వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు పరిశోధనలకు తెగులు సోకిందా?

By Staff
|
Google Oneindia TeluguNews

విశ్వవిద్యాలయాల్లోని తెలుగుశాఖల్లో తెలుగు సాహిత్యంపై వెలువడుతున్న సిద్ధాంత గ్రంధాలు ఆశించిన స్థాయిలో ఉండడం లేదని పలువురు ఆందోళన వెలిబుచ్చు తున్నారు. పత్రికల్లో సూటి వ్యాఖ్యలు; వ్యంగ్య రచనలు చేస్తున్నారు. ఈ ప్రమాణాల పతనంలో వ్యక్తిగత దోషాలు, వ్యవస్థాగత దోషాలు, సామాజిక దోషాలు ఎన్నెన్నో వున్నాయి. నేడు పరిశోధకుల పరిస్థితి, పర్యవేక్షకుల స్థితి 'పోబో నీళ్లకున్‌ పలుచనై....' అన్నట్లు నానాటికీ దిగజారుతున్నది. పూర్వపు ప్రతిభా పాండిత్యాలు, శ్రద్ధాసక్తులు కనుమరుగైపోయాయి. పరిశోధకుల స్థాయి పర్యవేక్షకుల స్థాయి రెండూ దిగజారుతున్నాయి.

ప్రమాణాల కోసం పరితపించడం మూర్ఖత్వమనీ ప్రయోజనాలు సాధించడమే మనిషి లక్ష్యమనీ వేగంగా దూసుకుపోతున్నది యువతరం. అయితే ఈ చొరవ, ఈ వేగం విద్యా సముపార్జన పట్ల, రచనాభ్యాసం పట్ల చూపవలసిన అవసరం ఎంతైనా వుంది. చేకూరి రామారావుగారన్నట్లు కష్టపడడానికి ఇష్టం లేని యువతరం తయారయింది. రకరకాల విద్యేతర ప్రభావాలతో సామాజిక కారణాలతో 'సిద్ధాంత వ్యాసరచనకు మార్గదర్శక సూత్రాలు' నిర్వచించే, నిర్ణయించే స్థానాలలోకి వచ్చి కూర్చుంటున్నారు. అలా వచ్చాకయినా స్థాయిని పెంచుకొనే వైపు దృష్టిని ప్రసరింప చేసుకోకపోవడం గమనార్హం. విశ్లేషణ, అన్వయ సామర్థ్యం మాట దేవుడెరుగు. పుట్టెడు వాక్య నిర్మాణ దోషాలతో, అక్షర దోషాలతో అనన్వయంగా రాసేసి డిగ్రీలు తెచ్చుకొన్న పరిశోధకులూ వున్నారు. ఆ పరిశోధకులే పర్యవేక్షకులుగా పరిణమించి మార్గదర్శనం చేస్తున్నారు. ఒక ముద్రిత సిద్ధాంత వ్యాసం వాక్య నిర్మాణ దోషంతో మొదలవుతుంది. ఆ పరిశోధకుని పర్యవేక్షకుడు గొప్పవాడే. ఆ తర్వాత పర్యవేక్షకుడయ్యాడు కూడా. రాసింది ఒకసారి సరి చూసుకుందామనే ఓపిక లేకపోవడం, నేర్చుకోవాలన్న ఆసక్తి లేకపోవడం. ఏమి రాసినా, ఎట్లా రాసినా డిగ్రీ వచ్చేస్తుందన్న నిర్లక్ష్యం అంతే.

ఉపన్యాసకులోక్కరే చెడిపోయారు దేశమంతా బాగుందన్నట్లు అభాండాలు వేయడం సబబు కాదు. ఈ స్థితి తెలుగుశాఖకే పరిమితమూ కాదు. ఎ. పున్నారావుగారొకసారి చెప్పిన మాటలు స్మరించుకుందాం. 'ఈ ప్రమాణాలు పడిపోవడం అనే ఆవేదన కేవలం ఈ తరం వారిదే కాదు. దాదాపు అన్ని తరాలవారూ కొందరు ఈ భావనకు గురైనట్లు తెలుస్తుంది. మాకు బోధించినవారు తమ తరం వారి అభినివేశాలూ, శ్రమశీలాలూ తమ విద్యార్థులలో లేవని విచారించేవారు. అయితే వారి ఆచార్యులూ వారిని అదే విధంగా అనలేదని చెప్పలేం. కాగా ఈ ప్రమాణాల పతనమో, రాహిత్యమో ఇలాంటివి ఏనాడూ తప్పనివే అని గ్రహించాలి. కాకపోతే నేడు మారిన సాంఘిక పరిస్థితుల వల్ల చదువరుల సంఖ్య బాగా (పాతకాలంతో పోలిస్తే) పెరిగిన కారణాన ఆ పెరుగుదల ప్రమాణానికి అనుగుణంగా ఈ పతనాల ప్రమాణమూ పెరిగి వుండవచ్చు. అది అనివార్యం గదా మరి... అవమానకరమైన పరిస్థితుల్లో మన చదువుల్నీ మన పరిశోధనల్నీ వుంచుకోవడం విషాదకరమైన పరిణామమే. ఈ పరిణామానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనమూ; కొంత వరకు మన పూర్వులూ బాధ్యులే! కాని వాస్తవమేమిటంటే ఈ పరిణామం ఈ దేశాన ఏ ఒక్క విభాగానికో, యూనివర్శిటికో పరిమితమై లేదు. తెలియ వచ్చినంత వరకు పరిశీలిస్తే- జాతి శీలంలోనే ఏదో వెలితి ఏర్పడినపుడు దాని ప్రభావం ఆ జాతి అన్ని చర్యల్లోనూ ప్రస్ఫుటంగా ప్రతిఫలించక తప్పదు. ఆ వెలితి ఒక విద్యారంగానికే ఇక్కడ పరిమితమనలేము. అది పరిపాలనా వ్యాపార వాణిజ్య, అది వివిధ జాతి జీవన ప్రక్రియలకూ వ్యాపించే వుంది. కాగా భాగీరథీ గంగతో పాటు భారతీయ జీవన గంగను కూడా (ముఖ్యంగా విద్యాధికుల) ప్రక్షాళన చేయవలసిన అవసరం పుష్కలంగా ఉంది. అప్పుడు గాని అన్నిటి మాలిన్యాలతో పాటు విద్యారంగ మాలిన్యమూ తొలగిపోదు' (పల్లవగ్రాహి పాండిత్యం (వ్యాసం), తెలుగు పరిశోధన, 4వ సంచిక, 1988)

ఈ రోజు సౌకర్యాలు ఎంతగా పెరిగినా మన పూర్వులు సాధించిన పాండితీ ప్రాభవాలను మించి సాధించుకోగలిగిన పరిస్థితులు లేవు. ఈ తరానికి బహు వ్యాపకత్వం ఎక్కువ. పైపెచ్చు సంఘంలో వాణీపూజ కన్నా లక్ష్మీపూజ మీద మనసు. అవసరాలు పెరిగిపోతున్నాయి. ఒక గంటసేపు అదెంత మంచి సిద్ధాంత గ్రంథమైనా సరే చదవడం కన్నా ఆ గంట సేపు ఏదో పని చేసుకొనో, ఏ యూనివర్శిటీ పేపర్లు దిద్దో నాలుగు రూకలు సంపాదించుకోవడం ఎక్కువ ప్రయోజనదాయకమనే భావన పెరిగింది. పర్యవేక్షకులు దైనందిన కార్యభారంతో నాగరిక జీవనంతో నలిగిపోతున్నారు. బోధనకు తయారుకావడంతోను కాలేజీకి ప్రయాణం కావడంతోను రాత్రి టెలివిజన్‌ భూతంతో గడపడంతోను అధిక సమయం వ్యయమైపోతున్నది. పాఠం చెప్పడానికో, సమీక్ష చేయడానికో తప్ప, ఏదో ఒక అవసరం వుంటే తప్ప ఎంత గొప్ప పుస్తకమైనా సరే చదవని స్థితి ఏర్పడింది. దాంతో పరిశోధకుడు, పర్యవేక్షకుడు ఇద్దరూ కొత్తగా చదువకుంటున్నవారే అవుతున్నారు.

పరిశోధన వ్రతులు ఆచార్య బి. రామరాజు అభిప్రాయం చూద్దాం-'పరిశోధన పేరుతో వ్రాస్తున్న సిద్ధాంత గ్రంథాలన్నీ అచ్చంగా పరిశోధన, మరికొంత ఉపరిశోధన, కొంత విమర్శ, కొంత సమీక్ష, కొంత సేకరించిన సామగ్రి కుప్పలు, ఉదాహరించిన గద్యపద్యాల తెప్పలు. కొన్నింట కొటేషన్లు, మరి కొన్నింట 'కొట్టేసెన్‌'లు ఎక్కువగా ఉన్నవి. సిద్ధాంత గ్రంథాలు ఈ విధంగా వుండటానికి కారణం కేవలం మసి బూసి మారేడు కాయ చేయవలెననే ఉద్దేశ్యంతో కాకపోయినా పరిశోధన అంటే ఏమిటి? సిద్ధాంత గ్రంథ రచనం ఎలా ఉండాలె? అనే సరియైన అవగాహన అందరు పరిశోధకులకూ అందరు పర్యవేక్షకులకూ లేకపోవటమే'

తెలుగు పరిశోధనలో వదులుకోవలసిన అలవాట్లు లేకపోలేదు. మొదటి తరం సిద్ధాంత గ్రంథాలు చాలా వరకు ఒక ప్రక్రియకు, కవికి సంబంధించిన సమగ్ర సాహిత్య చరిత్రలు (వచనం, విమర్శ, శతకం, ఆధునిక కవిత్వం, ద్విపద, నవల, కథ, పాల్కురికి సోమన, శ్రీనాథుడు, పోతన ఇత్యాదులు) మొదట్లో ఆ రంగానికి చెందిన సర్వాంశాలు వాటిలో పొందుపరిచారు. అవన్నీ ముద్రితమై ఇంచు మించు పాఠ్య గ్రంథాలుగా ఉపయోగంలోకి వచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా చెప్పదలచుకున్న విషయంలోకి సూటిగా వెళ్లిపోకుండా పరిణామ వికాసాలు చెప్పడం ఒక రకమైన పౌరాణిక సంప్రదాయానికి అనుస్యూతి కాబోలు. ఇప్పటి దిన పత్రిక భాషా స్వరూపాన్ని గురించి చర్చించే గ్రంథంలో దినపత్రికల్లో మొదటి పత్రిక ఏది అని చర్చించడం, ఏ ద్వివేదుల విశాలాక్షిగారి నవలలనో విశ్లేషించే గ్రంథంలో మొదటి నవల రాజశేఖర చరిత్రనా, రంగరాయచరిత్రనా అని చర్చించడం ఇలాంటివే. తెలుగు సిద్ధాంత గ్రంథాల్లో అసలు విషయం మూడవ అధ్యాయంలో వుంటుందన్న విమర్శ ఇందువల్లనే వచ్చిందేమో! ఈ పరిణామం చెప్పడం వల్ల గ్రంథానికి ఒక రకమైన నిండుదనం సిద్ధిస్తుందన్న భావం ఉన్నట్లుంది. నిర్ధారిత సత్యాలుగా అందరికీ అంది వచ్చి మామూలు విషయాలైపోయిన వాటిని తన అంశానికి సంబంధం లేకపోతే రాయడం పేజీలు పెంచడానికి తప్ప ప్రయోజనం శూన్యం. ఈ అలవాటు మానుకోలేకపోతే ఒక అధ్యాయంగా కాకుండా ఒక చిన్న ప్యారగ్రాఫుగా కుదించుకుంటే తృప్తి కలుగుతుంది.

సిద్ధాంత గ్రంథాలను వినోదం కోసం కాకుండా విజ్ఞానం కోసం చదువుతారు. ఆ పరిశోధనాంశాన్ని పొరలుపొరలుగా విశ్లేషించి చూపడం కొత్త వివరణలు అందజేయడం లక్ష్యంగా సాగాలి తప్ప కేవలం వర్ణనాత్మక ఫణితిలోనో, ప్రశంసోక్తులతోనో సాగకూడదు. చేకూరి రామారావుగారు తెలుగు విమర్శల్లో అలంకారిక, ఉద్వేగ భరిత, కవితాత్మక వచనం పరిహరించాలని 'వెన్నుగుద్ది' 'వెన్నుతట్టి' చెప్పారు. అందిస్తున్న విషయాన్ని 'కవిత్వం' మింగేయకూడదు. కుంటు పరచకూడదు. అనవసర రూపకాలు ప్రయోగించి సాగదీయకూడదు. చెప్పే విషయానికీ, చెప్పే విధానానికీ మధ్య సంతులనం పాటించాలి.

నవలలను, ప్రాచీన కావ్యాలను విశ్లేషిస్తున్న కొన్ని గ్రంథాల్లో పేజీలకు పేజీలు కథాసారాంశాన్ని అందిస్తారు. ఇక జానపదమైతే, గ్రామీణులందరూ కల్లాకపటాలెరుగని సౌమ్యులు అనీ, అదనీ ఇదనీ కీర్తిస్తారు. వ్యక్తిగత అభిప్రాయాలకు తావివ్వకుండా తటస్థ వైఖరితో వాస్తవాన్ని వెలుగులోనికి తీసుకురావడం ఉత్తమ పరిశోధకుని విద్యుక్త ధర్మం. అవాస్తవమైన అసందర్భ విషయాలను, భావాలను శాస్త్రీయ మార్గంలో సాగవలసిన పరిశోధన వ్యాసంలో వివరించడం, వ్యాఖ్యానించడం తగదు. జానపదులకు అమాయకులు, నిష్కల్మషులు, కోమల మనస్కులు, నిర్భాగ్యులు, నిరుపేదలు, సత్యవ్రతులు, ధర్మపరులు అనే విశేషణాలు విరివిగా పరిశోధకులు వాడుతుంటారు. జానపదుల్లో కూడా హత్యలు, దొంగతనాలు, పోట్లాటలు, మోసాలు జరుగుతుంటాయి. వారిలో భాగ్యవంతులు కూడా వుంటారు. జానపదుల సాహిత్యంపైన పరిశోధన చేస్తున్నామనే పక్షపాత దృష్టితో వివరించక వాస్తవాన్ని ప్రతిబింబింపజేయడానికి పరిశోధకులు ప్రయత్నించాలని జానపద పరిశోధకురాలు రావి ప్రేమలత సభాముఖంగా చెప్పారు. (తెలుగు జానపద సాహిత్య పరిశోధనల పరిస్థితి- హైదరాబాద్‌ కేంద్రీయ విద్యాలయం వారు నిర్వహించిన సదస్సులో సమర్పించిన పత్రం) జానపద పరిశోధకులు ప్రతిదానికి ప్రాక్తన మానవుడి దగ్గరకు వెళ్లిపోతారని చేకూరి రామారావుగారు చేసిన విమర్శ అందరికీ తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X