలమ్‌ను మరో పత్రికలో నిర్వహించాడు. ఇది పూర్తి తెలంగాణ భాషలో సాగింది. తెలంగాణ జీవద్భాష, దాని సొగసులు ఇందులో కనిపిస్తాయి. 'చాయ్‌ బండి' అనే కాలమ్‌ను కూడా రాశాడు. ఇది కార్మికుల సమస్యలను, పోరాటాలను ఇతివృత్తంగా చేసుకుని సాగిన రచన.

'ఇండియా టుడే'లో అచ్చయిన 'సంకరవిత్తులు' కత తీవ్ర వివాదానికి కారణమైంది. అదే విధంగా 'రాజయ్య రాకపాయె', 'చుడీదార్‌ పిల్ల' కథలపై కూడా కొంత దుమారం చెలరేగింది. తెలంగాణ అస్తిత్వ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన కథలు 'సంకరవిత్తులు', 'రాజయ్య రాకపాయె' అనేవి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రెండు అసమ సమాజాల మధ్య సాంస్కృతిక అసమానతలను, వైరుధ్యాలను ఈ కథలు వెల్లడిస్తాయి. ఈ కథల్లోని ఆర్తిని, ఆవేదనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం జరగకపోగా, వాటిని నిర్హేతుకంగా కొట్టిపారేశారు. దానికితోడు శ్రీనివాస్‌పై కొన్ని తప్పుడు ఆపాదనలు చేశారు. వాటిని చదవకుండానే మాట్లాడివారూ ఉన్నారు. ఈ కాలంలో ఒక తెలంగాణ రచయితగా, వెనకబడిన ప్రాంతం ప్రతినిధిగా శ్రీనివాస్‌ సాంస్కృతిక అణచివేత రూపాన్ని చవి చూశాడు.

శ్రీనివాస్‌ ఇప్పుడు మన కళ్లెదుట లేడు. ఒక కొడుకును, ఒక కూతురును అనాథలను చేసి అకాలంగా వెళ్లిపోయిన రచయిత ఆర్తిని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఈ నివాళి వాక్యాలు పలుకుతున్నాను.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more