వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్ట్-7

By Staff
|
Google Oneindia TeluguNews

ఏం జరిగిందో ఎవరికీ అంతుబట్టలేదు చాలాసేపు. ఊరేగింపులో పాల్గొంటున్న విద్యార్థులకు కూడా అర్థం కాలేదు మొదట. ఎన్నికల్లో ప్రగతిశీల శక్తులు ఓడిపోయి, సమాజాన్ని వేదకాలంలోకి నడిపించాలని ప్రయత్నిస్తున్న శక్తుల గెలిచాయన్న ధర్మాగ్రహమో, తాము ఓడిపోయామన్న ద్వేషమో తెలియదు గానీ విప్లవ విద్యార్థి సంఘం నాయకుడు రవికాంత్‌ జాతీయ విద్యార్థి సంఘం నాయకుడు రమేష్‌పై కాల్పులు జరిపాడు. రమేష్‌ ఈ కాల్పుల్లో గాయపడ్డాడు. గాయపడిన దేహంతోనే రమేష్‌ కాల్పులు జరిపిన రవికాంత్‌ వైపు రివ్వున దూసుకెళ్లాడు. అతని వెనక పదుల సంఖ్యలో ఆగ్రహం చెందిన జాతీయ విద్యార్థి సంఘం కార్యకర్తలు. ఆర్ట్స్‌ కాలేజీ దగ్గరున్న 'బి' హాస్టల్‌ దగ్గర మొదలైన ఉరుకులు పరుగులు యూనివర్శిటీ ఆవరణ దాటి తార్నాకాలో పడే దాకా. తను కాల్పులు జరిపితే ఏమవుతుంతో రవికాంత్‌కు తెలుసు. అందుకే కాల్పులు జరిపి రివ్వున దూసుకెళ్లిన అతను తన వెనక వస్తున్న వారికి అందకుండా తప్పించుకున్నాడు. ఈలోపల జరిగిందేమిటో అందరికీ అర్థమై పోయింది. రాబోయే ప్రమాదాన్ని గుర్తించిన విప్లవ, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఒక్కొక్కరే యూనివర్శిటీ దాటిపోయారు.

రవికాంత్‌ చిక్కకపోయేసరికి జాతీయ విద్యార్థి సంఘం కార్యకర్తలు విప్లవ, వామపక్ష విద్యార్థి సంఘాల కార్యకర్తల, సానుభూతిపరుల రూమ్‌లపై కర్రలతో, ఇతర మారణాయుధాలతో దాడి చేశారు. ఒక్కొక్క రూమ్‌లోకి అడుగుపెడుతూ తమ శత్రువులు కనిపించకపోయేసరికి రూమ్‌ల్లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేయసాగారు. కొందరు ఎటూ కాని విద్యార్థులు మాత్రం మిగిలిపోయారు. రాంరెడ్డికి ఇటువంటి అనుభవం ఇంతకు ముందెప్పుడూ ఎదురు కాలేదు. ఏం చేయాలో దిక్కు తోచలేదు. పారిపోవాలని కూడా అనిపించలేదు. మొండిగా రూమ్‌లోనే కూర్చున్నాడు. అంత మొండిధైర్యంలో గుండె భయంతో కొట్టుకుంటూనే ఉంది.

ఇంతలో తన క్లాస్‌మేట్‌ శ్రీధర్‌ రూమ్‌లోకి హడావిడిగా ప్రవేశించి, ఏమీ మాట్లాడకుండా రాంరెడ్డిని తన గదిలోకి లాక్కుపోయాడు. ఆ గదిలో అప్పటికే ఐదారుగురు విద్యార్థులున్నారు. వాళ్లందరూ తెలిసినవాళ్లే. ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు. రాంరెడ్డి ఓ మంచంపై కూర్చున్నాడు. అతని ముఖం వివర్ణమైంది. లోపల బాధగానూ ఉంది. అంతే స్థాయిలో భయమూ ఉంది.

జాతీయ విద్యార్థి సంఘం కార్యకర్తలు రాంరెడ్డి ఉంటున్న హాస్టల్‌పై కూడా దాడి చేశారు. వాళ్లు ఎంపిక చేసుకున్న గదులపై విచ్చలవిడిగా దాడి చేశారు. శ్రీధర్‌ బయటకు లోపలికి తిరుగుతున్నాడు. అతనిలో ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

దాడికి వచ్చిన గుంపు తానున్న గదిని దాటిపోయినప్పటి శబ్దం రాంరెడ్డి చెవుల నుంచి దాటిపోలేదు. వారిలో కోపం గాలిలో కలిసి తన చెవుల్లోకి చొరబడి తనలో భయాన్ని ఊదుతున్న ఆందోళన. శ్రీధర్‌ గది వెలుపల ద్వారం వద్దే ఉన్నాడు. 'నీ రూవ్లు ఎవ్వడైన ఉండారా?' ఎవరో అడగడం 'మా రూవ్లు ఎవడుంటడన్న!' అని శ్రీధర్‌ ఇచ్చిన సమాధానం లాంటి సంజాయిషీ రాంరెడ్డికి వినిపించింది. గదుల్లో చొరబడి తమ ఆగ్రహాన్నంతా ప్రదర్శించి ఆ గుంపు వెనుదిరిగి పోతుండడం కూడా రాంరెడ్డికి వినిపించింది. ఆ గుంపు వెళ్లిపోయాక శ్రీధర్‌ లోనికి అడుగు పెట్టాడు. లోనికొచ్చి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఏమీ మాట్లాడలేదు. కానీ అతని ముఖంలో అతను అనుభవించిన టెన్షన్‌ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రాంరెడ్డి వైపు ఓసారి చూసి బయటకు వెళ్లిపోయాడు.

ఆ గుంపు తాము దాడి చేసిన గదుల్లోంచి తెచ్చిన పుస్తకాలను కుప్పగా పోసి నిప్పంటించింది. ఆ మంటల్లో దాస్‌ క్యాపిటల్‌తో సహా అన్ని రకాల పుస్తకాలు దగ్ధమవుతున్నాయి. ఆ మంట చుట్టూ కవాతు చేస్తున్నట్లుగా తిరుగుతూ నినాదాలు చేస్తున్నారు. వారు చేస్తున్న నినాదాలు గాలి కన్నా వేగాంగా దూసుకుపోతూ ఒక భయానక వాతావరణాన్ని అనుభూతికి తెస్తున్నాయి. ఆ తర్వాత వాళ్లంతా వెళ్లిపోయారు. అప్పుడు మళ్లీ రూమ్‌లోకి వచ్చిన శ్రీధర్‌- ''కాల్పుల్లో రమేష్‌ గాయపడ్డాట. అతన్ని హాస్పిటల్‌లో చేర్చారట'' అని చెప్పాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X