వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మార్చాలన్న తపన ముఖ్యం'

By Staff
|
Google Oneindia TeluguNews

కవులు, రచయితలూ నిరంతరం జ్వలిస్తూ వుంటారని దేవరాజు మహారాజు అంటున్నారు. కవిత్వాన్ని, కథలను ఒకే ఈజ్‌తో రాసిన ఆయన వ్యాసాలు, అనువాదాలు అంతే ఈజ్‌తో చేశారు. తన రచనల గురించి, సృజనాత్మక ప్రక్రతియల గురించి ఆయన చెప్పిన మాటలు-

మాది మామూలు వ్యవసాయిక కుటుంబం. నల్లగొండ జిల్లా భువనగిరి దగ్గరలోని నడవర్తి గ్రామంలో మా తాతగారు సేద్యం చేసేవారు. మా నాన్న ఆ ఊరు వదిలి ఆనాటి రామన్నపేట తాలుకాలోని చాడ గ్రామంలో స్థిరపడ్డారు. నేను పెరిగిందీ, చదువుకుందీ ఆ గ్రామంలోనే. చాడ వడపర్తి కన్నా చాలా పెద్దది. ఎప్పుడైనా సెలవుల్లో తాతగారిని, నానమ్మను చూడడానికి వడపర్తికి వెళ్తున్నామంటే ఎంతో సంబరంగా వుండేది. చిన్నాన్న (కాకయ్య), చిన్నమ్మ (చిన్న), అత్తయ్య, మామయ్యల ముద్దు మురిపాలు, పాలివాళ్ల, ఊరివాళ్ల పలకరింపులు, కచ్చడాలు, బండ్లు, పశువుల సందడి చల్లని పల్లె వాతావరణంలో ప్రాణం లేచొచ్చేది. వాగులు దాటి కత్వల మీది నుండి నడిచి మా పొలం దగ్గరికి (శేరి)లోకి పోవడం, అక్కడి తోటలో బాదాములు కొట్టుకుని తినడం, వనభోజనాలు చేయడం ఆసక్తిగా ఉండేది. పోలి, శిగం లాంటివి చూడడం చాలా వింతగా ఉండేది. భయంతో కూడిన ఉత్సాహం కలిగేది. నా వయసు పిల్లలు ఇంట్లో మరెవరూ వుండేవారు కారు. అందరూ నన్ను ముద్దు చేసేవారు. ముఖ్యంగా మా కాకయ్య నన్నెంతో గారాబం చేసేవాడు. అప్పటికి ఆయనకు పిల్లలు లేరు. పండుగకు స్వంతూరికి వెళ్లడంలో ఉండే ఆనందాన్ని వర్ణించాలంటే నిజంగా మాటలు చాలవు.

బాల్యంలో చందమామ, బాలమిత్ర పత్రికల్లోని గేయాలు నన్ను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉండేవి. అలా రాయగలగాలని నాకు తెలియకుండానే ప్రయత్నిస్తూ ఉండేవాడిని. రాసి పడేసిన కాగితాలు మా అమ్మ ఇల్లు ఊడ్చేప్పుడు తీసి జాగ్రత్త చేసేది. నల్లగొండ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో అక్కడి ఉపాధ్యాయులు శ్రీయుతులు యం. ప్రభాకర రావు, టి. స్వామినాథన్‌, శ్రీనివాసన్‌, మల్లికార్జునరావుల ప్రోత్సాహం వల్ల 1965లోనే హైస్కూలు గోడ పత్రికకు సంపాదకుడినయ్యాను. హైదరాబాద్‌ నారాయణగుడా న్యూసైన్స్‌ కాలేజీలో పియుసిలో చేరినప్పుడు శ్రీయుతులు మంజుశ్రీ, పోరంకి దక్షిణామూర్తి, అరిపిరాల విశ్వంల ప్రోత్సాహం లభించింది. నా పదహారవ యేట కళాశాల వార్షిక సంచిక 'విజ్ఞాన్‌' (1967)లో మొదటి కవిత అచ్చయింది. పద్దెనిమిదవ ఆకాశవాణి (ఎ) కేంద్రం నుండి (1.8.69) స్వీయ కవితా పఠనం ప్రసారమైంది. ఆ మరుసటి సంవత్సరమే (16.12.1970) ఆంధ్రప్రభ వార పత్రిక నా మొదటి కథ 'గడ్డిపూవు' ప్రచురించింది. ఇరవయ్యవ యేట భారతిలో వ్యాసాలు అచ్చయ్యాయి. ఇరవై రెండవ యేట ఆంధ్రజ్యోతి వీక్లీ కథల పోటీలో బహుమతి వచ్చింది. ఇరవై మూడవ యేట తెలంగాణ జీవద్భాషలో 'గుడిసె గుండె' మొదటి కవితా సంపుటి వెలువరించగలిగాను. సాహిత్య రంగంలోకి ఇదీ నా దారి.

నాపై ఎవరెవరి ప్రభావం ఉందో చెప్పలేను. సాహిత్య పరిశీలకులు ఎవరైనా తేల్చి చెప్పాల్సిన విషయమిది. గోర్కీ, గోపిచంద్‌, బ్రెహ్ట్‌, సాదత్‌హసన్‌ మంటో, కిషన్‌ చందర్‌, ఆళ్వారు స్వామి, దాశరథి సోదరులు, పాబ్లో నెరుడా, ఓ హెన్రీ, టాగూర్‌, ప్రేమ్‌చంద్‌, సీతాకాంత్‌ మహాపాత్ర... నేను ఇష్టంగా చదవే కవుల పేర్లు, రచయితల పేర్లు. ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. కాని రచయితల మీద కేవలం రచయితలే ప్రభావం చూపుతారనుకోవడం పొరపాటు. ఇతర కళా రంగాలలో పని చేస్తున్న వారి నుండి కూడా కవులూ, రచయితలూ స్ఫూర్తిని పొందుతారు. ఒక్కోసారి కొన్ని సంఘటనలకు చలించిపోతారు. కొన్ని జీవిత సత్యాలను తెలుసుకున్నప్పుడు తలవంచుతారు. నా మట్టుకు నేను హరిప్రసాద్‌ చౌరాసియా, గురుదత్‌, ముఖేష్‌, జూబెన్‌, కె. రాజయ్య, లక్ష్మాగౌడ్‌, గోపికృష్ణ, గోవింద్‌ నిహలానీ, కె.ఎ. అబ్బాస్‌ లాంటి వారంతా తమ తమ కళలతో కలిగించే అనుభూతి తీవ్రతలోంచి సామాన్యంగా బయటపడలేను.

నాకు నచ్చిన నా రచనలు ఎన్నిక చేసి చెప్పడం కష్టం అయితే మంచి గుర్తింపు నిచ్చిన రచనలు కొన్ని ఉన్నాయి. అవన్నీ నాకు నచ్చినవే. తొలి దశళో ''ఊల్లెకు గాడిదొచ్చింది ఉర్కి రాండ్రి ఉర్కి రాండ్రి'' అనే కవిత, ''పాలు ఎర్రబడ్డాయ్‌'' కథ, భారతి సాహిత్య పత్రికలో జానపద సాహిత్యంపై వెలువడ్డ వ్యాసాలు చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 'గాయపడ్డ ఉదయం' (స్వీయ కవిత) కవితా భారతి (తెలుగులో భారతీయ కవిత్వం) సంపుటాలకు ఆదరణ లభించింది. ''మూఢ నమ్మకాలు- సైన్సు'' పునర్ముద్రణలు పొందుతూ వుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజల భాషలో రాసిన ''బయిరూపులోల్లం'' కవిత అనేక భారతీయ భాషల్లోకి వెళ్లింది. అనేక తెలుగు కవితా సంకలనాల్లో చేరింది. రంగస్థలం మీద ప్రదర్శనకు అనువుగా మారింది. ''ప్రకృతి'', ''అంతరం'' కథలు కూడా ఇటీవలే ఇతర భాషల్లోకి వెళ్లాయి. ఇవన్నీ నాకు మంచి పేరు తెచ్చినవే. నా కృషి నేను చేసుకుంటూ పోతున్నాను. ఎవరి నుండి ఏమీ ఆశించడం లేదు. తక్కువ స్థాయి పాపులారిటీకి వ్యతిరేకిని. అయితే నిరంతరం సమాజం గురించి ఆలోచించే రచయితలకు సమాజం ఇచ్చే గుర్తింపు కూడా అవసరం. అవార్డుల వల్ల సత్కారాల వల్ల నాకు తృప్తి కలుగదు. అసంతృప్తి రెట్టింపవుతుంది. బాధ్యతతో చెయ్యాల్సినంత సాహిత్య కృషి చేస్తున్నానా అనే ప్రశ్నలు మొలకెత్తుతాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది సత్కారం (1996), తెలుగు విశ్వ విద్యాలయ కవితా సత్కారం (గాయపడ్డ ఉదయం- 1989), దాశరథి దంపతుల సత్కారం (1994), జనహర్ష సత్కారం (1997), డేవియస్‌ సాహితీ కళా పీఠం సత్కారం (1997), తొలి ఎక్స్‌రే అవార్డు (1983), ఆంధ్రజ్యోతి వీక్లీ (1973), జ్యోతి మాసపత్రిక (1982)ల బహుమతులు నాకు వచ్చాయి.

కొద్దిపాటి పరిచయాల్ని కూడా అద్భుతంగా తమకు అనువుగా మలుచుకుని, ప్రతి దానికీ ప్రయత్నాలు చేసుకుంటున్న సమకాలీన సమాజంలో- అలాంటి వాటికి దూరంగా బతికే నా బోటి వాడికి ఈ మాత్రమైనా గుర్తింపు లభించిందంటే అది చాలా ఎక్కువ అనే భావిస్తున్నాను.

నేను అనువాదాలు చేయడానికి స్ఫూర్తి మానవతా విలువలు! ప్రపంచ వ్యాప్తంగా భాషలు, సాహిత్యాలు వేరు వేరు కావచ్చు కాని వాటిలో ఉన్న మానవతా విలువలు ఒక్కటే. వాటిని తెలుసుకోవడానికి, మరొకరికి తెలపడానికి అనువాదాలు అవసరమవుతున్నాయి. అనువాదమయ్యే ప్రపంచ వార్తలు మనకు చేరుతున్నాయి. అనువాదమయ్యే చాలా పత్రికల్లో- టీవి ఛానల్లో సీరియళ్లు నడుస్తున్నాయి. అనువాదమయ్యే సినిమాలు మనకు అందుతున్నాయి.

అసలు అనువాదమంటూ చేయకపోతే నూతిలో కప్పల్లాగా ఉంటాం. మనకు తోచిందే చాలా అద్భుతమయింది అనే దురభిప్రాయంలో ఉంటాం. అధ్యయనానికి, మనల్ని ఇతరులతో పోల్చుకొని చూసుకోవడానికి అనువాదం కావాలి. అనువాద ప్రక్రియ అనేది లేకపోతే రామాయణ మహాభారతాలు మనకు అందేవి కావు. ప్రపంచ సాహిత్యంతో మనకు పరిచయమే ఉండేది కాదు. యూరోపియన్‌ రచనలన్నీ ఇంగ్లీషులోకి అనువదించబడ్డాకే మనకు అందాయి. ఇంగ్లీషు కూడా చదవలేని మన కోట్లాది పాఠకులకు తెలుగు అనువాదాలు తప్పనిసరి. అలాంటప్పుడు అనువాదాన్ని తక్కువ చూపు చూడగూడదు. అదొక సంఘసేవ. అదొక సామాజిక బాధ్యత.

అనువాదకుడికి గ్రామ దృష్టి, జాతీయ దృష్టి మాత్రమే సరిపోదు. అవి ఉంటూనే విశ్వదృష్టి కూడా ఉండాలి. విశ్వమంతా నాది అనే భావనకి ఎదిగిన వాడే అనువాదానికి పూనుకుంటాడు. ప్రపంచ ప్రజలంతా నా వాళ్లు ప్రపంచ సాహిత్యమంతా నాది అనే భావన అనువాదానికి తప్పనిసరి. నేను ఆ భావనతోనే 'కవితా భారతి', 'ఖండాంతర కవిత్వం' తెలుగు పాఠకులకు అందించాను. కవిత్వం, కథ మొదలైన సృజనాత్మక ప్రక్రియలన్నీ ఎగిసిపడ్డ మనిషి చైతన్యానికి ప్రతీకలు. దాన్ని నిలుపుకోవాలనుకునే వారే అనువాదాల వైపు ఆకర్షితులవుతారు.

తెలంగాణ మాండలికంలో కవితలు, కథలు రాయడానికి, తొలి సంపుటాలు తేవడానికి కారణమేమంటే, నేను తెలంగాణలో పుట్టి పెరిగివాణ్ని కాబట్టి ఆ భాషలోని సొబగుల్ని సాహిత్యీకరించాలన్న ఉత్సాహం ఉన్నవాణ్ని కాబట్టి. మాండలికంలో రాయడం భాషను వక్రీకరించడం ఎంత మాత్రం కాదు. ఏ ప్రాంతంలోనైనా ప్రజలు మాట్లాడేదే సరైన భాష, సజీవ భాష. తెలంగాణ మాండలికాలే అని కాదు, ఏ మాండలిక రచన అయినా ఓ పట్టాన అనువాదానికి లొంగదు. జీవద్భాషను గురించిన ప్రసక్తి వచ్చింది గనక, ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. వ్యాపార సినిమాలలో, టీవి సీరియల్స్‌లో తక్కువ స్థాయి పాత్రలతో తెలంగాణ మాండలికాల్ని మాట్లాడించి, నాసిరకం హాస్యం పండిస్తున్న నిర్మాత, దర్శకుల ప్రయత్నాల్ని నేను తీవ్రంగా నిరసిస్తున్నాను. అలాంటి ప్రయత్నాల వల్ల తెలంగాన ఔన్నత్యాన్ని తగ్గించలేరు సరి కదా వారి అవగాహనారాహిత్యాన్ని బహిర్గతం చేసుకుంటున్నారన్న మాట.

జీవితంలో వెలుగు నీడల్లాగా సమాజంలో ఆరోగ్య, అనారోగ్య వాతావరణాలు కలిసే ఉంటాయి. ప్రత్యక్షంగా వెలుగు రావడానికి కారణమేదో అదే పరోక్షంగా చిక్కనైన నీడలు పరుచుకోవడానికి కూడా కారణమవుతుంది. ఆరోగ్య వాతావరణం నెలకొల్పుకున్నామంటే, అనారోగ్య బీజాలకు పరోక్షంగా ఆహ్వాన ద్వారాలు తెరిచి వుంచామని అర్థం. అందు వల్ల ఈ ఘర్షణ నిరంతరం కొనసాగుతూ ఉండాల్సిందే. సమూలంగా మార్చడం ఎవరి వల్లా కాదు. రచయితలు, కవులూ నిరంతరం జ్వలిస్తూ ఉండడం అందుకే! శాస్త్రవేత్తలు నిరంతరం శోధించేదీ అందుకే. సాహిత్యంలోనైనా, సమాజంలోనైనా మార్చాలన్న తపన ఉంటేనే మార్చుతూ ఉండగలం.

విద్య వంటి గౌరవప్రదమైన రంగమే కమర్షలైజేషన్‌ వల్ల ఘోరంగా దిగజారిపోయింది. సినిమాలు, టీవి సీరియల్స్‌, పత్రికలు మాత్రమే కాదు, దేశ రాజకీయాలే దిగజారిపోయాయి. ఇక సాహిత్యం ఒక లెఖ్కా? అయినా ఇప్పటికీ సాహిత్యమే కొన్ని విలువల్ని నిలుపుకుంటూ వస్తోంది. మనిషిని తట్టి లేపుతూనే ఉంది. ఈ రంగంలో కవిత, కథ వంటి సాహిత్య ప్రక్రియలు వ్యాపార ధోరణిలో పడి కొట్టుకపోకుండా ఇంకా తమ ప్రత్యేకతల్ని చాటుకుంటూనే ఉన్నాయి. ఈ రకంగా ఒక సాహిత్యకారుడిగా గర్వపడుతున్నాను.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X