వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవలలకు టీవి చానళ్ల దెబ్బ

By Staff
|
Google Oneindia TeluguNews

టీవీ చానల్స్‌ వల్ల పుస్తకాలకు గిరాకీ తగ్గిందా? తగ్గిందనే మాట చాలా వైపుల నుంచి వినిపిస్తోంది. తగ్గితే ఏ రకం పుస్తకాలకు గిరాకీ తగ్గింది? నాలుగైదు తెలుగు చానళ్లలో డైలీ సీరియల్స్‌, వీక్లీ సీరియల్స్‌ ప్రసారమవుతున్నాయి. ఇవన్నీ పాప్యులర్‌ సీరియల్స్‌. తెలుగులో పాప్యులర్‌ నవలలు సృష్టి 1960 దశకం నుంచి విజృంభించింది. కోడూరి కౌసల్యాదేవి నవలలతో ప్రారంభమైన ఊహా ప్రణయ నవలలు 1980 దశకం వరకు యువతను ఉర్రూతలూగించాయి. ఈ నవలల రచనలో యద్ధనపూడి సులోచనరాణి ట్రెండ్‌ సెట్టర్‌గా మిగిలారు. ఆ తర్వాత సైన్స్‌ ఫిక్షన్‌ పేర క్షుద్ర నవలలు వచ్చాయి. ఈ నవలలకు ఆద్యుడు యండమూరి వీరేంద్రనాథ్‌. (ఈ నవలలు సైన్స్‌ ఫిక్షన్‌ ఎందుకు కాదనేది ఇక్కడ చర్చనీయాంశం కాదు). అప్పటి వరకు పాప్యులర్‌ నవలా సాహిత్యంలో రాజ్యమేలిన రచయిత్రలు వెనకకు వెళ్లిపోయారు. యండమూరి 'తులసిదళం', 'తులసి', 'కాష్మోరా' నవలలు పాఠకుల్లో సంచలనం కల్పించాయి. వీటి తర్వాత క్రైం, సస్పెన్స్‌, థ్రిల్లర్స్‌, సెక్స్‌ నవలలు వచ్చాయి. పచ్చి బూతు వర్ణనలు ఈ నవలల్లో చోటు చేసుకున్నాయి. ఇవి వస్తున్న కాలంలోనే ఆభాస చారిత్రక నవలలు కూడా వచ్చాయి. ముదిగొండ శివప్రసాద్‌ నవలలు చాలా ఇటువంటివే. లల్లాదేవి కూడా ఇటువంటి నవలా రచనలో చేయి చేసుకున్నారు. ఈ నవలల ధాటికి సీరియస్‌ సాహిత్యం తట్టుకోలేకపోతోందనే అభిప్రాయం వుండేది. ఈ కాలంలో సీరియల్‌ నవలలను ప్రచురించే పత్రికల సర్క్యులేషన్స్‌ గణనీయంగా పెరిగాయి. వీటి ఆదరణను చూసి దిన పత్రికలు కూడా డైలీ సీరయల్స్‌ ప్రచురణకు పూనుకున్నాయి.

ఇటీవలి కాలంలో వీటి ఉధృతి తగ్గినట్లు అనిపిస్తోంది. తెలుగు టీవి చానల్స్‌ వచ్చాక పత్రికల్లో వచ్చే సీరయల్స్‌కు ఆదరణ తగ్గిందనే వాదన ముందుకు వచ్చింది. ఇందులో నిజం లేకపోలేదు. ఎందుకు తగ్గినట్లు? టీవి చానళ్లు అందిస్తున్న స్టఫ్‌ ఇవి అందించిన స్టఫ్‌ కన్నా భిన్నమైందా? ఎంత మాత్రం కాదు. పత్రికల్లో సీరియల్స్‌గా వెలువడిన అనేక నవలలు టీవి చానళ్లలో దర్శనమిస్తున్నాయి. పాఠకుల అభిరుచిలో మార్పు రాలేదనడానికి ఈ టీవిలు ప్రసారం చేస్తున్న డైలీ, వీక్లీ సీరియల్స్‌ నిదర్శనం. కుటుంబ వైరుధ్యాలకు, ఊహా ప్రణయ కథలకు, క్షుద్ర నవలలకు, అభాస చారిత్రక నవలలకు, సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌కు తెలుగు టీవి చానళ్లు పెద్ద పీట వేస్తున్నాయి. పైగా ఇవి తమిళం నుంచి తెలుగులోకి దిగుమతి అవుతున్నాయి. ఒక్కో సీరియల్‌ 300 రోజులకు ప్రసారమైన సందర్భాలు కూడా వున్నాయి. పత్రికల్లో వివిధ కాలాల్లో 1990 దశకం వరకు ఉధృతంగా వచ్చిన నవలా ధోరణులు ఏక కాలంలో టీవీల్లో కనిపిస్తున్నాయి. దీంతో పాప్యులర్‌ నవలా సాహిత్యానికి పాఠకులు తగ్గారు.

అయితే, సీరియస్‌ సాహిత్యానికి కూడా ఇదే మోతాదులో పాఠకులు తగ్గారా? కాదనే సమాధానమే వస్తుంది. సీరియస్‌ సాహిత్యానికి, అంటే విలువలతో కూడిన అసలు సిసలు సాహిత్యానికి ఆదరణ పెరిగింది. ఇదే కాలంలో వ్యక్తిత్వ వికాస (పర్సనల్‌ డెవలప్‌మెంట్‌) సాహిత్యానికి పాఠకులు పెరిగారు. దీన్ని బట్టి టీవీ చానళ్ల వల్ల పాప్యులర్‌ నవలా సాహిత్యానికి ప్రమాదం వుందే గాని సీరియస్‌ సాహిత్యానికి ప్రమాదం లేదని అర్థం చేసుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X