వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త కవిత్వం

By Staff
|
Google Oneindia TeluguNews

తెలుగులో పాత పద్ధతులను, నమ్మకాలను దెబ్బ కొడుతూ కొత్త రకం కవిత్వం విరివిగా వస్తోంది. ఏదో ఒక విశ్వాసానికి కట్టుబడి రాసే కవిత్వానికి కాలం చెల్లకపోయినా ఏ విశ్వాసానికీ కట్టుబడకుండా రాసే కవులు పెరిగారు. కవిత్వమూ పెరిగింది. ఈ మధ్య వచ్చిన కవితా సంకలనాలను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇంతకు ముందు ఇటువంటి కవులు చాలా అరుదుగా కనిపించేవారు. ఇప్పుడు వీరి సంఖ్య పెరిగింది. ప్రజలకు హితబోధలు చేసే, సమాజోద్ధరణకు కంకణం కట్టుకుని రాసే కవిత్వం పాలు తగ్గిందన్న మాట. తెలుగు కవి ఆత్మశోధనలో పడిన విషయాన్ని ఈ కవిత్వం పట్టిస్తుంది. తమ కోసం తాము కవిత్వం రాసుకునే కవులు పెరిగారు. తమ వ్యక్తిగత బాధలను, ప్రతిస్పందనలను వీరు తమ కవిత్వంలో పలికిస్తున్నారు. అయిల సైదాచారి 'ఆమె నా బొమ్మ', రమణజీవి 'నలుగురు పాండవులు', పులిపాటి గురుస్వామి 'చెమ్మ', బైరెడ్డి కృష్ణారెడ్డి 'ఆర్తి', ఎం.ఎస్‌. నాయుడు 'ఒక వెళ్లిపోతాను', తమ్మినేని యదుకుల భూషణ్‌ 'నిశ్శబ్దంలో నీ నవ్వులు' కవితా సంకలనాలు ఇటీవల వెలువడ్డాయి. ఇవన్నీ ఆయా కవుల వ్యక్తి గత ఆక్రందనలు, ఆక్రోశాలు. తెలుగు కవిత్వ ఇతివృత్తం, శైలి మారిందనడానికి ఇవి దాఖలాలు.

అయితే, ఇవి కేవల కవిత్వం కోసం కవిత్వం అనుకోవడానికి వీలు లేని సంకలనాలు. ఆత్మాశ్రయానికి, వస్త్వాశ్రయానికి మధ్య గల హద్దులను చెరిపేసే కవిత్వం ఇది. ఆయా కవుల అంతర్మథనం నుంచి వెలువడిన ఆవేదనలు ఈ కవిత్వాలు. సమాజానికి, తనకు మధ్య సంధి కుదిర్చేందుకు జరిగిన ప్రయత్నాలివి. పల్లె జీవనానికి సంబంధించిన వేళ్లు పోయి నగరీకరణ చెందుతూ కాళ్ల కింది భూమి తొలుచుకుని పోతుంటే చేస్తే ఆక్రోశాలివి. పాత కవిత్వ వాసనలేవీ లేకుండా తమ సొంత గొంతుకను ఈ కవులు వినిపించారు. ఈ కవితాసంకలనాల్లో దేనికదే ప్రత్యేకమైనది. తెలుగు కవిత్వ ప్రక్రియలో ఇవి కొత్త టానిక్‌లు.

రమణజీవి తన 'నలుగురు పాండవులు' కవిత్వంలో జీవితంలోని అర్థరాహిత్యం గురించి మాట్లాడితే ఎం.ఎస్‌. నాయుడు తన 'ఒక వెళ్లిపోతాను'లో బాల్యవేదనను పలకించాడు. తమ్మినేని యదుకుల భూషణ్‌ కవిత్వంలో ఇస్మాయిల్‌ కవిత్వ ఛాయలు కనిపిస్తాయి. ఇమేజరీలు వేయడంలో, వస్తువును ఎంపిక చేసుకోవడంలో ఇస్మాయిల్‌ కవిత్వ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. సైదాచారి కవిత్వం తెలుగులో కొత్తది. ఆత్మ ప్రక్షాళన గురించి అతను ఎక్కువగా మాట్లాడుతాడు. ఆత్మ పరిశుద్ధంగా వుండడం ముఖ్యమంటాడు. ఇది చెప్పడానికి ఆయన స్త్రీని తన కేంద్ర బిందువుగా చేసుకున్నాడు. సెక్స్‌ను అందుకు వాహికగా ఎంచుకున్నాడు. దానికి తోడు తన కులవృత్తి పతనావస్థను కళ్లకు కట్టినట్లు కవిత్వీకరించాడు. గురుస్వామి తన చెమ్మ కవితాసంకలనంలో మనిషి పతనమవుతున్న వైనాన్ని చెప్పాడు. ఈ సమాజంలో మనిషి మనిషిగా బతకలేని వైనానికి బాధపడ్డాడు. కృష్ణారెడ్డి సమాజంలోని హిపోక్రసీ మీద నిప్పులు కక్కాడు. వీరందరూ సమాజంలోని వింత పోకడలను, మనుషులు జీవన మూలాలను కోల్పోతున్న వైనాన్ని చూసి ఆక్రందన చెందుతున్నవారే.

వీరందరినీ విప్లవ సాహిత్యానంతర కవులుగా చెప్పవచ్చు. ఆ మాటకొస్తే, స్త్రీ, దళిత, మైనారిటీ సాహిత్యానంతర కవులుగా కూడా చెప్పవచ్చు. చాలా కాలంగా తెలుగు సాహిత్యంలో చిన్న పాయగా పారుతూ వస్తున్న ఈ కవిత్వం ఇప్పుడు బలంగా పలుకుతోంది. కొత్త వ్యక్తీకరణలు తెలుగు కవిత్వాన్ని పరిపుష్టం చేస్తున్నాయని చెప్పవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X