• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రాంతీయ అస్తిత్వ కవిత్వం

By Staff
|

తెలంగాణా ప్రాంతం వెనుకబడిందని, అక్కడి భాష నాగరికం కాదని, సారస్వత మూల్యాల్ని కాపాడే శక్తి ఆ భాషకు లేదని (ఇది కేవలం మాండలికం గనుక, మాండలికంలో రాసేవాళ్లు ప్రతిభ లేని వాళ్లు గనుక) ఒక అపవాదు వింటుంటాం. వెనుకబడిన ప్రాంతం మాటేమో గాని భాషా సారస్వతంలో మాత్రం తెలంగాణ ఏమీ తీసిపోదని గట్టిగా చెప్పొచ్చు.

ధనంజయ విజయ వ్యాయోగము (సంస్కృతం) రాసిన కాంతనుడు, అనంగ మంగళము (సంస్కృతం) రాసిన సుందరాఖ్యుడు, దశరథ రాజనందన చరిత్రము (తెలుగు) రాసిన సింగరాచార్యులు, శ్రీకృష్ణ శతానందీయము (తెలుగు) రాసిన మరిగంటి నరసింహాచార్యులు, తాలంక నందినీ పరిణయము (శశిరేఖా పరిణయకవి) రాసిన మరిగంటి సింగరాచార్యులు, ద్విపద రాఘవ కర్త వీర రాఘవ కవి, వరదరాజ రామాయణము అనే ద్విపద కావ్యం రాసిన కట్టా వరదరాజు, మధుర వాణీ విజయము రాసిన వీర రాఘవ కవి, అలాగే హరిశ్చంద్రోపాఖ్యానము రాసిన గౌరన, సింహాసన ద్వాత్రింశక రాసిన కొరవి గోపరాజు మొదలైనవాళ్లంతా తెలంగాణా వాళ్లే. అలాగే చెన్నూరు రామన్న (శ్రీమద్రామాయణము), బంగారు రంగవ్వ (భేతాళ చరిత్ర), దొంతర మల్లేశం (అలవాల క్షేత్ర మహత్మ్యము) లాంటి కవులు తెలంగాణా ప్రాచీన సాహితీ క్షేత్రాన్ని సస్యశ్యామలం చేశారు.

1724లో ఏర్పడ్డ ఆసఫ్‌ జాహీ వంశస్థుల పాలన క్రమంగా నిజాం పాలనగా అవతారం ఎత్తాక నిరంకుశత్వం హద్దు మీరింది. 1930-33లో సంభవించిన ఆర్థిక సంక్షోభం మూలంగా భూస్వాములు నిజాం కనుసన్నల్లో మెలగుతూ పెద్ద ఎత్తున రైతుల నుంచి భూమిని స్వాధీనం చేసుకొని వాళ్లని నిస్సహాయుల్ని చేశారు.

పాల్వంచ, ఆత్మకూరు, జటప్రోలు, గద్వాల, వనపర్తి, దోమకొండ, సిరినేపల్లి, గోపాలపేట, రాజపేట మొదలైన అన్ని సంస్థానాలు బలోపేతం అయ్యాయి. గ్రామ పారిశ్రామికులైన వడ్ల, కుమ్మరి, పద్మశాలి, చాకలి, మంగలి, మాదిగ, మాల వంటి సమస్త కులాలు ప్రతిఫలం లేకుండా వెట్టి చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఈ పరిస్థితిలో తెలంగాణ ఉద్యమం ఒక సాంస్కృతిక ఉద్యమంగా మొదలైంది. అప్పుడే మొదలైన గ్రంథాలయోద్యమం హైదరాబాద్‌ సంస్థానంలో ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని, విలువని చేకూర్చింది. తెలుగు పత్రిక, సుజాత, శోభ, భాగ్యనగర్‌, సారథి, ఆంధ్రాభ్యుదయం, నీలగిరి లాంటి పత్రికలన్నీ ఉద్యమాల్ని జాగృతం చేశాయి.

సాంస్కృతిక చైతన్యం లక్ష్యంగా ఆంధ్రజన సంఘం ఏర్పడింది. దీని పరిధి విస్తరించి సంస్కరణోద్యమంగా రూపొందింది. ఇది చివరికి 1946లో స్టేట్‌ కాంగ్రెస్‌లో విలీనమై తెలంగాణా విమోచనోద్యమాన్ని చేపట్టింది. రజాకార్ల పోలీసుల నిరంకుశత్వం నుండి, దౌర్జన్యం నుండి ప్రజల్ని కాపాడడానికి ఈ సంఘం తన వంతు కృషి చేసింది. దుండగుల్ని ఎదిరించడానికి గెరిల్లా దళాలు ఏర్పడ్డాయి.

ఈ సామాజిక పరిస్థితి అంతా అప్పటి సాహిత్యంలో ప్రతిఫలించింది. సామాజిక మార్పులు సాహితీ వ్యవస్థలోని అంతర్గత తర్కం (inner dialect) తెలంగాణా ఉద్యమ సాహిత్యాన్ని సృష్టించింది. చిత్రం ఏమిటంటే- మొట్ట మొదట తెలంగాణేతర కవుల్లో మొదలైంది. ఆవంత్స సోమసుందర్‌ వజ్రాయుధం, ఆరుద్ర త్వమేవాహమ్‌, రెంటాల సర్పయాగం, గంగినేని ఉదయిని లాంటి కావ్యాలు తెలంగాణా ఉద్యమాన్ని ప్రతిఫలించాయి.

తెలంగాణ దుర్భర పరిస్థితుల్ని ప్రత్యక్షంగా అనుభవించి ఉద్యమ స్ఫూర్తితో కవిత్వం రాసినవారు కాళోజీ. శ్రీశ్రీ ఆవిష్కరించిన తన 'నా గొడవ' కావ్యంలో- ''హింస పాపమని యెంచు దేశమున/ హిట్లరత్వమింకెన్నాళ్లు/ పగటి దోపిడుల నాపగ లేని/ ప్రభుత్వముండేదెన్నాళ్లు'' అని ఆవేశంతో ప్రశ్నించారు.

ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్న దాశరథి గురించి చెప్పనవసరం లేదు. ఆయన పద్యపాదాలు ఇప్పటికీ ప్రతి ఉద్యమకారుడికీ ప్రాతస్మరణీయాలయ్యాయి. ఇంకా ఉద్యమంలో పాల్గొనక పోయినా సినారె, వానమామలై వరదాచార్యులు, గర్రెపల్లి సత్యనారాయణరాజులాంటి కవులెందరో తెలంగాణా సీమకు వన్నె తెచ్చారు. ప్రస్తుతం కూడా మలయశ్రీ, ఎస్‌. వెంకటాద్రి, భైరి నర్సయ్య, శేషం రామాచార్యులు, గాదె శంకర్‌, అందె వెంకటరాజం, గుమ్మన్నగారు, అష్టకాల గౌరీభట్ల, రఘురామశర్మ, సామ లక్ష్మారెడ్డి లాంటి కవులెందరో తెలంగాణకు వన్నె తెస్తున్నారు. వాళ్ల కవితారూపాలు పాతవే అయినా వాళ్లలోని ప్రశస్తమైన కవితా సంపదని గుర్తించక తప్పదు.

ఆధునిక కవిత్వంలో తెలంగాణ ఆధునిక కవిత్వంలో తెలంగాణ పాత్ర కవిత్వానికి ఒక ముడి సరుకు అయింది. There is no marked difference poetry that of prose అన్న వర్డ్స్‌వర్త్‌ మాటలు ఈ కవిత్వంలో నిజమయ్యాయి.

స్వాతంత్ర్య వచ్చాక పాలకులు తెలంగాణ మీద దారుణమైన వివక్ష చూపించారు. ఉద్యమాలు నడిచినా స్వార్థం దాని ప్రయోజనాన్ని బలి తీసుకుంది. ఒప్పందాలు ప్రభుత్వ ఉత్తర్వులు గాలిలో కలిసిపోయాయి. సాంస్కృతికంగా తెలంగాణా అవహేళనల్ని, అవమానాల్ని ఎదుర్కుంది. సినిమాలలో దుష్టపాత్రలకు, హాస్యపాత్రలకు మాత్రమే పనికి వచ్చే భాషగా తెలంగాణా పరిగణించబడింది. కేవలం కోస్తా జిల్లాల మాండలికం రాష్ట్రంలోని ప్రామాణిక భాషగా చలామణి కావడానికి నడిచిన (ఉపరితలంలో అభ్యుదయ దృక్పథంగా కనిపించినప్పటికీ) వ్యవహారిక భాషోద్యమం వెనుక ఉన్న అసలు వ్యూహాన్ని ఇప్పుడు తెలంగాణ సాహితీవేత్త అర్థం చేసుకుంటున్నాడు. తెలంగాణలోని భాగవతం అనే వీధి నాటక కళలోని దరువులు ముత్యాలసరాలుగా చలామణి అయిన తీరును ప్రతి విమర్శకుడూ పట్టించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒక వేళ ఇదంతా యాదృచ్ఛికంగానే జరిగినా మూల రూపాలు పేర్కొనబడక పోవడంలోని ఒక కోస్తా అగ్రకుల నాగరికమైన కుట్రను క్రమంగా అందరూ గుర్తిస్తున్నారు. సాధారణమైన పాటకుడు కూడా దరువులు వేయగలిగిన తెలంగాణ జానపద గీతానికి ఆభాసం లాంటి మిశ్రగతి గేయం ఒక వ్యక్తిని సాహితీ యుగకర్తను చేయడం ఎంత పేలవమో అనేది సాహిత్య చర్చలకు క్రమంగా వస్తోంది.

ఈ నేపథ్యంలోనే అత్యాధునికంగా శిరసెత్తుకుంది తెలంగాణ కవిత్వం. ఇది సంప్రదాయ దాస్యానికి సంబంధించిన కవిత్వం కాదు. తన అస్తిత్వాన్ని గురించి ఆలోచించే కవిత్వం.... What the basic condition of human existence are and how man can establish his own meanig out of the condition అన్న Karl Jaspers ఇప్పుడు తెలంగాణా కవిలో కనిపిస్తున్నాడు.

ఒక దశకం వెనుక కవిత్వం రాసిన ఏ తెలంగాణ కవి అయినా గిడుగు సూచించిన భాషనే స్వీకరించాడు. ప్రామాణిక భాషగా చలామణి అయిన కోస్తా మాండలికాన్నే అనివార్యంగా అనుసరించాడు. ఒక వేళ తెలంగాణ మార్కు ఎక్కడైనా సూచించాలనుకున్నా అదో కృతక ప్రయోగమే అనిపించేది. డాక్టర్‌ ఎన్‌. గోపి, నిఖిలేశ్వర్‌ లాంటి కవులంతా ఈ కోవలో కవిత్వం రాసినవాళ్లే.

రూపపరమైన స్పృహ అంటే ఇక్కడ భాషా స్పృహగానే గమనించాలి. కవిని వస్తువును కాలాన్ని బట్టి రూపం ఏర్పరుచుకుంటుంది. రూపంలో భాష అనివార్యమైన అంశంగా నిలుస్తుంది. I consider atr as a form of knowledge which can be defined by its object అంటూ వస్తు స్పృహ (Thematic sense) ని విశ్లేషించిన Henri Bonnet దృక్పథం రూపానికి మూలమైన వస్తువును పరిశీలించడానికి ఉపకరించేదిగా గుర్తించాల్సి ఉంటుంది.

భాషా స్పృహ ఆధునికానంతర కాలంలో సామాజిక జీవనంలో పెరిగిన భాషా ప్రాధాన్యతను గురించిన చర్చలు ఈ వరకే సాహిత్యంలో బోలెడన్ని జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ కవుల్లో కొంత మందిలో యాదృచ్ఛికంగాను, కొందరిలో సాంస్కృతికోద్యమ స్పృహతోను వైవిధ్యమైన భాషా ప్రయోగం జరుగుతున్నది.

కవితల్లో అక్కడక్కడా చక్కని పదాలు తెలంగాణ జీవన మూలాల్ని పాఠకునికి తాకే విధంగా చిత్రిస్తున్నారు. కొలిమి (జూలూరి), కుంపటి (బాణాల), పెత్రమాస (సిద్ధార్థ) లాంటి కవితా శీర్షికలు తెలంగాణ స్పృహను చూపించేవి. గంగ తెప్ప సాయమాను సొట్ట బుగ్గ (అంబటి వెంకన్న) లాంటి పదబంధాలు తెలంగాణ పల్లెల జీవన మూలాల్ని సాహితీ లోకానికి పరిచయం చేసేవి. అలాగే జూకంటి జగన్నాథం 'పాతాళ గరిగె', రాయగిరి నాగరాజు స్మృతిలో వచ్చిన 'సింగిడి' తెలంగాణ స్పృహతో సంకలనాలకే పెట్టిన పేర్లు.

కొన్ని కవితలు తెలంగాణ పద్ధతిలోనే ఎత్తుకొని కోస్తా మాండలికం ప్రభావం వల్ల మామూలుగా కొనసాగిన సందర్భాలున్నాయి. ఏనుగు నర్సింహారెడ్డి నీటిపిట్ట- చివుక్కుమనవు, చిత్తడినేల అసలేటి వానవంకర్లు అంటూ చివుక్కు అని ప్రారంభమై కోస్తా మాండలికంలోనే కొనసాగుతుంది. పోయమ్‌లో గడ్డివాము, కర్రుమని లాంటి పదబంధాలు తెలంగాణ స్పృహను తెలియజేస్తాయి. అలాగే వానాకాలం అనే ఏనుగు మరో పోయమ్‌ పొద్దూకి, సీసంగోటిలాడాను అంగీకాడి లాంటి పదాలు ఈ స్పృహతోనే కొనసాగాయి.

పదబంధాలే కాక ఏకంగా పోయమ్‌ మొత్తం తెలంగాణ భాషలోనే రాసిన కవితలు ఇటీవల ఎక్కువే వచ్చాయి. 'అప్పుడు జూద్దాం', పగడాల నాగేందర్‌ 'గోస', సిద్ధార్థ 'భాష ఒక గుణుగు పూవు' లాంటి కవితలన్నీ ఈ కోవలోవే. జింబోలాంటి కవులు మొత్తం కవితల్ని తెలంగాణ భౄసలోనే రాసిన సందర్భాలున్నాయి. కాగా తెలంగాణ భాష అంటే కేవలం తెలంగాణ జానపదులు మాట్లాడుకునే భాష మాత్రమే కాదు. తెలంగాణాలో కూడా శిష్టభాష ఉంది. అది కొన్ని మార్పులు మినహాయిస్తే ఈనాడు ప్రామాణిక భాషగా చలామణి అవుతున్న కోస్తా భాషకేం తీసిపోదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ భాషే ఈనాటి సాహితీ ప్రక్రియలన్నింటికీ మాధ్యమంగా రూపొందుతుంది. మొత్తం కవితల్ని తెలంగాణ భాషలోనే రాయాలనుకునే కవులంతా ఈ విషయం గమనించాల్సి వుంటుంది. జగన్‌ రెడ్డి 'కాకతీయ గడ్డపై' అనే పోయమ్‌లో ఈ ప్రయత్నం కనిపిస్తుంది. అలాగే ఏనుగు నర్సింహారెడ్డి తహసీల్‌ తరీఖా- ''అవ్వా నోరెత్తి ఒక మాటైనా తిట్టైనా శాపనార్థమైనా పెట్టవే చీమూ నెత్తురూ గడ్డ కట్టి నోళ్లను చికాకైనా పెట్టవే'' అంటూ మొదలై ''అవ్వా/ మొదట పని చేసిన తర్వాత/ దరఖాస్తు రాయించుకుంటా'' అంటూ ముగిసిన పోయమ్‌లో ఈ ప్రయత్నం పూర్తి స్థాయిలో జరిగింది.

వస్తు స్పృహ జూలూరి గౌరీశంకర్‌ నా తెలంగాణ పూర్తి తెలంగాణ వస్తువుగా వచ్చిన లాంగ్‌ పోయమ్‌. లాంగ్‌ పోయమ్‌కు ఈనాడు మనం చెప్పుకునే లక్షణాలకు ఇది పూర్తిగా సరిపోకపోయినా తెలంగాణపైనే మొత్తం పోయమ్‌ రాయడం మంచి ప్రయత్నం. ఒకనాటి కుందుర్తి పోయమ్‌లో కాల్పనిక వాస్తవికత ప్రధానమైతే ఇందులో వాస్తవ కాల్పనికత ప్రధానం. ఇంకా పులిపాటి గురుస్వామి చెమ్మ సంకలనం కూడా తెలంగాణ వస్తు స్పృహతో కొనసాగిందే. ఈ సందర్భంగా ఎం. వెంకట్‌ 'ఎన' ప్రత్యేకంగా గుర్తించదగిన కావ్యం. తెలంగాణలోని బెస్తకుల జీవనాన్ని బలంగా చిత్రించాడు వెంకట్‌.

తెలంగాణ వస్తు స్పృహతోనే వచ్చిన సంకలనాలు కాకపోయినా పోయమ్స్‌ అయితే చాలనే వున్నాయి. పగడాల నాగేందర్‌ 'సుద్ది', 'దేవులాట' కవితలు చెప్పుకోదగ్గవి. అలాగే యస్వీ సత్యనారాయణ హైదరాబాద్‌ పాతబస్తీలో భాషా విషయం మినహాయిస్తే పూర్తి స్థాయి వస్తు స్పృహ కనిపిస్తుంది.

''సంక్రాంతి పండుగనాడు మా షంషుద్దీన్‌ మామ/ సంబరంతో ఎగిరే గాలి పటమయ్యేవాడు/యక్షగానాల్లో జాంగీర్‌ చాచా శ్రీకృష్ణుని గీతమయ్యేవాడు/ పీర్ల పండుగలో పాషా బాయ్‌తో ఆడిన క్షణాలు/ ఆసన్న ఊసన్నల బృంద గానంలో బద్దలయ్యే లేత గుండెలు వంటి పాదాలతో తెలంగాణ జీవితంలో చెప్పుకోదగిన మతాతీత లౌకిక స్పృహ బలంగా చిత్రించారు.

'ఇంకా బతుకమ్మ', జగన్‌ రెడ్డి 'ఇతిహాసం', 'మా చేతుల్లో కుక్కపిల్ల', అలాగే డాక్టర్‌ ఎన్‌. గోపి 'రాజయ్య కథ', 'బొంత'లాంటి కవితలన్నీ ఇందుకు ఉదాహరణ. సిద్ధార్థ 'మోసాంబరం', 'కర్రెసామి జంగపోడ' లాంటి పోయెమ్స్‌ అటు భాషలోను, ఇటు వస్తువులోను పూర్తి స్థాయి తెలంగాణ స్పృహతో వచ్చిన పోయమ్స్‌. అలాగే పూర్తి స్థాయి వస్తువు భాషలతో కొనసాగిన మరోటి పగడాల నాగేందర్‌ 'జోలి' ''మోదుగు డొప్పలో వెన్నెలను జుర్రుకున్న గీ నేల/ సలుపుతున్న సనుబాల తీపిని/ మేస్తుంది/ నెత్తుటి తడిసిన/ తంగేడు పూలవనంతో/ జీరబోయిన బాలసంతు పాట/ గుండె గూటిలో గులేరై ఒదుగుతుంది'' లాంటి చక్కని కవితాత్మక పంక్తులతో కొనసాగుతుంది.

కృష్ణమూర్తి యాదవ్‌ 'తొక్కుడు బండ' మరో విలక్షణమైన కావ్యం. ''అయ్యలను సూసెటోళ్లె కాని/ కన్నెత్తి మాట్లాడెటోళ్లు లేరు/ గాలికి కొమ్మ తాగినట్లు/ తలుపులూపుతుంటారు/ దేవుడి కాళ్లకు/ దండం మరిసిపోవచ్చు/ దొర కాళ్లకు మరిసిపోరు/ ఊరుకు శివారెంత/ శికస్తెంత/ పాణీలో ఏముంది/ బంజరెంత/....../............/ ఈ దేశం చెట్ల/ నీడలు వాళ్లే'' ఇలా కొనసాగే కవితల్లో తెలంగాణా భాషా వస్తువు పోటీ పడ్డాయి.

అనేక కారణాల వల్ల వ్యాసంలో పేర్కొనబడకపోయినా ఇటీవలి కాలంలో సాహిత్యంలో తెలంగాణా స్పృహ ఉధృతంగా కనిపిస్తుంది. ఇది తెలంగాణా ప్రజల జీవన మూల్యాల రక్షణకు స్వతంత్రేచ్ఛకు సంకేతంగా గుర్తించాలి.

ప్రతి వర్గమూ, కులమూ, అలాగే ప్రాంతం కూడా ఒకానొక ప్రత్యేక అస్తిత్వంతో మాట్లాడడం ఆధునికానంతర కవిత్వంలో ప్రత్యేకంగా గుర్తించదగిన పరిణామం. ఇవే కాకుండా ప్రతి మనిషి అస్థిత్వ పోరాటంలో భాగంగా తన దృక్పథం నుండి అనుభవ పరిధి నుండి మాట్లాడాల్సి వుంది. This heart in me I can feel and judge that it exists. This World I can touch and I like wise judge that it exists (albert camus) ప్రపంచం ఎంత నిజమో వ్యక్తి అంతే నిజం. ఈ అస్థిత్వాల పరమార్థం మానవ శ్రేయస్సే అయినప్పుడు ఇది ప్రత్యేకంగా గుర్తించదగింది. వికేంద్రీకృత పాలనతో పాటు వికేంద్రీకృత సాహిత్యమూ, సంస్కృతీ సమర్థించదగింది. స్వాగతించదగింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more