వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాట శూద్రులది,విప్లవీకరించాం: వంగపండు

By Staff
|
Google Oneindia TeluguNews

ఇటు తెలంగాణలో గద్దర్‌, అటు ఉత్తరాంధ్రలో వంగపండు ప్రసాదరావు విప్లవగేయాలకు, విప్లవ ప్రదర్శనలకు మారు పేరయ్యారు. వారు రంగం మీదికి వచ్చి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడానికి నేపథ్యం ఏమై ఉంటుందనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే సమాధానం స్పష్టంగానే దొరుకుతుంది. తెలంగాణలో నిజాం వ్యతిరేక సాయుధ పోరాట వారసత్వం ఉంది. ఉత్తరాంధ్రకు శ్రీకాకుళోద్యమ వారసత్వం ఉంది. ఈ రెండు పోరాటాల నేపథ్యం నక్సలైట్‌ ఉద్యమానికి ఉంది. ఈ నక్సలైట్‌ ఉద్యమంలో భాగంగానే విప్లవ పాట పుట్టింది. ఈ విప్లవ పాటకు తెలంగాణలో గద్దర్‌, ఉత్తరాంధ్రలో వంగపండు ప్రసాదరావు ప్రతీకలు. ఇటీవల వరంగల్‌ జిల్లాలో, తదితర ప్రాంతాల్లో పీపుల్స్‌వార్‌ అమరవీరుల సంస్మరణ సభలో గద్దర్‌, వంగపండు ప్రసాదరావు గొంతు విప్పి విప్లవగేయాలు ఆలపిస్తూ ప్రదర్శనలు ఇచ్చారు.

వంగపండు ప్రసాదరావుకు పెద్దగా చదువు లేదు. ఫిఫ్త్‌ ఫారమ్‌ వరకు చదువుకున్నారు. రైతు కుటుంబం శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం ప్రాంతంలోని పెదకొండపల్లిలో ఆయన పుట్టారు. ఇప్పుడు ఆ గ్రామం విజయనగరం జిల్లాలో ఉంది. వంగపండు ప్రసాదరావు మూడు వందలకు పైగా పాటలు రాశారు. "నేను కథలు కూడా రాశాను'' అని ఆయన చెప్పారు. ఆయన కథలు రాశారనే విషయం చాలా మందికి తెలియదు. అలాగే 'దొమ్మరసాని' అనే నవల రాశారు. ఆయన రచనావ్యాసంగం గురించి ఆయన మాటల్లోనే చదువుదాం.

చైనా యుద్ధంతో నా చదువు ఆగిపోయింది. చైనాతో తలపడటానికి శిక్షణ పొందాను. నా శిక్షణ అయిపోవడం చైనాతో యుద్ధం ముగియడం ఒకేసారి జరిగిపోయాయి. సైన్యంలో కొనసాగకుండా ఇంటికి వచ్చేశాను. ఆ తర్వాత బొబ్బిలిలో ఐటి ఐ కోర్సులో చేరాను. మా సంస్థ వార్షికోత్సవానికి ఐటి ఐ నాటిక రాశాను. దాన్ని ప్రదర్శించాం. ఇది మొదటి రచన.

మా నాన్న రాయచూర్‌లో ఉండేవాడు. అక్కడ ఒక నాటిక ప్రదర్శించాలని అనుకున్నారు. ఆ నాటికలో హీరో పాత్ర పోషించడానికి నన్ను పిలిపించారు. ఆ విధంగా 'సమర్పణ' అనే నాటికలో హీరో వేషం వేశాను.

ఉద్యోగం సద్యోగం ఏదీ లేదు. కానీ పెళ్లయింది. బతుకుతెరువు లేక వీరభద్రాపురంలోని అత్తవారింటికి వెళ్లాను. నాకు పనీపాటా ఏదీ లేదు. మా ప్రాంతంలో ఆ కాలంలో బుర్రకథలు విరివిగా ప్రదర్శించేవారు. ఈ బుర్రకథల్లో మధ్యలో ఉండే పాటలను నాచేత రాయించేవారు. నాటకాల మధ్యలోని పాటలు కూడా నా చేత రాయించేవారు. పాటలు రాస్తున్న సమయంలో ఒక చార్మినార్‌ సిగరెట్టు ప్యాకెట్‌ తెచ్చిచ్చేవారు. ఆ సిగరెట్లు తాగుతూ పాటలు రాసేవాడ్ని. 'బ్రోవుమా బ్రమరాంబ/ మొర వినుమా' లాంటి ప్రార్థనాగీతాలు బుర్రకథల కోసం, నాటికల కోసం రాసేవాడ్ని. పాటలు రాయడానికి పదజాలం సరిపోయేది కాదు. భాష కోసం అమరం, ఆంధ్ర పుస్తకాలు చదివాను. సినిమాకు పాటలు రాయాలని ఉండేది. ఈ కాలంలోనే గేయాలు విరివిగా రాశాను. వాటన్నింటినీ ఒక పుస్తకంలో రాసుకున్నాను.

అక్కడ కూడా పని ఏదీ లేకపోవడంతో పందొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రాంతంలో విశాఖపట్నం చేరాను. ఉండటానికి వసతి లేదు. విశాఖపట్నంలోని టర్నర్‌ చౌట్రీలో బస్సులు ఉండేవి. ఆ బస్సుల్లో రాత్రుల్లు పడుకునేవాడ్ని. ఆ రోజుల్లో 'లాంగ్‌ మార్చ్‌' అనే పత్రిక వచ్చేది. ఒకసారిఆ పత్రిక తిరగేస్తుంటే శ్రీశ్రీ 'నిన్నటి జట్కావాలా' కవిత కనిపించింది. అది నాకు బాగా నచ్చింది. అడ్రస్‌ పట్టుకుని ఒక రోజు ఆ పత్రిక ఆఫీసుకు వెళ్లాను. పావనమూర్తి అనే ఒకాయన, మరో డాక్టర్‌ ఉన్నారు అక్కడ. నేను పావనమూర్తికి నన్ను పరిచయం చేసుకున్నాను. "మీరు నక్సలైట్లా?'' అని అడిగారు. మా ప్రాంతంలో నక్సలైట్లు ఉండేవారు. కానీ నాకు ఆ నక్సలైట్ల కార్యకలాపాలతో అప్పటికి పెద్దగా పరిచయం లేదు. కాదని చెప్పా. ఆ తర్వాత నేను రాసిన గేయాలు ఆయనకు చూపించాను. "గేయాలు అచ్చేస్తాం గానీ డబ్బులు మాత్రం ఇవ్వలేం'' అని ఆయన చెప్పారు. కొన్నింటిని అచ్చేశారు.

పావనమూర్తిగారు నన్ను ఓ వర్క్‌షాపులో పెట్టారు. భోజనానికి హోటల్‌ టికెట్లు కొనిచ్చారు. ఈ సమయంలో హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌లో పనిచేసే యూనియన్‌ నాయకుడితో పరిచయం అయింది. అతను నాకు షిప్‌యార్డ్‌లో లేబర్‌ పని ఇప్పించాడు. కమ్యూనిస్టు సభ జరుగుతుంటే దానికో పాట రాయమని ఆ యూనియన్‌ నాయకుడే నన్ను అడిగారు. దాంతో ఓ పాట రాసి, ఆ పాట పాడుకుంటూ జీపులో సభ గురించి విశాఖపట్నంలో ప్రచారం చేయసాగాను. "పేరు చెప్పగ దేశానికి మూలం మనం'' అనేది ఆ పాట.

అలా పాడుతూ పాడుతూ జగదాంబ సెంటర్‌లో టీ తాగడానికి ఆగాం. అక్కడే రావిశాస్త్రి ఆఫీసుందని నాకు తెలియదు. ఒకాయన నా వద్దకు వచ్చి 'రావిశాస్త్రి తెలుసా?' అని అడిగాడు. తెలియదని చెప్పాను. తన పేరు రావిశాస్త్రి అని చెప్పుకొని "నువ్వు పాడుతున్న పాట ఎవరు రాశారు?'' అడిగాడు. "నేను రాశాను'' అని చెప్పాను. నాకో అడ్రసిచ్చి ఆదివారం అక్కడికి రమ్మన్నారు రావిశాస్త్రి. ఓ ఆదివారం నేను అడ్రస్‌ పట్టుకుని వెళ్లాను. అది ప్రముఖ రచయిత కాళీపట్నం రామారావు (కారా) ఇల్లు. నేను వెళ్లేసరికి ముప్పై నలబై మంది రచయితలు కూర్చుని వున్నారు. సుదీర్ఘంగా చర్చించుకుంటున్నారు. శ్రీకాకుళం విషయం ఏదైనా సరే రచయితలు గౌరవంగా చూసేవారు. వెంపటాపు సత్యం, కృష్ణమూర్తి, పంచాది నిర్మల పేర్లు వింటే పులకించిపోయేవారు.

ఏ ప్రజల కోసమైతే రాశామంటున్నారో ఆ ప్రజలకు వీరి కవిత్వం అర్థం కాదని ఓ వచన కవిత్వం పుస్తకం నిషేధంపై తీర్పు ఇస్తూ జడ్జి వ్యాఖ్యానించారట. దాని గురించి మాట్లాడుకుంటున్నారు అందరూ. ప్రజలకు అర్థం కావాలంటే ఎలా రాయాలనేది వారి తర్జనభర్జనట. పాట రాయాలని వారు అనుకుంటున్నారు. శ్రీకాకుళ ఉద్యమం మీద బుర్రకథ రాయాలని నన్ను అడిగారు.

అప్పటికి నేను విశాఖపట్నం వచ్చి దాదాపు అరు నెలలు అయింది. నాకో ఉద్యోగం కుదిరింది. దాంతో భార్యను తీసుకురావడానికి నేను మా అత్తవారింటికి వెళ్లాను. నేను ఆ వూళ్లో ఉన్న సమయంలోనే 'జాలరి బాగోతం' ఆడుతున్నారు. ఆ బాగోతం చూడాలని కూర్చున్నాను. నాకు చదువు వస్తుందని గానీ, నేను కవిత్వం రాస్తానని గానీ ఏనాడూ అనుకోలేదు. బాగోతం చూస్తుంటే నాకు అందులోని పాటల్లో ఒక బాణీ బాగా నచ్చింది. దాన్ని పట్టుకున్నా. "జాతి చెప్పగ మేమే జాలారివాళ్లము' అనేది ఆ లైను. ఆ బాణీతో పాట రాసి విశాఖపట్నం వెళ్లిన తర్వాత కారా ఇంట్లో మీటింగ్‌కు వెళ్లాను ఓ రోజు. బిక్కుబిక్కుమంటూ ఆ పాటను రావిశాస్త్రికి చూపించాను. రావిశాస్త్రి చూసి దాన్ని పాడమన్నారు. నేను పాడసాగాను. "కూడుగుడ్డ లేని కూలినాలోల్లము'' అనే లైనుతో పాట ప్రారంభమవుతుంది. "దుక్కి దున్నేది మనమే రైతన్న'' అనేసరికి చప్పట్లు మొదయ్యాయి. పాట పాడిన తర్వాత "మా బాగోతం నువ్వు వినొద్దు. ఇలా పాటలు రాస్తూ పో!'' అని సలహా ఇచ్చారు. ఆ పాటను నాచేత మళ్లీ పాడించుకుని అందరూ రాసుకున్నారు.

శ్రీశ్రీ పాల్గొన్న సభలో నేను మళ్లీ అదే పాట పాడాను. అప్పుడు శ్రీశ్రీ నా వద్దకు వచ్చి "నేను కవిని కాదు, ఈయన కవి'' అని ప్రకటించారు. ఆ తర్వాత పౌరహక్కుల సభ ఒకటి జరిగింది. ఆ సభకు గద్దర్‌ కూడా వచ్చాడు. గద్దర్‌తో పరిచయం అదే. పందొమ్మిది వందల డెబ్బై రెండు అనుకుంటా. గద్దర్‌ చేయిని, నా చేయిని తీసుకుని ఇద్దరి చేతులూ కలిపి ఈ సమాజాన్ని బాగు చేయండని చెప్పారు శ్రీశ్రీ. అలా జన నాట్యమండలి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విప్లవ పాట జననాట్యమండలిదే. దీని కవిత్వం, దీని రూపురేఖలు పూర్తిగా వేరు. విప్లవ పాటను పుట్టించి నడిపించింది అదే.

అంతకు ముందు ప్రజా నాట్యమండలి ఉండేది. అయితే దాని పాటల్లో ఫ్యూడల్‌ భావజాలం ఉండేది. మీ కోసం రాస్తున్నాం అని ప్రజా నాట్యమండలి కవులు ప్రజలకు చెప్పేవారు. తమ గురించి రాస్తున్నందుకు ఆ కవులను ప్రజలు ఆరాధనాపూర్వకంగా చూసేవారు. కానీ ప్రజా నాట్య మండలి కవులు రాసి పాడిన పాటలను ప్రజలు నేర్చుకోలేదు. మా పాటలను ప్రజలు సొంతం చేసుకున్నారు. నేను రాసి పాడిన 'సంగం బెడ్దాం సంగతేందో చూద్దాం' అనే పాట పద్దెనిమిది భాషల్లోకి అనువాదమైంది. గిరిజన భాషల్లోకీ వెళ్లింది. జన నాట్యమండలి పాటకు మాత్రమే దేశంలో ఆ గౌరవం దక్కింది. మేం ప్రజల కోసం ప్రజల బాణీల్లో పాటలు రాసి కొత్త ప్రయోగం చేశాం.

అంతకు ముందు కూడా ప్రజలు పాటలు పాడుకునేవారు. అయితే భారత, రామాయణాల్లోంచి వస్తువును తీసుకొని పాటలు అల్లుకునేవారు. ఉత్తరాంధ్ర అంటేనే పాటల సంస్కృతి. తాతల, అమ్మమ్మల సంస్కృతి నాకు వంటి బట్టింది. అందుకే నేను ప్రజల భాషలో పాటలు రాయగలిగాను. " ఇంగ్లీష్‌ చదివితే నాలాగా అయిపోయేవాడు. వంగపండు ప్రజా కవి నేను కాను'' అని శ్రీశ్రీ సభాముఖంగా అన్నారు. నేను రాసిన 'యంత్రమెట్లా పుట్టిందంటే' పాటను ఇంగ్లీష్‌లో అమెరికాలో కూడా పాడుకుంటున్నారు.

నేను మూడు వందలకు పైగా పాటలు రాశాను. 'భూమి బాగోతం', 'సిక్కోలు యుద్ధం' నృత్యనాటికలు రాశాను. విశాఖ రచయితల కోరిక మేరకు శ్రీకాకుళ ఉద్యమంపై బుర్రకథ రాసి ప్రదర్శిద్దామని బుర్రకథ నేర్చుకోవడానికి నాజర్‌ వద్దకు వెళ్లాను. అయన వద్ద నేర్చుకోవడం సాధ్యం కాలేదు. శ్రీకాకుళంలో బుర్రకథలు విరివిగా ఆడేవారు. నేను ఆ బుర్రకథలు చూస్తూ వాటి బాణీలను పట్టుకొని ప్రజల కోసం ఈ నృత్యనాటికలు తయారు చేశాను. విప్లవ పాట ప్రజాదరణ పొందడానికి కారణం జానపద తత్వం. జానపద తత్వంలో విప్లవ తత్వం చెప్పగలగాలి. పాట శూద్రులది. జానపదులంటేనే శూద్రులు. వాళ్ల భాషలో, వాళ్ల బాణీలో పాటలు కట్టాను. వస్తువు తమది సంబంధించింది కాకపోతే వాళ్లు హర్షించరు.

నేను జీవితంలో అనేక కష్టాలు పడ్డాను. చిన్నప్పుపడే అమ్మ చనిపోయింది. నాన్నదదో తత్వం. ఆ బాధలే నా చేత కష్టజీవుల పాటలు రాయించాయి. పాటను విప్లవీకరించి వీధుల్లో పాడటం మొదలు పెట్టాను. మొదట్లో రచయితలు ఐ.వి. సాంబశివరావు, రావిశాస్త్రి, చలసాని ప్రసాద్‌లాంటివాళ్లే నాకు వంతలు. ఈ సమయంలో ఎపిసియల్‌సి, విరసం సభల్లో పాట వేదిక మీదికి ఎక్కింది. అలా వేదిక మీది నుంచి ప్రజల్లోకి వెళ్లింది.

పాట వేదిక మీదికి ఎక్కేసరికి అలంకరణ అవసరమైంది. నేను, గద్దర్‌ బుర్రకథ చెప్పేవాళ్లం. డప్పుల పాటలు పాడేవాళ్లం. శ్రీకాకుళం ఉద్యమం గురించి, జన జీవితాల గురించి ఆడి పాడేవాళ్లం. పోరాట స్ఫూర్తిని ఇవ్వడం మా ప్రధాన కర్తవ్యమైంది. ఈ సమయంలో ప్రదర్శనకు ఒక రూపం ఇవ్వాల్సి వచ్చింది. గద్దర్‌ తెలంగాణ గొల్లల డ్రెస్‌ను ఎంపిక చేసుకున్నాడు. గోచి, గొంగడి, తలపాగా. నేను రైతు డ్రెస్‌ ఎంపిక చేసుకున్నాను. గోచీ, బనీను, తలపాగా, చేతిలో కర్ర.

మొదట కర్రను రైతుకు ప్రతీకగా మామూలుగానే తీసుకున్నాను గానీ తర్వాత్తర్వాత అది విన్యాసాలకు పనికి వచ్చింది. నాజర్‌ తంబూరాను వాడుకునేవాడు. కర్ర యాక్షన్‌కు పనికొచ్చింది. ఒక ఊపును ఇవ్వడానికి బాగా ఉపయోగపడింది. జానపదుల చిందులను ప్రదర్శనకు ఎంచుకున్నాం. ఇందులో జంతువుల కదలికలుంటాయి. ఆ చిందులను మేం విప్లవీకరించాం. విప్లవతత్వం చిందులో చూపించాం. జన నాట్యమండలి అంటే మొదట ఐదుగురే. గద్దర్‌, నేను, సంజీవి, దివాకర్‌, రమేష్‌. ఆ రకంగా పదేళ్ల పాటు దేశాన్ని పాటతో, ప్రదర్శనలతో ఊపాం.

పాటకు వచన కవిత్వానికి ఏ విధమైన సంబంధం లేదు. వచన కవిత్వం అదో ప్రపంచం. పాట నిత్యనూతనం. ఇక్కడ ఆటాపాటను కలిపి విప్లవీకరించి చెప్పే కళాకారుడు నిలబడతాడు. విప్లవ కళాకారుడు జానపద తత్వాన్ని విప్లవీకరించాడు; నాట్యంలో విన్యాసాలను విప్లవీకరించాడు.

నేను బాణీలను, వస్తువును ప్రజల నుంచే తీసుకున్నాను. 'భూమి బాగోతం' ఎన్నో ప్రదర్శనలిచ్చాం. జానపద తత్వం చెడకుండా వాడుకున్నాను. యతిప్రాసలు కూడా సరిగా వున్నాయని పురిపండా అప్పలస్వామి అన్నారు. ఆ విషయం నాకు తెలియదు. నేను చెప్పేది, పాడేది తమది కాబట్టి ప్రజలు కూర్చుండిపోతారు.

పీపుల్స్‌వార్‌పై, ఇతర ప్రజా సంఘాలపై నిర్బంధం ఉన్నప్పుడు కూడా నేను పాట పాడాను. ఇళ్లలోకి వెళ్లి పాటలు పాడేవాడిని. 'వంగపండు మా కవి' అని శ్రీకాకుళం బాతుపురం అమరవీరుల సంస్మరణ సభ వద్ద గిరిజనులు ప్రకటించారు. నా మీద పాట కట్టి పాడారు. వారి కోసం రాసి పాడాను కాబట్టే వాళ్లు నన్ను వాళ్లు సొంతం చేసుకున్నారు. కళలను, సాహిత్యాన్ని ప్రజల కోసం వారి రూపంలోనే సృష్టిస్తే వారు సొంతం చేసుకుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X