వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీరం దాటిన నిశ్శబ్దం

By Staff
|
Google Oneindia TeluguNews

వాడ ఎడిషన్లు, వీధుల, జోన్‌ల ఎడిషన్లు వచ్చాక మహానుభావుల మరణాలు కూడా వార్డు స్థాయి వార్తలు కావడం శోచనీయం. మరో వైపు- వాసికి నిలవని వారు పేరుతో, ఊరు పేరుతో, ఇంటి పేరుతో జనరల్‌ పేజీల్లో పెద్ద స్పేస్‌ అక్రమిస్తుంటారు. ఏభై ఏళ్ల కిందటి గొప్ప వ్యక్తుల గురించి తెలిసిన- పత్రికల్లో పని చేసే మహానుభావులు తక్కువే. ఒక సంపాదకుడు ఎన్నని చూస్తాడు, సంపాదకుడు ఉన్న పత్రికల గురించే మనం మాట్లాడుకుంటున్నాం.

కవి, రచయిత, స్వాతంత్ర్య సమర యోధుడైన పొట్లపల్లి రామారావుగారి మరణం కూడా వార్త కాలేక పోవడం వల్ల సాహిత్య లోకానికి పది రోజుల ఆలస్యంగా తెలిసింది. 1917లో వరంగల్‌ జిల్లా ఘనపురం మండలం తాటికాయల గ్రామంలో జన్మించిన రామారావు హైదరాబాద్‌ స్టేటు సత్యాగ్రహుల్లో మొదటి తరానికి చెందినవారు. మిలటరీలోకి వెళ్లి తిరిగి వచ్చి గ్రామంలో స్థిరపడ్డా ప్రజోద్యమాలకి దూరం కాలేదు. సాహిత్యాన్ని సామాన్యుల కోసం రాసే క్రమంలో ఆయన కవితోక్తుల, కథల రూపంలో రచనలు చేశారు.

అనంత యాత్ర (గేయాలు), మహత్కాంక్ష (ఖండికలు), చుక్కలు (1965), చుక్కలు (1974), చుక్కల కొనసాగింపు అక్షరదీప్తి (1993), జైలు (కథల సంపుటి) (1945) ఇత్యాది అచ్చయిన రచనల కన్నా గ్రంథ రూపంలో రానివే ఎక్కువ. వాటిన సేకరించాలన్న ఆలోచన ఆయనకెన్నడూ లేదు. ఎవరినీ అడగలేదు. సేకరిస్తామన్నా విముఖతనే చూపారు. రచనల్లో బలం వుంటే నిలుస్తాయి అనే నమ్మకం. నిజానికి ఆయన రచనల్ని గొప్ప మాస్టర్‌ పీస్‌లని అనడం కుదరదు. కాని మొత్తంగా ఆయన 'రచన'లను చూస్తే ఒక విశిష్టత గోచరించక మానదు. సరళ వ్యక్తీకరణ, సాదాసీదా తనం, సమున్నత భావన, చక్కని శైలి, సరళమైన భాషా నుడికారాలు ఆయన ప్రత్యేకత. నేల మీద నిలిచి చేసిన రచనలివి. ఆయన కళ్లు భూమ్మీద ఎంత పటుత్వంగా ఉండేవో మేధోపరమైన భావనలు అంత ఉన్నతంగా వుండేవి. అందుకే ఒక నిర్మలమైన తాత్వికత ఆయన అక్షరాల్లో పొందికగా కనిపిస్తుంది. తాత్వికతని గందరగోళంగా, అరూపంగా, అస్పష్టంగా చేయడం చాలా మందికి చైతనైన పని. కాని రామారావుగారు చిన్న చిన్న పదాలతో అలాంటి భావాలను సూటిగా స్పష్టీకరించారు. ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే ఆడంబరం అంటే తెలియదు. పరుష పదం ఆమడ దూరం. గుంపులనీ, గుంపు మనస్తత్వాన్నీ, సాహిత్య సభలనీ సున్నితంగా నిరాకరించేవారు. ఎందుకంటే ప్రకృతిని ప్రేమించి దానిలో లీనం కావడం నిత్యకృత్యం. చెట్లుచేమలూ, పుట్టా పురుగుల మధ్య కాలం వెళ్లదీశారు. ప్రకృతి మౌనం అలవరుచుకున్న తపస్వి. అవసరానికి అనుగుణమైన అతి తక్కువ మాటలు మాట్లాడేవారు. తెలుగు, ఉరుదూ, ఇంగ్లీషు భాషల్లో దిట్ట. ఉరదూ, తెలుగుల్లో మాత్రం కవిత్వం రాసేవారు. వారి లేఖల నిండా కవిత్వమే. నిజంగా ఒక 'కవి' ఎలా జీవించాలో అలా జీవించారు. జీవితం కవిత్వాల మధ్య తనదైన సంయమనం సాధించారు. తన మన్‌మానే జీవించిన రామారావుగారికి మరోసారి మనిషిగా పుట్టే అవసరం లేకుండా జీవించాడు.

ఒక దినపత్రికలో నేనే రాసిన చిన్న రచనతో ముగిస్తాను. స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత పొట్లపల్లి రామారావు హైదరాబాద్‌లో అనారోగ్యంతో మరణించి శుక్రవారానికి పన్నెండవ రోజు. రామారావుగారు స్వతహాగా నిశ్శబ్దాన్ని కోరుకునే మనిషి. వరంగల్‌కు అతి దగ్గర పల్లె (తాటికాయల)లో నివసించినా ఏ మాత్రం నాగరిక ప్రభావం తనపై పడనివ్వలేదు. సాదాసీదా పల్లెటూరి వాతావరణంలో జీవించడానికే ఆయన ఇష్టపడ్డారు. నెమ్మదితనం, చక్కని హృదయ స్పందన సంపన్నత ఆయన గుణాలు. ఇవే ఆయన కవిత్వంలో ఆరబోసినట్లుండేవి. ఆయన కవిత్వ శైలి వేరు. ఎన్నో కవితోక్తులు రాశారు. సాధారణంగా కనిపించే కవిత్వ రూపం ఆయన ఎన్నడూ తీసుకోలేదు. సులభ శైలి భాషల సమ్మిశ్రణ రూపంలో భావాల్ని వెల్లడించారు. జైలు శిక్ష అనుభవించి 'జైలు కథ'ను రాశారు. అదే పేరుతో కథా సంకలనం వెలువరించారు. సామాన్యుడు మాన్యుడు కావాలని, అందుకు సాహిత్యం ఉపకరించాలని ఎన్నో పత్రికల్లో గేయాలు, కథలు రాశారు. ఆయన సాహిత్య సభల పొడ గిట్టనివాడు. మిత్రులకు చక్కని సాహిత్య లేఖల విందు చేసేవారు. ఆంధ్ర మహాసభల్లో, ప్రజా ఉద్యమాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నా ఎక్కడా తన పాత్రను, ఇమేజ్‌ను పొక్కనివ్వలేదు. సాహిత్య రంగంలో కూడా తనకు తాను ఫోకస్‌ కావడానికి విముఖులు. అందుకే ఆయన తన గ్రంథాలను ఎవరో ఒకరు కోరి పట్టుబడితే తప్ప ముద్రించలేదు. వీరి 'జనత' కవితను నాలుగు దశాబ్దాల తర్వాత ఒక సభలో పి.వి. నరసింహారావు చదివి వినిపించారు. తనలో చివరికంటా దాగిన సాత్వికతను కూడా బయటకు రానిచ్చేవారు కాదు. కాలేజీ పెట్టుకుంటామంటే తన పొలాన్ని రాసిచ్చారు. వేమన, వీరబ్రహ్మం, ఖలీల్‌ జీబ్రాన్‌ల కలయిక ఆయనది. ఆయన తీరాన్ని దాటడం మనకు నిజంగా తీరని లోటే

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X