వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాంతీయ కవిత్వ చైతన్యం పార్ట్-3

By Pratap
|
Google Oneindia TeluguNews

{image-15-sunkireddy15-300.jpg telugu.oneindia.comతెలంగాణ ప్రాంతీయ చైతన్య కవిత్వం

మిగతా రెండు ప్రాంతాలో పోలిస్తే పూర్తిస్థాయినందుకొన్నదీ, గాఢమైనదీ, సుదీర్ఘచరిత్ర కలిగినదీ తెలంగాణ. ఇట్లా ఉండటానికి దీనికి చారిత్రక కారణాలున్నాయి. శాతవాహన విష్ణుకుండిన, కళ్యాణీ చాళుక్య, కాకతీయ వంటి సామ్రాజ్యాలు తెలంగాణలోనే ఆవిర్భవించడం, కుతుబ్‌షాహీల, అసఫ్‌ జాహీల రాజ్యాలకు కూడా తెలంగాణ కేంద్రస్థానం కావడం ఈ ప్రాంత విశిష్టతకు నిదర్శనం.

కోస్తాంధ్రులు రావడానికి ముందు ఇక్కడికి వచ్చి ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేసిన స్థానికేతరులను ఇక్కడి నుండి తరిమికొట్టడానికి ఉద్యమించిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉన్నది. దక్షిణ భారత దేశంలో మొట్టమొదట పట్టణీకరణ పొందిన ప్రాంతమిది. ఉత్తర దక్షిణ భారతదేశాల వారధియిది.

ఉత్తరాన గోదావరి, దక్షిణాన కృష్ణానది, తూర్పున తీరాంధ్ర ప్రాంతాన్ని వేరుచేస్తున్న నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని పర్వతసానువులు పడమటి దిశలో కర్ణాటక, మహారాష్ట్రాలను వేరు చేస్తూ ఆదిలాబాద్‌ నుంచి రంగారెడ్డి జిల్లా వరకు వ్యాపించివున్న పర్వత పంక్తులు తెలంగాణ ప్రత్యేకతను అస్తిత్వాన్ని నిర్ధారించే మొదటి అంశం.

మిగిలిన మూడు ప్రాంతాలతో నిమిత్తం లేకుండా షుమారు 1300 సుదీర్ఘ సంవత్సరాలు సంబంధం లేకుండా కొంత కాలం కొన్ని ఇతర ప్రాంతాలతో కలిసి, విడి రాజ్యంగా వుంది (తెలంగాణ సెంటిమెంట్‌ కాదు చారిత్రక వాస్తవం- అనడానికి ఆధారాలు) ఇది ఈ ప్రాంత ప్రత్యేకతను నిర్దేశించే రెండో అంశం. ఈ కారణం గా రూపొందిన భాష, సంస్కృతి, ఆర్ధిక, సామాజిక పరిస్ధితులు తెలంగాణ ప్రత్యేక అస్తిత్వాన్ని నిర్ధారించే మిగతా అంశాలు.

ఇట్లా రూపొందిన తెలంగాణాను, 1948 లో హైదరాబాద్‌ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణాను, తెలంగాణా ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా 1956 లో ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేసినారు. ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేస్తే వచ్చే కష్టాలను, నష్టాలను తెలంగాణ ప్రజలు ముందే వూహించి తమ భయాలను ''ఫజల్‌ అలీ కమీషన్‌ ముందు మొరపెట్టుకున్నారు. హైదరాబాద్‌ రాష్ట్రం ఏర్పడిన వెంటనే వలస వచ్చిన కోస్తాంధ్ర ఆధిపత్య ధోరణిని తిరస్కరించి నాన్‌ముల్కి (1952) ఉద్యమం నడిపిన అనుభవం ఈ విజ్ఞప్తి వెనుక ఉన్నది. ప్రజల ఆకాంక్షలను గమనించిన కమీషన్‌. విలీనం అవసరం లేదని సిఫార్స్‌ చేసింది. విశాలాంధ్ర ప్రతి పాదనలో తమ రాజ్యాన్ని విస్తరించుకోవాలనే సామ్రాజ్యవాద బావనలున్నాయి'' అని నెహ్రూ అన్నాడు. ఈ మాటలను చెవిన బెట్టకుండా కోస్తా సంపన్న వర్గాలు, కమ్యూనిస్టులు తమ దీర్ఘ కాలిక స్వార్ధ ప్రయోజనాల కోసం బలవంతంగా ఈ విలీనాన్ని జరిపినారు. పెద్దమనుషుల ఒప్పందం పేరుతో ఉత్తుత్తి హామిలిచ్చినారు. అవి ఉత్తుత్తి హామీలేనని ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డ మరునాటి నుంచే రుజువైంది. ప్రజలు ఊహించినట్టే కష్టాలు, నష్టాలు మొదలయినయి. లక్షలాది ఎకరాల తెలంగాణ భూముల్ని వాళ్ళు ఆక్రమించినారు. ఉద్యోగాల్లో నిండిపోయినారు. ఇక్కడి నిధుల్ని తరలించినారు. ఇక్కడి భాషను, సంస్కృతిని అవహేళన చేసినారు. ఈ అన్యాయాన్ని, వివక్షను తిరస్కరిస్తూ తెలంగాణ ప్రజలు 1969 లో ఉధృతంగా ఉద్యమించినారు. ఆరు సూత్రాల పథకమనే మరో ఉత్తుత్తి హామీతో ఉద్యమాన్ని మళ్ళీ అణిచి వేసినారు. ఇక ఇప్పట్నుంచి కోస్తాంధ్రుల వలస మరింత పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా తెలుగుదేశం ఆవిర్భావంతో ఈ వలసలకు ఎదురులేకుండా పోయింది. తెలంగాణ అస్తిత్వం ఉనికినీ కోల్పోయే పరిస్ధితి ఏర్పడింది. అన్యాయం, వివక్ష ఇంకా తీవ్రమైంది.

ఈ నేపథ్యంలో మూడో సారి 1996 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలైంది. 1997 జనవరిలో ''ఫోరం ఫర్‌ ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌'' జరిపిన సదస్సులు ఉద్యమానికి ఉత్తేజాన్నిచ్చినాయి. ఆ తరువాత అనేక తెలంగాణ సంస్థలు ఆవిర్భవించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. 2001 లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో ఉద్యమం తిరుగులేకుండా నిలబడినది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావాన్ని ఎవరూ ఆపలేరనే ఉత్తేజాన్ని కలిగించింది.

ఈసారి వచ్చిన ఉద్యమం గత ఉద్యమాల కంటే మౌళికంగా భిన్నమైంది. అప్పటి ఉద్యమాలు ఉద్యోగులకు విద్యార్ధులకు పరిమితమైతే ఇప్పటి ఉద్యమం అన్ని వర్గాలలో అన్ని రంగాలలో వ్యాపించింది. సాంస్కృతికోద్యమంగా, ఆత్మగౌరవ ఉద్యమంగా రూపుదిద్దుకొన్నది.

ఈ నేపథ్యంలో తెలంగాణ అస్తిత్వ చైతన్య కవిత్వాన్ని పరిశీలించాలి.

ప్రాచీన సాహిత్యంలో పాల్కుర్కి, పోతన మొ|| ఎంతో మంది కవులు ఈ ప్రాంత వైశిష్ట్యాన్ని కొనియాడినారు. 1910 లో జరిగిన ముల్కి ఉద్యమంలో ఓ చిరుద్యోగి స్థానికేతరులకు వ్యతిరేకంగా '' మా ఉద్యోగాలన్ని అపహరించి మీ వారికి అప్పగించావు / నీ కుట్రలన్ని అమలైతే ఇక చిరుద్యోగాలే మా గతి ''అని ఒక కవిత రాశాడు. ఈ ప్రాంత చైతన్యాన్ని ప్రతిబింభించే తొలి కవిత ఇదే కావచ్చు. (చూ. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల చరిత్ర). తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగి పోయింది. ఆ కాలపు తెలుగు అభ్యుదయ కవిత్వాన్నంతటినీ తెలంగాణా ఆవరించింది.

1969 నాటి ఉద్యమంలో ప్రాంతీయ చైతన్యంతో కొంత కవిత్వమొచ్చింది. అనుముల శ్రీహరి, ఎస్వీ సత్యనారాయణ, జగదీశ్వరస్వామి ఉద్యమానికి మద్దతుగా ''విప్లవ శంఖం'' (1969) అనే కవితా సంపుటిని ప్రచురించినారు. ''తెలంగాణయే విడికాకుంటే/ అంతా ఆంధ్రుల దాసులమే. స్వంతలాభమొకటి చూచి/ సంతకాలు చేసినారు / బావి తెలంగాణ ప్రజల / బ్రతుకులతో ఆడినారు -'' మానదురా తెలంగాణ ప్రజల / మనసులో గాయం / కాసూ! త్వరలోనే నీకు/ కాటి యాత్రఖాయం'' ఇదినా తెలంగాణ సంజీవదీవిరా, ఇది తెలంగాణ పుణ్యాల దీవిరా'' అంటూ అందులో ఆనాటి ఉద్యమ చైతన్యాన్ని ప్రతిబింభించినారు''. తెలుగు పేరిట తెలవి పరులై - పెత్తనమ్మొనరించు దూర్తులు తెలంగాణము నేలు చుండిరి. రక్తసిక్తము చేయుచుండిరి''. (1969) అని గనిరెడ్డి వెంకటరెడ్డి రాసిండు.'' వీర తెలంగాణ యిదుగో సలాం నీకు తగదు ఆంధ్రతో గులాం'' (1968 - 69) అంటు మేర మల్లేశం రాసిండు. (చూ. మత్తడి - తెలంగాణ ఆధునిక కవితా సంకలనం). ''ప్రాంతం వారి రక్షణ పనికి రాదు అన్నప్పుడు
ప్రత్యేకంగా రాజ్యం పాలు గోరడం తప్పదు'' అని కాళోజీ రాసిండు. ఆ ఉద్యమంలో ఇంకా కవితలు, పాటలు వచ్చి వుండొచ్చు.

బహుశా ఈ ఉద్యమ ప్రభావంతోనే కావచ్చు ఆ తరువాత అయిలయ్య (1972), దేవరాజు మహారాజు (1973) పంచరెడ్డి లక్ష్మణ్‌(1973), ఎన్‌.గోపి, కృష్ణమూర్తి యాదవ్‌. తెలుగులో కవిత్వం రాసినారు. తెలంగాణ పేర్లు పెట్టినారు. తెలంగాణ నేటివిటీకి పట్టం కట్టినారు. ఆ తర్వాత నల్లగొండ దళితకవులు వేముల ఎల్లయ్య, చిత్రంప్రసాద్‌, వెంకట్‌ అచ్చమైన తెలంగాణ భాషలో కవితలల్లినారు. విప్లవ కవిత్వంలో భాగంగా నందిని సిద్ధారెడ్డి, కందుకూరి శ్రీరాములు, దాసరాజు రమాకాంతు, అలాజిపురి కిషన్‌, దేశపతి శ్రీనివాస్‌, ఏలేశ్వరం నాగభూషణాచార్య మొ|| కవులు తెలంగాణ పల్లెలు అల్లకల్లోలం కావడాన్ని చిత్రించినారు.

ఇక మూడోసారి వచ్చిన ఉద్యమ సందర్భంగా వచ్చిన ప్రాంతీయ చైతన్య కవిత్వాన్ని పరిశీలిద్దాం. 1996 లో మూడవ దఫా ఉద్యమం ప్రారంభం కాగానే సాహిత్య రంగంలో కూడా ఆదిశలో ప్రయత్నాలు జరిగాయి. కె.శ్రీనివాస్‌, సురేంద్రరాజు, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, నందిని సిద్ధారెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి, డా||ఎస్వీ సత్యనారాయణ తదితరులు కలిసీ విడిగానూ పలు చర్చలు చేసినారు. అనంతరం 1998 నవంబర్‌ 1 న' తెలంగాణ రైటర్స్‌' పేరుతో అనేక మంది తెలంగాణ కవుల్ని ఆహ్వానించి చర్చలు నిర్వహించినారు. ఈ సమావేశం తెలంగాణ కవులకు గొప్ప ఉత్తేజాన్నిచ్చింది.1999 జనవరి 11న జరిగిన సమావేశంలో కె.శ్రీనివాస్‌ ప్రవేశపెట్టిన అవగాహన పత్రం మీద జరిగిన చర్చ అనంతరం సురేంద్రరాజు, సుంకిరెడ్డి, అనిశెట్టి రజిత, మల్లేపల్లి లక్ష్మయ్య, స్కైబాబ లు కన్వీనర్లుగా ''తెలంగాణ సాంస్కృతిక వేదిక'' ఏర్పడింది. అదే సంవత్సరం నల్లగొండలో వేదిక తొలి రాష్ట్ర మహాసభ జరిగింది. 2001 సెప్టెంబర్‌ 9న రెడ్డి హాస్టల్‌ లో జరిగిన వేదిక నాలుగో సదస్సు తెలంగాన సాహిత్యానికి దిశానిర్దేశం చేసిందని విమర్శకులు భావించారు. ఈ సదస్సులోనే తెలంగాణతోవలు, దాలి వెలువడినాయి. తరువాత నందిని సిద్ధారెడ్డి అధ్యక్షతగా వేణు సంకోజు కార్యదర్శిగా తెలంగాణ రచయితల ''వేదిక'' పేరుతో మరో సంస్థ ఏర్పడింది. ఈ వేదిక తరుపున అనేక సభలు నిర్వహించినారు. ఇవి రెండు 'సోయి' అనే పత్రికను వెలువరించినారు. ఇవి రెండు తెలంగాణ సాహిత్య చైతన్య విస్తృతికి చాలా దోహదం చేసినారు.

ఈ పరిణామానికి సమాంతరంగా ఎంతో కవిత్వం, ఎన్నో పాటలు, ఎన్నో వ్యాసాలు వచ్చినాయి. తొలుత గౌరీశంకర్‌ 'తెలంగాణా' వచ్చింది. శివకుమార్‌, రఘునాధం, సుంకిరెడ్డి లు రాసిన నల్లవలస (1997 - 99) నందిని సిద్ధారెడ్డి, ''నాగేటి సాల్లల్ల నా తెలంగాణా'' పాట గద్దర్‌, అందెశ్రీ, గూడ అంజయ్య పాటలు, బైరెడ్డి కృష్ణారెడ్డి దేవులాట బాగా ప్రాచుర్యం పొందినాయి.వందలాది మంది కవితలలో పొక్కిలి, మత్తడి సంకలనాలు వచ్చినవి. ''ఈ రెండు తెలంగాణ సాహిత్య చైతన్యానికి ప్రాతినిధ్యం వహించింది, తెలంగాణలో వెల్లి విరుస్తున్న కవితా వైభవాన్ని తెలుగు సాహిత్యం ముందు ఆవిష్కరించినవి. తెలంగాణ ఇతివృత్తంతో సుంకిరెడ్డి 'దాలి' అల్లంనారాయణ ''యాది - మనది'' వెంకట్‌ 'వర్జి' గ్యార యాదయ్య 'ఎర్కోషి' కాసుల ప్రతాపరెడ్డి 'గుక్క' దీర్ఘకవితలు వచ్చినవి. యెన్నం ఉపేందర్‌, అన్నవరం దేవేందర్‌ తొవ్వ, నడక అంకమ్మ తోట లేబర్‌ అడ్డ, జూకంటి జగన్నాధం, దర్బశయనం శ్రీనివాసాచార్యుల కవితలు - మంజీరా రచయితల సంఘం వేసిన 'తెలంగాణ' ''నా తెలంగాణ'' తెలంగాణ లొల్లి (2002). పై సంకలనాల్లోను, సొంత సంకలనాలను విడిగా తెలంగాణ కవులు కవిత్వాన్ని రాసిన కవులు అసంఖ్యాకం.

జయధీర్‌ తిరుమల రావు, నాళేశ్వరం శంకరం, డా||ఎస్వీ. చెరుకుసుధాకర్‌, జింబో, కందుకూరి శ్రీరాములు, ఆశారాజు, కె.శ్రీనివాస్‌, ఏలేశ్వరం నాగ భూషణాచార్యులు, ప్రసేన్‌, సీతాపతి, ఎస్‌.జగన్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, యాకూబ్‌, ననుమాసస్వామి, మోత్కూరి అశోక్‌ కుమార్‌, తైదల అంజయ్య, వఝాల శివకుమార్‌, సిద్ధార్ధ, వేణు సంకోజు, స్కైబాబ, పగడాల నాగేందర్‌, వేముల ఎల్లయ్య, వెంకట్‌, చిత్రంప్రసాద్‌, షాజహానా, దొడ్డి రామ్మూర్తి, గౌస్‌, దాసరాజు రామారావు, బోధనం నర్సిరెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి, బైరెడ్డి కృష్ణారెడ్డి, ఉదారి నారాయణ, అన్వర్‌, పొట్లపల్లి శ్రీనివాసరావు, దాస్యం లక్ష్మయ్య, హరగోపాల్‌, అనిశెట్టి రజిత, అయ్యూబ్‌, ఏనుగు నర్సింహ్మారెడ్డి, బాణాల శ్రీనివాసరావు, పోలేగిరి, కందుకూరి దుర్గాప్రసాద్‌, కాంచనపల్లి, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, గోపగాని రవిందర్‌, తిరునగరి శ్రీనివాస్‌, వాసు, దెంచనాల శ్రీనివాస్‌, పులిపాటి గురుస్వామి, బెల్లి యాదయ్య, వేముగంటి మురళీకృష్ణ, సుంకర రమేశ్‌, సబ్బని శారద, హనీఫ్‌, రేడియం, జనజ్వాల హిమజ్వాల, తెలిదేవర భానుమూర్తి, కోడూరి విజయ్‌ కుమార్‌, కాంచనపల్లి రాజేందర్‌రాజు, దున్న యాదగిరి, అలాజిపూరి కిషన్‌, చైతన్య ప్రకాశ్‌, చామల రవిందర్‌, లోకేశ్వర్‌, పరిమళ, భూపాల్‌, అలీ, దాసోజు కృష్ణమాచారి, జాజుల గౌరి, జూపాక సుభద్ర, కందాళై రాఘవాచార్య, బోడ జగన్నాధ్‌, చింతపట్ల సుదర్శన్‌ వీళ్లంతా తెలంగాణా చైతన్య కవిత్వాన్ని సుసంపన్నం చేసిన వారే.

కోస్తాంధ్ర : ప్రాంతీయ చైతన్య ఉద్యమమేదీ కోస్తాంధ్రలో రాలేదు. అలా రాకపోవడానికి కారణాలున్నాయి. 1973 లో వచ్చినా జై ఆంధ్రా ఉద్యమం ప్రజలకు సంబంధించింది కాదు. తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి, ఇతర రాజకీయ ప్రయోజనం కోసం వచ్చింది కాబట్టి ఇక్కడి కవులు ఈ ఉద్యమానికి పెద్దగా ప్రతిస్పందించిన సూచనలు కనిపించవు. రెండు పుస్తకాలొచ్చినట్లు తెలుస్తుంది. ఒకటి కృస్ణాజిల్లా అరసం వేసిన ''సమైఖ్యవాణి'' (1972) ఇందులో కోస్తాంధ్రపై అభిమానమేమి వ్యక్తం కాలేదు. ప్రత్యేక రాష్ట్ర వ్యతిరేక కవిత్వం ఉంది. రెండోది నూజివీడు నుంచి డా|| యనమదుల పుల్లారావు వేసిన జై ఆంధ్ర గేయాలు ''(1973) ఇందులో తెలంగాణ వాళ్ళు తమను దూషిస్తున్నారంటూ ఆక్రోషం వెలిబుచ్చినారు. ప్రాంతీయాభిమానం పెద్దగా వెల్లుబుక లేదు. ఎందుకని? దీనికి వేరే కారణాలున్నాయి.

మిగతా మూడు ప్రాంతాలకంటే ముందుగా ఈ ప్రాంతంలో 1852 లో కృష్ణా బ్యారేజి (ప్రకాశం బ్యారేజి) 1883 లోనే ధవళేశ్వరం (గోదావరి ఆనకట్ట) రావడంతో ఈ ప్రాంతం సంపద్వంతం అయింది. ఈ ప్రాజెక్టుల వల్ల వ్యవసాయంలో మిగులు సాధ్యమైంది. ఈ మిగులును సినిమా, ప్రచురణ వంటి అనుత్పాదక రంగాలకు విస్తరించారు. కోస్తాంధ్రా నయా సంపన్నులకు మొబిలిటీ పెరిగి అన్ని రంగాలను కబలించారు. తమ మార్కెట్‌ విస్తరణ కోసం 1953లో ఆంధ్రరాష్ట్రాన్ని, 1956లో ఆంధ్రప్రదేశ్‌ నూ సాధించుకొని మిగతా మూడు ప్రాంతాల్లో కబ్జాదారులుగా అంతర్గత వలసాధిపత్య వాదులుగా పేరు గడించారు. (ఈ ప్రాంతంలో అక్కడక్కడ వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోనూ పేద ప్రజలు ఉన్నారు. ఈ ప్రాంతంలోని వెనుకబడిన ప్రాంతాల్లో విప్లవోద్యమం తద్వారా విప్లవసాహిత్యం బలంగా ఉండటం చూస్తాం). మిగతా మూడు ప్రాంతాల భాషా సంస్కృతులను, ఆహారపు అలవాట్లను అవహేళన చేసి ఆ ప్రాంతాల ప్రజల మనోభావాలను గాయపరిచిన వారిగా పేరు గడించినారు. స్వార్ధ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అన్ని ప్రాంతాలు తమవే అన్న రీతిలో ప్రవర్తించారు. మిగతా ప్రాంతాలను తమ జీవిత మూలాల్లోకి ఆహ్వానించకుండానే, మిగతా ప్రాంతాల్లో తమ ప్రత్యేక అస్తిత్వాన్ని (మైనారిటీగా అయినా సరే) కాపాడుకుంటూనే ఆధిపత్య ధోరణి ప్రదర్శించారు. అందువల్ల ఇక్కడ ప్రాంతీయ చైతన్య ఉద్యమము అవసరం లేదు. ప్రాంతీయ చైతన్య కవిత్వమూ లేదు.

ఈ స్థితిలో అన్ని రకాలుగా తెలంగాణ అస్తిత్వ కవిత్వం, సాహిత్యం అన్ని రకాల ఆధిపత్యాలను ఎదిరించే ఉద్యమంగా సాగుతున్నది. ప్రపంచాన్నంతా కుగ్రామంగా మార్చేసి, తను మార్కెట్‌ను విస్తరించుకునే అమెరికా అగ్రరాజ్యానికి కోస్తాంధ్ర పాలకులు అండదండలు అందిస్తూ తెలంగాణాను ప్రయోగ ప్రాంతంగా మార్చారు. కేవలం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం రాజకీయోద్యమంగా కాకుండా ప్రపంచీకరణను, దానికి కొమ్ము కాస్తున్న దేశీయ పాలక వర్గాన్ని వ్యతిరేకించే విశాల ప్రాపంచిక దృక్ఫధాన్ని తెలంగాణ అస్తిత్వ ఉద్యమం అందిస్తున్నది. ఈ దృష్ట్యా తెలంగాణ కవిత్వం అన్ని వాదాల కన్న ముందు వుందని చెప్పవచ్చు.

- డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి

English summary
An eminent literary critic and poet Dr Sunkireddy Narayana Reddy analyses the regional awareness in Telugu poetry. He explains the regional expressions of Rayalaseema, North Andhra and Telugu poetry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X