• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మధ్య తరగతి జీవులకు షాక్‌ ట్రీట్‌మెంట్‌

By Staff
|

(ప్రముఖ కథా రచయిత సొదుం జయరాం ఇటీవల కన్నుమూశారు. ఆయన రాసిన కథలు పలువురి ప్రశంసలు అందుకున్నాయి. జయరాం స్మృత్యర్థం ఆయన కథల పుస్తకం 'వాడిన మల్లెలు'పై రాచమల్లు రామచంద్రారెడ్డి రాసిన సమీక్షా వ్యాసంలోని కొన్ని భాగాలను ఇక్కడ ఇస్తున్నాం.)

జయరాం మంచి కథకుడు. "మంచి'' యేమిటంటే అతనికి కథానికా లక్షణం యేమిటో తెలుసు. కథానికకు ఒక పాయింటు ఉండాలి. అదే కథానికలోని ఆత్మ. అది జయరాంకు తెలుసు. కథానికలోని పాత్రలూ సన్నివేశాలూ మొదలైనవన్నీ ఆ పాయింటును వ్యక్తం చేయడానికి సాధానాలు మాత్రమే. అది జయరాంకు తెలుసు. సంక్షిప్తత కథానికలకు బలం యిస్తుంది. అనగా పాయింటుకు పదును యిస్తుంది. అది జయరాంకు తెలుసు. సంక్షిప్తతే కథానికకు బలం కనుక కథను సాగదీసి పేజీలు నింపాలనే ఉబలాటమూ, కథలో కవిత్వం వెలగబెట్టాలనే ప్రలోభమూ, అతి తెలివి ప్రదర్వించాలనే చాపల్యమూ కథను నీరసపరుస్తాయి. ఈ విషయంలో జయరాంకు ఆత్మనిగ్రహం ఉంది. అందుకే జయరాం మంచి కథకుడు.

పై 'మంచి' అంతా శిల్పానికి సంబంధించింది. ఇతివృత్తానికి సంబంధించిన 'మంచి' జయరాం కథల్లో యింకా స్పష్టంగా, బలంగా కనబడుతుంది. కథలు జీవితంలో నుండి పుట్టుక రావాలి. అయోమయంగా, అర్థరహితంగా కనపడే జీవిత కీకారణ్యాన్ని విడగొట్టి, జీవిత సత్యాలను క్లోజప్‌లో చూపించి, జీవితాన్ని గురించి పాఠకులకు ఒక అవగాహన కలిగించాలి. పాఠకుల చైతన్య పరిధిని (Sphere of Consciousness) విస్తృతం చేయాలి. అప్పుడే ఆ కథలు జీవితానికి సన్నిహితమైనవని అంటాం. ఈ అర్థంలోనే జయరాం కథలు .... 'ప్రస్తావన'లో కుటుంబరావుగారన్నట్లు .... 'అచ్చమైన తెలుగు కథలు. జీవితానికి అత్యంత సన్నిహితమైనవి.'

ఈ సంపుటిలోని పదమూడు కథల్లో అధిక భాగం జీవితంలోని చేదు నిజాలనే వ్యక్తం చేస్తాయి. సాహిత్యాన్ని సీరియస్‌గా తీసుకునేవాళ్లకు బహుశా యిది తప్పదేమో. భారతదేశంలో జీవితం యానాడు చేదుకాయలే కాస్తున్నది. సీరియస్‌ సాహిత్యం ఆ చేదును ప్రతిఫలించక తప్పదు. అదలా వుంచినా, జీవిత పరిస్థితులనూ, జాతి సంస్కారాన్నీ మెరుగుపరచడమే యే యుగంలోనైనా సాహిత్యానికి ఏకైక లక్ష్యం గనుక, జీవిత పరిస్థితులలోనూ, వ్యక్తుల సంస్కారాల్లోనూ వున్న కంటకాలనూ, కాలుష్యాలనూ బహిర్గతం చెయ్యడం సాహిత్యానికి యెప్పుడూ ప్రధాన కర్తవ్యంగానే వుంటుంది.

జయరాంకు కథాశిల్పమూ తెలసు, కథా రచనకు కావలసిన ఆత్మనిగ్రహమూ వుంది. కానీ ఆ నిగ్రహమే ఒకో చోట బలహీనతగా కూడా కనపడుతున్నది. ఈ నిగ్రహాన్నే కుటుంబరావు నిరాడంరత్వమన్నారు. ఈ నిరాడంబరత్వమే ఒకో చోట మితిమీరి కథలకు నష్టం తెస్తున్నది. కథకు పాయింటు ఎంత ముఖ్యమైనదైనా, పాయింటు చెప్పడమే కథ చెప్పడం కాదు. ఆ పాయింటు చుట్టూ పాత్రలూ, సన్నివేశాలూ, ఆ సన్నివేశాలలో ఆ పాత్రల రాగద్వేషాలూ మొదలైన అంగాలన్నీ సరిగా వుండి సమన్వయింపబడినప్పుడే ఆ పాయింటుకొక సాహిత్య స్వరూపం ఏర్పడి కథ అవుతుంది. ముఖ్యంగా కథలోని పాయింటు పాఠకుని గుండెలకు తాకాలి. అలా తాకాలంటే కథలో - పాయింటు చుట్టూ - అనుభూతి సంపద వుండాలి. ఆ అనుభూతి సాధారణంగా కథలోని పాత్రలను ఆశ్రయించుకొని వుంటుంది. కథలోని పాత్రలతో (లేదా, యేదో ఒక పాత్రతో) పాఠకుడు తాదాత్మ్యం చెంది ఆ పాత్ర (ల) రాగద్వేషాలను తనవిగా అనుభవించినప్పుడే ఆ కథలోని పాయింటు పాఠకుని గుండెల్లో నాటుకుంటుంది; అప్పుడే శిల్పం కళ అవుతుంది. జయరాంకు శిల్పం తెలుసు. బాగా తెలుసుననడానికి యెన్నైనా నిదర్శనాలు చూపించవచ్చు. కానీ కొన్ని కథల్లో ఆ శిల్పం కళ కాలేకపోయింది. పాయింటైతే స్పష్టంగా వుంటుంది. పసిపిల్లలకు కూడా అర్థమయ్యేటంత స్పష్టంగానూ వుంటుంది. కానీ అది పాఠకుని గుండెలకు తాకదు. ఆ పాయింటు చుట్టూ వుండవలసిన అనుభూతి సంపద వుండదు. అస్థిపంజరానికి వున్నట్లు సర్వాంగాలూ ఉంటాయి, కానీ రక్తమాంస పుష్టమైన సజీవ వ్యక్తిలా వుండదు కథ. యేదో ఒక విధంగా పాయింటు చేప్పేసి త్వరగా చేతులు కడుక్కుందామని కథకుడు తొందరపడినాడా అనిపిస్తుంది.

ఉదాహరణకు 'కథకుడి కథ'లో అభ్యుదయవాది అయిన కథకుడు 'కుందనపు బొమ్మ'లాంటి తన కూతరును కట్నం లేకుండా పెండ్లి చేసుకోలేని నేటి యువతరాన్ని 'వఠ్ఠి ఉత్తర కుమారులు! దేబెలు! వాజమ్మలు! వీళ్లకి కట్నమే కైలాసం. వీళ్లకి సౌందర్యారాధన లేదు; అభ్యుదయ భావాలు అంతకన్నా లేవు'' అంటూ తిట్టుకుంటాడు. కానీ ఆ కూతురు యెవరినో ప్రేమించి, అతన్ని పెండ్లి చేసుకోవడానికి తండ్రి అంగీకారం కోరేటప్పటికి 'తన కూతుర్ని ఒక హీనకులస్తుడికి కట్టబెట్టడామా? తన పరువు ఏం కాను?' అని అతనిలో కోపం కట్టలు తెంచుకుంటుంది. అతని అభ్యుదయ భావాలలోని బూటకం లేదా సంకుచితత్వం వెల్లడవుతుంది. అదే కథలోని పాయింటు. పాయింటు వెంట కొంత ఆశ్చర్యం కూడా పాఠకునికి కలుగుతుంది. కానీ అంతకు మించి యే అనుభూతీ కలుగదు. పాఠకుడు ఆ తండ్రితొ తాదాత్మ్యం చెందలేడు. గనుక, యే అనుభూతికీ అవకాశం లేదు.

.................... ...........................................

జయరాంలో ప్రశంసనీయమైన శిల్పదృష్టి ఉంది. అంతకంటే పటిష్టమైన సామాజిక దృష్టి ఉంది. తరచుగా అనుభూతి సంపద లోపించినా అతని కథల్లోని సామాజిక దృష్టి పాఠకులను నిస్సందేహంగా ఉత్తేజపరుస్తుంది. ప్రగతిశీలమైన అతని సామాజిక అవగాహనా, సంయమన శీలమైన అతని శిల్పశక్తీ అతనికి గొప్ప భవిష్యత్తు ఉందని వాగ్దానం చేస్తున్నాయి.

యేటేటా కథల పోటీల్లో బహుమతులు అందుకునే కథకులతో పోలిస్తే జయరాం నిస్సంశయంగా గొప్ప కథకుడు. కానీ వారపత్రికా కథకులతో యితన్ని పోల్చడమే అన్యాయం. ఈ సంపుటిలోని ఒకటి రెండు కథలు వారపత్రికల ఆఫీసుల్లో కొన్నాళ్లు కాపురం చేసి వాపస్‌ చేసినవే. వారపత్రికల సెంటిమెంటల్‌ జాడ్యం అంటకపోవడమే జయరాం గొప్పతనం. జీవితం గురించి యితనికి ఏ కోశానా భ్రమలు లేవు. భ్రమలతోనూ, సెంటిమెంట్లతోనూ మానసికంగా నీరసించి పోయిన మధ్య తరగతి జీవులకు యితని కథలు మంచి షాక్‌ ట్రీట్‌మెంట్‌

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more