• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కవిత్వానికి దండం పెడతా

By Pratap
|

Kasula Linga Reddy
నాకు భాష మీద, భాషకున్న పరిమితుల మీద అనేక ఆరోపణలున్నాయి. ఎందుకంటే అవెప్పుడూ నేను వ్యక్తీకరించదలుచుకున్న పూర్తి భావనల్ని ప్రపంచానికి అందించడంలో విఫలమవుతున్నాయి. నా మిత్రులు, కుటుంబ సభ్యులు చాలా మంది తరుచూ నన్నొక ప్రశ్న వేస్తుంటారు. అదేమంటే "నువ్వు కవిత్వమెందుక రాస్తావ"ని. బహుశా ఇదే ప్రశ్న కొన్ని సార్లు నన్ను నేను వేసుకుంటాను. సమాధానం కూడా చెప్పుకంటూ ఉంటాను. అదేమంటే నేను రాయకుండా ఉండలేను కాబట్టి రాస్తున్నాను. ఈ ఉండలేనితనం ఎందుకంటే ఈ సమాజంతో నాకు అనేక పేచీలున్నాయి. ఈ పేచీల్లో నా వాదనను వినిపించేందుకు నా తరఫున నియమించుకున్న లాయర్ నా కవిత్వం.

"సహజ మానవునికి, సమిష్టి మానవునికి మధ్య వైరుధ్యమే కవిత్వం ఆవశ్యకత. మన ఆర్థిక కార్యాచరణే కవిత్వం" అంటాడు క్రిస్టోఫర్ కాడ్వెల్. వెంటనే మరో ప్రశ్న వేయవచ్చు. ఈ వాదన వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమిటని. అవును మనం ఈ విషయం కూడా మాట్లాడుకోవాలి. "కవులు అనధికార శాసనకర్తలు" (Unacknowlefged legislators - PB Shelly). "Only the poet can look beyond the detail and see the whole picture" అంటూ సమాజంలో కవుల ప్రాధాన్యతను అనేక రకాలుగా చెప్పారు. సామాజిక భవిష్యత్తు చిత్రపటాన్ని ఆవిష్కరించే కళాకారుడు రచయిత. మనిషి అంతరంగంతో సంభాషించి మానవత్వపు పరిమళాన్ని వెదజల్లేవాడు రచయిత. ప్రపంచంలో అనేక గొప్ప మార్పులు సాహిత్యం వల్లనే సాధ్యపడ్డాయి. ఈనాటి 21వ శతాబ్దపు మానవ పురోగతిని ఈ ఆరు పుస్తకాలు లేకుండా ఉహించగలమా? అవేమిటీ అంటే...

1. ఆరిజన్ ఆఫ్ స్పీసిస్ - చార్లెస్ డార్విన్

2. ది రివెల్యూషనిబన్ ఆర్బియ సోలెస్టియమ్ - నికోలస్ కోపర్నికస్

3. ఫిలాసఫియా నేచురిలిన్ ప్రిన్సిపియా మాథమెటికా - సర్ ఐజాక్ న్యూటన్

4. హామ్లెట్ - షేక్‌స్పియర్

5. కమ్యూనిస్టు మానిఫెస్టో - కారల్ మార్క్స్

6. ఇంటర్ ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ - సిగ్మండ్ ఫ్రాయిడ్

ఒక భూస్వామ్య సమాజంలో రెవెన్యూ అధికారిగా ఉండి, వ్యసనపరుడైన అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి పేద ప్రజల పోరాటాలకు నాయకత్వం వహించడం సాధారణ విషయం కాదు కదా. సాహిత్యం చదవడం అనే ఒకేఒక మంచి వ్యసనం వల్ల అతను జనరల్ ఛూటేగా మారి జనచైనా జనం గుండె చప్పుడయ్యాడు. భగత్‌సింగ్ వీలునామాలో జైలు జీవితానికి ముందు తాను ఒక పుస్తకం చదివి ఉంటే కనుక అసెంబ్లీలో బాంబులు వేసే ఉగ్రవాద చర్యకు పాల్పడి ఉండేవాడిని కాదని అంటాడు. ఆ పుస్తకం లెనిన్ రాసిన "స్టేట్ అండ్ రివెల్యూషన్". బహుశా అదే జరిగి ఉంటే భారత దేశచరిత్ర ఇంకో రకంగా ఉండేదేమో. ఇట్లా ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వవచ్చు. నన్ను నేను మానవీయ విలువలతో నిలబెట్టుకోవడానికి సాహిత్యం చదువుతాను.

మానవుని ఆవేశాలను పోగు చేసి, సహజాతాలను సిద్ధం చేసి సమిష్టి కార్యాచరణకు పురిగొల్పే గుంపు పండుగల్లో కవిత్వం పుట్టింది. వర్గ విభజన లేని సమాజంలో శ్రమ సమిష్టిగా ఉండేది. కవిత్వం సమిష్టి భావనగా మనుగడ సాగించేది. వర్గ సమాజంలో సంపదని, అధికారాన్ని కైవసం చేసుకున్న వర్గం శ్రమ నుంచి కవిత్వాన్ని దూరం చేసింది. అంతపురం బందీని చేసింది. తెలుగు కవిత్వ పరిణామ క్రమంలో అంతపుర బందిఖానాల్లోంచి తప్పించుకుని, రాజప్రసాదాల్లో సాగిలబడ్డ స్థితిని దాటుకుని, వ్యాకరణాల సంకెళ్లని, ఛందోసర్పపరిష్వంగాలని విడిపించుకుని ఆధునిక కవిత్వమై నిలబడ్డది. ఆధునిక కవిత్వం ఒక స్పష్టమైన సామాజిక, రాజకీయ దృక్పథంతో నడుస్తున్నది.

ఒక మనిషిని వేరొక మనిషి, ఒక జాతిని మరొక జాతి పీడించే సాంఘిక ధర్మాన్ని సమూలంగా నిర్మూలించి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను నెలకొల్పడానికి పురిగొల్పే క్రియలో ఉత్ప్రేరకాలుగా రచయితలు ఉండాలి కదా. ఈనాటి పరిస్థితుల్లో సామ్రాజ్యవాదాన్ని, ఆర్థిక ప్రపంచకీరణని, సాంస్కృతిక ప్రపంచీకరణని ఎదుర్కునే ఉద్యమాల్లో సూదిలో దారంలా రచయితలు ఉండాలి కదా. సామ్రాజ్యవాదుల ఆయుధ సంపత్తి పౌరసమాజాన్ని నోరెత్తకుండా చేస్తే, డబ్ల్యుటివో, వరల్డ్ బ్యాంకులు ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్నాయి. ప్రసార సాధనాలు, నాన్ సీరియస్ సాహిత్యం పలాయనవాద వ్యక్తిత్వాన్ని సమకూర్చుకోమని ఉద్బోధిస్తున్నాయి. వ్యక్తివాదం, వ్యక్తిగత అభివృద్ధి, వ్యక్తి చేతన అనేవి సమిష్టి భావ సంస్కృతిని నాశనం చేస్తున్నాయి. ఈ స్థితిలో కవిత్వం నాకు ఓ ఆయుధంగా ఉంది.

"మనిషి దూడను స్టేటస్ కొయ్యకు కట్టేసి

బతుకు పొదుగు నుంచి డబ్బుల్ని పితుకున్నప్పుడు

విలువల ఎన్నాద్రై గుండె ఆకలి తీర్చిన

కవిత్వానికి దండం పెడతా -

ఎడారి బతుకలో

ఆశల నారుమడి ఎండి నెర్రెబారుతున్నప్పుడు

గుండె చెరువు నిండి

కన్నీటి అలుగు దుంకిన

కవిత్వానికి దండం పెడతా

- కాసుల లింగా రెడ్డి

English summary
Kasula Linga Reddy, a prominent Telugu poet, spoke about the magic of poetry and its importance in the society. He says poetry as a medium to communicate his feeling with the society. He has published three poetry books in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X