వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రవాసి మనస్సంక్షోభం నైపాల్‌ రచనలు

By Staff
|
Google Oneindia TeluguNews

అతని వేళ్లు భారతదేశంలో ఉన్నాయి. పుట్టింది ట్రినిడాడ్‌లో. బ్రిటిష్‌ పౌరుడు. ఆయనెవరో కాదు, సాహిత్యంలో ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ బహుమతి పొందిన సర్‌ విద్యాధర్‌ సూరజ్‌ ప్రసాద్‌ నైపాల్‌. 2001గాను ఆయనకు నోబెల్‌ పురస్కారం వచ్చింది. భారతదేశానికి చెందినవారికి సాహిత్యంలో నోబెల్‌ పురస్కారం రావడం ఇది రెండవసారి. ఇంతకు ముందు ఈ పురస్కారాన్ని రవీంద్రనాథ్‌ టాగోర్‌ అందుకున్నాడు. 'ఎ హౌస్‌ ఫర్‌ మిస్టర్‌ బిస్వాస్‌', 'మిమిక్‌ మెన్‌', 'ఎ బెండ్‌ ఇన్‌ ద రివర్‌', 'ఇన్‌ ఎ ఫ్రీ స్టేట్‌', 'యన్‌ ఏరియా ఆఫ్‌ డార్క్‌నెస్‌', 'ది ఎనిగ్మా ఆఫ్‌ ద ఎరైవల్‌' వంటి మాస్టర్‌ పీస్‌లు రాశాడు నైపాల్‌.

నైపాల్‌ 1932 ఆగస్టు 17వ తేదీన ట్రినిడాడ్‌లోని చిన్న పట్టణంలో జన్మించాడు. హిందూ బ్రాహ్మణుడిగా పెరిగాడు. ఆయన తన 18వ యేట వరకు స్పెయిన్‌లోని పోర్టులో చదివాడు. ఆ తర్వాత ఆయన పూర్తిగా ట్రినిడాడ్‌ను వదిలేశాడు. ఆక్స్‌ఫర్డ్‌లో విద్యను అభ్యసించడానికి ఆయనకు స్కాలర్‌షిప్‌ వచ్చింది.

'కరిబేయన్‌ వాయిసెస్‌' అనే కార్యక్రమాన్ని బిబిసి రేడియోకు రూపొందించడం ద్వారా నైపాల్‌ తన కెరీర్‌ను ప్రారంభించాడు. తన 22వ యేటి నుంచి రచనలు చేయడం ప్రారంభించాడు. తన 29వ యేట 'ఎ హౌస్‌ ఫర్‌ మిస్టర్‌ బిస్వాస్‌' అనే మాస్టర్‌ పీస్‌ను వెలువరించాడు. ఆయనను సినిక్‌ అని, ఆంగ్లోఫోబిక్‌ అని పిలిచినా ఆ తరం రచయితల్లో విజయాలను అధిరోహించిన రచయిత నైపాల్‌. నైపాల్‌కు వచ్చిన చాలా అవార్డులలో బుకర్‌ ప్రైజు కూడా వుంది. 'ఇన్‌ ఎ ఫ్రీ స్టేట్‌' అనే రచనకు ఆయనకు బుకర్‌ ప్రైజు వచ్చింది. ప్రస్తుతం నైపాల్‌ తన భార్యతో లండన్‌లోని ఒక చిన్న ఫ్లాట్‌లో జీవనం సాగిస్తున్నాడు.

పురుటి గడ్డ కోసం పడే తపన నైపాల్‌ రచనల్లో కనిపిస్తుంది. పురుటి గడ్డ కోసం ఆయన చేస్తున్న అంతశ్శోధన, ఆ తపన ఆయన చేత రచనలు చేయించాయి. నిరంతర ప్రవాసంలో అనునిత్యం సంఘర్షణకు లోనై, తన ఆవేశకావేశాలకు అర్థాలు అన్వేషించే తత్వమే ఆయన రచనలకు పునాది. ఆ ప్రవాస మనస్సంక్షోభం ఆయనను సాహిత్యంలో ఉన్నత శిఖిరాలకు తీసికెళ్లింది. ఆయనను నిరంతర సంచార మేధావిగా మార్చింది. 'ద హౌస్‌ ఫర్‌ మిస్టర్‌ బిస్వాస్‌' రచనతో ఆయన ఒక్కసారి అగ్ర రచయితల సరసన నిలబెట్టింది. ఆయన పలు దేశాలు పర్యటించారు. ఎక్కడికి వెళ్లినా ఆయనకు వలస పాలన శక్తులు మానవ స్వభావాన్ని తొలిచి వేసిన దృశ్యాలే ఆయన కళ్ల ముందు నిలిచాయి. అవే ఆయన రచనలకు ముడి సరుకులయ్యాయి. ఇందులో భాగంగానే ఆయన 'గెరిల్లాస్‌', 'ఎ బెండ్‌ ఇన్‌ ద రివర్‌' వంటి రచనలు చేశారు. వెస్టిండీస్‌, తదితర దేశాల్లో పర్యటించి ఆయన ముస్లిం విధానాలపై రాసిన 'ఎమాంగ్‌ ద బిలీవర్స్‌: యాన్‌ ఇస్లామిక్‌ జర్నీ' అనే రచన వివాదాస్పదమైంది. మతభావాలు, ప్రవాసం, వలస పాలన ఆయన రచనల్లో కనిపించే ప్రధాన ఇతివృత్తాలు. 1987లో ఆయన రాసిన 'ది ఎనిగ్మా ఆఫ్‌ ఎరైవల్‌' అనే రచనను వలస ప్రపంచంలో ఊపిరాడక తిరిగీ తిరిగి చివరకు బ్రిటన్‌ చేరి అక్కడ స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఒక కరేబియన్‌ రచయిత ఆత్మాశ్రయ జీవిత చరిత్రగా మలిచాడు. ఈ రచననే నోబెల్‌ పురస్కార కమిటీ ప్రత్యేకంగా ప్రశంసించడం గమనార్హం.

ఉత్తర భారతదేశానికి చెందిన నైపాల్‌ ఆ మధ్య కాలంలో హైదరాబాద్‌ వచ్చారు. ఇక్కడి సామాజిక పరిస్థితులను, రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేశారు. నక్సల్స్‌ ప్రభావం గణనీయంగా ఉన్న కరీంనగర్‌ జిల్లాకు వెళ్లారు. ఆ జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌ నళినీ ప్రభాత్‌తో రెండు సార్లు మాట్లాడారు. ప్రముఖ విప్లవ రచయిత వరవరరావుతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ రాజకీయ, సామాజిక పరిణామక్రమంపై ఆయన రచన వెలువడుతుందేమో చూడాలి!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X