వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నైతిక కట్టుబాట్ల సంకెళ్లు

By Staff
|
Google Oneindia TeluguNews

సృజనాత్మకతకు ప్రేమ ఉదాత్త వస్తువు కాదా? ప్రేమ కవిత, ప్రేమ కథ రాయకూడదా? ప్రేమ మీద నిషిద్ధం వుందా? తెలుగు సాహిత్యంలో ఇటువంటి నిషిద్ధం ఒకటి అమలవుతూ వస్తోంది. ప్రేమ కథ, ప్రేమ కవిత రాశాడంటూ ఒక రచయితను, ఒక కవిని కొట్టి పారేయడం ఒక సంప్రదాయంగా మారింది. ఇటీవల ఒక సాహితీవేత్తతో మాట్లాడుతున్నప్పుడు 'చెమ్మ' కవితా సంకలనం వెలువరించిన డాక్టర్‌ పులిపాటి గురుస్వామి ప్రస్తావన వచ్చింది. 'ఆయనేం కవి, ప్రేమ కవిత రాశాడు' అని ఆయన కొట్టి పారేశారు. పులిపాటి గురుస్వామి 'చెమ్మ' కవితా సంకలనం వెలువరించడమే కాకుండా 'జీవగంజి' పేర ఒక దీర్ఘ కవిత వెలురించారు. ఇందులో ప్రేమ ఇతివృత్తంగా ఈ కవిత సాగుతుంది. కథా రచయిత డాక్టర్‌ వి. చంద్రశేఖర్‌ రావు 'సలీం సుందరం ప్రేమ కథ' అనే కథ రాశారు. ఈ కథను కూడా మరో సాహితీవేత్త ప్రేమ కథగా కొట్టి పారేశారు.

బహుశా, సీరియస్‌గా సాహిత్యాన్ని అధ్యయనం చేసే వారెవరూ లేదా సాహిత్యమంటే ఏమిటనే విషయం కచ్చితంగా తెలిసిన వారెవరూ ఈ విధమైన తేలికపాటి వ్యాఖ్యలు చేయరు. ఆత్మను పట్టుకోవడం తెలియని లేదా ఆత్మను పట్టుకోవడానికి ఇష్టపడని సాహిత్యకారులు మాత్రమే 'జీవగంజి'ని ప్రేమ కవితగా కొట్టి పారేయగలరు. కథకు, కవితకు, ఇతర ప్రక్రియకు ప్రేమ ఇతివృత్తం కావచ్చు; వ్యాపార సాహిత్యంలో లేదా ఫ్లాట్‌ఫారం సాహిత్యంలో వ్యక్తమయ్యే ప్రేమకు, సీరియస్‌ సాహిత్యంలో వ్యక్తమయ్యే ప్రేమకు తేడా వుంటుంది. సామాజిక, ఆర్థిక, మానసికాంశాలు ప్రేమ ఇతివృత్తంగా సాగే సాహిత్యంలో వ్యక్తీరింపబడతాయి. స్త్రీవాద సాహిత్యం స్త్రీపురుషుల మధ్య అసమానతలను వ్యక్తీకరించడానికి ప్రేమను ఇతివృత్తంగా ఎంచుకోలేదా? ప్రాంతీయ అసమానతలను వ్యక్తీకరించడానికి ఇటీవల ప్రేమ ఇతివృత్తంగా కథలు రావడం లేదా?

చంద్రశేఖర్‌ రావు రాసిన 'సలీం సుందరం ప్రేమ కథ' జాతీయ, అంతర్జాతీయ మార్పుల దృష్ట్యా ముస్లింలు తమ ఐడెంటిటీని కోల్పోవాల్సిన చిక్కుల్లో ఎలా పడుతున్నారనేది తెలియజేస్తుంది.

తెలుగు సాహిత్యంలో సెక్స్‌ అయితే అంటరానిదే అయింది. సెక్స్‌ వ్యక్తీకరణలపై చాలా కాలంగా నిషేధం కొనసాగుతోంది. ఏ బేషిజాలు లేకుండా లాటిన్‌ అమెరికన్‌ సాహిత్యంలో సెక్స్‌ వ్యక్తీకరణలు వుంటున్నాయి. ప్రేమ, సెక్స్‌కు సంబంధించిన అంశాలను తడమకుండా సమాజాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించడం సాధ్యమవుతుందా అనే ప్రశ్న ఇవ్వాళ్ల మనం వేసుకోవల్సిన అవసరం వుంది. ఈ 'నైతిక కట్టుబాట్ల'ను ధిక్కరిస్తూ తెలుగులో ఇంతకు ముందు కవిత్వం వచ్చింది. ఇప్పుడు కాస్తా ఎక్కువగా వస్తోంది. అయిల సైదాచారి, ఎస్‌. జగన్‌ రెడ్డి కవిత్వాలను పర్వర్షెన్స్‌గా పెదవి విరిచే వారున్నారు. పర్వర్షెన్స్‌ అయినా సరే, వ్యక్తీకరణకు నోచుకోకూడదా అనేది ప్రశ్న.

సృజనాత్మక ప్రక్రియలపై కొంత మంది పెద్దలు 'నైతిక కట్టుబాట్లు' విధించి పాలించే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక పరిస్థితులను మాత్రమే సాహిత్యం ప్రతిఫలించాలనే ఒక రొడ్డుకొట్టుడు పద్ధతిని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక పరిస్థితుల ప్రతిఫలనం అంటే సరైన అవగాహన లేనివారే ఈ విధమైన కట్టుబాట్లను విధిస్తారు. ఈ నైతిక కట్టుబాట్ల ఫలితంగానే దాము 'ప్రవాహగానం' కవితా సంకలనంపై పెద్ద యెత్తున వివాదం చెలరేగింది. ఈ కట్టుబాట్లు సాహిత్యాన్ని ఎడిట్‌ చేసుకోవాల్సిన అవసరానికి ఎక్కడ లేని ప్రాధాన్యం ఇస్తుంది. బహిరంగ పరచాల్సిన సాహిత్యాన్ని, దాచుకోవాల్సిన సాహిత్యాన్ని; వ్యక్తిగతమైన సాహిత్యాన్ని, సామాజిక సాహిత్యాన్ని వేరు చేసి చూపుతుంది.

అంటే, ఆచరణలో లేని దాన్ని బహిరంగ పరచాల్సిన, సామాజిక సాహిత్యంగానూ, ఆచరణలో వున్నదాన్ని, మనసులను తొలుస్తున్న సాహిత్యాన్ని దాచుకోవాల్సిన, వ్యక్తిగత సాహిత్యంగానూ వర్గీకరించి చూపుతున్నారు. నిజానికి, ఏదైతే నిషేధంగా వుందో రికార్డులకు ఎక్కకుండానే ఎక్కువ ప్రచారం పొందిన సందర్భాలు కూడా వున్నాయి. సాహిత్య సృజనకు గీసిన ఈ గిరులు ప్రయోగానికి, నూతనత్వానికి సంకెళ్లు వేస్తాయి. అందుకే ఏ మాత్రం కొత్త దనం లేని సాహిత్యం వెలువడుతూ వుంటుంది. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం వుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X