వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్ట్-42

By Staff
|
Google Oneindia TeluguNews

అంతా ఒకటే శబ్దం తేనెటీగలు బారుగా బయలుదేరి చెవుల్లోకి జొరబడుతున్న భ్రాంతి. ఆ శబ్దం ఏమిటో స్పష్టంగా వినపడడం లేదు. చెవులు మూసకున్నా ఆగని రొద. బాధతో మెలికలు తిరిగిపోతున్నాడు. ఇక లాభం లేదు, వెళ్లిపోదామని అనుకున్నాడు రాంరెడ్డి. ఇంతలోనే ఎదురుగా నల్లటి దుస్తుల్లో లెక్కలేనంత మంది మనుషులు కనిపించారు. వారి నోళ్ల నుంచే వెలువడుతున్న శబ్దమే తన చెవుల్లోకి చొరబడుతున్న విషయం అతనికి అర్థమైంది.

చల్లటి చలికాలం, సంక్రాంతి రోజులు. ఇదో జాతర జరుగుతూ ఉంటుందనే విషయం స్ఫురించింది అతనికి. 'స్వామి యే శరణం అయ్యప్ప' అనే మాటలు ఒక తుమ్మెదల రొదలా వినిపిస్తోంది. మానవ మాత్రుడి భరించలేని ధ్వని అది. వారంతా నినదిస్తూ ముందుకు దూసుకొస్తున్నారు. దగ్గరవుతున్నారు. వారందరికీ ఒక రకమైన ముఖాలున్నాయి. ముఖాల్లో ఏ మాత్రం తేడా లేదు. ఒక్క మనిషే వేల వేల రూపాలై మీదికి వస్తున్నట్లనిపించింది రాంరెడ్డికి. ఒకే రకమైన మాస్క్‌ వేసుకున్నారా ఏమిటి అనుకున్నాడు. ఆసక్తి పెరిగింది.

ఊరేగింపు దగ్గరవుతున్న కొద్దీ పక్కదారుల నుంచి చిన్న చిన్న ఊరేగింపులు పాయలుగా వచ్చి అందులో చేరుతున్నాయి. దాంతో ఊరేగింపు పెరుగుతూ వస్తోంది. పక్క దారుల నుంచి వచ్చి చేరుతున్న ఊరేగింపులను గమనించసాగాడు. విచిత్రంగా ఇప్పుడు ఆ ఊరేగింపు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా చాలా దూరమే ఉందనుకున్నాడు. ఈ ఊరేగింపులో ఉన్నవాళ్లను చూసేసరికి అతనికి ఒక్కసారిగా దిగ్భ్రమ కలిగింది. వెన్నులో చలిపాము పాకసాగింది.

కుడివైపు మలుపు కనిపించింది రాంరెడ్డికి. రమేష్‌, శశి, ఇంకా తనకు తెలిసిన చాలా మంది ఊరేగింపుగా వచ్చి ప్రధాన ఊరేగింపులో కలిసిపోతున్నారు. వారి ముఖాలన్నీ ఒకే రకంగా ఉన్నా వారెవరెవరో తెలిసిపోతోంది. ఇప్పటి దాకా అలా గుర్తు పట్టడం సాధ్యం కాలేదు. ఇప్పుడు గుర్తు పట్టే శక్తి తనకు ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోయాడు రాంరెడ్డి. ఎడమ పక్క సందు నుంచి అవినాష్‌, సిద్ధార్థచార్య, రంగనాథం, రాజిరెడ్డి, రాజయ్య, రసూల్‌ పెద్దపెట్టున నినాదాలు చేసుకుంటూ అందులో కలిసిపోయి తమ గొంతు మాత్రమే వినిపించేలా నినదిస్తున్నారు. ఊరేగింపు ముందుకు సాగుతోంది. తనకు మరింత దగ్గర అవుతోంది. విజయేందర్‌ రెడ్డి, రవికాంత్‌, పోచయ్య, మల్‌రెడ్డి, శివుడు వచ్చి అందులో చేరారు. రసూల్‌ అకస్మాత్తుగా ఊరేగింపులో కనిపించాడు. అతను ఎక్కడి నుంచి వచ్చాడో రాంరెడ్డి గుర్తించలేకపోయాడు. తాను ఊరేగింపు అన్ని వైపులను శ్రద్ధగా గమనిస్తున్నాడు. అతను ఎక్కడి నుంచి వచ్చాడో గుర్తించలేకపోవడం రాంరెడ్డికి విచిత్రంగా అనిపించింది.

గుండెలో అలజడి మొదలైంది. ఎందుకీ అలజడి తనకు. అదొక ఊరేగింపు. ఒకే ఒక ఊరేగింపు. సాగుతోంది. దేని కోసం సాగుతోంది. ఊరేగింపు తనను సమీపించింది. ప్రదర్శనకారులెవరూ తనను గుర్తించనట్టే ఉన్నారు. ప్రదర్శనకారుల పదఘట్టనల కింద నలిగిపోకతప్పదని అనిపించింది. పక్కకు జరిగే ప్రయత్నం చేశాడు. ఎక్కడా చోటు లేదు. వెనక్కి తిరిగి పారిపోదామనుకున్నాడు. కానీ వెనక్కి తిరిగడం సాధ్యం కావడం లేదు. పాదాలు భూమిలో పాతుకుపోయినట్లనిపించింది. వారి కింద పడి నలిగిపోకుండా తప్పించుకుందామని అనిపిస్తోందే గాని భయం వేయడం లేదు రాంరెడ్డికి.

ఇంతలో ఎదురుగా ముఖంలో ముఖం పెట్టి నల్లటి దుస్తులు వేసుకున్న భారీ కాయం ఒకటి వికటాట్టహాసం చేసింది. ఒక్కసారిగా ఒళ్లు జలదరించింది. భారీ కాయం వెనక్కి జరిగింది. ఆ భారీ కాయం వెనక చూశాడు. ఊరేగింపు ఏదీ లేదు. మనుషులూ లేరు. ఇప్పటి దాకా తనకు కనిపించిన వాళ్లందరూ ఏమయ్యారని ప్రశ్నించుకున్నాడు. నల్లటి దుస్తుల భారీ కాయం మనిషి రాంరెడ్డిని చూసి వ్యంగ్యంగా నవ్వాడు.

రాంరెడ్డికి భయంలోనూ చిరాకు వేసింది; ఆ తర్వాత కోపం వచ్చింది. ''ఇంకా నీలో మనిషి బతికున్నాడే'' అన్నాడు నల్ల దుస్తుల భారీ కాయం మనిషి మీదికి రావడం ప్రారంభించాడు. ఒక తోపుతో కింద పడిపోయాడు రాంరెడ్డి. రాంరెడ్డి మీద కాలు పెట్టబోయాడు భారీ కాయం మనిషి.

''వద్దు. నువ్వు వేసే అడుగు సరైంది కాదు'' అని అరిచాడు రాంరెడ్డి.
పకపకా నవ్వాడు భారీ కాయం మనిషి.
పిడికిట్లో రాంరెడ్డి గొంతును పట్టుకొని గాలిలోకి లేపాడు భారీ కాయం మనిషి. ''నేనెవరో తెలుసా?'' అడిగాడు భారీ కాయం మనిషి.
రాంరెడ్డి గొంతు పిడికిట్లో నలిగిపోతోంది. నాలుక పిడచకట్టుకుపోతోంది. గుడ్లు తేలేస్తున్నాడు. మాట్లాడే శక్తి లేదు.

''నేను విశ్వాసాన్ని. ఆ విశ్వాసమే సత్యం. ఆ విశ్వాసమే నన్ను ముందుకు నడిపిస్తుంది. వెనకడుగు, వెనక చూపు మనిషిన్న వాడికి ఉండకూడదు. నా దారిలో చిన్న గులకరాయి ఉన్నా సరే తొక్కేసి పిండి చేసి నేను ముందుకు సాగుతాను. నువ్వో గులకరాయివి. అయినా సరే, నీ గొంతు పలకకూడదు. నీ పీక నొక్కేయడమే న్యాయం'' అని గొంతు పిసకసాగాడు భారీ కాయం మనిషి.

అరవడానికి ప్రయత్నిస్తున్నాడు రాంరెడ్డి. కానీ మాట గొంతు దాటి రావడం లేదు. ''అమ్మా!'' అని అరిచాడు రాంరెడ్డి. ఆ మాట అమ్మకు వినిపించినట్లు లేదు. వినిపించి వుంటే ఎక్కడున్నా సరే ఒక్క ఉదుటున వచ్చేసి తనను రక్షించి ఉండేది. తనను కాపాడడానికి తగిన బలం అమ్మకు ఉంది. తనను కాపాడే విషయంలో అమ్మను ఏ శక్తీ అడ్డగించలేదు. అమ్మకు తన పిలుపు అంది ఉంటే నల్లదుస్తుల భారీకాయాన్ని ఎడమ చేత్తో పక్కకు నెట్టేసి తనను తన ఒడిలోకి లాక్కుని తల నిమురుతూ తన ఓదార్చి ఉండేదే. అమ్మకు తన పిలుపు అందలేదు. అందలేదు. అందలేదు.....

తన ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. తనకు తన ప్రాణం పోతుండడం తెలిసిపోతూనే ఉంది. మెల్ల మెల్లగా తాను మరణిస్తున్నాడు. మరణించాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X