• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మార్గదర్శక రచయిత జంగయ్య

By Staff
|

తెలుగు సాహిత్యంలో దళిత దృక్పథం ఇప్పుడున్నంత స్పష్టంగానూ, కులస్పృహ ఇప్పుడున్నంత చైతన్యంతోనూ లేకపోవచ్చు. బోయ జంగయ్య సాహిత్య ప్రయాణం అప్పుడు 1960 దశకంలో ప్రారంభంలో మొదలైంది. గత నాలుగు దశాబ్దాలుగా ఆయన తన రచనావ్యాసంగాన్ని కొనసాగిస్తూనే వున్నారు. ఆయనతో పాటు నడక ప్రారంభించినవారు చాలామంది ఆగిపోయారు. స్తబ్దతకు గురయ్యారు, వ్యక్తిగత కుటుంబ వ్యవహారాల్లో కూరుకుపోయారు. కానీ జంగయ్య ఎవరి వైపూ చూడకుండా సజీవ సజల స్రవంతిలా ప్రవహిస్తూ వున్నారు. మిగతావాళ్లు ఆగిపోవడంతోనూ, పయనం సాగిస్తుండడంతోనూ బోయ జంగయ్యకు నిమిత్తం లేదు. ఆ ప్రయాణం లక్ష్యం ఏమిటి, తన సాహిత్యం ఆశించే గమ్యం ఏమిటి అనేవి ప్రధానం.

సాహిత్యలోకంలోని వాదోపవాదాలు, కీచులాటలు, వ్యక్తిగత ఈర్ష్యాద్వేషాలు ఆయనకు ఆయనకు అంటలేదు. అలా అంటకుండా ఆత్మరక్షణ చేసుకుంటూ వస్తున్నారు. అందుకు ఆయన తన దారి నుంచి పక్కకు వైదొలగడమో, అప్పటికప్పుడు మెరమెచ్చుల రాతలు రాయడమో చేయలేదు. ఇది తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా దళిత, పీడిత వర్గ పక్షపాత దృక్పథానికి మేలు చేసింది.

తెలుగు సాహిత్యంలో ఆయన ప్రవేశించేనాటికే అభ్యుదయ సాహిత్య దృక్పథం తన కర్తవ్యాన్ని నెరవేర్చి ఉంది. మార్క్సిజం పునాదిగా అభ్యుదయ రచనావ్యాసంగం కొనసాగుతూ వున్నది. ఇంకా విప్లవ సాహిత్య ఉద్యమం పురుడు పోసుకోలేదు. ఒక రకంగా అది సంధి దశ. రాజకీయ, సామాజిక ఉద్యమాలు సంక్షోభంలో చిక్కుకున్న కాలం. స్వాతంత్య్ర ఫలాలు అందుతాయనే ఆశకు తూట్లు పడుతున్నాయని హెచ్చరిక చేస్తున్న తరుణం. అయితే సమాజం పట్ల నిబద్ధత గల రచయితలు మార్క్సిజాన్ని తమ గుండెలకు హత్తుకుంటున్న కాలమే.

అప్పుడు వామపక్ష ఉద్యమాలతోనే తమకు విముక్తి లభిస్తుందని పీడితులు, దళితులు గట్టిగా నమ్ముతున్నారు. అయితే దళితులకు ప్రత్యేక సమస్యలున్నాయని ఇంత నిర్దిష్టమైన గ్రహింపు లేదు. ఈ గ్రహింపు ఇంత స్పష్టంగా లేని కాలంలోనే జంగయ్య దళిత సాహిత్య సృజన చేశారు. ఆయన కథలు, కవిత్వం సమాజంలోని 'కింది కులాల' వెతలను ఎలుగెత్తి చాటాయి. కేవలం ఆయన రచనలు సమస్యలను చిత్రించి పరిష్కారాన్ని కాలానికి వదిలేయలేదు. దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసే కథనాన్ని ఎంచుకున్నారు. అందుకు ఆయన శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని ఆయుధంగా వాడారు. విద్యకు దూరమైన వెలి బతుకులకు ఏం కావాలో ఆయన స్పష్టంగా గుర్తెరిగారనే విషయాన్ని అవి పట్టిస్తాయి.

"కొడవటిగంటి కుటుంబరావుగారు అనేవారు - అన్ని వర్గాలూ, కులాల నుంచి రచయితలు పుట్టి నవలలు రాస్తే మనకు జీవితం గురించి సరైన అవగాహన వుంటుందని. అటువంటి కాలం రావాలనేవారు.'' కొడవటిగంటి కుటుంబరావు మాటలను యదార్థం చేయడానికే అన్నట్టు బోయ జంగయ్య రచనలు వచ్చాయి. దళితుల గురించి, అట్టడుగు వర్గాల గురించి తన భాషలో, తన ప్రత్యేక శైలిలో రాయడం వల్ల అప్పటి వరకు వస్తున్న సాహిత్యంలో ఒక కదలిక మొదలైంది. ఒక రకంగా చాప కింద నీరులా 'కింది కులాల' సంస్కృతిని, ఆచార వ్యవహారాలను, వారి కన్నీళ్లనూ కడగండ్లనూ, వారి జీవనపోరాటాలను తెలుగు సాహిత్యంత ఎర మీదికి తెస్తూ ఉద్యమాలు ఎవరి కోసం జరగాలో, ఎందుకు జరగాలో జంగయ్య సాహిత్యం స్పష్టతను చేకూర్చింది. అప్పటి పీడితవర్గ పక్షపాతంతో రచనలు సాగుతూ వస్తున్నాయి. అయితే ఆ రచనల్లో అందరి జీవితం ప్రతిబింబించిందా అనే ప్రశ్న వేసుకుంటే స్పష్టమైన సమాధానం దొరకదు. రచన విషయంలో వారి నిబద్దతను, నిజాయితీని ప్రశ్నించలేం. అయితే వారికి తెలియని జీవితాల గురించి రాయాల్సి వచ్చేసరికి 'గుండె గొంతుకలోన' కొట్లాడే పరిస్థితిలో పడ్డారని అర్థం చేసుకోవచ్చు. అటువంటి సమయంలో జంగయ్య రచనలు అగ్రవర్ణ అభ్యుదయ రచయితలకు అందుబాటులోకి వచ్చాయి.

ఆ కారణంగానే శ్రీశ్రీ, రావిశాస్త్రి, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, గజ్జెల మల్లారెడ్డి, అద్దేపల్లి రామమోహన్‌ రావు, కె. శివారెడ్డి లాంటి గొప్ప సాహిత్యకారులు జంగయ్య సాహిత్యాన్ని గుండెకు హత్తుకున్నారు. లిఖిత సాహిత్యంలో జంగయ్య రచనల కొత్త ఒరవడిలోని సామాజిక అవసరాన్ని, శ్రేయస్సును గుర్తించారు కాబట్టే వారు జంగయ్య రచనల గురించి నలుగురికి తెలియజెప్పే పనిని కూడా చేపట్టారు. అప్పటి వరకు సాహిత్యంలో అగ్రకుల రచయితలు పీడితుల పక్షాన రాస్తూనే ఉన్నారు. కానీ వాటిలో అట్టడుగువర్గాల జీవితం లోపించడం వారి గమనం నుంచి తప్పించుకుని పోయిందని చెప్పలేం. అందుకని జంగయ్య రచనలు వెలువడడమే తరువాయి వారు ఆహ్వానించి, ఆదరించారు. అది వారికి సాహిత్యం పట్ల, ప్రజల పట్ల ఉన్న నిబద్దత, నిజాయితీ.

మరి జంగయ్య రచనలకు ఆ కొత్త ఒరవడి, ఉరవడి ఎలా వచ్చింది? ఆయనకు చదువు దాన్ని ప్రసాదించింది. అయితే చదువు మాత్రమే సరిపోదు. తనవారి పట్ల ప్రేమ, అనురాగం ఉండాలి. తను నడిచి వచ్చిన దారులను మరిచిపోకూడదు. జంగయ్య తన మూలాలను మరిచిపోయి సమాజంలో తానొక్కడే ఎదిగిపోవాలని అనుకోలేదు. కుహనా సాంఘిక గౌరవం కోసం తాను పొందిన అవమానాలను, తాను అనుభవించిన వివక్షను, తన కుటుంబ నేపథ్యాన్ని దాచుకోవడానికి ప్రయత్నించలేదు. వాటన్నింటినీ అక్షరీకరించి, వాటి నుంచి బయటపడే మార్గం తన వారందరికీ తెలియజెప్పే కార్యాన్ని భుజాన వేసుకున్నారు. ఆయన రచనలన్నీ సంఘంలో కులం కారణంగా అనుభవిస్తున్న అమానవీయ అణచివేతకు దర్పణం పడుతాయి. తన వారందరూ మిగతావారి లాగా 'మానవులు'గా సాంఘిక గౌరవం పొందాలనే తపనతో తమవారు చేయాల్సిన పోరాటం గురించి, వివిధ సందర్భాలలో తాము ఎదుర్కునే కష్టాలను అధిగమించడానికి చేసే ప్రయత్నాల గురించి ఆయన కథలు కథలుగా చెప్తూ పోయారు. సంఘంలోని మూఢవిశ్వాసాలను, అనాచారాలను, దుర్మార్గాలను, అణచివేతను, దళిత బహుజనుల పట్ల అమలవుతున్న అమానవీయ చర్యలను సంఘటనలుగా చిత్రీకరిస్తూ, ఏ మాత్రం వాస్తవికతకు దూరం కాకుండా దాని నుంచి విముక్తి పొందే మార్గాలను చెప్పుతూ పోవడం ఆయన కథాకథనం పద్ధతి. శాస్త్రీయ దృక్పథాన్ని దళితులు అలవరుచుకోవాలని ఆయన బోధన.

బోయ జంగయ్య రచనలు సాదాసీదాగా ఉంటాయి. ఏ అలంకరణలు ఉండవు. కథామర్మమెరిగిన బహుకొద్ది మంది తెలుగు రచయితల్లో బోయ జంగయ్య ఒకరు. తన జ్ఞానసంపదనంతా తన కథల్లో ప్రదర్శించే ప్రయత్నం ఆయన చేయలేదు. ఆయన జ్ఞానమంతా కథను, నవలను, కవిత్వాన్ని అట్టడుగు వర్గాల జీవితాల లోతులను, వారి జీవితాలు అలా ఉండడానికి గల కారణాలను, మంచి జీవితాల కోసం, గౌరవప్రదమైన బతుకుల కోసం చేయాల్సిన ప్రయత్నాలను ఆత్మీయంగా చెప్పడానికి ఉపయోగపడింది. దాని వల్ల రచయితకు, పాఠకునికి మధ్య హెచ్చుతగ్గుల తారతమ్యం తొలగిపోయింది.

సంక్లిష్టమైన శైలిని ఎంపిక చేసుకుని, తాను పైమెట్టున ఉన్నట్లు ప్రదర్శన ఇవ్వడం జంగయ్య సరిపడని విసయం. అది ఆయన వ్యక్తిత్వం కాదు. అక్షరాల పొదుపు తెలిసిన రచయిత. అక్షరానికి గల అమేయమైన శక్తి గురించి తెలిసినవారు. అందుకే ఆయన రచనల్లో పొల్లు మాట ఉండదు. ఒక పదం తీసి మరో పదం పెట్టడానికి వీలు కాదు. శ్రామికులు, దళితులు కూడా మాటలను అంత పదునుగానూ, పొదుపుగానూ వాడుతారు. వారి జీవితానుభవాలు నుడికారాలుగా, సామెతలుగా ముందుకు వచ్చాయి. వాటి సృష్టికర్తలు వారే. వారి జీవితాలతో మమేకం కావడం, తన పుట్టుకకు సంబంధించిన మూలాలను మరవకపోవడం, అక్కడి నుంచే కథావస్తువులు తీసుకోవడం వల్ల ఆయన రచనలకు అంత పదును, నిర్దిష్టత.

తన జీవిత నేపథ్యానికి జంగయ్య అంబేడ్కర్‌ ఆలోచనా విధానాన్ని తోడు చేసుకున్నారు. మార్క్సిజం జ్ఞానం ఉండనే ఉంది. దానివల్ల ఆయన రచనలకు ఒక సమగ్రత చేకూరింది. తన సిద్ధాంత జ్ఞానాన్ని ఆయన జీవితాలను, ఆ జీవితాల వెనక గల నేపథ్యాలను, తద్వారా సామాజిక స్థితిగతులను, సమాజంలోని వ్యత్యాసాలను అర్థం చేసుకుని, శాస్త్రీయ, సృజనాత్మక రచనలు చేయడానికి వాడుకున్నారు. అందుకే ఆయన రచనలు నిరాడంబరంగా, సహజసిద్ధంగా ఉంటాయి.

బోయ జంగయ్య రచనల వైశిష్ట్యాన్ని చాలామంది విశ్లేషించారు. తన అభిప్రాయాలను, జీవన నేపథ్యాన్ని సందర్భం వచ్చినప్పుడు ఆయన కూడా వెలువరిస్తూ పోయారు. తన గురించి, తన రచనలు, సాహిత్యం గురించి బోయ జంగయ్య వెలువరించిన అభిప్రాయాల్లోనూ, ఇతరులు ఆయన రచనలను విశ్లేషించిన తీరులోనూ ఒక అంతస్సూత్రం కనిపిస్తుంది. గత నాలుగు దశాబ్దాలకు పైబడిన ఆయన రచనావ్యాసంగంలో ఏకసూత్రత ఉంది. ఒక స్పష్టమైన దారికి ఆయన వేసిన పునాదులు ఉన్నాయి. ఆ పునాదుల మీద లేచిన సాహిత్యం ఇవాళ్ల మనం అనుభవంలోకి తెచ్చుకుంటూనే ఉన్నాం.

బోయ జంగయ్య రచనలు
నాటికలు: కష్టసుఖాలు, దేశం కోసం, కొత్తబాటలు.
కథాసంకలనాలు: లోకం, గొర్రెలు, దేశం కోసం, దున్న, రంగులు, చీమలు, తెలంగాణ వెతలు, బోజ కథలు, బొమ్మలు, ఉప్పనీరు, ఇప్పపూలు, ఆమె.
కవితా సంకలనాలు: నడుస్తున్న చరిత్ర, వెలుతురు, బోజ కవితలు.
బాలల సాహిత్యం: బడిలో చెప్పని పాఠాలు, కొత్త పాఠాలు, గుజ్జనగూళ్లు, ఆటలు - పాటలు, మాటల ఆటలు, చిలుకల పలుకులు, మన నేతలు, టీవీ ముచ్చట్లు.
జీవిత చరిత్రలు: డా॥ అంబేడ్కర్‌ (బాల్యం - విద్యాభ్యాసం), సమతావాది బాబూ జగ్జీవన్‌రామ్‌, దేశాధ్యక్షులు కె. ఆర్‌. నారాయణన్‌, గుఱ్ఱం జాషువా.
వయోజనుల సాహిత్యం: ముందుచూపు, తోటోడు తొడ కోసుకుంటే, స్వయం నిర్ణయం, నిమోనియా.
నవలలు: జాతర, జగడం.

బోయ జంగయ్యకు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. చాసో అవార్డు కూడా ఆయనకు లభించింది. ఎచ్చరికకు శ్రీశ్రీ మెమోరియల్‌ బంగారు పతకం పొందారు. జాతర తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ నవలగా ఎంపికైంది. ఇంకా పలు పురస్కారాలు లభించాయి. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆయన రచనలు పాఠ్యపుస్తకాలుగా కూడా ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X