• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సాహిత్య పెద్దమనిషి - కెవిఎస్‌ వర్మ

By Staff
|

ఎప్పుడూ నవ్వు మొహంతో డిగ్నిఫైడ్‌గానూ కించిత్‌ రిజర్వ్‌డ్‌గానూ ఉండే కలిదిండి వేంకట సుబ్రహ్మణ్య వర్మ- అనే కెవిఎస్‌ వర్మను చూస్తే జర్నలిస్టని పొరపాట్న కూడా అనిపించదు. ఏ సెక్రటేరియట్‌లోనో, ఏజీ ఆఫీసులోనో సెక్షనాఫీసరుగా ఉంటూ - చీకూ చింతాలేకుండా జీవితాన్ని చిద్విలాసంగా దొర్లించేసే 'పెద్దమనిషి' లా ఉంటారాయన. అసలా బట్టతలను మినహాయిస్తే ఆ మనిషికి యాభయ్యేళ్ళని కూడా అనిపించదు. మోచేతుల కిందకి మడిచిన పొడుగు చేతుల చొక్కా - మడత నలగని పువ్వు లాంటి 'రింకిల్‌ ఫ్రీ' ఫ్యాంటూ - ఒక్క ముక్కలో చెబితే చక్కని డ్రెస్‌ సెన్స్‌తో నీట్‌ అండ్‌ టైడీగా కనిపించే వర్మది పరిసరాలకు సైతం గాంభీర్యం ఆపాదించగల అస్తిత్వం - అంటే ప్రెజెన్స్‌. 'ఈనాడు' సబ్‌ఎడిటర్‌గా పాత్రికేయ వృత్తి జీవితం ప్రారంభించి, ప్రస్తుతం వార్త న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్న కెవిఎస్‌ వర్మ స్నేహశీలి, సమాజ శ్రేయోభిలాషి.

పేపరాఫీసులో వర్మ ప్రవర్తన 'ముఠా మేస్త్రి' ని తలపునకు తెస్తుంది. అటూ ఇటూ హడావిడిగా కలదిరుగుతూ, వాళ్ళకీ వీళ్ళకీ పన్లు పురమాయిస్తూ , జరుగుతున్న కార్యకలాపాల కంజాయింపు సాగిస్తూ, చేతిలో సిగరెట్టో - పైపో ఎక్కువసేపు టేబుల్‌ మీదే ఉంచేస్తూ కనిపించే వర్మగారిని చూస్తే ఆయన మూడు దశాబ్దాలకుపైగా కథలు రాస్తున్న సీరియస్‌ రచయిత అని ఎంతమాత్రం అనిపించదు. పరిమాణంలో చిన్నే అయినా గుణంలో మిన్న అయిన కవిత్వం కూడా కొన్నాళ్ళపాటు రాశాడని అనుమానం కూడా తలెత్తదు. దాదాపు దశాబ్దంగా కాలమిస్టుగా సైతం సాహిత్య దీపారాధన సాగిస్తున్నారని ఎవరైనా చెప్పినా, ఒక్క క్షణం సందేహించాలనిపిస్తుంది.

ఆ స్థాయిలో ఉంటుంది జర్నలిస్టుగా ఆయన ఇన్వాల్వ్‌మెంట్‌. ''1969 మే నెల్లో - డిటెక్టివ్‌ రచయిత విశ్వప్రసాద్‌ ఎడిటర్‌గా ఉన్న సుహాసినీ అనే పత్రికలో నా మొదటి కథ అచ్చయింది. ఇతివృత్త 'స్త్రీ హృదయంలోని మంచితనం. మనిషికి అందం కన్నా మంచితనం ముఖ్యం అన్న మెసేజ్‌తో రాశానా కథని. రంగనాయకమ్మ రాసిన ఓ కథ - కృష్ణవేణి - ఈ కథకి ప్రేరణ అని జ్ఞాపకం. మొత్తం కథ ఉత్తరాల్లో ఉంటుం''దంటూ గుర్తు తెచ్చుకున్నారు కెవిఎస్‌ వర్మ. ''అప్పట్లో పీయూసీ పరీక్షలై ఇంట్లో తీరిగ్గా ఉన్నాను. బహుశా పద్ధెనిమిదేళ్ళ వయసుంటేందేమో. ఎలిమెంటరీ స్కూల్‌ రోజులనుంచీ పుస్తకాలుచదివే అలవాటుంది. ముఖ్యంగా 'చందమామ'. చాలాకాలం ఆ పత్రికకు రూపుదిద్దిన మహనీయుడు కొడవటిగంటి కుటుంబరావు గారన్న వాస్తవం తెలియనే తెలియదు. అదలా ఉంచితే బాల్యం నుంచీ పఠనాసక్తికి 'చందమామ' ఆలంబనగా ఉండేది. అటు తర్వాత 'ఆంధ్రప్రభ' వీక్లీ నాకు ఆసక్తినీ ప్రేరణనూ అందించిం''దని చెప్పుకొచ్చారు వర్మ.

''వాస్తవానికి నాలుగయిదు తరగతులు చదువుతుండగా పరిమితమైన వేమన పద్యాల నుంచే సాహిత్యరచనకు తొలి ప్రేరణ లభించిందని చెప్పాలి. నా తొలిరచన కూడా వేమన పద్యానికి ఇమిటేషన్‌గా వచ్చిందే. ఇప్పటికీ ఆ మహానుభావుడు నన్ను ఇన్‌స్పైర్‌ చేస్తూనే ఉన్నా''డని వర్మ కళ్ళల్లో గౌరవం మెరిపిస్తూ అన్నారు.

''మొదట్లో నేను కథలు - కవిత్వం జోడుగుర్రాల స్వారీ సాగించేవాణ్ణి. మిత్రుడు కీర్తిశేషుడు బివిఎస్‌ శాస్త్రి - మహా నగ్న, వసునేమి, హీరో తదితర పెన్‌ నేమ్స్‌తో విస్తృతంగా బహుముఖంగా రచనలు చేసిన వ్యక్తి - నాకో సలహా ఇచ్చాడు. ''వర్మ నువ్వు కధలు రాస్తేనే బావుంటుంది- ఆ దిశగా ట్రై చెయ్యమని సూచించాడు మిత్రుడు. స్వాతి మంత్లీ రెండో సంచికలో అని గుర్తు - ఆరిపోయిన ఆకలి అనే నా కథ ఒకటి వచ్చింది. అంతకుముందే స్మైల్‌ రాసిన ఖాళీసీసాలు కథ చదివి ఉన్నాను. నా కథ ముగింపు మీద స్మైల్‌ కథ ముగింపు ప్రభావం ఉంది. అందుకే నా కథ అచ్చయిన స్వాతి సంచిక తీసుకెళ్లి - అప్పట్లో రామచంద్రపురంలో ఏసీటీవోగా ఉన్న స్మైల్‌ను కలిశాను. బహుశా రచయిత అవతారంలో వెళ్లి రచయితలను కలవడం అదేమొదలు - అదే ఆఖరు కూడా'' అన్నారు వర్మ.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X