వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాహిత్యంలో గోడ మీది పిల్లులు

By Staff
|
Google Oneindia TeluguNews

తెలుగు కథ విస్తృతి పెరిగింది. వస్తువు వైవిధ్యం పెరిగింది. శిల్పపరంగా పెద్దగా సాధించిందేమీ లేదు. విప్లవం ఊపులో వచ్చిన కథల వాడి వేడి తగ్గింది. సిద్ధాంతానికి, ఆచరణకు వైరుధ్యం లేని కథ శిఖరంలా నిలబడిన రోజుల్లో కథారచయితలు అటో, ఇటో తేల్చుకోవాల్సిన అనివార్య స్థితి వుండేది. స్త్రీ, దళిత వాదాల నుంచి బలమైన ప్రశ్నలు ఎదుర్కున్న తెలుగు విప్లవ కథ పస తగ్గడం కథారచయితల్లో గోడ మీది పల్లివాటం పెరగడం ఏకకాలంలో జరుగుతూ వచ్చాయి. అయితే, విప్లవ కథకు ఉన్న బలహీనతలు విప్లవ కథలకున్నాయి. అవన్నీ విప్లవోద్యమం వెల్లువలో కొట్టకుపోయాయి. ఇందులో ప్రధానమైంది శిల్పపరమైన లోపం. అట్లాగే, వస్తు వైవిధ్యం పెరగకపోవడం మరో లోపం. దీనికి కారణాలు చాలానే వున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నిబద్ధత పేరుతో తమకు సంబంధం లేని ఇతరుల మేలు కోరి రచనలు చేయడం. దీని వల్ల మూస కథలు వెలువడ్డాయి. వస్తువు శిల్పాన్ని నిర్ణయిస్తుందనే విషయాన్ని గుడ్డిగా నమ్మడం వల్ల కథలు డాక్యుమెంట్లుగానే తప్ప సృజనాత్మక రచనలుగానే మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఈ రకంగా విప్లవ కథలో మొనాటనీ వచ్చాక స్త్రీవాద కథలు బలంగా వచ్చాయి. అదే సమయంలో దళిత కథలది పైచేయి అయింది. ముస్లిం మైనారిటీ కథలు చాలా తక్కువగా వచ్చాయి.

స్త్రీ, దళిత, మైనారిటీ వాదాలు ఆచరణలో సాంస్కృతికోద్యమాన్ని ముందుకు నడిపించలేక పోయాయి. మానవ సంబంధాలను మరింత బలమైన వ్యాపార సంబంధాలుగా మార్చే ప్రక్రియ వేగవంతమైందే తప్ప ప్రత్యామ్నాయ సంస్కృతిని, నిజానికి దేశీ సంస్కృతిని పరిరక్షించి ముందుకు నడిపించలేకపోయాయి. ఆ రకంగా ఈ మూడు వాదాలు అంతవరకు సాహిత్యంలో బహిష్కరణలాంటి పద్ధతికి గురువుతున్న సాహిత్యకారుల అక్కున చేరే ప్రక్రియకు దోహదపడ్డాయి. తమను తాము వ్యక్తీకరించుకునే అంటే, తమ స్వీయానుభవాలను, అవమానాలను, అణచివేతను, వివక్షను ఎత్తి చూపే పనిని బలంగానే చేశాయి. అయితే, అవి కెరీరిస్టు సాహిత్యకారులతో మిలాఖతయ్యే ప్రక్రియను ఆచరణలో పెంచి పోషించాయే తప్ప వారికి, తమకు మధ్య వుండాల్సిన పల్చటి పొరను తొలగించి వేదిక మీదికి బహిరంగంగానే ఎక్కారు.

విప్లవ సాహిత్యం కూడా దాదాపు ఇదే దిశలో నడిచింది. నిమగ్నతను కాకుండా నిబద్ధతకు విప్లవ సాహిత్యం పెద్ద పీట వేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అంటే, ఆచరణకు, సాహిత్య సృష్టికి సంబంధం లేని వాతావరణాన్ని పోషించారు. అంటే, సానుభూతిపరుల ప్రాబల్యం విప్లవ సాహిత్యంలో పెరిగింది.

ఈ కారణాల వల్ల సాహిత్యంలో గోడ మీది పిల్లులు పెరిగిపోయారు. విప్లవ సిద్ధాంతాలు వల్లిస్తూ ప్రభుత్వ, ప్రభుత్వ సంబంధ సంస్థలు ఇచ్చే అవార్డులు స్వీకరించడం ఇవాళ్ల పెద్ద తప్పుగా కనిపించడం లేదు. ఒకప్పుడు ఇలా అవార్డులు స్వీకరిస్తే పెద్ద నేరమయ్యేది. పెద్ద దుమారం చెలరేగేది. ఇప్పుడు దేనికదే అయిపోతోంది. విండోలు ఎన్నయినా ఒపెన్‌ చేసుకోవచ్చు. కవి కె. శివారెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును స్వీకరించడం, కాళీపట్నం రామారావు నిస్సంకోచంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో శాలువా కప్పించుకోవడం సజావుగా జరిగిపోయాయి. వారిని తప్పు పట్టినవారు లేరు. వారిని దూరం చేసుకున్నవారు లేరు.

కథల విషయానికి వస్తే- విప్లవోద్యమం నుంచి వచ్చినవారే దళిత, స్త్రీవాదాలను ముందుకు నడిపించారు. దీని వల్ల సాహిత్య ధోరణి మారిందే తప్ప సాంస్కృతిక రంగంలో గుణాత్మక పాత్రను తక్కువగా పోషించాయి. కవిత్వమైతే చాలు అనే ధోరణి బలపడిపోయింది. సాహిత్యమే ఇప్పుడు ఎటుండాలో తేల్చుకోలేని స్థితిని ఎదుర్కుంటోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X