వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు కథ చరిత్ర పెద్దదే, కానీ...

By Staff
|
Google Oneindia TeluguNews

తెలుగు కథ చరిత్ర పెద్దదే. గురజాడతో ప్రారంభమైన తెలుగు కథ అనేక 'దిద్దుబాట్ల'తో శైలీవిన్యాసాలను, వస్తు విస్తృతిని సంతరించుకుంది. అంతర్జాతీయ వేదికల మీద అవార్డులు కూడా అందుకున్నాయి. నిజంగానే గర్వించదగ్గ స్థాయికి తెలుగు కథ చేరుకుంది. ఏ సాహిత్య ప్రక్రియ అయినా ఎప్పటికప్పుడు వికాసం చెందుతూ వుండాలి. మొదటి తరం కథకుల్లో కుటుంబ సంబంధాలను, మానవ సంబంధాలను, సామాజిక సంబంధాలను విశ్లేషించే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. ఇప్పుడు ప్రధానంగా తెలుగు రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల నుంచి కథలు వస్తున్నాయి.

ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ, తెలంగాణా కథలంటూ తెలుగు కథను నాలుగు విభాగాలుగా విడగొట్టవచ్చు. దీనికి తోడు ప్రవాసాంధ్రుల తెలుగు కథ ఒకటి వుంది. అయితే, రానురాను తెలుగు కథ ఇతివృత్తం కుంచించుకుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి గల కారణాల గురించి తెలుసుకోవడానికి ముందు తెలుగు కథ ఏయే ప్రాంతాల్లో వికాసం చెందుతూ ఏ దశకు చేరుకున్నదనే విషయాన్ని సంక్షిప్తంగా తెలుసుకోవడం అవసరం.

ఉత్తరాంధ్ర కథకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. రావిశాస్త్రి చేతి మీద అది నానా విన్యాసాలు చేసింది. పతంజలి మొదలు గంటేటి గౌరునాయుడు వరకు మంచి కథలు రాస్తూనే వున్నారు. సామాజిక సంబంధాల నిగ్గు తేల్చడంలో ఈ కథ చాలా ముందున్నది. కోస్తా ప్రాంతం నుంచి తొలి దశలో వచ్చిన కథలు ఇప్పుడు రావడం లేదు. కొడవటిగంటి కుటుంబరావు వారసత్వాన్ని స్వీకరించడంలో ఈ కథ విఫలమైంది. మారుతున్న సామాజిక పరిస్థితులను, సామాజిక అనుబంధాలను, కుటుంబ సంబంధాలను చిత్రించడంపై కథకులు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. విప్లవ, స్త్రీ, దళితవాదాల ప్రవాహాల్లో ఈ కథ కొట్టుకుని పోతోంది. ఇలా చూస్తే రచయితలు, రచయిత్రులు ఇక్కడ దండిగానే వున్నారు. కొంతలో కొంత ఆశాజనక పరిస్థితి రాయలసీమలో వుంది. రాయలసీమ రచయితలు ఈ విషయంలో ముందున్నారు. వీరు వాదాల జోలికి ఎక్కువగా వెళ్లకుండా తమ ప్రాంత సామాజిక మార్పులను, అనుబంధాలను, ఆత్మీయతలను, వెతలను చిత్రించడం మీద దృష్టి పెట్టి సఫలీకృతులవుతున్నారు.

తెలంగాణాలో కుటుంబ సంబంధాలను, మారుతున్న సామాజిక సంబంధాలను చిత్రీకరించడంలో కథ చాలా వెనుకబడి వుంది. ఉద్యమాలను చిత్రించడంలోనే అది నిండా మునిగి బయట పడలేకపోతోంది. ఒక రకంగా, ఉద్యమాలను తడమని కథలు కథలే కావనే అభిప్రాయం నెలకొని వుంది. అందుకే, కొన్ని కథలు మాత్రమే రాసిన అల్లంరాజయ్యను, తుమ్మేటి రఘోత్తమ రెడ్డిని గుర్తించినంతగా కాలువ మల్లయ్యను గుర్తించడం లేదు. కాలువ మల్లయ్య సామాజిక సంబంధాల్లో వస్తున్న మార్పులను, అందుబాటులోకి వస్తున్న ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం వల్ల సంభవిస్తున్న మార్పులను తన కథల్లో ఎప్పటికప్పుడు చిత్రిస్తూ వస్తున్నారు.

కుటుంబ సంబంధాలను, అందునా వివిధ కులాల్లోని సామాజిక సంబంధాలను చిత్రించడంలో తెలంగాణా కథ విఫలమైందనే అనుకోవాలి. అందుకే, సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా తెలంగాణా కథలో మార్పు రావడం లేదు. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ రాష్ట్రంలో ఊపందుకున్న తర్వాత చాలా మంది ఇంతకు ముందు లేని సంపదను, సౌకర్యాలను పొందుతున్నారు. ఈ స్థితిలో సామాజిక సంబంధాల్లో వచ్చిన మార్పును, వైరుధ్యాలను పట్టుకోవడంలో కథ విఫలమైంది. దీనికి ప్రధాన కారణం- సమాజంలో వస్తున్న ఆధునిక మార్పులను అన్నింటినీ వ్యతిరేకించే తత్వం రక్తంలో ఇమిడిపోవడమే. ఉద్యమాల వల్ల ఎదురవుతున్న అనుభవాలను, ఉద్యమ 'ఎదుగుదలను', తద్వారా పెచ్చరిల్లుతున్న రాజ్యహింసను, ప్రతిహింసను చిత్రించడంలోనే గొంతు దాకా కూరుకుపోయి వుంది.

సమాజంలో వస్తున్న మార్పులను మార్పులను వ్యతిరేకించే నెపంతో వాటిని పట్టించుకునే తీరిక కూడా లేకుండా పోయింది. దీని వల్ల కథ ఎదగలేకపోతోంది. విప్లవోద్యమం పతాక స్థాయిలో వుందంటున్న కరీంనగర్‌ జిల్లా నుంచే వాటి వాసనే చూడని యువతరం ఇవాళ్ల తయారవుతోంది. దీనికి కారణాలు వెతకాల్సిన అవసరం లేదా? తల్లిని పంచుకునే కొడుకులు గ్రామగ్రామాన ఇంకా వున్నారు. సంపద విషయంలో అన్నాచెల్లెళ్ల సంబంధాలు, అన్నదమ్ముల సంబంధాలు ఘోరంగా తయారయ్యాయి. ఇవన్నీ పట్టించుకోనసవరం లేని అంశాలా? వీటన్నింటినీ పట్టించుకోకపోవడానికి సాహిత్యం మానసిక పరివర్తనకు ఉపయోగపడాలనే కనీస పరిజ్ఞానం లోపించడమే ఇందుకు కారణం కావచ్చు. ఉద్యమం సఫలమైతే సమస్యలన్నీ వాటంతటవే మాయవుతాయనే మంత్రజపం కథారచయితలపై కూడా బలంగానే పని చేసింది. దీని వల్ల చాలా విషయాలు కథారచయితలకు పట్టని విషయాలుగానే వుండిపోయాయి.

ఈ విషయంలో ప్రవాసాంధ్రుల కథ కొంత మెరుగ్గా వుంది. మద్యంపాటి సత్యం, అంబల్ల జనార్దన్‌ వంటి రచయితలు మంచి కథలు రాస్తున్నారు. కథ మానవ సంబంధాలను చిత్రీకరించి మనిషి సంస్కారాన్ని పెంచాలి. ఆ సంస్కారాన్ని పెంచే కథ రావాలంటే మనకు చాలా విషయాలు కథకు ఇతివృత్తాలు కావాలి. ఈ దిశగా తెలుగు కథ సాగుతుందని ఆశిద్దాం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X