• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణదళిత భావన ఇటీవలిదే: జయధీర్‌

By Staff
|

ఆచార్య జయధీర్‌ తిరుమలరావు జానపద సాహిత్యంలో, తెలంగాణ సాయుధ పోరాట సాహిత్యంలో విశేష కృషి చేశారు. కవిత్వం, సాహిత్య విమర్శ చేశారు. ఆయనను కాలువ మల్లయ్య ఇంటర్వ్యూ చేశారు.

ఇతర ప్రాంతాల విమర్శకులు తెలంగాణ కథకు చేసినదేమైనా వుందా? ఎంత మేరకు చేశారు?
తెలంగాణేతరులు తెలంగాణ కథా సాహిత్యాన్ని ప్రత్యేకంగా పట్టించుకోలేదు. అట్లని తెలంగాణ ప్రాంతంలో ఉన్న విమర్శకులు సైతం పెద్దగా పట్టించుకున్నారని కాదు. ఈ మధ్యకాలంలో అంటే ఆరేడు ఏళ్ల నుంచి మాత్రమే కొంత మాట్లాడుతున్నారు. నిజానికి తెలంగాణ కథను తవ్వి తీయనిదే దాని ప్రత్యేకతను చెప్పలేం. ఆ పని చేయడానికి, అంత శ్రమ చేయడానికి చాలా మంది సిద్ధంగా లేరు. నాలుగు కథలు, ఆరు కవితలు రాసి పేరు తెచ్చుకుందామని భావించేవారే అధికం. అలాంటప్పుడు ప్రాంతేతర విమర్శకులు ఎలా పట్టించుకుంటారు?

తెలంగాణలో కథా విమర్శ ఉందా?
తెలంగాణ ప్రాంతం నుంచి కథా విమర్శకులు తక్కువే. కథారచయితలే విమర్శకులు కావడం ఒక సంప్రదాయం. ఐతే వివిధ ధోరణులకు అనుగుణంగా రాసిన కథకులే ఎక్కువ. ఉదాహరణకు - అల్లం రాజయ్య. ఆయన విప్లవ కథకుడు. విప్లవ కథ గురించే ఆలోచిస్తాడు తప్ప తెలంగాణ ప్రాంతం కథ గురించి ఎలా ఆలోచిస్తాడు? అదే విధంగా నవీన్‌. చెప్పొచ్చేదేమిటంటే ప్రాంతీయ స్పృహ పెరిగిన తర్వాత మాత్రమే తెలంగాణ కథ రూపొందింది. అలాంటి కథా సాహిత్యం వచ్చాక మాత్రమే కథావిమర్శ రూపొందుతుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది.

తెలంగాణ దళిత కథ గురించి మీరేమంటారు?
తెలంగాణలో దళిత భావన ఇటీవల వచ్చిందేమో! దళిత దృక్పథం ఉన్న రచయితలు ఒకరిద్దరు ఉండవచ్చు. కాని తెలంగాణ దళిత దృక్పథం ఉన్నవారు స్పష్టంగా విడివడిలేరు. తెలంగాణ కథ అంశమే కొత్తది. అందులో తెలంగాణ దళిత కథ అంశం మరీ కొత్తది. ఈ పరిధి చాలా చిన్నది. ప్రాంతీయ భావన పెరగడం మంచిదే. కాని ఇలా ప్రతి అంశాన్ని వింగడించుకుంటూ పోవడం వల్ల ఉపయోగం ఉంటుందా?

బహుజన కథా సాహిత్యం పరిస్థితి ఏమిటి?
దళిత కథపై వ్యక్తీకరించిన అభిప్రాయాలే ఈ అంశానికీ వర్తిస్తాయి. అసలు బహుజనసాహిత్యం తెలుగులో స్పష్టమైన విభజన పొందిందా? తెలంగాణకు దాన్ని అన్వయించడానికి ప్రాతిపదిక అయిన కథా సాహిత్యం ఎంతో ఉందో తరచి చూడవలసి వుంది.

తెలంగాణ కథకు లేదా సాహిత్యానికి మీ కాంట్రిబ్యూషన్‌ ఏమిటి?
తెలంగాణ మాండలిక కథా సాహిత్యంపై ఒక పిహెచ్‌డి పరిశోధన చేయించాను. డాక్టర్‌ ఎ.కె. ప్రభాకర్‌ అనే విద్యార్థి ఎంతో శ్రమించి మొత్తం తెలంగాణ కథా సాహిత్యంపై మాండలిక ప్రభావం గురించి పరిశోధించాడు. కథకులపై అనివార్యంగా తెలంగాణ మాండలిక భాష ప్రభావం ఉందని తేల్చి చెప్పాడు. పదో పరకో కథలు రాశాను. ఐతే నేను కూడా తెలంగాణ వస్తువును తీసుకున్నప్పుడల్లా తెలంగాణ మాండలికాన్ని అనివార్యంగా రాశాను. వివిధ కథా సంకలనాలకు సంపాదకుడిగా ఉన్నప్పుడు తెలంగాణ కథకులు తీసుకునే ఇతివృత్తానికి ఆశ్చర్యపడేవాడిని. అప్పుడప్పుడు వ్యాసాలు రాయడం తప్ప ప్రత్యేకంగా కృషి చేయలేదు.

తెలంగాణ నుంచి అపార వస్తువైవిధ్యంతో కథలు రావడానికి కారణాలు ఏమిటి?

తెలంగాణ ప్రాంతం ఎప్పుడూ ఉద్యమాల మయం. వైవిధ్యమైన జీవన విధానాలు ఇక్కడ పుష్కలం. ఇక్కడి ప్రజలు చేసిన పోరాటాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. రాజకీయ ఆలోచనా విధానం అధికం. ఈ మధ్యకాలంలో సంభవించే పరిణామాలు - మరీ ముఖ్యంగా ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ ప్రభావం ప్రజలపై పడింది. దానివల్ల పాతవ్యవస్థ అతలాకుతలం అవుతున్నది. జీవిన సంబంధాలు దెబ్బ తినడం ఈ ప్రజలు ఇష్టపడటం లేదు. గ్రామాలు శిథిలం కావడం, చేతివృత్తులు నాశనం కావడం భరించలేకపోతున్నారు. పైగా వివిధ రాజకీయ పార్టీల ప్రభావం, ఆధిపత్యాలు వాటి పాత్రను కథకులు చూస్తున్నారు. వాటిని ఇతివృత్తాలుగా చేసుకోవడంలోనే ఈ కథకులవిజయం ఇమిడి వుంది. ఊహాజనిత ఇతివృత్తాలను పక్కన పెట్టడమే వీరి బలం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X