గోపి సాహిత్య 'జల'
తెలుగు సాహిత్యంలో ఎన్. గోపికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. కవిత్వంలో, పరిశోధనలో ఆయన ముద్ర ఒకటుంది. తంగెడుపూలు కవితా సంకలనం నుంచి ఇటీవలి జలగీతం దాకా ఆయన స్వచ్ఛమైన కవితాప్రవాహం సజీవంగా సాగుతూనే ఉంది. సాహిత్య అకాడమీ అవార్డు వంటి అవార్డులు, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్ష పదవి వంటి పాలనాపరమైపన పదవులు ఆయనలోని కవితాహృదయంలోని తడిని ఆర్పలేదు. తనను తాను సానపెట్టుకుంటూ ఆయన మానవ జీవితం పట్ల, దేశీయ వాతావరణం పట్ల కవిత్వమై పలకరిస్తూనే ఉన్నారు. ఇక పరిశోధన విషయానికి వస్తే వేమనపై చేసిన పరిశోధన ఆయన పరిశోధనా దాహాన్ని, సామర్థ్యాన్ని పట్టిస్తుంది. ఆ పరిశోధనకుగాను ఆయన పేరుకు ముందు 'వేమన' అనే పదం చేరిపోయి 'వేమన' గోపి అయ్యారు. ఇటువంటి గౌరవం చాలా తక్కువ మందికి లభిస్తుంది.
గోపి కవిత్వం స్థానీయ ప్రతీకలతో విశ్వజనీనతను సంతరించుకుంటుంది. ఇది ఆయన ప్రత్యేకత. ఒక కవితాసంకలనానికి 'తంగెడుపూలు' పేరు పెట్టడమే ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది. వేమనపై పరిశోధనకు ఆయనకు ఎంత పేరు వచ్చిందో తంగెడుపూలు కవితా సంకలనానికీ అంతే పేరు వచ్చింది. భువనగిరి కొండపై కవిత రాసి పాఠకులను మెప్పించడం ఆయనకే చెల్లు. ఆయన కవితలు ఆత్మాశ్రయ కోణం నుంచి వస్త్ర్వాశ్రయాన్ని సంతకరించుకుంటూ విశ్వజనీనాన్ని సంతరించుకుంటాయి. అందుకే స్థానీయత కూడా ఆయన కవితలను అందరూ ఆస్వాదించేలా చేస్తోంది. ఇది ఆయన తొట్టతొలి కవితా సంకలనం. ఆ తర్వాత మైలురాయి, చిత్రదీపాలు, వంతెన, కాలాన్ని నిద్రపోనివ్వను, చుట్టకుదురు, ఎండపొడ కవితా సంకలనాలను వెలువరించారు. లండన్, భారత్కు గల సాంస్కృతి సంబం«ధం ఏ విధంగా పెనవేసుకుపోయిందో అనుభూతిపరంగా అర్థం చేయించే ఆయన 'మరో ఆకాశం' కవితల పుస్తకం విశిష్టమైంది.
ఇక నానీల విషయానికి వస్తే గోపిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నానీలు, గోపి నానీలు అనే రెండు పుస్తకాలు వెలువరించాయి. అలతి అలతి పదాలతో, చిరు రూపంతో చిత్రిక కడుతూ అనేకానేక విషయాలను వ్యాఖ్యానించే కవితాశకలాలు ఇవి. దీనికి పునాది వేసింది గోపీయే. ఇప్పుడు నానీలు రాయడం కవులకు ఒక ఇష్టమైన కార్యంగా మారింది. గోపి నానీలకు అనుచరులు తయారయ్యారు. కోట్ల వెంకటేశ్వరరెడ్డి తెలంగాణ నానీలతో పాటు అనిశెట్టి రజిత, రఘు వంటివారి నానీలు గోపీ పెంచి పోషించిన నానీలకు గల ఆదరణ తెలుస్తుంది. గోపి నానీలు హిందీలోకి అనువాదమయ్యాయి. 'నన్హే ముక్తక్' పేర గోపీ నానీలను డాక్టర్ విజయరాఘవరెడ్డి హిందీలోకి అనువదించి పుస్తకంగా తెచ్చారు. హిందీలో కూడా దీనికి విశేషమైన ఆదరణ లభిస్తుంది. కవిత్వంలో బ్రివిటీని, మెరుపులను హిందీ, ఉర్దూ పాఠకులు విశేషంగా ఆదరించే విషయం మనకు తెలియంది కాదు.
గోపి జలగీతం అనే దీర్ఘ కవితను వెలువరించారు. గోపీయే చెప్పుకున్నట్టు - "కాస్మిక్ జలం నుంచి కాలుష్య జలం దాకా నీటి అనంత యాత్రా ప్రక్రియ దీనిలో చిత్రితమైంది. విశ్వం నుంచి నీటి రాక, జలచక్రం, పంచభూతాల్లో నీటి ప్రాధాన్యం, ప్రమేయం, నీటి వివిధ రూపాలు, ధర్మాలు, నీటి విలువ, ప్రశస్తి, మనిషికి నీటితో ఉన్న నిర్దిష్ట సంబంధం, నీరూ సంస్కృతి, నీటి కరవు, నీటి పంపకాలు, జలకలహాలు, నదులు, జలపాతాలు, చెరువుల జలవ్యవస్థ, రవాణా జలం, నీటిని వాణిజ్య వస్తువుగా మారుతున్న వైనం, నీటి కోసం ఉద్యమాలు, నీటి నిల్వల కోసం భగీరథ యత్నాలు మొదలైన సమస్త అంశాలకు కవితాత్మక రూపమే ఈ రచన (జలగీతం)''. ఈ కావ్యం 'జలగీత్' పేర హిందీలో కూడా వెలువడింది. 'జలగీత్'ను జయపూర్లో మే 16వ తేదీన గాంధీ పీస్ ఫౌండేషన్ కార్యదర్శి అనుపమ్ మిశ్రా ఆవిష్కరించారు.
రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లాకు నీళ్లిచ్చిన రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్కు ఈ పుస్తకాన్ని అంకితమిచ్చారు. జలగీతాన్ని 'జలగీత్' పేర ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన పి. మాణిక్యాంబ హిందీలోకి అనువదించారు. 'జలగీత్' జలాత్మను ఆవిష్కరించిన మహా కావ్యమని అనుపమ్ మిశ్రా ప్రశంసించారు. జలగీతం కావ్యం ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించి విశాల భారతంలోకి విస్తరించడం ముదాహవమని, ఈ కావ్యం చదివితే జల చైతన్యం కలగడం తథ్యమని రాజేంద్ర సింగ్ అన్నారు. తరుణ్ భారత్ సంఘ్ గొడుగు కింద ఏర్పడిన తరుణ్ జల్ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయంలో 'జలగీత్'ను పాఠ్యపుస్తకంగా పెట్టారు.
కేవలం కవిత్వంతో, సాహిత్య ఆచార్యుడిగా పాఠాలు చెప్పడంతో గోపి సంతృప్తి చెందడం లేదు. విమర్శ, పరిశోధనకు సంబంధించి ఆయన పలు గ్రంథాలు వెలువరించారు. ప్రజాకవి వేమన అనే సిద్ధాంత వ్యాసం ప్రత్యేకత గురించి మరోసారి చెప్పాల్సిన అవసరం లేదు. వేమన వాదం, వ్యాసనవమి, గవాక్షం, సాలోచన వంటి గ్రంథాలు ఆయన విమర్శనాపటిమకు అద్దం పడతాయి. బహుముఖీన ప్రజ్ఞ గల గోపి స్నేహశీలి కూడా. సాహిత్య పుస్తకాలను హృదయానికి హత్తుకునే విధంగానే మిత్రులనూ ఆయన ఆలింగనం చేసుకుంటారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!