వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేమన, వీరబ్రహ్మంల 'స్త్రీ చూపు'

By Staff
|
Google Oneindia TeluguNews

వేమన, వీరబ్రహ్మంల మధ్య అనేక అంశాలలో సమాన భావాలున్నా స్త్రీలను గూర్చి వారి అవగాహనలో భిన్నాభిప్రాయాలు కనిపిస్తాయి. సమాజంలో స్త్రీల పట్ల పురుషులకుండే స్వాభావికమైన ఆధిపత్య అవగాహనతో వేమన పరిశీలించాడు. వేమన అవగాహనకు భిన్నంగా వీరశైవులు ఆధ్యాత్మిక జీవితంలో అక్కమహాదేవికి ప్రముఖ స్థానమిచ్చి గౌరవించిన సంప్రదాయాన్ని వీరబ్రహ్మం కొనసాగించాడు. తాను స్థాపించిన మఠానికి తన మనుమరాలైన ఈశ్వరమ్మను వారసురాలిగా ప్రకటించడం ద్వారా సాంప్రదాయికంగా స్త్రీల పట్ల వుండే అవగాహనకు భిన్నత్వాన్ని వీరబ్రహ్మం ప్రదర్శించాడు. స్త్రీల పట్ల వీరిరువురి అవగాహనను నిర్ణయించడంలో వారి వ్యక్తిగత జీవితం కూడా కారణం కావచ్చు. వేమన తన సంసారాన్ని త్యజించి, విరాగియై సంచరించగా (ఎన్‌.గోపి ''కర్మయోగి వీరబ్రహ్మం''- వ్యాసనవమి, పే.52) వీరబ్రహ్మం సంసార జీవితం కలిగి వున్నాడు. అంతేగాక సామాజిక జీవితంలో ప్రశాంతస్థితిని వాంఛించిన వీరబ్రహ్మం కుటుంబంలోనూ స్థిరమైన జీవితాన్ని, స్త్రీపురుషుల మధ్య సహజీవనాన్ని కోరుకోవడానికి అవకాశం వుంది. స్త్రీల వల్ల వచ్చే బాధలను వేమన-

''స్త్రీలు గలుగు చోట చెల్లాటములు గల్గు
స్త్రీలు లేని చోట చిన్నబోవు
స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా'' అని,
స్త్రీలకును బెడుదురు స్త్రీల శ్రాద్ధంబులు
స్త్రీల యోగ్యమేమి చెప్పవచ్చు

స్త్రీలకిడుట కంటె శిలల కిడుట మేలు'' అంటూ స్త్రీల హృదయాలు శిలల వలె కఠినమైనవని వేమన ఆరోపణ. పురుషులు కోరుకునే జీవితానికి, వారు తలపెట్టే పనులకు స్త్రీలు ప్రతికూలంగా స్పందిస్తే కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం వుంది. అయితే స్త్రీలు భావించే పనులు పురుషులకు అనుకూలంగా లేనట్లయితే అవి కార్యరూపం దాల్చే అవకాశమే లేదు. స్త్రీ చేయదలచిన పనులన్నీ పురుషుడి అభివృద్ధికి ఉపకరించే రీతిలోనే వుండాలనేది పురుష ప్రధానమైన సమాజంలోని కోరిక. మరొక రకంగా వారు ఊహించడానికి అవకాశం లేదు. ఈ భావాలన్నింటికి వేమన ప్రాతినిధ్యం వహిస్తాడు. పురుషుడు ఆధ్యాత్మిక జీవితాన్ని వాంఛించినా, ఇతర కార్యాల్లో పాల్గొనాలని భావించినా స్త్రీలు ఆటంకంగా మారడాన్ని సహించలేని సామాజిక విలువల్లోనే వేమన జీవించాడు. ఆ భావాలనే ప్రతిపాదించాడు. స్త్రీ పురుషుడి జీవితంలో ప్రవేశించే తొలి రోజుల్లోనే తనకు అణుకువగా ఉండేట్లు మలచుకోవాలని వేమన బోధ.

''ఆలి వంచలేక యధమత్వమున నుండి
వెనుక వంతుననుట వెర్రితనము
చెట్టు ముదరనిచ్చి చిదిమిన బోవునా'' అని పేర్కొన్నాడు. స్త్రీలు ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకమని వారి పట్ల కోరికలు తొలగించుకోవడం వల్లనే ముక్తి సాధ్యమని వేమన తలచాడు. అయితే పురుషుడి కన్నా స్త్రీ అధమ స్థానంలో లేదని, బాహ్యరూపంలోని స్త్రీ, పురుష భేదాలు ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవని వీరబ్రహ్మం వివరించాడు. శివ, విష్ణువులే స్త్రీ రూపం ధరించారని వీరబ్రహ్మం బోధ.

''స్త్రీ పురుషులనే కులము సృష్టిలోపలి నుండి రూపులై యున్నవి రూఢిగాను
ఆ పరబ్రహ్మము ఆదివిష్ణు శివుడు స్త్రీ పురుషుడైనాడు సృష్టిలోపల జాణ''

పురుషుల కంటే స్త్రీలది అధమ స్థానం కాదని భావించడం వల్లనే తన మనుమరాలిని కందిమల్లయపల్లెలో స్థాపించిన మఠానికి వారసురాలుగా ప్రకటించి ఆధ్యాత్మిక జీవితానికి స్త్రీలు ఆటంకం కాదని విస్పష్టపరిచాడు. వేమన కంటే భిన్నమైన చైతన్యాన్ని వీరబ్రహ్మం ప్రదర్శించాడు.

తన పద్యాల ద్వారా సమాజంలోని కాపట్యాన్ని, అనాచార పద్ధతులను, మతాచారాలలోని క్రమ రాహిత్యాన్ని వేమన తీవ్రంగా గర్హించాడు. వేమన కంటె కొంత భిన్నంగా వీరబ్రహ్మం వర్ణాధిపత్య భావాలను తనదైన మత జీవనాన్ని ప్రబోధించి నూత్న జాగృతి కోసం ప్రయత్నించాడు. వీరిరువురూ సమాజంలోని ఆధిపత్య భావాలను నిరసించినవారే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X