వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచనశిల్పి రావిశాస్త్రి

By Staff
|
Google Oneindia TeluguNews

అతని చేతిలో అక్షరాలు జవనాశ్వాలు. భావాలు పడిలేచే కడలి తరంగాలు. తెలుగు వచనాన్ని ఉరకలెత్తించిన ఆ రచయిత రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన రాచకొండ విశ్వనాథ శాస్త్రి. ఈయన విశాఖపట్నం జిల్లాకు చెందినవారు. అయితే, తమ పూర్వీకులది నల్లగొండ జిల్లాలోని రాచకొండ ప్రాంతమని చెప్పి ఆ రాచకొండలంతా తిరిగి తన పెద్దలను చూసినంత సంతృప్తి చెందిన బాలుడు.

ఆయన నవలలు, కథలు రాశారు. ఒక్కో నవల మానవ జీవితమంత విశాలమైనది. వ్యంగ్యాన్ని ఆశ్రయించి ఆయన లోకంపోకడపై విసిరిన బాణాలు ములుకుల్లా గుచ్చుకుంటాయి. 'కథను సమాజానికి సర్జరీ చేసే సర్జన్‌ చేతి కత్తిగా వాడిన రావిశాస్త్రి చేతిలో గురజాడ అందించిన వ్యవహారిక భాష మరింత జీవం, జవం పోసుకుంది' అని అన్నారు వాకాటి పాండురంగారావుగారు. సాహిత్యాన్ని సమాజానికి శస్త్రచికిత్స చేసే కత్తిగా వాడినప్పటికీ రావిశాస్త్రి కథల్లో, నవలల్లో కళాసౌందర్యానికి ఏ మాత్రం లోటు రాలేదు. 'ఆయన ఎంత గొప్ప సమాజవాదియో, అంతకంటే ఎక్కువ సౌందర్యవాది. ఆయన కథ దేనిని తీసుకున్నా, చటుక్కున మెరిసే ఉపమానాలూ, పదాల విరుపులు, వర్ణణల సేర్పులు... అదంతా హోరెత్తే జలపాతం'. ఆయన రచనల్లో వర్ణనలు శృతి మించాయని కొందరు బుద్ధివాదులు అనకపోలేదు. అయితే, అవి పాఠకులకు ఎక్కడ కళ్లెం వేయవు. పట్టుకుంటే వదలించుకోలేని రచనలు రావిశాస్త్రివి. అందుకే, త్రిపురనేని శ్రీనివాస్‌ రావిశాస్త్రి రచనల్లో కవితాత్మక వర్ణనలను ఏరి 'వెన్నెలా, వెన్నెలా' అనే కవితాసంకలనం వేశాడు.

రావిశాస్త్రి మరణించినప్పుడు కవి అజంతా శోకిస్తూ-
'ఇక కథ లేదు వ్యధ,
దారి లేదు, ఎడారి, ఎడారి ఎడారి
అడుగడుగునా ఇక అశ్రుఘాతాలే
శిరస్సు వ్రయ్యలైన అపశబ్ద శరీరాలే
వీధి మొగలో ధూళి, ధూళి
జీవన గ్రంథం నిండా పొగ' అని అన్నాడు.

రావిశాస్త్రి ఏది రాసినా అధోజగత్సహోదరుల గాధలే. సమాజంలోని అట్టడుగు వర్గాల జీవితాలు మన కళ్ల ముందు కదలాడి ఆశ్చర్యాద్భుతాలను కలిగిస్తాయి ఆయన నవలలు, కథలు. 'రత్తాలు-రాంబాబు', 'రాజు-మహిషి', 'సొమ్ములు పోనాయండి', 'గోవులొస్తున్నాయి జాగ్రత్త', 'మూడు కథల బంగారం' అనే నవలలు రాశారు. ఆయన చివరి నవల 'ఇల్లు'. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం. ఇక ఆయన కథలు 'ఆరు సారా కథలు', 'ఆరు సారో కథలు', 'బాకీ కథలు', 'కలకంఠి', 'ఋక్కులు' వచ్చాయి. 'విషాదం', 'నిజం' అనే నాటికలు కూడా రాశాడు. ఆయన మంచి నటుడు కూడా. గురజాడ రాసిన 'కన్యాశుల్కం' నాటకంలో ఆయన సారా అంగడి దృశ్యంలో నటించి రక్తి కట్టించాడు.

మంచి తెలుగు సాహిత్యం చదవాలనుకుంటే తప్పకుండా రావిశాస్త్రి రచనలను చదివి తీరాల్సిందే. రావిశాస్త్రిని చదవకుండా ఎంత చదివినా చాలా మిస్‌ అయ్యామన్న మాటే. తెలుగులో గొప్ప వచన శిల్పి రావిశాస్త్రి. ఆయన వ్యంగ్యాన్ని, ఆయన శిల్ప నైపుణ్యాన్ని అంది పుచ్చుకున్నవాళ్లు తెలుగులో ఇద్దరున్నారు. ఒకరు- కె.ఎన్‌.వై. పతంజలి, మరొకరు- బీనాదేవి. నందిగం కృష్ణారావు అనే కథా రచయితది కూడా రావిశాస్త్రి మార్గమే. రావిశాస్త్రి రచనల గురించి ఎంత చెప్పినా తక్కువే. రావిశాస్త్రి మరి కొంత మంది రచయితలను తెలుగుకు అందించి వుంటే సాహిత్యానికి ఎంతో మేలు జరిగి వుండేది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X