ఎనభైలలో ప్రవహించినసముద్రం
రాత్రిపదయింది
ఆఫీసు పని పూర్తి చేసుకుని
లెక్సింగ్టన్ అవెన్యూలో రైలు దిగి
ఆకాశానికి వేలాడుతున్నభవంతుల మధ్య నుండి
వడివడిగా నడుస్తున్నాను
కుక్కలఅరుపులు లేవు
యజమానుల లాలనలో
వారి పక్కనే నిద్ర పోయుంటాయి
వీధిలోఅక్కడక్కడ
ఎవరో వదిలేసిన వస్తువుల్ని చుట్టూపేర్చుకుంటూ
నిద్ర కోసం సర్దుకుంటున్ననిరాశ్రయులు
ఉండుండి
చిరుజల్లు
చెవుల్ని చీల్చుకుంటూ ఈదురు గాలి
చలికి వణుకుతున్నాను
ఆదివారం
రోడ్లు రద్దీగా లేవు
ఎదురు చూసిన
వారాంతపు ఆనందంతీరకముందే
ఎవరూ కోరుకోని
సోమవారపు దుఃఖం
అల్లంతదూరంలో
ఒక జంట
వారి మధ్య ఒక చిన్నారి
కూతురనుకుంటాను
అరుస్తూ అతను
ఏడుస్తూ ఆమె
పాపని చెరో వైపు లాగుతున్నారు
పగలనిపించే దీపాల వెలుగులో
అంతా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది
ఉన్నట్టుండి
ఆమెను తోసి
అరుస్తూ ఏడుస్తూ ఆమె లేచే లోగా
ఆటబొమ్మని విసిరేసినట్టు
పాపను కారులో పడేసి
దూసుకుపోయాడు
ఏమిచేయాలో తెలీదు
ఆమెకి కూడా బహుశా
నిట్టూరుస్తూ ఆమె పక్కనుండే పోయాను
అయినా
ఆ రాత్రి
ఆమె అశక్తత
నా నిస్సహాయత
నన్ను మాత్రం వెంటాడుతూనేఉన్నాయి
-ముకుంద రామారావు