వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలకుర్తి ప్రయాణం

By వరవరరావు
|
Google Oneindia TeluguNews

"నిజంగా హృదయానికి ఎంతో సమీపమైనవి కూడ ఒక్కోసారి ఎంత సుదూరంగా ఉంటాయి చేతికందేంత దూరంలో ఉన్న ఆత్మీయ అనుబంధాలను కూడ ఒక్కోసారి మనం నిర్లక్ష్యం చేస్తుంటాం."

ఎన్. వేణుగోపాల్ 'పాలకుర్తి ప్రేరణ'తో నేను ఉద్నిగ్నుడయ్యాను. చరిత్ర అనుభూతి, ఉద్వేగం - విశ్లేషణ, సమాచారం - సంక్షిప్తత - ఒకచోట నా వల్ల సాధ్యం కావు గానీ తనవలెనే నేను పంచుకోవాల్సిన అంశాలు కూడ ఉన్నాయి. కాలము, దూరము రీత్యా నేను పాలకుర్తికి ఇంకా దగ్గర. నా చిన్నతనంలోనే పాలకుర్తి ఐలమ్మ వీరోచిత పోరాటం విన్నాను. అంటే మా చెవుల దగ్గర ప్రత్యక్షంగా పోరాడిన వీరవనిత. సాహిత్య విద్యార్థిగా పాల్కుర్కి సోమనాథుడ్ని చదువుకున్నాను. జాను తెలుగు భాష, దేశి కవిత్వాన్ని ప్రతిపాదించి మార్గ పద్ధతిని, ఉరుతర గద్య పద్యోక్తులను ఈసడించిన ప్రత్యామ్నాయ సాహిత్య మార్గం ఆయనది. రూపము, వస్తువు, పాఠకులు పరస్పర సంబంధం గలవని మావో కన్నా ఏడు వందల సంవత్సరాల ముందు ప్రతిపాదించినవాడు ఆయన. రాజాస్థానంలో పండితులు శ్రోతలుగా, మార్గఛందస్సులో వైదిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన నన్నయకు భిన్నంగా చాపకూడు ఏర్పాటు చేసి దేశిఛందస్సులో (ద్విపద) ఆవైదిక (వీరశైవ) సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన తిరుగుబాటు ఆయనది.

నేను కూడా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళశాల (వరంగల్) విద్యార్థిని. మాకు ఎం.ఆర్. సత్యనారాయణగారని ఇంగ్లీషు లెక్చరర్ ఉండేవాడు. (1957-60) ఆయన తల్లిభాష కన్నడం గానీ బహు భాషాకోవిదుడు. కన్నడ తెలుగు సాహిత్యాలు డొక్కశుద్ధిగా చదువుకున్నాడు.

1959లో మొదటిసారి ఆయన నుంచి విన్నాను మిత్రమండలి అనే సాహిత్య సంస్థ సమావేశంలో. "మా బసవేశ్వరుడు మీకు వీరశైవం ఇస్తే, మీ పాల్కుర్కి సోమనాథుడు మాకు శతకం ఇచ్చాడు. మీరేమో మీ విశ్వవిద్యాలయ చదువుల్లో ఆ దేశి సంప్రదాయాన్ని కొనసాగించిన వేమన, శతకకవులు, గురజాడ వంటి వాళ్లను కాక సంస్కృత సంప్రదాయాన్ని నెత్తిన బెట్టుకున్న కవుల్ని చదువుతారు. సాహిత్య చరిత్రలో వాళ్ల గురించే రాస్తారు" అన్నాడు.

ఆంధ్రప్రదేశ్ స్వర్ణోత్సవాలు, తెలుగు భాష ప్రాచీనత్వం సంరంభంలో నన్నయతో పాటు వేమన అయినా వినవస్తున్నాడు కానీ, నన్నెచోడుడు, సోమనాథుడు వినరావడం లేదు. ట్యాంకుబండు మీద విగ్రహాల్లో సోమనాథుడు లేకపోవడం ఈ విస్మరణ కారణమే.

నా హృదయానికి దగ్గరిదైన మరొక విషయం ఏమిటంటే స్వయంగా బుద్ధిస్టు అయిన వే. నరసింహారెడ్డి పాల్కుర్కి సోమనాథుని సాహిత్యం మీద బండారు తిమ్మయ్యగారి పరిశోధనల వెలుగులో పిహెచ్ డి చేశాడు. ఆయన మరణానంతరం అది అచ్చయింది. పాల్కుర్కి సోమనాథుని స్థానాన్ని సాహిత్యంలో సరిగా గుర్తించాలంటే పాలకుర్తి ఐలమ్మ దాకా ప్రత్యామ్నాయ ప్రజా దృక్పథాన్ని గుర్తించే సహృదయత ఉండాలి. ప్రభుత్వం నుంచి అటువంటి ఆదరణ ఆశించలేము గానీ భాషా, సాహిత్య ఉద్యమకారుల్లోనైనా ఆ దృష్టి లేకపోవడం విషాదం.

వరంగల్ జిల్లాలో విస్తరించి ఉన్న నెల్లుట్ల వంశీకులు బమ్మెర పోతన వారసులంటారు. మాది వీరశైవ మతం కాదు గానీ మా పూర్వీకులు ఇంటి పేరు పాలకుర్తి అని చెప్పారు. ఆ మూలాలు వెతకడానికి నేను కూడ ఎప్పుడూ పాలకుర్తి వెళ్లలేదు.

English summary
Varavara Rao 'Paalakyrthi Prayanam'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X