• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఒక ఉద్విగ్న మానస 'సంభాషణ'

By Pratap
|

Dr Kasula Linga Reddy Review
సమాజంలో వేగం పెరిగింది. అనేక మార్పులు త్వరిగతగతిన సంభవిస్తున్నాయి. పేలి చిట్లబోతున్న రంగుల బెలూన్ ఇప్పుడు చాలా ఉచ్ఛస్థితిలో ఎగురుతోంది. దాని నీడ సమాజం మీద కఫన్‌లా పరుచుకుంటోంది. వాస్తవం యొక్క శీర్షాసనమే వాస్తవంగా ప్రతిబింబిస్తోంది. మానవ మనుగడ కేవలం సంపాదన కోసం, వస్తు సంచయం కోసం, ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం, క్షణికసుఖాల స్వార్థం కోసం కుదించబడ్డప్పుడు సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు ఒక నిరంతర వేదనకు గురవుతారు. లోపల గూడు కట్టుకున్న పరివేదన బరువు భరించలేనంతగా సంచితమైనప్పుడు జ్వాలాముఖి విస్ఫోటనం అనివార్యమవుతుంది. ఇట్లాంటి సందర్భంలో ఆ వ్యక్తి రచయిత అయితే అక్షరమై రగులుతాడు. అట్లాంటి పనే అమూర్త శ్రోతల సమూహంతో కె. శ్రీనివాస్ చేసిన ఈ ఉద్విగ్న మానస సంభాషణ.

ఒక సూక్ష్మదృష్టితో పరిశీలించిన సమాజంలోని గంభీరమైన వాస్తవాలను తేలికపాటి సంభాషణ రూపంలో గాఢమైన గద్యంగా మన ముందు పరిచాడు. నేను వ్యక్తిగతంగా ఈ రకమైన వచనాన్ని ఇష్టపడతాను. అయితే, అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా భాషాశైలులను ప్రస్తావిస్తే అదేమంత ఆనందమూ, ప్రోత్సాహమూ ఇవ్వదు అని గట్టిగా నమ్మే వాళ్లలో నేను కూాడ ఒకణ్ని. ఇన్ బిట్వీన్ లైన్స్‌ని చదవగలిగిన రచయిత తన సామాజిక బాధ్యతగా వాటిని విప్పి చెప్పాల్సి వుంటుంది. అందుకనే సామ్రాజ్యవాదం విషపు పడగనీడ గురించి, బూర్జువా దోపిడీ విధానాల గురించి, పాలకవర్గాల నీతిబాహ్య, అరాచక కుతుంత్రాల గురించి, మానవ విలువలు మృగ్యమై వికృత సంస్కృతిని మూటగట్టుకున్న సమాజం గురించి నిరంతర వేదనతో రగిలే రచయిత వాస్తవికత ఏమిటో తెలిసినవారికి ఈ ఉద్వేగాలు హృదయాన్ని తాకాలని, ఉద్వేగాల్ని స్వీకరించగలిగే వారికి వాస్తవికత ఏమిటో అర్థం కావాలని తపిస్తాడు. మన శ్రీనివాస్ కూడా తన సంభాషణ ద్వారా అదే కోరుకుంటున్నాడు. గంభీరమైన, సామాజిక ప్రాధాన్యత కలిగిన విషయాలను మామూలు వచనంలో చెపితే, అది కలిగించే ప్రభావం కంటే, ఈ గాఢమైన వచనం పాఠకుడి మీద కలిగించే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో వచనకవిత్వంలో ఇమడని సిద్ధాంత చర్చను ఈ రకమైన సంభాషణలో చేసే వీలుంటుంది. అందుకనే శ్రీనివాస్ ఈ శైలిని ఎన్నుకుని ఉంటాడు.

"మంచుదుప్పటి కప్పుకొని మునగదీసుకున్న వేకువను శతకోటి కిరణాలతో సూర్యుడు నిద్ర లేపుతాడు

వేసవి కాలం పల్లెటూళ్ల మధ్యాహ్నం కొండ మీదికి లాగా బండరాళ్ల వలె అంగుళం అంగుళం కదులుతాయి

ముసురు పట్టిన వానాకాలంలో ఉదయాలు ముసుకుపోయి విరహకాలపు ఏకాంతం వలె క్షణమొక యుగంగా నడుస్తాయి" - అద్భుతమైన భావావేశంతో, చక్కటి భావచిత్రాలతో మొదలైన సంభాషణ "జీవితాన్ని సంచయనంతో, వ్యాపక సమర్థంతో నింపుకోవాలనుకున్నప్పుడు - అత్యంత ఆదిమమైన, నిసర్గమైన, సహజమైన అందాలను, ఆనందాలను, అవకాశాలను మనిషి కోల్పోక తప్పుద. అనుభవాల కోసం జరిగే వెంపర్లాటలో, వెంపర్లాటే ఏకైక అనుభవంగా మారుతుంది" - అంటూ ముగుస్తుంది. చేదైన జీవిత వాస్తవాన్ని చిత్రించడం ద్వారా పాఠకుడిలో ఆలోచనలు రేకెత్తిస్తాడు. ప్రకృతిని అదుపు చేయడమే అభివృద్ధిగా చెలామణీ అవుతున్న వైనాన్ని నిశితంగా తూలనాడుతూ ప్రకృతివైపరీత్యమైన సునామీకి మనిషే బాధ్యుడంటాడు. "కుంతాల జలపాత కన్యను విపణివీధికి పరిచయం" చేయడం పట్ల కలత చెందుతాడు.

"ఆయన తెలంగాణలోని అమాయక రైతుకు, బెంగాల్‌లోని నిరక్షరాస్యుడైన గిరిజనుడిిక కూడా తన ఆశను బట్వాడా చేయగలిగాడు. అవహరించడమే న్యాయంగా, ధర్మంగా చెలామణీ అయ్యే ప్రభువులకు అపహరణ భయాన్ని చవి చూపినందుకు కృతజ్ఞతగా ఉండకుండా ఎలా ఉండగలం? ఉన్న ఒక్క ఆశను ఎట్లా పారేసుకోగలం?" అంటూ మార్క్సిజం పట్ల అచంచల విశ్వాసాన్ని ప్రకటిస్తాడు. కాని అదే సమయంలో "వ్యవస్థలను, సమాజాలను సమూలంగా మార్చాలనుకునేవారు కూడా హింసనో, ప్రతిహింసనో ప్రధాన రాజకీయ ఆయుధంగా నిష్ఫలత్వాన్ని గుర్తించలేకపోతున్నాం" అంటూ సాధారణ విలేకరిలాగా వ్యాఖ్యానిస్తాడు. రాజ్యం హింసని ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎట్లా, ఎవరి మీద ప్రయోగిస్తుందో రచయితకు తెలియదని అనుకోలేం. ప్రతిహింస ఎందుకు అనివార్యమైందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరముందని అనుకోను. "సృష్టికర్త ఆరంభ సంశయంలో సుదీర్ఘ కాలం అలమటింటి ఉండాలి" అంటూ సర్రున మరో ధ్రువంవైపు కొట్టుకుపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. "అణ్వస్త్రతూణీతారాలను మోసుకొని లోకమంతా పహారా కాస్తున్న పోలీసులకు నువ్వు గురిపెట్టావు. కాస్ట్రో నువ్వు అద్భుతం చేశావు" అంటూ ఆ అసమాన యోధుడికి అక్షర నిరాజనాలు అర్పిస్తూ, ప్రపంచ చిత్రపటం మీద మిగిలిన ఒక్కగానొక్క వెలుగు దివ్వెను ముద్దాడుతాడు. "బహదుర్‌షా జాఫర్ లాగా అంతిమ క్షణాల్లో అతను సామ్రాజ్యవాదుల వ్యతిరేక ప్రపంచ సేనాని అయినాడ"ని సద్దాంను స్తుతిస్తాడు. "కప్పం కట్టను పొమ్మని ధిక్కరించే ఎవరికైనా కత్తిలాంటి జ్ఞాపకం సమ్మక్క" అంటూ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడేవారందరికీ తనకు ఆరాధ్యులని ప్రకటిస్తాడు.

"ఆధునిక ప్రజాస్వామ్యంలో జీవిస్తూ రాచరికపు నిరంకుశ పాలకులను గౌరవంగా స్మరించుకోవలసి రావడం విషాదం. వర్తమానంతో పోలీక కోసం స్మరించుకోవడం మరీ దారుణం" అంటూ తెలంగాణ వర్తమాన ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తాడు. మూసీనది ఉప్పొంగి హైదరాబాదుకు వరదలు వచ్చినప్పుడు ఆరవ నిజాం తన సొంత విశ్వాసాలను పక్కన పెట్టి గంగమ్మతల్లికి పూజలు చేయడాన్ని గుర్తు చేస్తాడు. జంట జలాశయాల నిర్మాణం తర్వాత, వాటి ఖర్చులు భరించడానికి ప్రజలపై విధించవలసిన చార్జీలను అధికారులు ఏడవ నిజాం ముందు పెడితే, నీరు అమ్ముకోవడానికి నిరాకరించిన ఉస్మాన్ అలీఖాన్‌ను ఉద్దేశించి "నెత్తురు పారించిన కదా అతడు" అని సెటైర్ విసురాతుడు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో మన నెత్తిన మోపబడుతున్న అనేక పన్నుల గురించి అనివార్యంగా మనల్ని ఆలోచింపజేస్తాడు. ధనయజ్ఞంగా మారిన జలయజ్ఞాల గురించి, ఆరోగ్యశ్రీ గురించి కూడా రక్షించలేని అతిసార సృష్టిస్తున్న భోలక్‌పూర్‌ల గురించి, నిర్వీర్యమైపోతున్న సంక్షేమ వ్యవస్థల గురించి వ్యధ చెందుతాడు. మిడిల్ స్కూల్ దాకా తెలుగు మీడియాన్ని అనుమతించిన నిజాం కంటే ఈనాటి పాలకులెంత ప్రజావ్యతిరేకులో గుర్తు చేస్తాడు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి స్థానిక భాషలో విశ్వవిద్యాలయ చదుపును ప్రవేశపెట్టిన ఏడవ నిజాం దూరదృష్టిని అర్థం చేసుకోకుండా, ఉర్దూ ఆనాటి రాజభాష అనేది పరిగణనకు తీసుకోకుండా తెలుగును అణచివేశాడని చరిత్రలో రికార్డు చేయడం ఎంత దుర్మార్గం? తెలుగుకు బదులు ఇంగ్లీషు ప్రవేశపెట్టిన వాళ్ల పాలకులు స్తుతించబడతారు, మన పాలకులు ప్రజావ్యతిరేక నియంతలుగా నిలబడతారు. ఎంత విడ్డూరం?

"వ్యాకరణం కుక్కిన పేను. పదాలు ఇష్టం వచ్చిన అర్థాలతో లేచిపోతున్నాయి. కష్టసమాసాలతో దుష్టవ్యవహారం చెలరేగుతున్నది. వత్తులూ, దీర్ఘాలూ, పొట్టలో చుక్కలూ నెలవులు తప్పి సెలవులు తీసుకుంటున్నాయి. బతుకులాగే... సమాజంలాగే, దేశంలాగే, ఈ పాపిష్టి ప్రపంచ లాగే భాష ఒక వట్టిపోయిన గోవు" అంటూ ప్రపంచీకరణతో అత్యంత పాజిటివ్ అర్థం కలిగిన ప్రజాస్వామిక పదాలు, అప్రజాస్వామిక పనులకు ప్రాతనిధ్యం వహించడాన్ని నిరసిస్తాడు. "సాల్వాజుడుం అంటే శాంతి సంఘం. అడవిలోంచి నక్సలైట్‌ను తీసేస్తే బాక్సైట్ వస్తుంది. భాషే కాదు సమస్త విజ్ఞానమూ తలకిందులుగా చేసే విన్యాసమే నడుస్తున్న చరిత్ర". అదివాసీలను అడవి నుంచి బేదఖలు చేసి, అపారమైన ఈ దేశ సహజవనరులను బహుళజాతి కంపెనీలకు దారాదత్తం చేస్తు్న ఈ దళారీ ప్రభుత్వాల్ని ఎదురొడ్డి, ఆదివాసీలను సమరోన్ముఖుల్ని చేస్తున్నందుకే సాల్వాజుడుం ఆవిర్భవించింది. దేశాన్ని అంగడి సరుకు చేసి అమ్ముకోవడాన్ని అడ్డుకుంటున్నందుకు, ఇవ్వాళ్ల వామపక్ష తీవ్రవాదం దేశభద్రతకు అత్యంత ముప్పుగా మారిందని మన్మోహనుడు వాపోతున్నాడు. అంగాంగ దోపిడీకి తలుపులు బార్లా తెరవాల్సి వచ్చినప్పుడు బ్యూరోక్రాట్లే దేశాధినేతలు కావడం కాకతాళీయం కాదు.

స్వప్నిక, ప్రణీతలపై ఆసిడ్ దాడి, స్వయం తీర్పరుల చేతిలో దోషుల ఎన్‌కౌంటర్లు ఈ వ్యవస్థ యొక్క అత్యంత అమానవీయ, భయానక సామాజిక ముఖచిత్రాన్ని కళ్ల ముందు నిలబెట్టినప్పుడు "ఇనుప ప్రేమల కథాచిత్రాలు కొంత, నేరాల ఘోరాల నాటకీకరణలు కొంత, ఉన్న జీవితంలోకి అడుగుపెడుతున్న ఆడపిల్లను చూసి అణచుకోలేని అసూయ కొంత - అతన్ని తీర్చిదిద్ది వుంటాయి. అయ్యా, వారు దోషులే కాదు, సంస్కృతి చేసిన చేతబడికి బలి అయి, దానవులైనారు కూడ" అంటూ ఈ సామ్రాజ్యవాద సంస్కృతి వికృతరూపాన్ని ఆవిష్కరిస్తున్నాడు.

శ్రీనివాస్ వాక్యాలను విడగొట్టి వరుసగా పేర్చుకుంటూ పోతే ఒక అద్భుత వచన కవితలాగా ఉంటుంది. ఇంతటితో ఆగిపోతే మామూలు కవి అవుతాడు. కాని శ్రీనివాస్ మంచి భావుకుడు మాత్రమే కాదు, ఒక సామాజిక బాధ్యత ప్రజా ఉద్యమాలను వెన్నంటి ఉన్న పాత్రికేయుడు, సాహిత్య విమర్శకుడు. కాబట్టే 2005 డిసెంబర్ 13 నాటి పార్లమెంటు ఉగ్రవాద దాడిని గుర్తు చేస్తూ, 11 మంది పార్లమెంటు సభ్యులు అవినీతికి పాల్పడిన సంఘటనను పార్లమెంటు మీద మరొక దాడిగా అభవర్ణిస్తూ - "అధ్యక్షా! పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ఒక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చునా?" అంటూ భ్రష్టుపట్టిన ఈ వ్యవస్థ మీద ఒక వ్యంగ్యధిక్కారంతో ముగిస్తాడు. సముద్ర తీరాన శీతాకాలపు లేయెండలో లాంగ్ డ్రైవ్‌లా సాగుతున్న సంభాషణ ఒక అనూహ్యమైన కుదుపుతో ముగిసి మనల్ని ఈ వ్యవస్థ కఠోర వాస్తవం ముంగిట నిలుపుతుంది.

- కాసుల లింగారెడ్డి

English summary
Dr Kasula Linga Reddy, a pediatrician as preffessional, has reviewed K srinivas book Sambhasana. K Srinivasm editor of Andhrajyothy daily is an eminent literary critic and journalist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X