దళిత కథా గుచ్ఛాలు
తెలుగు సాహిత్యంలో దళిత స్పృహ గణనీయంగా పెరిగింది. గత కొన్నేళ్లుగా దళిత కవిత్వం ఉప్పెనలా వెలువడుతూ వచ్చింది. 'చిక్కనవుతున్న పాట', 'పదునెక్కుతున్న పాట' కవితాసంకలానాలతో మొదలైన దళిత కవిత్వ ఝరి 'బహువచనం', 'మొగి', 'మేమే' వంటి కవితా సంకలనాలతో ఊపందుకుంది. వేర్వేరు శిబిరాల్లో వుండిపోయిన కవులు చాలా మంది దళిత కవిత్వం రాయడం మొదలు పెట్టారు. వ్యక్తిగత కవితా సంకలనాలు కూడా వెలువడ్డాయి. తెలుగులో ఏ ఉద్యమం వచ్చినా ముందు అది కవిత్వంలో ప్రతిఫలిస్తుంది. దళిత వాదం కూడా మొదట కవిత్వంలోనే ప్రతిఫలించింది. అగ్రవర్ణాలపై శాపనార్థాలతో మొదలైన దళిత కవిత్వం క్రమంగా చిక్కబడుతూ వచ్చింది. దళిత కవులు తమ ఐడెంటిటీని వెతుక్కోవడం ప్రారంభించడంతో కవిత్వానికి చిక్కదనం వచ్చింది. ఇదే సమయంలో పాటలు కూడా ఉధృతంగా వచ్చాయి. పాటల సంకలనాలు వెలువడ్డాయి. కవిత, పాట ఆవేశపూరితమైన ప్రతిస్పందన వాహకాలు. తమను తాము వ్యక్తీకరించుకుని, తమ ఉనికిని చాటుకోవడానికి ఇది సరిపోదు.
తాము వ్యతిరేకించాల్సిన అంశాలేమిటి, సమర్థించాల్సిన అంశాలేమిటి అనేది ఇందులో ఒకటైతే, తమ మూలాలను వెతుక్కోవడానికి ఇందులో మరోటి. ఈ మూలాలను వెతుక్కోవాల్సిన అవసరం వచ్చేసరికి వచన ప్రక్రియ వైపు దళిత సాహిత్య కారులు తమ దృష్టిని మళ్లించారు. నాగప్పగారి సుందర్రాజు వచన ప్రక్రియలో విశేష కృషి చేశారు. 'మాదిగోడు' కథల సంకలనం దళిత సాహిత్యంలో ఓ మైలురాయి వంటిది. ఎండ్లూరి సుధాకర్ కూడా దళిత కథలు రాశారు. వేముల ఎల్లయ్య 'కక్క' నవల రాశారు. కళ్యాణరావు 'అంటరాని వసంతం' అనే నవల రాశారు. అరుణ 'ఎల్లి' నవల రాశారు. ఇలా వచన ప్రక్రియను దళిత సాహిత్యకారులు అనివార్యంగానే ఎంచుకున్నారు.
దీనికి తోడు, సాహిత్యంలో దళిత కోణం నుంచి వచ్చిన సాహిత్యాన్ని వెలికి తీసి, పరిశీలించే కృషి కూడా జరిగింది. డాక్టర్ కె. లక్ష్మినారాయణ తెలుగులో వచ్చిన దళిత కథలన్నింటినీ సేకరించి పుస్తకాలు వెలువరించే పనిని భుజాన వేసుకున్నారు. ఇతివృత్తాన్ని బట్టి ఆయన కథలను వింగడించారు. ఇప్పటి వరకు ఏడు కథా సంకలనాలు వెలువడ్డాయి. దళిత కథల పేర వెలువరిస్తున్న ఈ కథ సంకలనాలను వస్తువును బట్టి వర్గీకరించి వేర్వేరు సంపుటాలుగా వెలువరించారు. దళిత కథలకు సంబంధించి 'వ్యక్తిత్వ వికాస కథలు', 'అస్పృశ్య కథలు', 'దళిత స్త్రీ సమస్యల కథలు', 'ఆర్థిక రాజకీయ కథలు', 'వర్ణ వివక్ష కథలు' వెలువడ్డాయి. తెలుగు సాహిత్యంలో కథా ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి దళితులకు సంబంధించిన కథలను సేకరించి విభజించి వెలువరించారు. ఇటీవల వచ్చిన కథల వరకు ఈ సంపుటాల్లో చోటు చేసుకున్నాయి. పాలగుమ్మి పద్మరాజు, చలం, కరుణకుమార, తదితర ఉద్ధండుల కథలతో పాటు ఇటీవలి పైడి తైరేష్బాబు, కలేకూరి ప్రసాద్ వంటి వారి కథల వరకు సేకరించి ఆయన అచ్చేశారు. ఈ కథల ఎంపికలో అగ్రవర్ణాలవారు రాసిన కథలను కూడా వేశారు.
ఈ కథా సంపుటాల్లోని కథలను జాగ్రత్తగా చదివితే తెలుగు సమాజంలో దళితుల జీవన పరిణాక్రమాన్ని తెలియజేస్తాయి. వివిధ రంగాల్లో వారు ఎదుర్కుంటున్న సమస్యలను, వాటి అధిగమించడానికి వారు చేస్తున్న ప్రయత్నాలను మనం కథల ద్వారా తెలుసుకోవచ్చు. ఒక సామాజిక శాస్త్రవేత్తకు ఈ కథా సంపుటాలు ముడిసరుకుగా కూడా ఉపయోగపడతాయి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!