వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్ట్-19

By Staff
|
Google Oneindia TeluguNews

ప్రస్తుత మార్గం దరి చేస్తుందనే నమ్మకం రాంరెడ్డికి క్రమక్రమంగా సన్నగిల్లసాగింది. స్త్రీవాదం లేపిన ప్రశ్నలు సరేసరి, దళితవాదం లేవనెత్తిన ప్రశ్నలు ఒక్కొక్కరి గుండెల్లో గునపాలై తాకుతున్నాయి. విప్లవంతో పాటే కుల సమస్య పరిష్కారం అవుతుందనే సంప్రదాయ విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రశ్నలు ముందుకు వచ్చాయి. ఇదే సమస్య మీద సాహు, శివసాగర్‌, బి.యస్‌. రాములు వంటివారు బయటకు వచ్చారు. వారు బయటకు వచ్చిందే తడవుగా విప్లవద్రోహులు, కెరీరిస్టులూ అని విమర్శలు వెల్లువెత్తాయి. నిజంగానే వారు ఆ కోవకు చెందినవారైతే ఏకంగా ఒకసారే బయటపడిపోదు కదా! ఆ లక్షణాలు వారిలో పొడసూపడం ప్రారంభమైనప్పటి నుంచే సూచనలాంటిది ఇస్తూ పోతే ఆరగించుకోవడానికి సులభమయ్యేదేమో! భుజాన మోసుకుంటూ వస్తున్నవారిని ఒక్కసారి ఎత్తేయమంటే ఎత్తేయాల్సిందేనా? ఏ ప్రశ్నలూ అడగకూడదా?

అలా ప్రశ్నించి బయటకు వచ్చిన రాజయ్య అందులో ఒక్కడు. రాజయ్య మీద రాంరెడ్డికి గురి కుదరసాగింది. కుల సమస్యను ప్రధానం చేసుకుని ఉద్యమం సాగించాలని వాదిస్తూ వస్తున్న రాజయ్య తన పార్టీ నుంచి విడిపోయే వేరే పార్టీని మొదలు పెట్టే పనిలో నిమగ్నమయ్యాడు. రాజయ్య కేవల ఆర్థిక పోరాటం మాత్రమే కాదు, సాంస్కృతి పోరాటాన్ని ముందుకు నడిపించాలని, ఆ రకంగా సామాజిక ఉద్యమాన్ని నడిపించాలని, ఆ క్రమంలో అది తప్పకుండా రాజకీయ ఉద్యమం అవుతుందని రాంరెడ్డి రాజయ్యతో అన్నాడు. రాజయ్య కూడా అందుకు సుముఖంగానే ఉన్నట్లు అనిపించింది.

రాజయ్యతో పాటు ఆయనతో వున్నవాళ్లందరూ నూనూగు మీసాల నూత్న యవ్వనంతో ఉన్నవారు. ఉడుకు రక్తం ఉరకలు వేస్తున్నవారు. స్టేజీల మీద నృత్యం చేస్తూ పాటలు పాడి ఎందరినో ఉద్యమం వైపు నడిపించిన అనుభవం రాజయ్యకుంది. విద్యార్థి సంఘం నాయకుడిగా అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే, ఆ విద్యార్థి సంఘం నడిచిన తీరులోనే ఈ ఉద్యమం సాగాలనేది రాంరెడ్డి కోరిక. ఉద్యమానికి దళితులు నాయకత్వం వహించాలని, ఆ ఉద్యమం అందరూ దళితులను అంగీకరించే రీతిలో సాగాలనేది, ఇది ఓ రకంగా సాంస్కృతిక ఉద్యమని రాంరెడ్డి చెప్తూ వస్తున్నాడు. దానికి రాజయ్య కూడా సమ్మతించినట్లే అనిపించింది.

రాజయ్య ప్రాబల్యం, ఉనికి, రాజకీయ ప్రచారం ఊపందుకోసాగింది. పార్టీకి కార్యాచరణ ప్రణాళికను, డాక్యుమెంట్‌ను రాసుకోవడం రాజయ్య ప్రథమ కర్తవ్యమై కూర్చుంది.

డాక్యమెంట్‌ రాసుకోవడానికి పెద్ద యెత్తున సామగ్రి కావాల్సి వచ్చింది. మనసులోనైతే ఎలా పోరాటం చేయాలో ఉన్నది కానీ రాతలో పెట్టాలంటే కష్టంగానే ఉన్నది. గత చరిత్రను, వర్తమాన చర్చలను క్రోడీకరిస్తూ పార్టీ ప్రణాళికను రూపొందించుకోవలసి ఉంటుంది. అందుకు ఎన్నో ఇంగ్లీషు వ్యాసాల తెలుగుసేత అవసరం. వాటి సారాంశం రాజయ్యకు, తెలుసు, ఆయన అనుచరులకు తెలసు. కానీ ఇంగ్లీషులో వాటిని అర్థం చేయించడం కష్టం. ఆంధ్రప్రదేశ్‌లో కుల సమస్యపై చర్చతో పాటు శరద్‌పాటిల్‌, గెయిల్‌ ఓంవెద్త్‌ రాసిన వ్యాసాలు, వచ్చిన పుస్తకాలు తెలుగులోకి అనువాదం చేసే బాధ్యత రాంరెడ్డిపై పడింది. అందుకు రాంరెడ్డి సంతోషంగానే అంగీకరించాడు. తాను ఊహిస్తన్నటువంటి ఒక ఉద్యమం రూపు దాల్చబోతోందనే నమ్మకం అతనికి కలిగింది. అంతా అనువాదమయ్యాక ఓసారి కలిశాడు రాజయ్య.

''అన్నా! ఏం చేయమంటావు?'' అని అడిగాడు రాజయ్య.
''చేసేదేముంది? దూకనైతే దూకావు. ఈదాల్సిందే'' అన్నాడు రాంరెడ్డి.

''అదే ఎలా అనేది... చాలా మంది అభిప్రాయాలు తీసుకుంటున్నాం. నువ్వు కూడా చెప్తే బాగుంటుందని....'' అన్నాడు. ఈత వచ్చినవాడికి ఈత నేర్పడమా? అయితే కొన్ని మెలకువలు, జాగ్రత్తలు మాత్రం చెప్పగలరు. కానీ ఈదాల్సిందే దూకిన వ్యక్తే.

''నువ్వు ఉద్యమాన్ని నిర్మించాలని సీరియస్‌గా ఉన్నావా?''
''సీరియస్‌గా లేకుంటే పార్టీతో పెట్టుకుని ఎందుకు ఇంత మందిమి బయటకు వస్తాం?''

''ఇప్పటి వరకు కమ్యూనిస్టు పార్టీలు ఎన్ని సార్లు చీలిపోయాయో నేను చెప్పలేను. కానీ చీలిపోయిన ప్రతిసారీ ప్రజల గురించి కాకుండా మాతృసంస్థలోని సిద్ధాంత వైరుధ్యాల గురించి, వ్యక్తుల ప్రవర్తన గురించి దుమ్మెత్తిపోస్తూనే ముందుకు సాగే ప్రయత్నం చేశాయి. మాతృసంస్థకు సమాధానం చెప్పుకునే రీతిలోనే వాదనలుంటూ వచ్చాయి. ఉన్న క్యాడర్‌నే పంచుకునే ప్రయత్నం చేశాయి. నువ్వు సీరియస్‌గా నడపదలుచుకుంటే రెండు విషయాలపై కచ్చితంగా ఉండాల్సి వస్తుంది.''
''మేం కచ్చితంగానే ఉన్నాం''

ఇద్దరూ చాలా సీరియస్‌గా ఉన్నారు. రాంరెడ్డి ఆ రెండు విషయాల మీదే ఇంత కాలం ఆలోచిస్తూ వస్తున్నాడు. విప్లవ ఉద్యమాలు ఎందుకు వెనకడుగు వేయడానికి, వాటిలోని లోపాలకు ఈ రెండు విషయాలే ప్రధానమని, ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటే బలమైన ఉద్యమాన్ని నడిపించవచ్చునని అతను అనుకుంటూ వుంటున్నాడు. ఆ విషయాలే రాజయ్యకు చెప్పాడు.

అయితే.. మరోసారి రాంరెడ్డి తల కొట్టేసినట్లయింది. అనుకున్నదొకటి అయిందొకటి. ఫలితం... మరో త్యాగం.. వీరమరణం.. పార్టీ ప్రారంభించిన కొద్ది రోజులకే నెత్తుటి మడుగులో రాజయ్య... ఎలా అయిందని ప్రశ్నించుకుంటే కథ పాతదే.. అయితే తొట్లెలలోనే కత్తుల బోనులో ప్రాణాలు విడిచిన ఉద్యమం.. రాంరెడ్డికి మనసు మనసులో లేకుండా పోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X