వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాహిత్యం: స్థానీయత, ప్రపంచీకరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
'ప్రపంచీకరణకు ప్రత్యామ్నాయం స్థానికీకరణే. తమ ప్రాంత ప్రయోజనాలు, సాంస్కృతిక భిన్నత్వాల కోసం పోరాడే వారందరికీ ఇదే తారకమంత్రం కావాలి. ఇందు కోసం ఐక్య కార్యాచరణకు నడుం బిగించాలి' - గుస్తావో ఎస్తెవ

గత పదేళ్లుగా వెలువడుతున్న తెలంగాణ సాహిత్య విశ్లేషణకు ఆ సూత్రమే ప్రాతిపదికగా పనిచేస్తున్నది. అయితే స్థానీయత అనే అంశాన్ని నిర్ధారించడానికి కొలమానాలేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జాతి దానికి ప్రాతిపదిక అవుతుంది. జాతిని నిర్ధారించే అంశాలు సహజ భౌగోళిక పరిస్థితులు, ప్రాచీనత, పాలనా విభాగం - చారిత్రక క్రమం, భాష, సంస్కృతి. ఈ ఐదు అంశాలను జాతి నిర్ధారణకు ప్రాతిపదికగా తీసుకోవాల్సి వుంటుంది. భాషను ప్రాతిపదికగా తీసుకున్నప్పుడు మాత్రమే మూడు తెలుగు ప్రాంతాలను ఒక జాతిగా పరిగణించడానికి వీలవుతుంది. బహుశా ఈ ప్రాతిపదిక మీదనే వరవరరావు 'తెలుగు ప్రజలు - తాము ఒకే జాతి, ఒక భాషీయులు అయినా - రెండు రాష్ట్రాలుగా విడిపోవచ్చు' (తెలంగాణ వ్యాసాలు పుస్తకంలోని చిన్న రాష్ట్రాల ఆలోచన హిందూత్వ, ప్రపంచబ్యాంకు కుట్రలో భాగమా? వ్యాసం) అని అన్నారు. తెలంగాణ అస్తిత్వ ఉద్యమం మొదలైన తర్వాత తెలంగాణ మేధావులు తమది ప్రత్యేక భాష అనే వాదాన్ని ముందుకు తెచ్చారు. ఆ రకంగా తమది ప్రత్యేక జాతి అని ప్రకటించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భాష విషయంలో తెలంగాణ మేధావుల వాదనను పక్కన పెట్టినా మిగతా నాలుగు అంశాల విషయంలో ఇతర తెలుగు ప్రాంతాలకు తెలంగాణతో సాపత్యం లేదనే వాదనను అంగీకరించాల్సి వుంటుంది.

'తెలంగాణ తోవలు' పుస్తకంలోని 'జాతి వేరు, నీతి వేరు' అనే వ్యాసంలో వేణుగోపాల్‌ తెలంగాణ జాతి వేరనే అభిప్రాయాన్ని స్థాపించడానికి ప్రయత్నించారు. మిగతా తెలుగు ప్రాంతాలకు తెలంగాణ ఎలా భిన్నమైందో వివరిస్తూ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి 'తెలంగాణ సెంటిమెంట్‌ కాదు, చారిత్రక వాస్తవం' (మన తెలంగాణ, 17 సెప్టెంబర్‌ ప్రత్యేక సంచిక, 2006) అనే వ్యాసంలో చేసిన నిర్ధారణను బట్టి తెలంగాణ ప్రత్యేక జాతి అని చెప్పడానికి వీలవుతుంది. అయితే తెలంగాణను ప్రత్యేక జాతి అని ఆయన అనలేదు. జాతి లేదా ఉపజాతి అనవచ్చనేమో అనే సందిగ్ధతకు ఆయన లోనయ్యారు. కానీ పై అయిదు అంశాల్లోనూ మిగతా తెలుగు ప్రాంతాల కన్నా తెలంగాణ ఎలా భిన్నమైందో, ప్రత్యేకమైందో ఆయన సోదాహరణంగా వివరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమాన్ని పరిగణనలోకి తీసుకుంటే కూడా మిగతా తెలుగు ప్రాంతాలను మినహాయిస్తున్నందున దీన్ని ఒక ప్రత్యేక అస్తిత్వంగానే గుర్తించాల్సి వుంటుంది.

తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమం భాషాప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాలన్నీ ఒక్కటే, ఈ ప్రాంతాలన్నీ ఒకే సమాజం అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నది. ఈ ఉద్యమం తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో భాగంగా సాగుతున్న తెలంగాణ భాషా పరిరక్షణ అంశాన్ని తనలో ఇమిడ్చుకోవడం లేదు. ఈ రీత్యా తెలంగాణ భాష గానీ, తెలంగాణ సాహిత్యకారులు గానీ దానికి వెలుపలనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో అద్దేపల్లి ప్రభు రాసిన 'పారిపోలేం' కవితా సంకలనాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. ఆయన స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ ఆయన కవిత్వమంతా తెలుగు సాంస్కృతిక ఉమ్మడి లక్షణాన్ని వ్యక్తీకరించే ప్రయత్నం చేసింది. అదే సమయంలో అమెరికా అగ్రరాజ్య ఆధిపత్య నిరసనలో ఇరాక్‌, అఫ్ఘనిస్తాన్‌ వంటి దేశాల సంస్కృతిలో గల ఏకరూపతను వ్యక్తం చేసే ప్రయత్నం కూడా చేసింది. ఆ రకంగా సామ్రాజ్య వ్యతిరేకతకు ఒక ఉమ్మడి సాంస్కృతిక నేపథ్యాన్ని అందించే ప్రయత్నం చేసింది. (ఈ కవిత్వాన్ని ఈ కోణంలోంచి విశ్లేషించినవారు లేరు. అద్దేపల్లి ప్రభు కవిత్వంలోని పాఠక ప్రతిస్పందనకు మూలం బహుశా అందులోనే వుంది). ఆంధ్రప్రదేశ్‌ అవతరణను తెలంగాణకు చెందిన దాశరథి, కాళోజీ వంటి కవులు, ముదిగంటి సుజాతారెడ్డి వంటి నవలాకారులే కాకుండా సురవరం ప్రతాపరెడ్డి కూడా ఆహ్వానించడానికి ప్రాతిపదిక అక్కడే వుంది.

పాలనాపరంగా అన్ని తెలుగు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రూపంలో ఏకమైనప్పటికీ భౌగోళిక, ప్రాచీన, భాష, సంస్కృతుల విషయంలో భిన్న అస్తిత్వాలుగానే కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించారు కాబట్టే కాళోజీ ప్రస్తుత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని బలపరిచారు. ఇదే విషయాన్ని యశోదారెడ్డి కూడా గుర్తించారు. ''... తెలుగువారందరేకమై విశాలాంధ్రగా రూపొందినారు. కానీ ఈ రెండు ప్రాంతీయ భాషలకు సమన్వయము కుదరలేదు'' అని పి. యశోదారెడ్డి 1973లోనే 'మా వూరు ముచ్చట్లు' పుస్తకానికి తాను రాసుకున్న 'ఒక మాట' అనే పీఠికలో అన్నారు. తెలుగు ప్రాంతాలన్నింటినీ ఒకే జాతిగా, లేదంటే ఒకే సమాజంగా గుర్తించడానికి, నమ్మడానికి, ఆచరింపడానికి చేసిన ప్రయత్నాలేవీ తెలంగాణ ప్రాంత ప్రజల ఉనికి అన్ని రంగాల్లో ప్రమాదంలో పడుతూ వస్తున్నది. రెండు అసమ సమాజాలనే విషయాన్ని జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా గుర్తించారు. ఇలా చూసినప్పుడు తెలంగాణ స్థానికత మిగతా తెలుగు ప్రాంతాలకు భిన్నంగానే వ్యక్తమవుతున్నది.

తెలంగాణ ప్రస్తుతం పాలనాపరమైన విభజన కోసం పోరాడుతున్నదంటే భాష, సంస్కృతి, ప్రాచీనత, భౌగోళిక ప్రత్యేకతలను చాటుకునే ఆత్మగౌరవ అస్తిత్వాన్ని నిలబెట్టుకోడవడానికి పోరాడుతున్నట్లే. తెలుగు సాహిత్యంలో గత పదేళ్లుగా ఈ వ్యక్తీకరణలు వివిధ రూపాల్లో బయటపడుతూనే వున్నాయి. ముదిగంటి సుజాతారెడ్డి 'తొలి తరం తెలంగాణ కథలు', ఆ తర్వాత సంగిశెట్టి శ్రీనివాస్‌తో కలిసి వెలువరించిన 'తొలినాటి తెలంగాణ కతలు', జూలూరి గౌరీశంకర్‌ సంపాదకత్వంలో వెలువడిన 'పొక్కిలి' కవితా సంకలనం, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, అంబటి సురేంద్రరాజు సంపాదకత్వంలో వెలువడిన 'మత్తడి' కవితా సంకలనాలు, కర్ర ఎల్లారెడ్డి వెలువరిస్తున్న 'తెలంగాణ కథా వార్షికలు', సుంకర రమేష్‌, అన్వర్‌ వెలువరించిన 2006 కవితా వార్షిక వంటివాటిని స్థానీయతను భౌగోళిక, సాంస్కృతిక, భాషాపరమైన అంశాల్లో స్థాపించుకోవడానికి జరిగిన కృష్టిగానే గుర్తించాలి. ఈ స్థానీయ ఆకాంక్షను, వ్యక్తీకరణను సంతృప్తిపరచడానికే విశాలాంధ్ర 'తెలంగాణ కథలు' సంకలనాన్ని వెలువరించిందని అనుకోవాలి. నవలా సాహిత్యంలో ఈ స్థానిక అంశాన్ని పి. లోకేశ్వర్‌ 'సలాం హైదరాబాద్‌' నవల బలంగా వ్యక్తీకరించింది.

తెలంగాణకు సంబంధించిన భౌగోళిక, సాంస్కృతిక, భాషాపరమైన అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటే ప్రపంచీకరణకు తెలంగాణ అస్తిత్వ ఉద్యమం ఒక బలమైన ఆచరణాత్మక పోరాట రూపాన్ని అందిస్తుందనే విషయాన్ని గుర్తించకతప్పదు. ఈ స్పృహతోనే తెలంగాణ అస్తిత్వ ఉద్యమం సాగుతున్నది. స్థానికతను ఒక ప్రధానాంశంగా మొదట వ్యక్తీకరించింది నీలగిరి సాహితీ సంస్థ వెలువరించిన 'బహువచనం' కవితా సంకలనం. భాష, సంస్కృతి, భౌగోళిక అంశాల్లో స్థానీయతను ఒక ప్రధానమైన అంశంగా ఈ కవులు గుర్తించారు. ఆ తర్వాత గోసంగి వెలువరించిన 'మేమే' కవితా సంకలనం అత్యంత విశిష్టమైన స్థానీయ దృక్పథంతో వెలువడింది. విప్లవోద్యమంలో భాగంగా స్థానీయత వ్యక్తమైన సందర్భాలున్నాయి. అయితే వాటిని తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వంగా చెప్పలేం. తెలంగాణలో 1970 థకంలో ముందుకు వచ్చిన కవులను విప్లవోద్యమం ప్రభావితం చేసింది. ఆ విప్లవోద్యమ స్ఫూర్తితోనే 1990 థకం వరకు జూకంటి జగన్నాథం, సుంకిరెడ్డి నారాయణరెడ్డి వంటి కవులు కవిత్వం రాశారు. విప్లవ కవిత్వంలో భాగంగా వారు తెలంగాణ స్థానీయతను వ్యక్తం చేశారు. ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వాన్ని బలంగా, విస్తృతంగా వెలువరించిన కవి జూకంటి జగన్నాథం. తెలంగాణ స్థానిక వ్యక్తీకరణలను, భాషాప్రయోగాలను ఆయన కవిత్వ శైలికి బలంగా వాడుకున్నారు. విప్లవ కవిత్వంలో ఇటువంటి ప్రయత్నం విస్తృతంగా జరిగింది. సలంద్ర, గద్దర్‌ వంటి కవులు దళిత సాంస్కృతిక అంశాలను తమ కవిత్వంలో వ్యక్తీకరించారు. అంత మాత్రాన ఆ కవిత్వాన్ని దళిత కవిత్వంగా పరిగణించలేం. కవిత్వంలో తెలంగాణ అస్తిత్వ స్పృహను శిరసు (శివకుమార్‌, గుడిహాళం రఘునాథం, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి) వెలువరించిన 'నల్లవలస' బలంగా వ్యక్తీకరించింది. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి 'తోవ ఎక్కడ' కవితా సంకలనం వరకు పరిష్కారాలను, ఉద్యమాచరణలను విప్లవోద్యమంలో భాగంగానో, దళితోద్యమంలో భాగంగానో చేశారు. 'దాలి' దీర్ఘకావ్యం నుంచి ఆయన తెలంగాణ స్థానిక ఉద్యమ కవిత్వాన్ని ఒక ప్రాపంచిక దృక్కోణం నుంచి చూడడం ప్రారంభించారు. గ్యార యాదయ్య 'ఎర్కోషి', ఎం. వెంకట్‌ 'వర్జి' దీర్ఘకవితల్లో తెలంగాణ స్థానీయత అత్యంత బలంగా వ్యక్తమైంది.

తెలంగాణను ఒక ప్రత్యేకమైన అస్తిత్వంగా గుర్తించి అంతర్గత వలసాధిపత్యాన్ని వ్యతిరేకించాల్సిన అవసరాన్ని తెలంగాణ కవులు గుర్తించిన తర్వాతనే తెలంగాణ స్థానికోద్యమం సారంలో బలం పుంజుకుంది. ఆ వలసాధిపత్యాన్ని 'తెల్లోని మారేశం' అని పసిగట్టారు. సామ్రాజ్యవాద ప్రపంచీకరణను వ్యతిరేకించే క్రమంలో అమెరికా, దాని సహచర ఆధిపత్య దేశాలకు దళారులుగా పనిచేస్తున్న కోస్తాంధ్ర ఆధిపత్య పాలకవర్గాలను వ్యతిరేకించాలనే ఎరుకను తెలంగాణ కవులు సంతరించుకున్నారు. తెలంగాణ స్థానిక ఉద్యమం ప్రపంచీకరణకు సమాధానం చెప్పే ప్రపంచీకరణ వ్యతిరేకో ద్యమంగా సాగుతున్నదని ప్రకటిస్తున్నారు. ఈ దృక్పథంతోనే 'తెలంగాణ' (జూలూరి గౌరీశంకర్‌), 'యాది - మనాది' (అల్లం నారాయణ), గుక్క (కాసుల ప్రతాపరెడ్డి) వంటి దీర్ఘకవితలు వెలువడ్డాయి. జూకంటి జగన్నాథం వంటి కవులు స్పష్టమైన దృక్పథంతో తెలంగాణ కవిత్వాన్ని వెలువరిస్తున్నారు. అన్నవరం దేవేందర్‌ 'మంకమ్మతోట లేబర్‌ అడ్డా', కాసుల లింగారెడ్డి 'ఎన్నాద్రి' వంటి కవితాసంకలనాలు తెలంగాణ కవిత్వ దృక్పథాన్ని స్పష్టంగా పట్టిస్తాయి.

సామ్రాజ్యవాద ప్రపంచీకరణను వ్యతిరేకించడానికి వామపక్ష సాహిత్య ఉద్యమాలు పరిమితులకు లోనవుతున్నాయి. సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు వ్యతిరేకంగా స్థానికతను నిలపడానికి ముందుకు రావడం లేదు. అదే వాటి పరిమితి. అందువల్లనే సామ్య్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడానికి థాబ్దాలుగా ఎంచుకున్న అమూర్త పోరాట రూపాలనే ప్రపంచీకరణను వ్యతిరేకించడానికి ముందుకు తెస్తున్నాయి. సాంస్కృతిక రంగంలో భిన్నత్వాన్ని చాటే ఆచరణాత్మక తెలంగాణ స్థానిక అస్తిత్వ ఉద్యమాన్ని అవి వ్యతిరేకించడానికి కారణం కూడా ఆ పరిమితిలోనే వుంది. ఈ రకంగా చూసినప్పుడు ఇతర తెలుగు ప్రాంతాలు పాలనాపరంగా, భౌగోళికంగా, సాంస్కృతికంగా భిన్నత్వాన్ని చాటుకుంటూ అన్ని రకాల ఆధిపత్యాలను వ్యతిరేకిస్తున్న తెలంగాణ అస్తిత్వ ఉద్యమాన్ని బలపరచాల్సి వుంది.

- కె. నిశాంత్

English summary
K Nishanth proposes localization to counter globalization. He explained how Telangana literature is expressing local culture and how it will anti globalization in content abd form.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X