వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మదిని దాగిన మాట మొలకలెత్తిన 'ఆర్తి'

By Staff
|
Google Oneindia TeluguNews

బైరెడ్డి కృష్ణారెడ్డి ఆర్తి మరో నాలుగు కవితల మలిసంకలనం. సరిగ్గా రెండేళ్ల క్రితం 'ఆర్తి' పేరిటనే తన తొలి కవితా సంకలనాన్ని వెలురించినాడు.ఈ మలి సంకలనంలో మొత్తం అయిదు కవితలున్నాయి. మొదటి సంకలనంలో అచ్చయిన ఒక కవితకి మరో స్టాంజా అదనంగా చేరుస్తూ ఈ సంకలనంలో మరోసారి ప్రచురించినందువల్ల దీన్ని నాలుగు కవితల మలి సంకలనమనే అంటున్నాడు కృష్ణారెడ్డి. ఇందులోని అయిదు కవితలూ దేనికదే. ఏ కవితని ఉటంకించినా వాల్యూమ్స్‌ మాట్లాడాల్సినవే. అన్నీ అంతరంగాన్ని బలంగా ఆకట్టుకనేవే. అయినా పాఠకుడి సాహిత్యాస్వాదన సామర్థ్యంతోనూ, స్థాయితోనూ నిమిత్తం లేకుండా అందర్నీ కట్టి పడేసి కన్నీటి పర్యంతం చేసే కవిత 'వీడ్కోలునామా'. మదిని నిమిరే ఒక ఆర్ధ్రత, ఒక ఆర్తి ఈ కవిత. అది తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని విడమరిచి వివరించే విషాద కావ్యంలోని సజీవ దృశ్యం. తన కడుపులోని ఒక పేగుని ఒక అయ్య మెడలో వేసి గోడున ఏడ్చే తండ్రి దిగులు దీనాలాపన.

అప్పగింతల్లో ఒక అయ్య చేతిలో పెట్టినప్పుడు తన అసహాయతను అంగీకరిస్తూ తన 'ఇంటి నుంచి శాశ్వత కాలానికి బహిష్కరి'స్తున్నప్పుడు ఎంతటి రాయిలాంటి తండ్రైనా గుండె కరిగి కన్నీరైపోతాడు. 'నీ గుండెల నిశ్శబ్ద సవ్వడులలో/ ఓలలాడించి నన్నూరడిద్దువులే' అంటూ కూతురు 'ఒళ్లోన తలవాల్చి' ఓదార్చబడే ఆ అదృష్టాన్ని, ఆ అపురూపమైన అనుభవాన్ని కృష్ణారెడ్డి గొప్పగా చిత్రీకరించినాడు.

'వీడ్కోలునామా'లోని అనుభూతుల పరంపర మనల్ని డీప్‌గా డిస్టర్బ్‌ చేస్తుంది. ఇందులో అంతర్లీనంగా సాగే ఇమోషనల్‌ డ్రామా గాఢంగా స్పృశిస్తుంది. ఆడపిల్లల తండ్రులమే ఆ భాగ్యానికి నోచుకోలేకపోయిన తండ్రులు ఏదో వెలితితో, దేని కోసమో దేవులాడుకోకపోరు ఈ కవిత చదివిన తర్వాత. కమర్షలైజేషన్‌ను పుక్కిట పుణికిన అనాగరికపు వ్యవస్థలో కూతురు పడే అగచాట్లకు, అవమానాలకు తానే జవాబుదారీ, దోషి అని తలచి తన చేతకానితనాన్ని వేలెత్తి చూపుతున్నప్పుడు, కూతురు కష్టాలు తలుచుకొని నిస్సహాయంగా కుమిలిపోయే తండ్రులెందరో!

మరుగైపోతున్నందున మానవ సంబంధాలు, విరిగి వికలమవుతున్న జీవనసరళి, ఉదయిస్తున్న స్త్రీఉద్యమాల్లో ఆమె విరోచిత పోరాటం నిత్య శీర్షిక నేటి చరిత్ర. తండ్రిని శాసించి, మందలించి, అధికారం చెలాయించే కూతురును చిత్రీకరించి ఈ కవి గొప్ప లోతుల్ని ఆవిష్కరిస్తున్నాడు. మధ్యతరగతి కుటుంబాల్లో దాగలేక తొంగి చూసే పేదరికం- ''బుద్ధి లేదు నాన్నా నీకసలు/ లౌకికునవని తగని మిడిసిపాటే గాని/ లౌక్యమే లేకుంట లోకంల/ ఏం చేసి బతుకతౌ'' అనే కూతురి హెచ్చరికతో తెలిసిపోతుంది.

'ఇప్పుడిక్కడంతా తేటతెల్లం' అనే కవితలో ''ఇప్పుడిక్కడ అంతా తేటతెల్లం/ ఇప్పుడిక్కడ దాపరికములు లేనేలేవు'' అంటూ మానవ సమాజాన్ని ఒక వికృతమైన 'జనమృగారణ్యం' అంటారు కవి. ఈ ఎత్తిపొడుపుని, ఈ వ్యంగ్యాన్ని ఒక గొప్ప నెరేటివ్‌ టెక్నిక్‌ ద్వారా ఆవిష్కరిస్తున్నాడు. ద్వంద్వ ప్రమాణాలు, ద్వంద్వ ప్రవృత్తులు సహజమై కొనసాగుతున్న సమాజంలో- ''..... తీయ తేనెల/ పూతలుండవ్‌/ ... మేకవన్నెల/మెరుగులుండవ్‌/ ..... పురులు విప్పిన పడగలుండవ్‌/ ... మేలిమేలిమి/ మేలిపురుగల/ మేడిపళ్లే'' అంటూ సమాజంలోని కుళ్లుకూ, క్రూరత్వానికి ఒక కొత్త అర్థాన్నీ, షాక్‌నీ కలిగిస్తాడు.

''రెప్పపాటున డొక్కలో/ రంపాలు తిప్పుడె'' లాంటి ఇమేజ్‌లు ఒక భీభత్సాన్ని, ఒక భయానక స్థితిని,ఈ సామాజానికి బలవుతున్న అమాయకుల్ని, వాళ్ల హాహాకారాల్ని హృదయ విదారకంగా చిత్రిస్తున్నాయి. ''రెప్పపాటున గొంతులో పంజాలు'' విసిరే పులులు సంచరిస్తున్న సమాజం ఒక 'మృగజనారణ్యమే''నంటూ అణచిపెట్టుకోలేని ఆవేశాన్నీ, ఆక్రోశాన్నీ పదునైన సెటైర్‌గా మార్చి ఒక వికారమైన, వికటించిన దుస్థితిని కవి మన అనుభవంలోకి తెస్తున్నాడు.

హిపోక్రసీకీ, ద్వంద్వప్రమాణాలకీ అతీతమైన నిజాయితీ బతుకు కాంక్ష కృష్ణారెడ్డి కవిత్వమంతటతా స్పష్టంగా కనబడుతుంది. 'తృష్ణమాలిక' అనే కవిత ద్వారానూ ఇదే ప్రతిపాదన చేస్తున్నాడు. ఒక్కో యూనిట్‌ ఒక్కో గల్‌ షేర్‌లా వినిపిస్తుంది. ఒక్కో యూనిట్‌ ఒక్కో ఇతివృత్తాన్ని ప్రతిపాదిస్తుంది. ''కలలు అలలై/ మమత కడలి కావాలె/ ఎండమావుల నీళ్ల/ కంటి తుడుపెందుకట'' అంటూ అదృశ్యమైపోతున్న మమతానురాగాల పట్లా, బాంధవ్యాల పట్లా తన వ్యాకులతని వ్యక్తం చేస్తున్నాడు. అడుగడుగునా బాధించే వ్యధల, వ్యాకులతల ప్రతిచర్యే ఈ సహజ కవితాధార. సహజత్వం ఎజెండాతో ప్రపంచంపై దాడి చేస్తున్నాడు. మనిషికి మనిషికి మధ్య ఆవులించే ఆఖాతాల్ని ఆవిష్కరిస్తున్నాడు. ''ముక్కు సూటిగ బతుకు/ మోదమందాలె/ మోచేతి నీల్దాగు/ ఆమోదమెందుకట'' అంటూ స్వావలంబనకి, స్వతంత్ర జీవితానికి పిలుపునిస్తున్నాడు. తడిలేని, కృతకమైన కవితా పోకడల్ని ''రుధిరాన్ని మరిగించు/ సృజన కావాలె/ తడిలేని నాలుకల/ మెప్పుకోళ్లెందుకట'' అని అంటూ గర్హిస్తూనే మరోవైపు ''వాసి బలమసలైన/ కొలతకావాలె/ నాకైత మనుగడకి/ రాశిఫలమెందుకట'' అంటూ తన కవితోద్రేకాన్ని వినూత్నంగా ప్రకటిస్తాడు కృష్ణారెడ్డి.

'దేవులాట'. ఇదొక పల్లెపాట. పల్లె బతుకు పాట. పాడైపోయిన పల్లె బతుకు. జ్ఞాపకాల్లోనే కొన ఊపిరైన/ పల్లె బతుకుని ఆర్ధ్రంగా అమాయకంగా నెమరేసుకుంటున్నాడు కవి. ఇట్స్‌ ఎ నాస్టోలిజికల్‌ రికలెక్షన్‌. ఊపిరైనిండిన ఉచ్చగచ్చు, ములుగర్ర పాడిన తత్వాలు, రిక్క పెట్టిన రంకె పరుగుళ్లు, ఉయ్యాల పాటల్ల కండ్లనీళ్లు, నడకల్నేర్పిన పల్లె ఉగ్గుపాలు, ఇట్లా ఎన్నెన్నో. గ్లోబలైజేషన్‌, అర్బనైజేషన్‌, టెక్నాలాజికల్‌ అడ్వాన్స్‌మెంట్‌, అన్నిటినీ తలదన్నే బాహ్యశక్తుల ఎక్స్‌ప్లాయిటేషన్‌ పల్లెల్ని ఎలా నాశనం చేశాయో తలపోస్తూ, వాపోతున్నాడు కవి ఈ కవితలో. ''పక్కింటి గంగమ్మ మనవడా రమ్మని/ పందిట్ల మంచంల కూసొ బిడ్డా అని/ ఉంటనో పోతనో యాదిలుండాలని/ పచ్చల్ల పొడిసిన పావురం ఎటుబాయె'' అంటూ తెలంగాణ భాషలో, తెలంగాణ మట్టి వాసనని ఊపిరితిత్తుల్లోకి ఊదుతూ రోదిస్తున్న ఈ దేవులాటకి చలించిపోని గుండెలుంటాయా! కవి నిరాశాస్మృతిని విషాదంగా ధ్వనిస్తున్న కవిత ఇది.

అర్బన్‌ లైఫ్‌లోని కాలుష్యానికి, కృత్రిమత్వానికి సహజ కవితా చిత్రణ 'నడిబొడ్డు చీకటి'. ''నలుపెక్కిన నగరం/ కడిగేసుకున్న మురికిలో/ జలకమాడిన/కుళాయి నీళ్లు'' అంటూ మొదలయ్యే ఈ కవిత నగరవాసులు గడిపే అధోగతి జీవితాన్ని, సబ్‌-హ్యూమన్‌ ఎగ్జిస్టెన్స్‌ని ప్రతిబింబిస్తుంది. ''సిమెంటు చెట్ల రెక్కలకు/ వేలాడుతున్న/ కరెంటు పూలు'' ఇదొక అమోఘమైన ప్రయోగం. పూల పరిమళాల సహజమైన బతుకు కనుమరుగైపోయి, కృతకమైన కరెంటు పూలు ''కమురు మేఘాల్ని గుభాలించడం'' ఎంత విపరీతం! హ్యూమర్‌, ఐరనీ సెటైర్‌ కలగలసి అంతర్లీనంగా సాగుతూనే మనసును కలుక్కుమనిపించే ఏదో సెన్స్‌ ఆఫ్‌ వాక్యూమ్‌కి లోను చేస్తుంది. ''చుక్కల మందల్ని ఓదార్చబోయి/ బొక్కబోర్లాపడి/ గొంగళి ముసుగేసుకున్న/ ఒంటరి చంద్రుడు'' (ప్రకృతిసహజమైన అందాలకీ, ప్రవృత్తుల సహజమైన నడవడికలకీ వెలియైన నేటి ఆధునికులకు చంద్రుడు) నిజంగానే ఒక ఒంటరి, ఒక అవుట్‌సైడర్‌. ''కన్నీటి బొట్లైన కంటి చూపు'' మాత్రమే కాదు, బతుకే జారిపోతుంది, కన్నీటి బొట్లై ఆవిరవుతుంది.

ముందే చెప్పినట్లు 'ఆర్తి'లోని ప్రతి కవితా ఒక విలక్షణమైన సృష్టి. నేటి కవితా ధోరణులకు భిన్నంగా తనదనైన దారిలో మాత్రమే నడుస్తున్న కృష్ణారెడ్డి కవిత్వం అంతా ఒక వైవిధ్యం కావడం ఒక ఎత్తైతే, ఈ సంకలనంలోది ఏ కవితకాకవితై అంతర్లీనంగా మరో వైవిధ్యాన్ని సాధించినాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X