వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ మూడు కథలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Allam Rajaiah
తెలంగాణ కథ విస్తృతి పెరిగింది. మానవ జీవితంలోని వివిధ పార్శ్వాలను స్పృశిస్తూ అభివృద్ధి చెందుతున్నది. మునుపటిలా మూసపోసిన కథలు కాకుండా జీవితంలోని వివిధ కోణాలను తెలంగాణ రచయితలు స్పృశిస్తున్నారు. మానవ జీవితంలోని వైరుధ్యాలను ప్రతిబింబిస్తూ అద్భుతమైన చిత్రీకరణతో కథలు వస్తున్నాయి. ఈ స్థితిలో తెలంగాణలోని చేయి తిరిగిన రచయితలు ఇద్దరు రాసిన మూడు కథలు అత్యంత ప్రధానమైనవి. స్త్రీవాదం, వర్గపోరాటం అనే రెండు అంశాల దృష్ట్యా ఈ మూడు కథలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. స్త్రీపురుష సంబంధాలు, వర్గవైరుధ్యాల దృష్టితో చూస్తే ఈ మూడు కథలు కూడా మనకు తెలంగాణ గ్రామాల్లోని కల్లోలం, విద్యావంతులై గ్రామాలకు దూరమైన వ్యక్తుల ఆర్తి అర్థమవుతుంది. తుమ్మేటి రఘోత్తమ రెడ్డి రాసిన పనిపిల్ల, జాడ కథలు, అల్లం రాజయ్య రాసిన మధ్యవర్తులు కథ స్త్రీపురుష సంబంధాలను, స్త్రీపురుషుల మధ్య ఉండే వైరుధ్యాలను చిత్రీకరించడంతో పాటు వర్గ వైరుధ్యాలను విశ్లేషించాయి. ఒక విధంగా చూస్తే, ఈ మూడు కథలు దేనికదే భిన్నమైంది. పనిపిల్ల కథలో భార్యాభర్తల మధ్య తలెత్తే ఘర్షణలను చిత్రీకరించారు. అల్లం రాజయ్య మధ్యవర్తులు కథలో కూడా భార్యాభర్తల మధ్య మానసిక సాన్నిహిత్యం కొరవడడం కనిపిస్తుంది. అదే విధంగా రఘోత్తమ రెడ్డి జాడ కథలో అదే ప్రధానాంశమైంది.

పనిపిల్ల కథలో మహేంద్ర అనే పాత్ర తన భార్యతో నిత్యం ఘర్షణ పడుతూ కారణాలను అన్వేషించే మార్గంలో పయనిస్తుంది. ఇందులో భాగంగా భార్య కోసం పనిపిల్లను వెతకడానికి మహేంద్ర స్నేహితుని ఊరికి వెళ్తాడు. అదే విధంగా జాడ కథలో తెంలగాణలోని సర్వసాధారణమైన పరిస్థితుల్లో మాదిరిగానే సుజాత అనే గృహిణి పోలీసులు మాయం చేసిన తమ్ముడిని వెతుక్కుంటూ వెళ్తుంది. ఈ ప్రయాణంలో ఆణె తన భర్త మధుసూదన్‌తో తనకు ఎదురవుతున్న సంఘర్షణను నెమరు వేసుకుంటూ తన భర్తకు, తన తమ్ముడికి మధ్య ఉన్న వైరుధ్యాలను, శత్రుత్వాన్ని విశ్లేషించుకుంటూ వెళ్తుంది. అల్లం రాజయ్య మధ్యవర్తులు కథలో డాక్టర్ నాగేంద్ర తన భార్యతో నిత్యం ఘర్షణ పడుతూ తన సొంత ఊరికి బయలుదేరుతాడు. ఈ ముడు కథలు కూడా అద్భుత శిల్ప విన్యాసంతో పఠితలను చివరంటా తమతో నడిపిస్తాయి.

అయితే ఈ మూడు కథల్లో సంక్లిష్టమైన అంశాలను విశ్లేషించడానికి రచయితలు పూనుకున్నారు. ఈ రచయితలకు ఒక స్పష్టమైన సామాజిక, రాజకీయ అవగాహన ఉంది. ఈ దృష్ట్యానే వారు వర్గ వైరుధ్యాల నిగ్గు తేల్చడానికి పూనుకున్నారు. పనిపిల్ల కథలో మహేంద్ర తన భార్యతో సంఘర్షణకు వర్గపోరాట రూపం ఇవ్వడానికి పూనుకున్నాడు. తనకూ తన భార్యకూ మధ్య శత్రుపూరిత వైరుధ్యమే తప్ప మిత్ర వైరుధ్యం లేదని స్పష్టంగా తనను తాను సమర్థించుకుంటాడు. కథనంతా మహేంద్ర స్వగతంతో రచయిత నడిపించాడు. దీని వల్ల రచయిత రఘోత్తమ రెడ్డి పనిపిల్ల కథలోని మహేంద్ర పాత్రను బలపరుస్తూ వచ్చిన విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

మహేంద్ర లోపాలను చిత్రీకరించడంలోనూ, మహేంద్ర భావజాలపరంగా ఎదిగే క్రమాన్ని ఎత్తి చూపడంలోనూ రచయితకు దృష్టి లేదని కథను చదువుతూ వెళ్లే పాఠకులకు అర్థమైపోతుంది. మహేంద్రలో పరస్పర విరుద్ధ భావాల మధ్య సంఘర్షణ జరుగుతున్నట్లుగా కథ నడుస్తుంది. కానీ, మహేంద్ర వివిధ సందర్భాల్లో ప్రకటించే నిర్ణయాలను బట్టి ఆ పాత్రను పూర్తి చైతన్యం పొందిన పాత్రగానే రచయిత మలిచినట్లు అర్థమవుతుంది. ఈ దృష్ట్యా పనిపిల్ల కథ స్త్రీవాద వ్యతిరేకమైనదే.

ఈ రచయిత రాసిన చావువిందు కథను చదివితే రచయిత పనిపిల్ల కథలో ఎవరి వైపున్నాడో స్పష్టంగా తెలుస్తుంది. చావు విందు కథలో తన భూముల ఆక్రమణకు భూస్వామి పడే ఆవేదననూ, ఆ కుటుంబ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారు. అయితే పాఠకులు ఆ భూస్వామి వ్యధతో మమేకం కారు. బాధితుల పక్షాన, తెలంగాణ ఉద్యమాల పక్షాన ఉండేవారందరూ రచయిత భూస్వామిని బలపరుస్తున్నట్లు ఎక్కడా అర్థం చేసుకోరు. దీన్ని బట్టి రచయిత శిల్పనైపుణ్యం, కథను నడిపించిన తీరు ఎంత అద్భుతమైందో అర్థమవుతుంది. అయితే ఇదే దృక్కోణంతో చూస్తే పనిపిల్ల కథలో రచయిత స్పష్టంగా కన్స్యూమర్ వస్తువులపై మక్కువ చూపే మహేంద్ర భార్యను దోపిడీ చేసే వర్గానికి చెందిన స్త్రీగా స్పష్టమైన అవగాహనతోనే చిత్రీకరించారనిపిస్తుంది.

జాడ కథ విషయానికి వస్తే, "వాన్ని ఇక ఈ జన్మకు చూడగలుగుతానో లేదో, వాడెక్కడున్నాడో" అని తమ్ముడి కోసం వెతుక్కుంటూ వెళ్లే సుజాత పూర్తి చైతన్యం పొందిన స్త్రీలా కనిపిస్తుంది. తన భర్త మధుసూదన్‌తో తనకు పొత్తు కుదరకపోవడాన్ని కూడా ఆమె విశ్లేషించుకుంటుంది. ఇద్దర మధ్యా గొడవలు, అసంతృప్తులూ ముదిరిపోయి ఇద్దరి మధ్య దూరం పెరిగిపోవడాన్ని కూడా ఆమె అర్థం చేసుకుంటుంది. అరెస్టు అయిన తమ్ముడు బతికున్నాడో లేడోనని మథనపడుతూ అతని జాడ కోసం బయల్దేరిన సుజాత నిజానికి పూర్తిగా విప్లవోద్యమాల వైపు ఉన్న స్త్రీ కాదు. అట్లాగే తన భర్త మధుసూదన్ విప్లవ వ్యతిరేకి. ఇదే సమయంలో సుజాత తమ్ముడు అజ్ఞాత ఉద్యమకారుడు. ఈ స్థితిలో సుజాత తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన తమ్ముడి కోసం సాధారణ స్త్రీల మాదిరిగానే మథనపడుతుంది. తమ్ముడి జాడ కోసం అనేక కష్టనష్టాలు ఓరుస్తూ ముందుకు సాగుతుంది.

ఇదే సమయంలో సుజాత ఎక్కడికి వెళ్లిందో అనే తపనతో ఆమె భర్త కూడా ఆమె వెనుకే ఆమెను వెతుక్కుంటూ బయల్దేరుతాడు. దీన్ని బట్టి మధుసూదన్ సుజాతలు ఒకే వర్గానికి చెందినవారని, ఒకే చైతన్య స్థాయి కలిగినవారని అర్థం చేసుకోవచ్చు. అయితే, సర్వసాధారణంగా కుటుంబంలో స్త్రీపురుషుల మధ్య ఉండే వైరుధ్యాలే ఈ రెండు పాత్రల మధ్యా ఉన్నాయి. అయితే ఈ కథలో రచయిత స్త్రీవాద వ్యతిరేకిగా ఎక్కడా కనిపించడు. పరిస్థితిని నిష్పక్షపాతంగా వివరించే అభివృద్ధికర రచయితగా పాఠకుల ముందు నిలబడుతారు.

ఇక అల్లం రాజయ్య మధ్యవర్తులు కథలో కూడా భార్యాభర్తల మధ్య సంఘర్షణ కనిపిస్తుంది. ఈ కథలోని డాక్టర్ నాగేంద్ర భార్య సులోచన పనిపిల్ల కథలోని మహేంద్ర భార్య వంటిది. నాగేంద్రతో కూడా మహేంద్ర పాత్ర సరిపోలుతుంది. ఒక విధంగా మధ్యవర్తులు కథలో నాగేంద్ర పడిన మానసిక సంఘర్ణణ పనిపిల్ల కథలో మహేంద్ర పడుతాడు. అయితే నేర్పంతా రచయిత కథను నడిపించడంలో ఉంది. ఇక్కడ తాను ఏ వర్గానికి చెందినవాడో ఆ అట్టడుగు వర్గానికి దూరమైన తీరును, ఆ ఊరికి తన వారికి దూరమైన పరిస్థితిని సంఘంలో హోదా పెరిగినప్పటికీ లభించని తృప్తిని, తన వృత్తి ద్వారా డబ్పులు సంపాదిస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ తృప్తి పొందని భార్య నుంచి ఎదురయ్యే ఆటుపోట్లను నాగేంద్ర తట్టుకోలేకపోతుంటాడు. అయితే తప్పంతా నాగేంద్ర తన భార్య మీదనో, మరెవరి మీదనో నెట్టేయలేదు.

తాను ఏ విధంగా తన వర్గానికి దూరమై రాజ్యప్రయోజనాల కోసం ఉపయోగపడుతున్నాడో నాగేంద్ర స్పష్టంగానే అర్థం చేసుకున్నాడు. అందువల్ల మధ్యవర్తులు కథలో పనిపిల్ల కథలోని మహేంద్ర తన భార్యపై వేసే నిందలను నాగేంద్ర తన భార్యపై వేయలేకపోయాడు. తను ఎటు వైపున్నాడో కూడా నాగేంద్ర అర్థం చేసుకున్నాడు. నాగేంద్రలో పనిపిల్ల కథలోని మహేంద్రకున్న హిపోక్రసీ లేదు.

మనలాంటి దేశాల్లోనైతే సకల అధికారులకూ, దోపిడీకీ ఈ చదువుకున్నవాళ్లే మధ్యవర్తులు, గవర్నమెంట్ భాషలో చెప్పాలంటే వీళ్లే యంత్రాంగం అని నాగేంద్ర స్పష్టంగా తనను తాను విశ్లేషించుకుని స్పష్టం చేయగలుగుతాడు. అయితే పనిపిల్ల కథలో కరువుదాడిలో పాల్గొన్న పనిపిల్ల ద్వారా మహేంద్ర అసలు నిజమేమిటో అర్థమైపోయినట్లు సంపూర్ణ వ్యక్తిగా చిత్రీకరించబడ్డాడు. అందుపల్ల పనిపిల్ల కథలో మహేంద్రను కాకుండా రచయిత రఘోత్తమరెడ్డిని తప్పుగా అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది.

జాడ కథలోనూ, చావు విందు కథలోనూ తన దృక్పథాన్ని అత్యంత సమర్థతతో ప్రదర్శించగలిగిన రఘోత్తమరెడ్డి పనిపిల్ల కథలో కూడా అదే సమర్థతను ప్రదర్శించారు. అందువవ్ల పనిపిల్ల కథలో మహేంద్ర భావజాలపరంగా చైతన్యం పొందుతున్న పాత్ర కాదు. రచయిత మహేంద్ర పాత్ర ద్వారా స్త్రీవాదాన్ని కొట్టివేయడానికి ఎత్తుగడ వేశారు.

- కాసుల ప్రతాప రెడ్డి

English summary
The three Telugu short stories written by two writers Thummeti Raghotham Reddy and Allam Rajaiah are important in Feminist angle. Raghotham Reddy's Panipilla story undrmines the feminist angle when compared with his own story Jaada and Allam rajaiah's short story Madhyavartyhulu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X