వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అశాంతి కవిత

By కె. శ్రీనివాస్
|
Google Oneindia TeluguNews

(డా. కాసుల లింగారెడ్డి కవితా సంకలనం ఎన్నాద్రికి ప్రముఖ సాహిత్య విమర్శకుడు కె. శ్రీనివాస్ ముందు మాట రాశారు. దాన్ని ఇక్కడ ఇస్తున్నాం).

బహుశా ఈ కవిలో అవధులు మీరిన రొమాంటిసిజం ఉన్నది. ఇతని స్వప్నాలు కలవరపరిచి నిద్రాభంగం చేసేవే తప్ప శాంచినిచ్చేవి కావు. విరిగిన కలలన్నీ వ్రణాలై అతని మనసుని సలుపుతూ ఉంటాయి. అరికాలి కింద అంతరాత్మను తొక్కిపడేయడం తెలియక, అద్దం ముందు అదే పనిగా సమాధానాలిస్తూ ఉంటాడు.

డాక్టర్ కాసుల లింగారెడ్డి గురించి నాకు పెద్దగా తెలియదు కానీ ఎన్నాద్రి కవి మాత్రం అంతరంగంలో ఒక చిన్న యుద్ధరంగాన్ని మోసుకు తిరుగుతున్నాడు. ఉన్న ఉనికిపై ఎడతెగని అసంతృప్తి, గాయపడిన మనసు గొంతై చేసే ఆర్తనాదం, తనను కదిలించగలిగే చిరు ఉద్వేగాలను సైతం సంభ్రమావేశాలతో ఆలింగనం చేసుకోవడం - ఈ కవిని ప్రేమాస్పదుడిని చేస్తున్నాయి. అతనొక్కడి సొంత గొడవ కాదిది, తన కాలంలో తన లాగా బతికిన, బతుకుతున్న వారందరి ఆదర్శాలను, నిరాశలను, నొప్పిని తను మాధ్యమంగా నిలబడి పలుకుతున్నాడు. అతని వేదనో సంవేదనో ఏదో ఒకటి ప్రతి ఒక్కరినీ స్పృశిస్తుంది.

ఈ కవిలో ఆదర్శాల ఆరంభయవ్వనం ఇంకా అణగారిపోలేదు. అది జీవిత ప్రౌఢిమగా అనువదితం కాకపోవడంతో అతను సమాధానపడలేక పోతున్నాడు. జీవితం మీద అతనికి చాలా ఆశ ఉంది. మానవసంబంధాల మీద, సాహచర్యం మీద అతనికి చాలా అవాస్తవమైన అత్యాశ ఉంది. అనుభవంలో అవి భిన్నంగా ఎదురుకావడంతో తీవ్రమైన నిస్పృహ ఏర్పడింది. తన ప్రవృత్తితో మరింతగా వెలిగించగలిగిన ఉన్నతమైన వృత్తికి న్యాయం చేయడం లేదన్న బాధ అతన్ని తొలుస్తున్నది. విదిలించుకోలేని సంకెల, పెగిలించుకున్న గొంతు - కలిసి ఈ కవిత్వం అయింది.

ఈ బాధ ఒక్క బొందుగులదేనా
ఈ కథంతా ఒక్క కొట్టనంపు బాయిదేనా
ఈ పరాయీకరణ విషపు కోరల్లో నేనొక్కణ్నేనా

తన గ్రామం శైథిల్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ కవి వేసుకున్న ప్రశ్నల్లో - బాధ, ఒంటరితనాన్ని గుర్తించడం ఉంది. పరాయీకరణ వ్యక్తిగత, సామూహిక స్థాయిల్లోనూ బాధిస్తుంది. కానీ, ఒక్కరమే ఆ వలలో చిక్కుకున్నట్లు భ్రమ కల్పిస్తుంది. నిస్పృహను విధిస్తుంది. మాయపొర మన నుంచి దాచిన సత్యాలను తెలియజేసే చైతన్యం అక్కడే అవసరం. లింగారెడ్డికి ఆ చైతన్యం చాలానే ఉంది.

ప్రపంచబాధల్ని భుజానెత్తుకొని
నేలతల్లి రుణం తీర్చుకుందామని
గుండెల్నిండా కవిత్వాన్ని తాగి
అడవి పుత్రుల్ని ఆలింగనం చేసుకొని - తాను ఆశయగానం చేసినవాడే. విశ్వాసం వీగిపోయిందని ఇప్పుడంటున్నా, అది పెదాల చివరి నుంచే తప్ప మనసు లోతులనుంచి కాదని అతని కవిత్వం నుంచే నిరూపించవచ్చు. సంక్షోభ సమాజపు రాచపుండు శస్త్రచికిత్సను వేగిరపరుస్తుందని అతను పదే పదే తెలుసుకుంటూనే ఉన్నాడు. రోగనిర్ధారణ తీరు మారవచ్చు. కులం వేళ్లని విస్మరించడం విషాదం అన్న ఎరుక కలగవచ్చు. కొత్తగా దారుల వేట జరగవచ్చు కానీ, గమ్యం పాత బంగారు లోకమే.

రూపాయి నన్ను కొరుక్కుతింటుంది, పీక్కు తింటుంది - అని లింగారెడ్డి అలనాడు అన్నప్పుడు ఇంకా అది ధనస్వామ్య, పరాయీకరణ నిరసన మాత్రమే. వస్తు సంభోగ సౌఖ్యం సమస్త మానవాళినీ నిర్వీర్యం చేసే వల్లకాటి అధ్వాన్న శకం ఇంకా అప్పటికి అవతరించలేదు. మనుషులు సరుకుల చేత వినియోగించబడుతున్నారని లింగారెడ్డి చెబుతున్నప్పుడు ఆ క్రమం పరాకాష్టకు చేరింది. ఇప్పుడు ప్రపంచీకరణ రాక్షసరతిలో సంక్షేమ రాజ్యం చచ్చిపోయింది. గ్రామమూ అణగారిపోయింది. మనుషులు కూడా మారిపోయారు. మారిపోతారు మరి. ఆశయాలు సంఘర్షించే వేళ, ఆశల ఇంద్రధనువుల వేటా జరుగుతుంది. విషవలయంలో చిక్కినవారందరూ స్వచ్ఛంద బందీలు కాకపోవచ్చు. గీతకు ఆవలివారంతా సుఖాలు కామించేవారే కానక్కరలేదు. కత్తి మీద సాముగా మారిన జీవితంలో అలసినవారు, అదమరిచినవారు, రాజీపడినవారు, విరమించినవారూ అందరూ ఉంటారు. పోరాడే వీరుడే కానీ, తక్కిన వారి మీద తీర్పులు ప్రకటించకూడదు.

మానవసంబంధాల్లోకి ప్రవేశించిన ప్రపంచీకరణ - మనుషులను దురాశాపరులను చేస్తుంది. ఆదర్శాలను అపహాస్యం చేస్తుంది. మార్కెట్ గా మారిపొమ్మని, మార్కెట్ పై తేలిపొమ్మని, మార్కెట్ నే కోరుకొమ్మని చెబుతుంది. వ్యవస్థ రహస్యం తెలుసుకోలేనివారిని మైకం త్వరగా వరిస్తుంది. విముఖులైనవారిని రకరకాలుగా వేధిస్తుంది. ఆత్మీయులనే పరాయివారిని చేస్తుంది. అనుబంధాలన్నీ ఆర్థికబంధాలై చిట్లి చీము కారిపోతాయి. సాహచర్యం వర్థిల్లవలిసిన ఇల్లు కూడా రాత్రి తుపాకుల మోతకు పక్షులెగిరిపోయిన గూడులా సంక్షుభితం అవుతుంది. ఇంకా నోస్టాల్జియా ఆఫ్ డ్రీమ్స్ వేధిస్తున్నవారికి వలపోతే మిగులుతుంది. ఏదీ నా అనంత విశాల విశ్వాస దీపశిఖ అంటూ తొలియవ్వనాల ప్రేమ అయిన ఆదర్శాన్ని వెతుక్కోవలసి వస్తుంది. ప్రేమానురాగపు సెలయేరుల కోసం తపిస్తే దొరికింది ఒట్టి ధనానుబంధపు ఎండమావులే అని నిస్పృహ చెందవలసి వస్తుంది.

గుండెలో గూడు కట్టుకున్న ప్రేమరాహిత్యం
గడ్డ కడుతున్న రక్తనాళాలు
ఒంటరితనపు రోహిణి తీవ్రత
ఎండిపోయిన కన్నీటి చెరువు - తో జీవితకాలమంతా నిరంతర దేవులాటలో గడుపుతున్న కవి ప్రేమరాహిత్యం ఈ వ్యవస్థ రుగ్మతని, ప్రేమతో మాత్రమే దాన్ని నయం చేయగలమని గుర్తించాల్సి వస్తుంది.

ఆదర్శాల పరిమళంతో ఇంకా ఉన్మత్తుడవుతున్న కవిని సమాజం ఉలిపికట్టెగా వేలెత్తి చూపే అవకాశం ఉంది. దానికి తాను చాలా సంజాయిషీలు ఇచ్చుకోవాలి. తన వైఖరులకు ఎన్నో సమర్థనలు వెతుక్కోవాలి. సమిష్టి జీవనాన్ని, పరోపకార జీవనాన్ని ఒకనాడు గర్వంగా ప్రకటించుకున్న మనుషులు, ఇప్పుడు పరిహాసాల మధ్య తమ గొంతును బిగ్గరగా వినిపించాలి. నది సముద్రమంత ఎదిగింతర్వాత బ్యాక్ వాటర్ లా తిరిగొచ్చి నేలతల్లి పాదాలు ముద్దాడడం విజయమెందుకు కాదు - అంటూ లింగారెడ్డి వేస్తున్న ప్రశ్న ఇప్పుడు చెలామణిలో ఉన్న విజయగాథలకు విరుగుడే. జీవితం అమ్మకానికి కాదన్న ఈ కవి నినాదం - తనను తాను సరుకు చేసుకోబోనని చేస్తున్న ప్రకటనే. బాధిస్తున్న కారణాల మీద లింగారెడ్డికి ఉన్న అసహన తీవ్రత వల్ల అతని వలపోత ఎక్కువగా కనిపిస్తుంది. కానీ, మూలకారణాలూ, కొంత పరిష్కారమూ తెలిసిన చైతన్యశీలి అతని కవిత్వంలో బలంగా వినిపిస్తూనే ఉన్నాడు. నమ్మకాల చాంతాడు తెగిపడ్డప్పుడు, బతుకు పొదుగు నుంచి డబ్బుల్ని పితుకుతున్నప్పుడు, మనిషి స్పర్శలోని కరెన్సీ వాసనకు హృదయం పొలమారినప్పుడు గుండె చెరువు నిండి కన్నీటి అలుగు దుంకిన కవిత్వానికి నమస్కరించాలని అతనికి తెలుసు. మరో వర్ణం తనతో కలిసి రానప్పుడు ఏకవర్ణ నిరసనల ఇంద్రచాపం కావాలని తెలుసు. బుడిబుడి నడకలతో నడిచివచ్చే పసివాడిని చూసి పోగొట్టుకున్న తనను తాను పొందవచ్చుననీ తెలుసు. కవిత్వం నుంచి, పుత్రపరిష్వంగం నుంచి ఊరట పొందేవారు ప్రకృతి నుంచీ, తల్లి నుంచీ కూడా ఆశ్వాసనలు పొందగలరు. తెలంగాణ మీద లింగారెడ్డి కవిత్వం అంతా గతానుబంధాల తలపోతగా, వేళ్లని బలంగా నేలలోకి అదిమిపెట్టే ప్రయత్నంగా కనిపిస్తుంది. బలంగా మనల్ని మనం ప్రకటించుకోగలిగే అస్తిత్వం ఒకటి దొరికినప్పుడు, అది నేటి అంగడి బతుకులో పెద్ద ఆలంబన అవుతుంది. ప్రపంచీకరణ పెనుగాలికి దొరికిన చిర ఆశ్రయం - అస్తిత్వం. ప్రమాదాన్ని గుర్తించిన లింగారెడ్డి - దాని నుంచి రక్షణనూ సరిగానే గుర్తించాడు.

కొన్ని వ్యక్తిగతాలు, మరికొన్ని రాజకీయాలూ అయిన ఆశాభంగాలతో గాయపడ్డ కవి వేదన ఇది. పెనుగులాటను పలికిన కవిత్వం యిది. తన మీద విధించిన ఉనికితో కవి ఎంతగా ఘర్షణ పడతాడో అతని కవిత్వం అంత సజీవంగా ఉంది.

English summary
K Srinivas on Dr Kasula Linga Reddy's anthology of Telugu poetry
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X