పార్ట్-28
దాదాపు ఇరవై మంది విద్యార్థుల గుంపు యూనివర్శిటీ బస్సులోంచి దిగింది. ఆ గుంపు ఇలా దిగిందో లేదో హెచ్చరికలు, సూచనలు ఏమీ లేకుండా పోలీసులు వారిపై లాఠీలతో విరుచుకుపడ్డారు. పరుగెత్తబోయి పడిపోయిన ఇద్దరు, ముగ్గురు విద్యార్థులను లేచి పారిపోయేదాకా కొట్టారు. ఈ ధాటికి సందులూ గొందులూ పట్టుకుని విద్యార్థులు పారిపోయారు. మరో అరగంటకు వచ్చిన మరో గుంపుపై కూడా పోలీసులు అదే ప్రతాపం చూపించారు. దీని వల్ల బీసీ విద్యార్థుల ఆందోళన జరిగిందనే విషయం కూడా ఎవరికీ తెలియలేదు. అసలు అది ప్రజల దృష్టికే పోలేదు. అక్కడున్న రాంరెడ్డికి తప్ప మిగతా పత్రికలవారికి కూడా ఆ విషయం తెలియదు. దీంతో మర్నాడు పత్రికల్లో వార్తలే రాలేదు.
బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు కొట్టేసింది. రిజర్వేషన్లు పరిమితిని మించి ఉన్నాయనే సాంకేతిక కారణంతో కోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో బీసీలకు రాష్ట్ర స్థాయిలో కల్పించాలనుకున్న రిజర్వేషన్లకు తెర పడింది. పాలక పార్టీపై, ముఖ్యమంత్రిపై బీసీల్లో ఆదరణ పెరిగింది.
.................... ............................. ...................................
నిస్సహాయత, నిర్వేదం......... అంతటా పరుచుకున్న చీకటి. ఆ చీకట్లో దేవులాట. ఆశలు చిగురించని స్మశానం. ఇప్పటి వరకు తను చేసిన ప్రయాణంలో ఏదీ మనసుకు ఊరటనిచ్చేది కాదు. విశ్వాసాలు క్రమక్రమంగా సన్నగిల్లుతుండడమే కాదు మొండి విశ్వాసాలపై, మతాచారాలుగా మారిన సిద్ధాంతాలపై అసహనం కూడా పెరిగిపోసాగింది.
అప్పటికప్పుడు శివుడి దారేమైంది?. ''వద్దంటే వద్దు'' అని రాంరెడ్డి చెప్పాడు. అయినా వినలేదు. కాన్షీరామ్ నాయకత్వంలోని బిఎస్‌పిలో చేరాలని శివుడు నిర్ణయం తీసుకున్నాడు. అప్పటికే ఆ పార్టీలో మాజీ విప్లవకారులు కొందరు చేరారు. వీరందరూ దళిత నాయకులే. శివుడు కూడా విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చినవాడే. నిజానికి అతని ముదిమి ఆవహించింది. అయినప్పటికీ ఉత్సాహం చల్లారలేదు. ప్రజలందరినీ కదలించి మహోధృత జలపాతంలాంటి ఉద్యమాన్ని నిర్మించే శక్తియుక్తులు తనకు ఉన్నాయని శివుడికి అపారమైన నమ్మకం.
అజ్ఞాతంలో ఉండే నమ్మకాలకు, బయటికి వచ్చిన తర్వాత జరిగే పరిణామాలకు నిజానికి పొంతన ఉండదనేది అతనికి అనుభవంలో లేని విషయం. అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఒక మహా ఉద్యమం ముందుకు సాగుతున్నట్లు, ప్రజా సైన్యం కదను తొక్కుతూ శత్రువును చీల్చి చెండాడుతున్నట్లు అనిపించేది. ఒక్కో సంఘటన ఉద్యమం ఎదుగుదలకు ఒక్కో మెట్టులా అనిపించేది. ఆ స్థితిలోనే శివుడికి విప్లవోద్యమ నాయకుడిగా ఇక ఇమేజ్ ఏర్పడింది. విప్లవ కవిగా ఆయనకు సాటి వచ్చేవారు మరొకరు లేరు.
''మీరు అండర్‌గ్రౌండ్‌లో అంచనా వేసుకున్నట్లు ఇక్కడి ఉద్యమాలు ఉండవు. మీరు కచ్చితంగా మోసపోతారు.'' అన్నాడు రాంరెడ్డి.
శివుడి మాటలు ఎదుటివారి ముందు దృశ్యాలు కట్టి చూపిస్తాయి. ఆ కవిత్వం చదువుతుంటే దృశ్యాలు పాఠకుడి ముందు కదులుతుంటాయి. ఆయన రాసిన కవితలు, పాటలు దృశ్యచిత్రాలు.
''అదిగో నల్లసూర్యుడు వస్తున్నాడు. నువ్వు వద్దంటావేమిటి?'' అన్నాడు.
''విషయాలను సిద్ధాంతీకరించడం నాకు తెలియదు. కానీ జరుగుతున్న పరిణామాలేమిటో, జరగబోయే పరిణామాలేమిటో నాకు తెలుసు'' అన్నాడు రాంరెడ్డి.
''తెలుగు సమాజాన్ని మునుపెన్నడూ లేని ఒక కొత్త నల్లప్రవాహం ముంచెత్తుతోంది'' అన్నాడు శివుడు.
''కాన్షీరాం ఇప్పటి వరకు చేసిన దాన్ని నేను తక్కువ అంచనా వేయడం లేదు. తప్పని కూడా అనడం లేదు. కానీ అతనికి కొన్ని ఎత్తుగడలు, వ్యూహాలు ఉన్నాయి. ఇక్కడ బియస్‌పి నిలదొక్కుకోవడం- అదీ ఎన్నికల్లో బలం చూపడం సాధ్యం కాదు'' అన్నాడు రాంరెడ్డి.