• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణ పాట: దేశీయత

By Pratap
|

Andesri-Goreti Venkanna
పాట ఉద్యమానికి ప్రాణం. అదే సమయంలో ప్రాణవాయువుకు గాలి వాహకమైనట్లుగా పాటకు ఉద్యమం వాహకం. రెండు పరస్పరం కలిసి ప్రయాణం చేస్తాయి. ఉద్యమ ఉధృతి పాట పుట్టుకను, ప్రచారాన్ని నిర్దేశిస్తాయి. ఉద్యమ సందేశాన్ని పాట ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఉద్యమంలో పాట నిర్వర్తించే పాత్ర ఏ ఇతర ప్రక్రియలూ నిర్వర్తించలేవు. తెలంగాణ ఉద్యమం విషయంలో అదే జరుగుతున్నది. తెలంగాణ ఉద్యమానికి పాటకు విడదీయరాని సంబంధం ఏర్పడింది. తెలంగాణ అస్తిత్వ ఉద్యమ లక్షణం దృష్ట్యా పాటలోకి కొత్త వస్తువు, కొత్త అభివ్యక్తి వచ్చి చేరాయి. పాట జాతీయ ఉద్యమంలో, కమ్యూనిస్టు విప్లవోద్యమాల్లో నిర్వర్తించిన పాత్ర మనకు తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం విషయంలోనూ అదే పాత్ర నిర్వహిస్తున్నది.

విప్లవాన్ని వస్తువుగా తీసుకుని పాటలు రాస్తూ, ఆలపిస్తూ వచ్చిన వాగ్గేయకారులు తెలంగాణ ఉద్యమంతో ప్రాంతీయ నిర్దిష్టతను కూడా తమ పాటలో భాగం చేసుకున్నారు. గద్దర్‌, గూడ అంజయ్యలాంటి కవులు తెలంగాణపై, తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో పాటలు రాశారు. నిజానికి ఉద్యమగేయం ఉత్తరాంధ్రను మినహాయిస్తే ఎక్కువగా వస్తున్నది తెలంగాణ నుంచే. స్వాతంత్య్రానంతరం చూసుకుంటే కమ్యూనిస్టు ఉద్యమాలకు, విప్లవోద్యమాలకు పాట ఒక అనివార్య అభివ్యక్తిగా మారింది. విప్లవోద్యమంలో పాట ప్రధానంగా పుట్టింది దళిత, శ్రామిక కులాల నుంచే. నిజానికి, పాట సృష్టికర్తలు మొదటి నుంచి కూడా శ్రామికులే. ఆ సంప్రదాయం వల్లనే కావచ్చు, విప్లవోద్యమంలోనూ శ్రామిక, దళిత, బహుజన కులాల నుంచే పాట ఆవిర్భవించింది. ఆ తర్వాత దళిత ఉద్యమానికి పాటకు విడదీయరాని సంబంధం ఉంది. మాష్టార్జీ, గుండెడప్పు కనకయ్య, గ్యార యాదయ్య, దొడ్డి రామ్మూర్తి వంటి ఎందరో తమ పాటల ద్వారా దళిత ఉద్యమానికి, పాటకు ఉన్న 'రక్తసంబంధాన్ని' బయటపెట్టారు. విప్లవోద్యమం కోసం పాటలు రాసిన కవులు కూడా ప్రధానంగా శ్రామిక, దళిత, బహుజన కులాలవారే కాబట్టి ఆ సంస్కృతి, దళిత లక్షణం పాటకు తెలియకుండానే అబ్బింది. అలాగే తెలంగాణ అంశం కూడా విప్లవోద్యమ పాటలో ఎరుకతో కాకుండా విప్లవోద్యమ అంశగా వ్యక్తమైంది. ''నా తెలంగాణా... నా తెలంగాణా... అనాదిగా అరుణ అరుణ వీరులకిది ఖజానా'' అన్న గూడ అంజయ్య పాట అటువంటిదే. గద్దర్‌ పాటలు విప్లవ సందేశాన్ని అందించినా తెలంగాణ దళిత, శ్రామిక కులాల సంస్కృతి ఒక తప్పనిసరి అంశంగా ఉంది. తెలంగాణ లోనే విప్లవోద్యోమాలు పెద్ద యెత్తున జరగడం వల్ల ఇక్కడి విప్లవ పాటలో అది ఒక భాగం కావడం అనివార్యంగానే జరిగిపోయింది. ప్రజల నుంచి ప్రజలకు అనేదాన్ని పాటించడం వల్ల ప్రజల నుంచి నేర్చుకుని ప్రజలకు అందివ్వాలనే ఉద్దేశంతో ప్రజల బాణీలను తెలంగాణ వాగ్గేయకారులు తీసుకుని వస్తువును విప్లవీకరించారు. ఆ కారణంగా తెలంగాణ జానపద గేయాల బాణీలు విప్లవకవులకు వాహికలు అయ్యాయి. శివసాగర్‌ లాంటి కవి కూడా తెలంగాణ బాణీలను అధ్యయనం చేసి ఆ బాణీల్లో పాటలు రాశారు. శైలి దృష్ట్యా చూస్తే తెలంగాణ నిర్దిష్టత పాటకు ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు.

తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత తెలంగాణ వాగ్గేయకారులు స్పష్టమైన ఎరుకతో తెలంగాణను తమ పాటల్లో వస్తువుగా ఎంచుకున్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, పాలకుల వివక్షను ఎండగడుతూ గద్దర్‌ ఎన్నో పాటలు రాసి భువనగిరి, వరంగల్‌ సభల్లో ఉర్రూతలూగించారు. తెలంగాణ పల్లెపట్టుల విధ్వంసాన్ని, రాజ్యహింసను ఆయన పాటల్లో ప్రతిబింబించారు. గూడ అంజయ్య మరింత నిర్దిష్టంగా తెలంగాణను గానం చేశారు. ఆర్థికంగా, అంతకన్నా ముఖ్యంగా సామాజికంగా, సాంస్కృతికంగా తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడిందనే భావన తెలంగాణ సాహిత్యకారులను ఆవహించింది. తమ చారిత్రక ఆనవాళ్లు అంతర్జాతీయ వలసవాదుల వల్లనే కాదు, అంతర్గత వలసవాదులవల్ల కూడా రూపుమాసిపోయే ప్రమాదం ముంచుకొచ్చిందనే ఎరుక వారిని శోకాలు పెట్టించింది. ఈ శోకతీవ్రతను పాట కూడా ప్రతిబింబించి, దాన్ని అధిగమించి పోరాట స్ఫూర్తిని అందిస్తున్నది. ఆ శోకతీవ్రత తెలంగాణ పాట సాంద్రతను, ప్రేక్షకులను తనదైన లోకంలోకి తీసుకెళ్లి గుండెలను కదిలించే గుణాన్ని సంతరించుకున్నది. అంతకుముందు గుర్తించాల్సిన అవసరం లేదనుకున్నా ఎన్నో విషయాలు పాటలో భాగమయ్యాయి. కేవలం విప్లవ సంప్రదాయం మాత్రమే కాదు, ఆ సంప్రదాయానికి కూడా కారణమైన చారిత్రక, భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక అస్తిత్వం తెలంగాణ అనే చైతన్యం ముందుకు వచ్చింది. దీంతో తెలంగాణ ఉద్యమ పాటకు అనేక పార్శ్వాలు వచ్చి చేరాయి. ''పోరు తెలంగాణ, నా ఊరు తెలంగాణ'' అనేది ఒకటే కాదు, నిరంతరంగా ఆ పోరు చేయాల్సిన స్థితి తెలంగాణకు కలగడానికి గల అనేకాంశాలను తెలంగాణ పాట తడిమే ప్రయత్నం చేసింది. అదే పోరును తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేస్తామనే, పోరాట సంప్రదాయాన్ని కొనసాగిస్తామనే విషయాన్ని తెలంగాణ పాట స్పష్టం చేసింది.

గేయగతిని తెలంగాణ వైపు మళ్లించి ఒక ఊపును ఇచ్చినవాళ్లు గూడ అంజయ్య, గోరటి వెంకన్న, అందెశ్రీ. వీరి పాటల్లో అంతర్గత వలసాధిపత్య నిరసన, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, తెలంగాణ పట్ల పాలకుల వివక్ష, నీటి సమస్య, తెలంగాణ పల్లెల విధ్వంసం, ఇక్కడి రాజ్యహింస ప్రతిబింబిస్తాయి. తన విప్లవగేయాన్ని గూడ అంజయ్య తెలంగాణవైపు మళ్లించుకున్నారు. ''దొర ఎందుకురో? దొర జులుమెందుకురో'' అనే ప్రశ్నను ''ఆంధ్రులేందిరో వాళ్ల పాలనేందిరో/ వలసలేందిరో వాళ్ల మోసమేందిరో'' అని ప్రశ్నగా మలుచుకుని అంతర్గత వలసాధిపత్యాన్ని ఆయన నిరసించారు. ''అయ్యోనివా నువ్వు అవ్వోనివా/ ఇసుంట రమ్మంటే ఇల్లంత నాదంటివి'' అని అన్నారు. విప్లవ గేయాల బాణీలతోనే కొత్తగా తెలంగాణ గేయాలను ఆయన ఆలపించారు. తెలంగాణలో పారుతున్న జీవనదులను ఒక్కొటొక్కటే చెప్పుకుంటూ పోతూ నదులెన్నో పారుతున్న మడి తడవని తెలంగాణ'', ''తలాపున నీళ్లున్నా తాగ నీరు కరువాయె'' అని ఆయన బాధపడతారు. తెలంగాణను 'నిలువెల్ల గాయాల వీణ'గా అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమాన్ని గానం చేయాల్సిన వచ్చినప్పుడు గేయకవులకు అనివార్యంగానే స్థానీయ సాంస్కృతిక ప్రత్యేకతను చాటుకోవాల్సి వచ్చింది. ''తైదంబలి తైద రొట్టె'' అంటూ అంజయ్య తన పాటల్లో తెలంగాణ శ్రామిక జనజీవన సంస్కృతిని చిత్రించారు.

వస్తువులో, అభివ్యక్తిలో మార్పును తెచ్చినవారు ప్రధానంగా గోరటి వెంకన్న, అందెశ్రీ. తెలంగాణలోని పల్లెల్లోని శ్రామిక, దళిత, బహుజన కులాల ఆచారవ్యవహారాలను, మానవ సంబంధాలను, సంస్కృతిని సుదీర్ఘంగా పాడుతూ తెలంగాణ ప్రత్యేకతను చాటుతూ ఉద్యమస్ఫూర్తిని అందజేస్తున్నారు. భావకవులు స్త్రీకి ఆపాదించిన నైర్మల్యాన్ని, స్వచ్ఛతను ఈ తెలంగాణ కవులు పల్లెలకు, పల్లె వాతావరణానికి ఆపాదిస్తూ వాటిని కోల్పోతున్న అనుభూతిని ప్రేక్షకులకు గాఢంగా అందించే ప్రయత్నం చేస్తున్నారు. హేతువాద, శాస్త్రీయ దృక్పథంతో చూస్తే కొన్ని పాదాల్లోని వస్తువును అంగీకరించడం అప్పటికప్పుడు కష్టం అనిపించినా వారు అందించే అనుభూతి చిట్టచివరకు వారు నిర్దేశించిన శాస్త్రీయతకు, పోరాట స్ఫూర్తికి తీసుకునిపోతుంది. ఈ పాటలు సాధిస్తున్న విజయం అక్కడే ఉంది. గోరటి వెంకన్న, అందెశ్రీ, బైరెడ్డి కృష్ణారెడ్డి, గూడ అంజయ్య పల్లెలు విధ్వంసం అవుతున్న తీరును చిత్రిక కట్టారు. వీరంతా దాదాపుగా ఒకే వస్తువును తమ ప్రత్యేకతలతో వృత్తుల విధ్వంసాన్ని, తద్వారా పల్లెల విధ్వంసాన్ని గానం చేశారు. ఈ పాటలు వింటున్నప్పుడు తిరిగి పాత ఫ్యూడల్‌వ్యవస్థలోకి మనం జారిపోవాలా అనే సందేహం కలుగుతుంది. పాత కుల అసమానతల్లోకి వీరు మనలను తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం కూడా కలుగుతుంది. ''సాలెల మగ్గం, కుమ్మరి సారె'' వంటి పల్లెల బతుకుదెరువు మార్గాలు ధ్వంసమైపోయిన తీరును గూడ అంజయ్య తన పాటలో వినిపించారు. గోరటి వెంకన్న 'పల్లె కన్నీరు' పాట శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నది. ఆ పాట ఎంత ఆదరణ పొందిందో వేరుగా చెప్పనవసరం లేదు. ''కుమ్మరివాముల తుమ్మలు మొలిసెను/ కమ్మరి కొలిమిల దుమ్ము పేరెను/ పెద్ద బాడిస మొద్దువారినది/ సాలెల మగ్గం సడుగులిరిగినవి'' అని కులవృత్తులు నాశనమైపోతున్న వైనాన్ని దృశ్యీకరిస్తూ ''చేతివృత్తుల చేతులిర్గిపాయే నా పల్లెల్లోనా'' అని గోరటి వెంకన్న అంటారు. ''గొల్లసుద్దల డోలు సిందోల్లు మద్దెల్లు/ కాటికాపని వంకు బైండ్లోల్ల భేరీలు/ డప్పుల్ల కొమ్ముల్ల అస్సైదూలాలల్ల/ నడకల్నేర్పిన పల్లె ఉగ్గుపాలెటు బాయె'' అని బైరెడ్డి కృష్ణారెడ్డి తన 'దేవులాట' గేయంలో అంటారు. పల్లెల్లోని మానవసంబంధాలు, ప్రేమలు, ఆత్మీయతానురాగాలు మాయవుతూ పల్లెలు పల్లెలుగా లేకుండా పోతున్న సంధికాలాన్ని ఆయన గానం చేస్తారు. అందెశ్రీ పల్లెల ప్రకృతిని, ప్రకృతి అందాలను గానం చేస్తూ అవి కోల్పోతున్న తీరును గానం చేస్తారు. ఈ ముగ్గురి పాటలను చూసినప్పుడు ఇవి అభివృద్ధి నిరోధక అంశాలను కీర్తిస్తున్నట్లు అనిపించక మానవు. అన్నింటి కన్నా ప్రధానంగా కులాన్ని అంటిపెట్టుకుని ఉన్న వృత్తులను పునరుద్ధరించాలనే ఆకాంక్ష ఈ గేయాల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. వృత్తులు నశించిపోవడం వల్ల ఉపాధి పోతున్నదనే వేదన ఈ గేయాల్లో వ్యక్తమవుతున్నది. అయితే వృత్తులను అంటిపెట్టుకుని ఉన్న కులాల మాటేమిటనేది ప్రశ్న. కులాలు భారతదేశంలో నిర్వహిస్తున్న పాత్ర ఏ విధంగానూ హేతుబద్దమైంది కాదు. దళితుల విషయంలో కులం నిర్వహించిన పాత్ర సమాజం సిగ్గుతో తల వంచుకునేది. వృత్తులుండాలని గానం చేస్తున్న ఈ కవులు, పాత మానవసంబంధాలను ఆలపిస్తున్న ఈ కవులు వృత్తుల పునరుద్ధరణతో పాటు కుల అణచివేతలను, అసమానతలను కూడా పునరుద్ధరించాలని చెబుతున్నారనే అభిప్రాయం కలగడం సహజం.

సమాజం తీవ్ర సంక్షోభానికి గురయైనప్పుడు గతమే బాగుండేదనే భావనకు కవులు గురి కావడం పరిపాటే. సమకాలీన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, ముఖ్యంగా తెలంగాణ వంటి అస్తిత్వ ఉద్యమానికి బలం చేకూర్చడానికి గతాన్ని కీర్తించడం కూడా ఒక అవసరంగానే మారుతుంది. వృత్తులను, గత సంబంధాలను కీర్తించడం గతాన్ని యథాతధంగా పునరుద్ధరించాలని అడగడం కాదనే విషయాన్ని గుర్తించి, వాటిలోని సారాన్ని మాత్రమే గ్రహించాల్సి వుంటుంది. ''పల్లె కన్నీరు పెడుతుందో/ కనిపించని కుట్రల తల్లీ బందీయై పోతుందో'' అని గోరటి వెంకన్న స్పష్టంగా పాడుతున్నాడు. ప్రపంచీకరణ నేపథ్యంలో వర్ధమాన దేశాలు మార్కెట్లుగా మారిపోయే ప్రక్రియను నిరోధించడానికి స్థానికతను గానం చేస్తూ దాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి ఆచరణకు దిగడం తప్ప మరో మార్గం లేదు. ప్రపంచీకరణ 'కనిపించని కుట్ర'లో తెలంగాణ పల్లెలు విధ్వంసమైపోతూ ప్రజలు ఉపాధిని కోల్పోతున్న వైనాన్ని మాత్రమే ఆయన గానం చేస్తున్నారు. దేశీయ ఉపాధి మార్గాలను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని గోరటి వెంకన్న గుర్తు చేస్తున్నారు. కుల నిర్మూలన అనేది జరుగుతూ దేశీయ ఉపాధి మార్గాల అన్వేషణ జరగాలనేది వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే బైరెడ్డి కృష్ణారెడ్డి గత మానవీయ సంబంధాలను గుర్తు చేసుకుంటూ మార్కెట్‌ ఎకానమీవల్ల మానవసంబంధాల్లో పెరిగి పోతున్న యాంత్రిక అనుబంధాలను నిరసిస్తున్నారు. వలసాధిపత్యంలో తెలంగాణ పల్లెలు విధ్వంసం అవుతూ మానవ సంబంధాలు కనుమరగవుతున్న తీరును ఆయన తన పాటలో రూపుకట్టారు. అందెశ్రీ పాటలు మొత్తంగానే ఆ విషయాన్ని చెబుతూ ప్రకృతికి, మానవుడికి గల అవినాభావ సంబంధాన్ని ఆవిష్కరిస్తాయి.

వ్యక్తీకరణ విషయానికి వస్తే, గత విప్లవగేయాల శైలిని గోరటి వెంకన్న, అందెశ్రీ పూర్తిగా మార్చివేశారు. గద్దర్‌, గూడ అంజయ్య వంటివారి గేయాల్లో విప్లవబాణీలే వస్తువు మార్చుకుని తెలంగాణగేయాలుగా రూపుకడితే వీరి పాటలు అభివ్యక్తి ప్రత్యేకతను చాటు కుంటున్నాయి. ఈ ప్రత్యేకత వల్లనే గద్దర్‌, గూడ అంజయ్య వంటి ఉద్ధండులుండగానే వీరి పాటలకు ప్రత్యేక గుర్తింపు, ఆదరణ లభిస్తున్నాయి. గోరటి వెంకన్న పాటల్లో బైరాగుల తత్వాల్లోని, యక్షగాన రీతుల్లోని లక్షణాలు కనిపిస్తే, అందెశ్రీ పాటల్లో పద్యనాటక లక్షణాలు కనిపిస్తాయి.

గేయానికి, వచనకవితకు చాలా తేడా ఉంది. వచనకవిత ప్రయోజనం చాలా పరిమితమైంది. గేయానికి ఎల్లలు లేవు. గేయాలు రాసిన కవులు మరుగునపడిపోయి గేయం ప్రజల్లో నిరంతరం ప్రయాణం చేస్తూ పోతుంది. ఒకరి నుంచి ఒకరు పాటను అందుకుంటూ పోతారు. అక్కడ కవి ప్రధానం కాదు, పాట ప్రధానం. మౌఖిక ప్రక్రియకు ఆ సంప్రదాయం ఉంటుంది. తెలంగాణ ఉద్యమం గురించి ఎంతోమంది పాటలు రాస్తున్నారు. నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్‌వంటి కవులెందరో తెలంగాణ ఉద్యమ గేయాలు రాస్తున్నారు. ఇంకా చాలామందే వుంటారు. ఈ వ్యాసం వారందరిని ఉద్దేశించింది కూడా.

- కాసుల ప్రతాపరెడ్డి

English summary
Songs will be a part of any movement. We see lyrics playing a main role in Telangana movement. Gorati Venkanna and Andesri are pioneers in Telangana movement writing and demonstrating lyrics in Telangana movement. Their songs are having true literary values.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X