• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హైదరాబాద్ ఎవరిది?

By Pratap
|

Maa Telangana
మన పురపాలక శాఖ మంత్రి మహీధర్ రెడ్డి ఇటీవల మన కళ్లు తెరిపించే మాటన్నాడు. వానలు పడిన ప్రతిసారీ హైదరాబాద్ రోడ్లు సెలయేర్లు కావడం, ఎక్కడి ట్రాఫిక్ అక్కడే ఆగిపోవడం అనుభవిస్తూనే ఉన్నాం. నిజాం కాలంనాటి డ్రైనేజీ వ్యవస్థనే ఇప్పటికీ ఉందని, అందువల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. అత్యంత ఆవాసయోగ్యమైన హైదరాబాద్ నగరాన్ని చేశారో అర్థం చేసుకుంటే సీమాంధ్ర పెట్టుబడిదారులు చేసిన అభివృద్ధి ఏమిటో మనకు అర్థం కావాలి.

నిజానికి, అభివృద్ధికి ప్రాతిపదిక ఏం కావాలో మంత్రిగారి మాటలను బట్టే మనం అర్థం చేసుకోవాలి. ప్రజలకు మేలు చేసి, వారి నిత్యజీవనయానానికి అవసరమైన ఏర్పాట్లు చేయడమనేది అభివృద్దికి ప్రాతిపదిక కావాలి. అలాంటి ఏర్పాట్లు హైదరాబాదు నగరంలో జరిగిన దాఖలాలు ఏమీ లేవు. నిజాం కాలంనాటి డ్రైనేజీ వ్యవస్థ మీద మనం ఇప్పటికీ ఆధారపడి ఉన్నామంటే సీమాంధ్ర పెట్టుబడిదారులు, పాలకులు చెప్పే అభివృద్ధిని నేతి బీరకాయ చందంగానే చూడాల్సి ఉంటుంది.

చాలా కాలం హైదరాబాద్ నైజాం కాలంనాటి మంచినీటి వ్యవస్థపైనే ఆధారపడింది. ఇప్పటి ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు అప్పటి నైజాం కాలంనాటివే. కొత్తగా చేసిన అభివృద్ధి ఏమైనా ఉందంటే అది, హైటెక్ సిటీ, నెక్లెస్ రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయం - ఇలా కొన్నింటిని చెప్పుకోవచ్చు. ఈ అభివృద్ధి ఏది కూడా స్థానిక ప్రజలకు గానీ, విలీనం తర్వాత హైదరాబాద్ వచ్చిన ప్రజలకు గానీ ఉపయోగపడేది ఏ మాత్రం కాదు. అటువంటప్పుడు ఆ అభివృద్ధికి అర్థం ఏమిటనేది ప్రశ్న. పైగా, ఇక్కడి వనరులు కొల్లగొట్టుకుని పోవడానికి అవసరమైన రవాణా వ్యవస్థను వారు ఏర్పాటు చేసుకున్నారు. అత్యంత ప్రాచీనమైన హైదరాబాదు నగరాన్ని చారిత్రక, పర్యాటక కేంద్రంగా మార్చడం మరిచిపోయి నెక్లెస్ రోడ్డు వంటి కృత్రిమ వినోద, వ్యాపారాత్మక ఏర్పాట్లు చేశారు.

పైగా, స్థానికులకు ఉపాధి కల్పించిన నైజాం కాలంనాటి ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటినీ ప్రైవేట్ పెట్టుబడీదారులకు కారుచౌకగా విక్రయించడం ద్వారా మరింత నష్టానికి గురిచేశారు. హైదరాబాదులోని పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టి ఇక్కడి భూములను, సంస్థాగత ఏర్పాట్లను సొంతం చేసుకున్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు తమ వెంట హైదరాబాద్కు తెచ్చింది ఏమీ లేదనే విషయం కాస్తా ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇక్కడి వనరులను వాడుకుని, ఇక్కడి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని స్థాపించిన సంస్థలే ఎక్కువ. వాటి ద్వారా లాభాలను పిండుకుని తమ సొంతానికి తరలించుకుని పోయే ప్రక్రియ మాత్రమే ఇంతకాలం సాగుతూ వచ్చిందనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

శ్రీధర్ 'మా తెలంగాణ' పుస్తకం చదువుతుంటే - ఆధిపత్య వలసవాదులు, పెట్టుబడిదారుల కుట్రలూ కుచ్చితపు వాదనలు గుండెను మెలిపెడుతూ ఉంటాయి. వారి మొండివాదనలకు విరుగుడుగా మనకు శ్రీధర్ అద్భుతమైన వాదనను, లెక్కలు పత్రాలతో సహా మన ముందుంచారు. నైజాం కాలంనాటికే ఏర్పడిన పరిశ్రమలను, వాటి ప్రజోపయోగకర కార్యకలాపాలను ఆయన మనకు తన పుస్తకం ద్వారా వినిపిస్తున్నారు.

ఇదే సమయంలో నైజాం పైశాచికత్వం అంతగా ఎందుకు ప్రచారంలోకి వచ్చిందో తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా శ్రీధర్ పుస్తకం చదవుతుంటే పెరుగుతుంది. నిజానికి, చివరి నవాబు పరదేశీ కాదు, స్థానికుడు. అతని విశ్వాసాల కారణంగా అతడ్ని పరాయివాడిగా చూడడం తగునా అనేది ఒక ప్రశ్న అయితే, అతను స్థానిక ప్రజల విశ్వాసాలను కూడా గౌరవించాడనే విషయం మనకు ఇక్కడ ఆయన చేసిన పనులను చూస్తే అర్థమవుతుంది. ఏ చక్రవర్తి లేదా రాజు నిజాం కన్నా నిరంకుశుడు కాకుండా పోయాడా అనేది ప్రస్తుతం అత్యవసరంగా అడగాల్సిన ప్రశ్న. హైదరాబాదు రాజ్యంలోని గ్రామాలపై జరిగిన దాడికి మూలకారకులు ఎవరు, ఆ దుర్మార్గాలు నైజాం ఏ స్థితిలో ఉన్నప్పుడు జరిగాయి, యూనియన్ సైన్యం దాడికి దిగిన తర్వాత జరిగిన దమనకాండ ఎంత అనే సామాజిక చరిత్ర ఇప్పటికీ రావాల్సే ఉంది. శ్రీధర్ పుస్తకం చదువుతుంటే ఇవన్నీ మన మదిలో పొరపొరలుగా ఆలోచనలు పరుచుకుంటూ పోతాయి.

నైజాం కాలంలో జరిగిన అభివృద్ధిని, ఇతర ప్రాంతాలను ఏలిన రాజుల కాలంలో జరిగిన అభివృద్ధిని ఎప్పుడైనా బేరీజు వేశారా అని ప్రశ్నించాలి ఎప్పటికప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. చేసిన దండయాత్రలు, సామ్రాజ్య విస్తరణ కార్యకలాపాలు మాత్రమే మనకు రాయల కాలంనాటి సంగతులు తెలుస్తూ ఉంటాయి. అతను జనరంజక పాలించాడని ఒక్క మాట అంటే సరిపోతుందా అని ప్ర,శ్నించుకోవద్దా అని అడగాలనిపిస్తుంది. నైజాం ఆధీనంలో ఉన్న ప్రాంతాలను, స్థానిక పెత్తందార్ల చేతుల్లో ఉన్న ప్రాంతాల మధ్య తారతమ్యాలను కూడా బేరీజు వేయాల్సే ఉంది. ఇదంతా నైజాంను సమర్థించడానికి కాదు, మన చుట్టూ అలుముకున్న వలసాధిపత్య భావనలను తొలగించుకోవడానకి పనికి వస్తుందని చెప్పుకోవడానికే. రాచరిక వ్యవస్థకు ఉండే అన్ని అవలక్షణాలు నైజాం ప్రభువుకు ఉండవచ్చు గాక, అతను కొన్ని మంచిపనులు ప్రజల కోసం చేశాడనే విషయాన్ని కూడా మనం స్మరణకు తెచ్చుకోవాలి. హైదరాబాద్ ప్రజలకు ఉచితంగా నీటి సరఫరా కల్పించాడు, విద్యా సంస్థలను ఏర్పాటు చేశాడు. మాయరోగం నగర ప్రజలను పీడిస్తుందంటే దానికి విరుగుడుగా హిందూ దేవాలయాన్ని నిర్మించాడు.

నైజాం దుష్ట కార్యాలను వ్యతిరేకిస్తూనే, అతను చేసిన మంచి పనులను కూడా చెబుతూ నిష్పాక్షికంగా చరిత్ర రచన జరగకపోవడానికి కారణం ఏమిటి, మనం ఎందుకు అలా చూడలేకపోతున్నాం అని ప్రశ్నించుకోవాలి. నిజానికి, యూనియన్ సైన్యం దాడి ద్వారా ఒక ఆధిపత్యంలోకి మరో ఆధిపత్యంలోకి తెలంగాణ ప్రజలు వెళ్లిపోయారు. ఇక్కడి ప్రజలు కుదురుగా హైదరాబాద్ రాష్ట్రంలో కుదురుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులకు విరుద్ధంగా సీమాంధ్ర ఆధిపత్యవాదులు వారి తలల మీద ఎక్కి కూర్చున్నారు. అలా సొంత గడ్డ మీద పరాయిలుగా మార్చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ వచ్చింది.

శ్రీధర్ పుస్తకం చదువుతుంటే, హైదరాబాద్ను అభివృద్ధి చేశామని చెప్పుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు హైదరాబాద్ మాత్రమే ఆటంకం అనే పెంపుడు వాదన ఎంత అర్థరహితమైందో, ఎంతగా స్థానికులనే కాదు, ఇక్కడికి వచ్చిన ఇతర ప్రాంతాల సామాన్యులను పరాధీనులుగా మార్చేసిందో అర్థమవుతుంది. సామాన్య ప్రజలను పీల్చి పిప్పి చేస్తూ, ఇది మన నగరం కాదనే ఒక వైరాగ్య భావనను పెంచే దాకా సీమాంధ్రుల పెట్టుబడిదారులు, పాలకుల వ్యవహారం కొనసాగుతూ వచ్చింది.

ఈ పుస్తక చదివిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హైదరాబాద్ ఏ మాత్ర ఆడ్డంకి కాదని, సీమాంధ్ర పెట్టుబడిదారుల బుద్ది మాత్రమేనని మనకు స్పష్టమవుతుంది. తెలుగుదేశం పార్టీ అవతరణ తర్వాత జరిగిన రాజకీయ మార్పు కూడా ఈ స్థితికి కారణం. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు చట్టసభల్లో తిష్ట వేసి తమ ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తున్న పరిణామం అది. అందుకే, తెలంగాణ ఏర్పాటు అనే ఒక ప్రజాస్వామిక ఆకాంక్షను వారు అడ్డుకుంటున్నారు. శ్రీధర్ పుస్తకం చదివితే మనకు ఈ విషయాల పట్ల ఉన్న అనుమానాలు, అపోహలు తొలగిపోయి, చిత్రం స్పష్టంగా కనిపిస్తుంది.

- కె. నిశాంత్

English summary
A journalist Sridhar Dharmasanam has written a book on Hyderabad titled 'Maa Hyderabad' (our Telangana), countering the Seemandhra leaders' claim on Hyderabad. K Nishanth reviews on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X