వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమాంతర ప్రవాహాలే!

By Staff
|
Google Oneindia TeluguNews

ఆధునిక తెలుగు సాహిత్య ఉద్యమాలను, ధోరణులను పరిశీలించడమంటే ఆధునిక జీవితాన్ని పరిశీలించడమే. ఆధునిక సమాజ ప్రకంపనలను పరిశీలించడమే అవుతుంది. సమాజంలో, సంస్కృతిలో, సాహిత్యంలో ఏకకాలంలోనే అనేక దృక్పథాలు, ధోరణులు, భావధారలు, ఉద్యమాలు ప్రవహిస్తుంటాయి. ఇవి ఒకదానికొకటి కొనసాగింపు కావు. అందులోను భారతీయ సమాజం ప్రపంచంలోని అనేకానేక ఇతర దేశాల సమాజాల కన్నా భిన్నమైనదీ, సంక్లిష్టమైనదీ. దీనికి కారణాలు సుదీర్ఘ సాంస్కృతిక వారసత్వంలో ఉన్నాయి. విశాల భౌగోళిక నేపథ్యంలో ఉన్నాయి. చారిత్రక మూలాలలో ఉన్నాయి. భారతీయ సమాజం ఏకకాలంలోనే ఒక కుల సమాజం, వర్గ సమాజం, మత సమాజం, ప్రాంతీయతల సమాజం, అనేక విశ్వాసాల వారసత్వ సమాజం. సహజంగానే అనేక ఘర్షణలు, పోరాటాలు, వైరుధ్యాలు సమాంతరంగా కొనసాగుతుంటాయి. ఒక్కోసారి ఒక సంఘర్షణ అగ్రిమంగా సాగుతుంటే, మరో సంఘర్షణ ఆనుషంగికంగాను, ఇంకోటి ప్రచ్ఛన్నంగాను కొనసాగుతుంటాయి. ఒకసారి ఒకటి ప్రభావవంతంగా వుంటే, ఇంకోటి ఉదాసీనంగా వున్నట్టు బయటికి కనబడుతూ వుంటుంది. ఒకటి ఉధృతంగా వుంటే, ఇంకోటి కొంత మందకొడిగా నడుస్తున్నట్టు కనబడుతుంది. వీటిని విశ్లేషించేవారి దృక్పథాన్ని బట్టి, పాక్షికతను బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి వారి అంచనాలు, అవగాహనలు, అధ్యయనాలు వెలువడతుంటాయి.

ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ శతాబ్దమంతా విస్తరించిన మహోద్యమం అభ్యుదయ సాహిత్యోద్యమం. కందుకూరి సంఘ సంస్కరణోద్యమం, గిడుగు భాషా సంస్కరణోద్యమం, గురజాడ సాహిత్య సంస్కరణోద్యమాల త్రివేణీ సంగమంగా ప్రారంభమైనది అభ్యుదయ సాహిత్యోద్యమం. తెలుగునాట తలెత్తిన సకల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాలకు దర్పణం పడుతున్నది. ఆయా ఉద్యమాలతో ప్రభావితమవుతున్నది. అలాగే ఆయా ఉద్యమాలకు ఊపిరులూదుతున్నది.

'మన సమాజంలో జరుగుతున్న మార్పుల్ని గుర్తించి, వాటి అభివృద్ధిని ప్రతిబింబింప చేసే సాహిత్యాన్ని సృష్టించడం మన రచయితల విధి. సారస్వతంలో హేతువాదాన్ని చొప్పించి, దేశంలో వున్న అభివృద్ధికర శక్తులకు చేయూతనివ్వాలి. కుటుంబ జీవితం, సమాజం, మతం, సెక్స్‌, యుద్ధం మొదలైన సమస్యల మీద అభివృద్ధి నిరోధక తత్వాన్ని అరికట్టాలి. కులమత కక్షలు, జాతి విద్వేషం, వర్గదోపిడీ మొదలైన వాటిని పురికొల్పే రాతల్ని ప్రతిఘటించాలి' అంటూ తన ప్రణాళికలో ప్రకటించుకున్న అభ్యుదయ సాహిత్యోద్యమం, తెలుగు సాహిత్యంలో హేతువాద, భౌతికవాద భావాలను ప్రవేశపెట్టింది. కుల నిర్మూలన, జాతి విద్వేష నిర్మూలన, వర్గదోపిడీ నిర్మూలన ద్వారా సమసమాజ నిర్మాణాన్ని సాధించాలన్న ఉదాత్త ఉత్తమాశయాలను సాహిత్యానికి వస్తువులుగా అందించింది. సమాజం, సామాజిక అస్తిత్వం, సమాజంలో మానవ సంబంధాలను చర్చనీయాంశం చేసింది.

1930 దశకం నుంచి సంస్థాగత నిర్మాన రూపం పొందిన అభ్యుదయ సాహిత్యోద్యమం 1948 వరకు అటు 'అభ్యుదయ రచయితల సంఘం', 'ప్రజా నాట్యమండలి' వంటి సంస్థల ద్వారా సంస్థాగత కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఇటు సృజనాత్మక సాహిత్యం మీద, ప్రజా కళారూపాల వికాసం మీద ప్రగాఢమైన ప్రభావం వేయడం మొదలు పెట్టింది. 1948- 52 మధ్యకాలంలో అభ్యుదయ సాహిత్యోద్యమం, ప్రజా సాంస్కృతికోద్యమం తీవ్రమైన ప్రభుత్వ దమనకాండకు గురైంది. తెలంగాణ సాయుధ పోరాటం తీవ్రతరం కావడంతో ప్రభుత్వం 'కమ్యూనిస్టు పార్టీ'ని నిషేధించింది. 'ప్రకాశం ఆర్డినెన్స్‌' వెలువడిన తర్వాత ప్రభుత్వ అణచివేత చర్యలు పతాక స్థాయికి చేరుకున్నాయి. 'అరసం'లో ప్రముఖ పాత్ర వహిస్తున్న పార్టీ రచయితలూ, కళాకారులూ జైళ్లలో నిర్బంధింపబడ్డారు. రహస్య జీవితాన్ని కొందరు గడిపారు. ఆరుద్ర, అనిసెట్టి, గోఖలే వంటి ప్రముఖ రచయితలు సంస్థ నుంచి తప్పుకున్నారు. వీటి ఫలితంగా 'అరసం' కార్యక్రమాలు, 'అభ్యుదయ' పత్రిక తాత్కాలికంగా కొంతకాలం మూతపడ్డాయి. 1951లో తెలంగాణ సాయుధ పోరాట విరమణ జరిగాక కూడా కొంతకాలం పాటు 'అరసం' కార్యక్రమాలు పుంజుకోలేకపోయాయి.

ఇలా సంస్థాగత కార్యక్రమాలు జరగకపోయినా, అభ్యుదయ సాహిత్య సృజనలో మాత్రం స్తబ్దత రాలేదు. విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవసాహితి, సంధ్య, ఉదయిని, దండోరా, నగారా, బృందావనం మొదలైన పత్రికల ద్వారా అభ్యుదయ రచయితలు తమ సాహిత్యాన్ని ప్రజల్లో ప్రచారం చేశారు. 1948 నుంచి 'అరసం' 5వ మహాసభ జరిగిన 1955 మధ్యకాలంలో శ్రీశ్రీ 'మహాప్రస్థానం', సోమసుందర్‌ 'వజ్రాయుధం', రమణారెడ్డి 'అడవి', గంగినేని 'ఉదయిని' వంటి ప్రసిద్ధమైన అభ్యుదయ కవితా సంకలనాలు వెలువడ్డాయి.

తెలంగాణ సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న కాలంలో అభ్యుదయ రచయితలు పోరాటాన్ని చిత్రించే కథలు, కవితలు, నవలలు, గీతాలు, వివిధ ప్రజా కళారూపాలు వెలువరించారు. పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న కవులూ, పోరాట స్ఫూర్తితో కవులైనవారు ఎందరో ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాట విరమణ తర్వాత చాలా కాలం పాటు ఉద్యమ ఉదంతాలను, అనుభవాలను, జ్ఞాపకాలను చిత్రిస్తూ అద్భుతమైన సాహిత్యం వెలువడింది. ఆధునిక తెలుగు సాహిత్యానికి పోరాట వారసత్వాన్నిచ్చింది. దురదృష్టవశాత్తు ఈ కాలంలో స్తబ్దత ఏర్పడిందని కొందరు విమర్శకులు, కవులు, పరిశోధకులు పదేపదే తమ వ్యాసాల ద్వారా, సిద్ధాంత వ్యాసాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాట విరమణ తర్వాత సాహిత్యంలో స్తబ్దత ఏర్పడలేదు. స్తబ్దతను బద్దలు కొట్టి, అపారమైన అభ్యుదయ సాహిత్యం వెలువడింది. 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం' నినాదంతో సాగిన ఆంధ్రోద్యమ కాలంలోను, 1969- 72 మధ్య కాలంలోనూ తెలుగునేలను కుదిపేసిన వేర్పాటువాద ఆందోళనల కాలంలోనూ అభ్యుదయ రచయితలు 'సమైక్యాంధ్ర పరిరక్షణ' కోసం సాహిత్యాన్ని సాధనంగా ప్రయోగించారు.

1979 దశకంలో 'సాయుధ పోరాటమే ఏకైక మార్గం'గా విశ్వసించిన కవులు, మావో ఆలోచనా విధానంతో ప్రభావితులైన రచయితలు 'విప్లవ రచయితల సంఘాన్ని' స్థాపించుకుని విప్లవ సాహిత్యాన్ని సృజించడం మొదలు పెట్టారు. నిర్దిష్టమైన ప్రాపంచిక దృక్పథం, నిబద్ధ నాయకత్వం, సంస్థాగత నిర్మాణ రూపం కలిగిన విప్లవ సాహిత్య ధోరణి ఒక ఉద్యమంగా ఎదిగింది. తెలుగు సాహిత్య ప్రక్రియలను, కళారూపాలను ప్రభావితం చేస్తూ ముందుకు సాగిపోతున్నది.

ఇది అభ్యుదయ సాహిత్యోద్యమానికి కొనసాగింపుగా వచ్చిందీ కాదు, అభ్యుదయ సాహిత్య వైఫల్యం నుంచి ఆవిర్భవించిందీ కాదు. 'సాయుధ పోరాట పంథా'ను ప్రచారం చేయాల్సిన కొందరి చారిత్రక అవసరం నుంచి ఉద్భవించింది.

విప్లవ సాహిత్య ధోరణి ప్రారంభం కాగానే అభ్యుదయ సాహిత్యం చచ్చిందనీ, పుచ్చిందనీ, స్తబ్దతలో పడిపోయిందనీ, నిస్తేజమైందనీ కొందరు మేధావులు నిరాధారమైన అసత్య ఆరోపణలు చేయడం ప్రారంభించారు. వామపక్ష ఉద్యమంతో సాయుధ పోరాట పంథాను ఏకైక మార్గంగా భావించే రాజకీయ సంస్థకు అనుబంధంగా ఒక సాహిత్య సంస్థ అవసరమైంది. 'విరసం' ఏర్పడింది. అంతేకానీ అభ్యుదయ సాహిత్య వైఫల్యం నుంచి కాదు.

కొందరు సాహితీవేత్తలు తాము ఒ సంస్థలోనో, సాహిత్యోద్యమంలోనో క్రియాశీలంగా పాల్గొన్నంత కాలం ఆ ఉద్యమం బలంగా వున్నదనీ, తాము ఏ కారణాల వల్లనైనా తప్పుకుంటే ఉద్యమం బలహీనపడిందనీ, సంస్థ పనై పోయిందనీ ప్రచారం చేస్తుంటారు. తాము పాల్గొన్న కాలాన్నే ఉజ్వలమైనదిగా సాహిత్య చరిత్రలో రికార్డు చేసే ప్రయత్నం చేస్తుంటారు.

విప్లవ సాహిత్య సంస్థలూ, వ్యక్తులూ ఏ విధమైన దాడినైతే నిన్నటి దాకా అభ్యుదయ సాహిత్యోద్యమంపై చేశారో, నేడు అదే రకమైన దాడిని స్త్రీవాద, దళితవాద సాహితీవేత్తల నుంచి ఎదుర్కుంటున్నారు. 'విరసం' మరణించిందని శివసాగర్‌, మరణించింది విరసం కాదు, శివసాగర్‌ అంటూ చెంచయ్య వ్యాసాలు రాసుకున్నారు. వేదికలపైనా ఈ రకమైన చర్చలే జరుగుతున్నాయి. ఇలా శాపనార్ధాలతో, ఆరోపణప్రత్యారోపణలతో సాహిత్యోద్యమాలు ఆవిర్భవించవు. అంతరించవు. ఆయా ఉద్యమాలు ఏ ఆదర్శాలను, నినాదాలను, లక్ష్యాలను ప్రజల ముందుకు తెచ్చాయో ఆ ఆదర్శాలు నెరవేరేదాకా అవి కొనసాగుతుంటాయి.

వీటికి సమాంతరంగా సామాజిక అవసరాలుగా అనేక సాహిత్య ధోరణులు ఆవిర్భవిస్తుంటాయి. తమ లక్ష్యాలను, సిద్ధాంతాలను సాహిత్య ప్రక్రియలుగా సృష్టిస్తూ ప్రజలను ప్రభావితం చేస్తుంటాయి. ఒక ధోరణి ఉద్యమంగా పరిణామం చెందాలంటే దానికి నిర్దిష్టమైన తాత్విక దృక్పథం ఉండాలి. నిబద్ధ నాయకత్వం దొరకాలి. సంస్థాగత నిర్మాణ రూపం పొందాలి. అన్నిటినీ మించి జనానికి దీని అవసరం తెలిసి ఆహ్వానించే స్థితిగతులుండాలి. దిగంబర కవితాధోరణికి ఇది సమకూరకపోవడం వల్ల అది ఒక ఉద్యమంగా ఎదగలేకపోయింది. ఒక ధోరణిగా చల్లారిపోయింది.

అలాగే సాహిత్యరంగంలో 1980 దశకం నుంచి వాయువేగంతో దూసుకువస్తున్న స్త్రీవాద, దళితవాద ధోరణులు, ఇటీవలి కాలంలో కనబడుతున్న మైనారిటీ వాద ధోరణి మొదలైనవి తెలుగు సాహిత్య రంగంలో ఆయా ప్రజాశ్రేణుల ఆకాంక్షలను, అనుభవాలను, ఆగ్రహాలను, అనుభూతులను వ్యక్తం చేస్తున్నవి. సాహిత్యంపై ప్రగాఢమైన ప్రభావాన్ని వేస్తున్నవి. దళితోద్యమం అవసరంగా ఆవిర్భవించిన దళిత సాహిత్య ధోరణి క్రమం మాల సాహిత్యం, మాదిగ సాహిత్యం, ఇతర నిమ్న జాతుల సాహిత్యంగా బహుముఖాలుగా విస్తరిస్తున్నది. అయితే ఈనాటికీ ఒక తాత్విక భూమికను, సంస్థాగత నిర్మాణ రూపాన్ని పొందని దళిత సాహిత్యం ఒక ధోరణిగా మాత్రమే ఉండిపోయింది. ఒక సాహిత్య ఉద్యమంగా ఎదగలేకపోతున్నది.

అలాగే స్త్రీవాద సాహిత్య ధోరణి ఒక ఏకీకృత లక్ష్యాన్ని, నిర్దిష్ట ప్రాపంచిక దృక్పథాన్ని ఏర్పరుచుకోలేక పోతున్నది. మొత్తం స్త్రీజాతి సమస్యలను ప్రతిబింబించలేక, కేవలం మధ్యతరగతి విద్యావంతులైన స్త్రీల మనోభావాలనూ, ఆకాంక్షలనూ వ్యక్తం చేస్తున్న ఒక సాహిత్య ధోరణిగా పరిమితమై పోయింది. సామ్రాజ్యవాదంతో, పెట్టుబడిదారీ వర్గంతో, రాజ్యంతో ఘర్షణ వైఖరిని కాకుండా రాజీ ధోరణి అవలంభిస్తున్న స్త్రీవాద రచయిత్రులు కొన్ని ప్రముఖ దినపత్రికల్లో కాలమిస్టులుగా స్థానాన్ని సంపాదించుకోగలిగారు. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఆర్థికంగా బలపడగలిగారు. అంతే తప్ప స్త్రీవాద సాహిత్యాన్ని ఒక ఉద్యమంగా రూపొందించలేకపోయారు.

ముస్లిం మైనారిటీ వాద కవిత్వంగా వెలువడుతున్న కవిత్వం ఈ దేశంలోని సగటు ముస్లిం ప్రజల జీవితానుభవాలను, ఆలోచనలను, ఆకాంక్షలను సంపూర్ణంగా వ్యక్తం చేయలేకపోతున్నది. కేవలం తెలుగుభాష తెలిసిన, తెలుగు సాహిత్య అభివ్యక్తి గల ముస్లింల ఆలోచనలను మాత్రమే తెలుగులో ముస్లిం మైనారిటీ వాద సాహిత్య ధోరణి వ్యక్తం చేస్తున్నది. మొత్తం ముస్లింల ప్రజల అభివ్యక్తిని అక్షరమయం చేయలేకపోతున్నది. అందుకే ఇది ఉర్దూ ముస్లిం కవిత్వానికీ, ఇతర భాషల ముస్లిం మైనారిటీ కవుల అభివ్యక్తికీ భిన్నంగా ఉన్నది. ఈ ధోరణి కూడా నిర్దిష్టమైన తాత్విక దృక్పథం, నిబద్ధ నాయకత్వం, సంస్థాగత నిర్మాణ రూపం ఏర్పడకపోవడం వల్ల ఇదొక ఉద్యమంగా ఎదగలేకపోతున్నది.

ఇలా సంక్లిష్టమైన భారతీయ సమాజంలో నేడు ఆయా ప్రజాశ్రేణుల ఉద్యమాలకు, ఉద్వేగాలకు, ఆకాంక్షలకు, లక్ష్యాలకు అనుగుణంగా ఏకకాలంలో అనేక సాహిత్య ధోరణులు సమాంతరంగా ప్రవహిస్తున్నాయి. ప్రవహిస్తూ ఉంటాయి కూడా. ఇవి అభ్యుదయ, విప్లవ సాహిత్యోద్యమాలకు ప్రత్యామ్నాయం కావు. కొనసాగింపూ కావు. ఎవరి ఆదర్శాలు వారికున్నాయి. ఎవరి అనుభవాలు వారికున్నాయి. తమ తమ లక్ష్యాలను నెరవేర్చుకునే దాకా విభిన్న సాహిత్యోద్యమాలు, వివిధ సాహిత్య ధోరణులు సమాంతరంగా కొనసాగుతూనే వుంటాయి. సాహిత్యాన్ని ప్రభావితం చేస్తూనే వుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X