వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కథా' భరిత జీవన వ్యథలు!

By Staff
|
Google Oneindia TeluguNews

'Beauty is art' అనంటే, భిన్న జీవన వైరుధ్యాలని పరిగణించడం లేదనే వాదానికి దిగుతారేమో చాలా మంది. సౌందర్యానికి విస్తృతమైన నిర్వచనం ఇస్తూ 'truth is beauty' అంటాడో మహానుభావుడు. వేదనాభరిత జీవన 'వాస్తవా'న్ని, దాని తాలూకూ పెనుగులాటని పదిహేను కథల సమాహారంగా అందించిన 'శ్వేతరాత్రులు' ఒక చక్కని art piece అని నిర్ద్వంద్వంగా చెప్పుకోవచ్చు.

గ్రీష్మంలో కాగి, ముసురు రొచ్చు బ్రతుకుల్లో రోగగ్రస్తమై, చలిలో అచ్ఛాదనాలేమిటో వణికే అడవితల్లి బిడ్డల దుర్భర జీవన దృశ్యాన్ని, వారి అమాయకత్వాన్ని దాని చాటున వటవృక్షంలా పెరిగిన మూర్ఖత్వాన్ని చిత్రించిన కథ 'జంగుబాయి'. 'బ్రతుకు ఎంత దుర్మార్గమైందో అంత దుర్మార్గాన్ని' భరించి, అన్నింటికీ కారణమవుతున్న ఆకలికి మూలమేమిటో తేల్చుకోలేక, భరించలేని యాతనతో పారిపోయి వచ్చేసిన యువకుడు, ఒక వైపు ప్రకృతి నిరాదరణ, మరో పక్క పోలీసు దౌష్ట్యం మధ్య నలిగి, విధి లేక పల్లె వదిలి వచ్చేసిన గోండు యువతి, పచ్చి బాలింతరాలైన ఆమె శరీరానికి కూడా వెంపర్లాడే మనుషులతో నిండిన ప్రపంచాన్ని; 'అమ్మడం, కొనడంలోనే తచ్చాడే బురద' ప్రపంచాన్ని మరో కథలో అద్భుతంగా ఆవిష్కరిస్తారు అల్లం రాజయ్య. 'మహాద్భుతమైన మనిషి, ఆరోగ్యవంతమైన మనిషి, మట్టి నుండి పచ్చటి మొక్కలు, పంటలు, సర్వసంపదలు సృష్టించుకున్న మనిషి సకల కలలను, సర్వ శక్తులను హరించినదెవరు?' అన్న ప్రశ్నకు సమాధానంగా 'మహాదేవుని కల'. మహాదేవుని నోస్టాల్జియా జబ్బుగా పరిగణింపబడ్తుంది. పిచ్చిగా నిర్ధారింపబడుతుంది. మనిషిని, అతని మానవీయ విలువల్నీ గుర్తించిన రచయిత అతన్ని నిమిత్తమాత్రుడ్ని చేస్తున్న శక్తుల గురించి దార్శనిక దృక్పథంతో వ్యాఖ్యానించిన మంచి కథ 'మహాదేవుని కల'.

రచయితకి ఏకపక్ష దృష్టి వుంటే ఎంతటి ప్రతిబైనా వ్యర్థమవుతుంది. Ideological గా ఒక పక్షాన నిలబడిన కథకుడు మరో వర్గపు మనోభావాల్ని వారి కోణం నుంచి పరిశీలించడం ఉదాత్తమైన విషయం. అటువంటి ఉదాత్త దృక్కోణం 'చావు విందు'లో కన్పిస్తుంది. అయితే 'ఇంట్లో అన్ని రకాల అనుబంధాలు ఆస్తితో ముడిబడి ఉన్న సంగతి విమలకు బాగా అర్థమవుతుంది....' అంటూ రచయిత వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆస్తి తెచ్చే దర్పం, అభిజాత్యాల నుండి బైటపడలేని నర్సింహారెడ్డి వంటి వారి ఘర్షణే గాని, ఆస్తి పోవడం వలన ఏర్పడిన వెలితి కాదది. 'ఈ గాడుపు దుమారంలో తనెక్కడ నిలబడాలన్నదే' ఆ వర్గపు ఈ తరం ప్రతినిధి మధుకర్‌ రెడ్డి ఆలోచన. రచయిత రఘోత్తమ రెడ్డి ఇదే సంయమనాన్ని మధుసూదన్‌ పాత్ర (జాడ) చిత్రణలో కూడా పాటించారు. ఏ వర్గం వారికైనా కూడా ఎవరి వాదం వారికుంటుందని మధుసూదన్‌ మోనోలోగ్‌ నిరూపిస్తుంది. అది సమర్థనీయమా కాదా అన్నది పాఠకుడే తేల్చుకొంటాడు. పాఠకుడి ప్రమేయాన్ని కథలో చొప్పించేలా చేయడం రఘోత్తమ రెడ్డి ప్రత్యేకత. కానీ కొన్ని చోట్ల రచయిత జోక్యం ఎక్కువవ్వడం, దాంతో సంవిధానంలో టెంపోని దెబ్బ తీయడం కూడా ఇదే రచయితలోని బలహీనత (వేటగాడి చూపులు). కేవలం బాహ్య దృష్టితోనే కొత్త పెళ్లికొడుకు క్రౌర్యాన్ని సమీర అంచనా వేయడం కూడా కొంత ఆశ్చర్యాన్ని కలగచేస్తుంది.

ఇంకా ఈ కథల్లో, అనిశ్చితులకు కారణమవుతున్న వాతావరణం, ఆ వాతావరణంలోంచి పుట్టుకొస్తున్న అసంఖ్యాక ప్రశ్నలు, సమాధానాల కోసం అన్వేషిస్తున్న మొగలి, లక్ష్మీరాజం, సుజాత తమ్ముడు.... వీరి జీవితాల్తో తాదాత్మ్యం చెందుతున్న స్త్రీమూర్తులు సావిత్రి, నీల, సుజాతలు... ఇంకా ఎందరో ప్రతిఫలిస్తారు. వీరే కాకుండా దుర్మార్గ వ్యవస్థలో భాగస్వామ్యమవుతున్న వారూ ఉన్నారు. వ్యవస్థ మీద యథాశక్తి 'నిరసన' ప్రకటిస్తున్నవారూ ఉన్నారు. ప్రశ్నార్థకమవుతున్న తమ ఉనికి కోసం తండ్రికి 'ఉరి' పెట్టే కొడుకులూ ఉన్నారు. చదివిన చదువు దోపిడీకి ఇతోధికంగా సాయపడుతూ 'మధ్యవర్తి'త్వం నెరుపుతుందని మథనపడే నాగేంద్రలూ వున్నారు. ఉత్తమ శ్రేణి కథల్లో ఒకటయిన 'మధ్యవర్తులు' కథలో, ఈనాడు విజ్ఞానం ఏ విధంగా దుఃఖ కారణమవుతుందో వివరిస్తాడు రచయిత. ప్రవాహంలోని దుర్మార్గానికి ఎదురీదాల్సే అర్జ్‌ని కలిగించేదే నిజమైన విజ్ఞానం అనుకుంటే, విజ్ఞానవంతుడైన నాగేంద్ర పడిన వేదనే ఈ కథ. చుట్టుముడ్తున్న చీకట్ల మధ్య గోరంత దీపాన్నైనా వెలిగించాలని తపించే నాగేంద్ర వంటివారు తుపాన్‌ బీభత్సానికి అస్తిత్వ పరివేదనకు, ఎడారి ఏకాకితనానికి గురి కావడం అనివార్యమవుతుంది. సమాజంలో రకరకాల హోదాల ముసుగు వేసుకున్న అమానవుల నుండి, చివరికి అర్థం చేసుకోలేని జీవిత భాగస్వామి నుండి కూడా తనకు తాను వెలియై ఒంటరిగా బ్రతికే నాగేంద్రను తల్లిపేగు పాశంతో లాగే పల్లె, విఫల ప్రేమల ముళ్ల జ్ఞాపకాలు మరింత వ్యథకి గురి చేస్తాయి. Agony ని సింపతైజ్‌ చేయడం కన్నా, పాత్ర బాధను, వ్యక్తి బాధ (being pain)గా మార్చి, పాఠకుడ్ని అందులో ఐడెంటిఫై అయ్యేలా చేయడం ఏ రచయితకైనా కష్టసాధ్యం. దాన్ని సుసాధ్యం చేశారు రచయిత. కథలోని మూడ్‌ని పాఠకుడిలో క్రియేట్‌ చేసే ప్రతిభావంతుడు అల్లం రాజయ్య. 'వేపచెట్టు చిత్రమైన ధ్వనితో కనలి కనలి రోదిస్తున్నట్లుగానే తడితడిగా ఆకులమాపుతోంది...' (బురద); 'రాత్రి నిర్దయగా ఆ ఊరి మీద పాకింది' (మహాదేవుని కల); 'ఆ సంగీతం అర్థరాత్రి నిద్రపోయినప్పుడు కుటుంబాన్ని ఒక్కతే భరించలేక తన తల్లి ఏడ్చినట్లే ఉంది' (మధ్యవర్తులు); వంటివి రాజయ్య ప్రతిభకు కొన్ని మచ్చుతునకలు. కానీ వేరే కాంటెస్ట్‌లో అన్య దృక్పథంలో రాయబడిన 'గాలివాన' కథను, ఒక అరిస్టోక్రాటిక్‌ పాత్ర (శాస్త్రి) ద్వారా బాగుందనిపించి, దానితో డిఫర్‌ అవ్వడం అనౌచిత్యం. ఇటువంటివే రచయిత సమతుల్యాన్ని దెబ్బ తీసేవి.

స్థూలంగా ఈ కథల గురించి మాట్లాడుకున్నప్పుడు వస్తుపరంగా ఎంత ప్రాముఖ్యత వున్నవో, శైలిపరంగా గొప్పవే. అయితే మంచి అవగాహన కలగజేసే ప్రతిదీ కథ కాదుకదా. 'విశాలాంధ్ర' ఎడిటోరియల్స్‌ లేదా మరో 'ప్రజాసాహితి' సంపాదకీయాలో ప్రగతిశీలమైనవి కావచ్చేమో గానీ, ప్రగతిశీల సాహిత్యం మాత్రం కాదు. అంటే హృదయ సంబంధి అయిన సాహిత్యానికి సంబంధించిన ఏ ప్రక్రియకైనా ఆర్ద్రత ముఖ్యం. అన్య ధ్వని సూచనంగా రాసిన 'వాసన' కథలోని మోకింగ్‌ స్టయిల్‌ బాగానే వుంటుంది గానీ, టచింగ్‌గా లేదనిపించింది. వర్గీకరణ లక్ష్యమేదైనా మిగిలిన కథలు మొదటి తొమ్మిది కథల తత్పతర ఒరవడి నుండి తప్పుకున్నట్లు తోస్తాయి.

ఏది ఏమైనా, ఒక్కొక్క పుస్తకమూ ఒక్కో జీవితానుభవాన్ని ఇస్తుందన్నది వాస్తవమైతే, ఒక ఉన్నత జీవితానుభవాన్ని పంచి, మానవవత్వపు విలువల్ని తరచి చెప్పిన 'శ్వేతరాత్రులు' ప్రతీ ఒక్కరు చదవవలసిన పుస్తకం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X