వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్ట్-27

By Staff
|
Google Oneindia TeluguNews

సెక్రటేరియట్‌ రోడ్డు.
వందలాది మంది విద్యార్థులు రోడ్డు మీద బైఠాయించారు. అందులో మెడికోలు, ఇంజినీరింగ్‌ విద్యార్థులు, ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు... ఎంతో మంది ఉన్నారు. అమ్మాయిలు కూడా చాలా మందే ఉన్నారు. ఆధునిక వస్త్రధారణ, తీర్చి దిద్దిన హుందాతనం... వారిని చూస్తే దివ్యలోకం నుంచి ఇప్పుడే దిగి వచ్చినవారిలా ఉన్నారు. అక్కడక్కడా జుట్టు చెదిరి, ఒళ్లు చెమటలు కారి జిడ్డోడుతున్నవారు కూడా ఉన్నారు. వీరందరూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందినవారని, ఇందులో చాలా మంది ఇంతకు ముందు లెఫ్ట్‌ విద్యార్థి సంఘాల్లో పని చేసివారని గుర్తు పట్టడానికి రాంరెడ్డికి ఎక్కువ సమయం పట్టలేదు. రెండు వేర్వేరు సమాజాలు ఒక్కటైనట్లనిపించింది. అమ్మాయిలు చాలా మంది మెడలో స్టెతస్కోపులతో ముందు వరుసలో కూర్చున్నారు.

పోలీసులు మహా టెన్షన్‌గా వున్నట్లు కనిపిస్తూనే ఉన్నది. పరిస్థితి మాత్రం ప్రశాంతంగానే ఉంది. అది తుఫాను ముందు ప్రశాంతత అనిపించింది రాంరెడ్డికి. ఇంతలో పోలీసు కమీషనర్‌ వచ్చాడు. వెంటనే రాంరెడ్డితో పాటు రిపోర్టర్లందరూ ఆయన వద్దకు వెళ్లారు. రిపోర్లను విష్‌ చేసి అమ్మాయిల వద్దకు నడిచాడు పోలీసు కమీషనర్‌. ఆయనతో పాటు వీరు నడిచారు. ఆయన్ని చూడగానే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు దగ్గరకు వచ్చారు.

''మీది మరీ టూమచ్‌ డాడీ!'' అంది ఆ అమ్మాయి.
''ఏమిటి టూ మచ్‌?'' అని అడిగాడు కమీషనర్‌.
''ఇంత పోలీసు ఫోర్సా?'' అని అడిగింది.
''మీరు ఇక్కడ వుండొద్దమ్మా! ఇళ్లకు వెళ్లిపొండి!'' అని చెప్పాడు మిగతా అమ్మాయిలతో కమీషనర్‌. ''రోజీ! నీకు కూడా అదే చెప్తున్నా!'' అన్నాడు.

మిగతా అమ్మాయిలు మాట్లాడలేదు. ''నో డాడీ! ముఖ్యమంత్రి దిగి రావాల్సిందే. రిజర్వేషన్లు తెచ్చి మాకు చిప్ప చేతికి ఇస్తున్నాడు సీయం'' అని అంది ఆవేశంగా రోజీ. ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. కమీషనర్‌ అర్థవంతంగా నవ్వాడు. రిజర్వేషన్లు మాత్రమే నిరుద్యోగానికి కారణం కాదని వీరికి అర్థమయ్యేలా చెప్పగలిగేవారెవరు అని అనుకున్నాడు రాంరెడ్డి.

''ఈ రోజు ఏమైనా జరగవచ్చు. ఎంత దూరమైన పరిస్థితి వెళ్లవచ్చు. అందుకే చెప్తున్నా'' అన్నాడు కమీషనర్‌.
''దేనికైనా మేం సిద్ధమే'' అంది రోజీ.

చేసేది లేక కమీషనర్‌ వెనుదిరిగాడు. చాలా సేపు రోడ్డు మీద బైఠాయించారు విద్యార్థులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అందులో చాలా మందికి ఇది ఒక సరదాలా, ఆటవిడుపులా వుంది. అలా గంటలు గడిచాయి. ట్రాఫిక్‌ను దారి మళ్లించారు.

సూర్యుడు నడిమెత్తి మీది నుంచి కొద్దిగా పశ్చిమానికి వంగాడు. ఎండ అంత తీవ్రంగా లేకపోయినప్పటికీ ఏదో గాలి ఆడని వాతావరణం.

ఏమైందో గానీ సెక్రటేరియట్‌లోంచి విద్యార్థుల మీదికి రాళ్లు వచ్చి పడ్డాయి. అంతే విద్యార్థులు రెచ్చిపోయారు. విద్యార్థులు రాళ్లు అందుకున్నారు. సెక్రటేరియట్‌లోకి, పోలీసుల మీదికి విసరసాగారు. సెక్రటేరియట్‌ గేట్‌ వద్దకు దూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు లాఠీలు అడ్డం పెట్టి విద్యార్థులను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు, విద్యార్థులకు మధ్య బలప్రయోగ పరీక్ష జరుగుతోంది. దాదాపు అరగంట సేపు గోడలా నిలబడి ఆపుతున్న పోలీసులను తోసుకుని పోవడానికి విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. రిజర్వేషన్లను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు హోరెత్తుతున్నాయి. సహనం పాటించాలని పోలీసు అధికారులు చాలా సార్లు మైక్‌ల ద్వారా విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎక్కడి నుంచో పోలీసు వలయాన్ని ఛేదించుకుని ఒక గుంపు సెక్రటేరియట్‌ గేట్‌ వద్దకు సమీపించింది. అంతే పోలీసలు ఒక్కసారిగా విద్యార్థుల మీద విరుచుకుపడ్డారు. దొరికినవాళ్లను దొరికినట్లు చితకబాదారు. చాలా మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడినవారిలో కమీషనర్‌ కూతురు రోజీ కూడా ఉంది.

ఇది రిపోర్టర్లకు పెద్ద వార్త అయింది. మర్నాడు పత్రికల్లో పెద్ద యెత్తున మొదటి పేజీలో విద్యార్థులపై పోలీసు జులుం అంటూ వార్త అచ్చయింది. ఇందులో పోలీసు కమీషనర్‌కు, ఆయన కూతురు రోజీకి జరిగిన సంభాషణా వివరాలు, లాఠీఛార్జీలో రోజీ గాయపడిన ఉదంతం ప్రత్యేకంగా ఓ వార్త.

ఈ లాఠీఛార్జీ వార్తతో ప్రపంచమే తలకిందులైందన్నట్లు పరిస్థితులు వేడెక్కాయి. రిజర్వేషన్‌ వ్యతిరేకోద్యమం ఊపందుకుంది. ప్రభుత్వం దిగిరాక తప్పదేమో అనిపించింది.

రిజర్వేషన్‌ వ్యతిరేకోద్యమం కొనసాగుతున్న తరుణంలోనే బీసిలు ప్రత్యేకంగా ఒక విద్యార్థి, యువజన సంఘాన్ని ఏర్పాటు చేసుకుని రిజర్వేషన్లను సమర్థిస్తూ ఆందోళనలు చేపట్టారు. అయితే ఈ ఆందోళనలకు అంతగా ప్రచారం లభించడం లేదు. రిజర్వేషన్‌ వ్యతిరేక ఉద్యమకారులపై లాఠీచార్జీ తర్వాత బీసీ విద్యార్థులు చలో సెక్రటేరియట్‌ చేపట్టారు. ఈ వార్తను సేకరించడానికి రాంరెడ్డి సెక్రటేరియట్‌ వద్ద కాపు వేశాడు. అక్కడంతా పోలీసులు మోహరించి ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X