వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానవతే నా మతం: రంగాచార్య

By Staff
|
Google Oneindia TeluguNews

జీవన యానంలో అలసిపోని కలం యోధుడు దాశరథి రంగాచార్య. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తుపాకిని, కలాన్ని ఎక్కుపెట్టిన యోధుడీయన. 1928లో పుట్టిన ఈ పెద్దాయన ఇప్పటికీ అలసిపోలేదు. కళ్లల్లో, నడకలో, రాతలో చురుకుదనం పోలేదు. నవలాకారుడిగా ప్రసిద్ధికెక్కిన దాశరథి రంగాచార్య స్వయంగా 'నా తెలంగాణ కోటి రత్నాల వీణ' అని పలికిన దాశరథి కృష్ణమాచార్యకు సోదరుడు. అయితే, కృష్ణమాచార్య నీడలో ఆయన ఎన్నడూ లేడు. సొంత వ్యక్తిత్వాన్ని, సొంత ప్రవక్తతను సంతరించుకుని తనదంటూ సొంత వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు రంగాచార్య.

దాశరథి రంగాచార్య నవలాకారుడిగా ప్రసిద్ధుడు. ఆయన రాసిన చిల్లర దేవుళ్లు, మోదుగు పూలు, జనపదం నవలలు తెలంగాణ సమాజ చరిత్రకు అద్దం పడుతాయి. సామాజిక చరిత్రను సృజనాత్మకంగా చెప్పడంలో ఆయనది అందె వేసిన చేయి. రంగాచార్య ఒక రకంగా 'ప్రజల మనిషి', 'గంగు' నవలలు రాసిన వట్టికోట ఆళ్వారుస్వామికి వారసుడు. వట్టికోట ఆళ్వారుస్వామి తన నవలా రచనను ఎక్కడ ఆపేశారో, అక్కడ తాను ప్రారంభించానని దాశరథి రంగాచార్య 'ఇండియా ఇన్ఫో'తో అన్నారు. ఆళ్వారుస్వామి మరణించడం వల్ల తెలంగాణా సామాజిక చరిత్రను నవలారూపంలో చిత్రించడం ఆగిపోకూడదని, తాను నవలలు రాయడం మొదలు పెట్టానని ఆయన చెప్పారు.

రంగాచార్య నవలల్లోని తెలంగాణ జానపద గుభాళింపును తెలుగు ప్రజలందరూ ఆస్వాదించారు. వట్టికోటది నవలా రచనలో చారిత్రక దృష్టి మాత్రమే అయితే రంగాచార్యది నవలా రచనలో చారిత్రక దృష్టితో పాటు కళాత్మక దృష్టి కూడా. ఇదే విషయం ప్రస్తావిస్తే- తాను చరిత్రను కళాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశానని అన్నారు.

'చిల్లర దేవుళ్లు' నవలలో తెలంగాణలో 1938కి ముందున్న సాంఘిక, ఆర్థిక, రాజకీయ శక్తులను ప్రతిబింబించానని, 'మోదుగు పూలు' నవలలో 1942 నుంచి తెలంగాణ విముక్తి వరకు గల పరిస్థితులను ప్రతిబింబించానని, 'జనపదం' నవలలో అప్పటి నుంచి 1967 ఎన్నికల వరకు పరిస్థితిని గురించి రాశానని ఆయన వివరించారు. ఈ సుదీర్ఘ పరిణామాలను తన నవలల్లో ప్రతిబింబించిన రంగాచార్య తన ఆత్మకథను 'జీవనయానం' పేర రాశారు. ఈ విషయాన్ని ప్రస్తావించగా తాను ఆ మూడు నవలల్లో చెప్పలేని విషయాలను, చెప్పని విషయాలను తన జీవన యానంలో చెప్పానని, ఇదీ ఒక రకంగా నవలేనని ఆయన అన్నారు. తన జీవిత చరిత్ర అంటే తెలంగాణ సామాజిక పరిణామాల చరిత్ర అని ఆయన అన్నారు.

దాశరథి రంగాచార్య 'మాయజలతారు', 'మానవత', 'శరతల్పం' అనే నవలలు కూడా రాశారు. అయితే, రంగాచార్య పేరు చెప్పగానే 'చిల్లరదేవుళ్లు' గుర్తొస్తుంది. దానికి లభించిన ప్రజాదరణ అటువంటిది.

తన పోరాట చరిత్రను గుర్తుకు తెచ్చుకుంటూ- 'ఏం ఆశించి ఆ రోజు తుపాకి పట్టుకుని అజ్ఞాతంలోకి వెళ్లాం? ఏమీ ఆశించలేదు' అని ఆయన అంటారు. తన అన్న కృష్ణమాచార్యను పోలీసులు అరెస్టు చేసినప్పుడు అజ్ఞాతంలోకి రావాల్సింగా పార్టీ నుంచి పిలుపు వచ్చిందని, వెంటనే కుటుంబాన్ని వదిలేసి తాను వెళ్లిపోయానని ఆయన చెప్పారు.

ఆయన వేదాలను కూడా తెలుగులోకి అనువదించారు. వేదాలను అనువాదం చేయడానికి ముందు ఆయన తన వేషధారణ కూడా మార్చుకున్నాడు. పంచె కట్టుకోవడం, చొక్కా వేసుకోకుండా శాలువా కప్పుకోవడం, నుదుటి మూడు నామాలు పెట్టుకోవడం చాలా మందికి ఈ రోజుల్లో ఆశ్చర్యంగా, ఆయన జీవితంలోని వైరుధ్యంగానూ కనిపిస్తుంది. ఇదే విషయం గురించి ప్రశ్నలు వేస్తే- వైరుధ్యమేమీ లేదని, మతం వ్యక్తిగతమైందని, మార్క్సిజానికి, తన వేషధారణకు, వేదాల అనువాదానికి మధ్య వైరుధ్యమేదీ లేదని నిక్కచ్చిగానే సమాధానిమిచ్చారు. తాను వేదాలను అనువదించి, సామాన్యులకు అందుబాటులోకి తెచ్చానని, అవి కేవలం అనువాదాలు కావని ఆయన అన్నారు. తాను మానవతా వాదినని, తన రచనల్లో మానవతా దృక్పథం ప్రతిబింబిస్తుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X