వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతీకాత్మక కథ 'రంకె'

By Pratap
|
Google Oneindia TeluguNews

Yaganti-nandi
నా నుంచే మొదలు పెడతాను. స్వామి రాసిన 'రంకె' కథ చదివినప్పుడు నా నుంచి ప్రారంభించడమే న్యాయమని అనిపిస్తోంది. భూమి వ్యవసాయానికి కాక మరొకందుకు పనికి రాదనేది మా అమ్మ దృఢ విశ్వాసం. ఆ కారణంగానే హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌ నగర్‌ డిపో ఎదుట కనీసం 200 గజాల జాగైనా తీసుకోవే అని మా మేన మామ మసిరెడ్డి నర్సింహారెడ్డి 1970 థకంలోనో, అంతకు ముందు థకంలోనో బతిలాడినట్లు చెప్పినా వినలేదు. దున్నుకోవడానికి పనికి రాని భూమి భూమే కాదనేది ఆమె నమ్మకం. ఇది రైతులందరి నమ్మకం కూడా. భూమి మారకం సరుకు కాదని రైతులు నమ్ముతూ ఉంటారు. అందుకే భూమిపై ప్రాణాలు పెట్టుకుని బతుకుతారు. అలా బతికిన మా అమ్మ నన్ను రైతు బిడ్డను చేయాలని చాలానే ప్రయత్నించింది. చదువు సాకుతో నేను నా భూమి మీంచి, మా ఊరు నుంచి ఒక రకంగా పారిపోయాననే చెప్పాలి. బహుశా, అందుకేనేమో ఇంకా బతికున్నానని కూడా అనుకుంటూ ఉన్నాను. మా అమ్మ లాగా భూమి మీద ప్రాణాలు పెట్టుకుని బతికిన రైతే స్వామి రాసిన 'రంకె' కథలోని వరదప్ప. అతని తండ్రి కూడా అంతే. వ్యవసాయాన్ని వారసత్వంగా స్వీకరించిన కుటుంబం అది. వ్యవసాయం ఆత్మగౌరవానికి చిహ్నం కూడా. గిట్టుబాటు కాని వ్యవసాయాన్ని వదిలేసి మరో లాభసాటి వృత్తిని చేపట్టాలని భార్యలు చెప్పినపన్పుడు వరదప్ప అన్న మాటలూ, అతని తండ్రి అన్న మాటలు రైతు ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తాయి. మరి, ఆ ఆత్మగౌరవం నిలబడుతున్నదా? రైతు ఆత్మాభిమానం దెబ్బ తిని వరదప్ప ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందో మన కథా రచయితలు చాలా మంది ఇప్పటికే చెప్పారు. స్వామి కూడా 'రంకె' కథలో చెప్పాడు. కానీ ఈ కథ అంతకన్నా ముందుకు సాగింది.

కథ చదవడం మొదలు పెట్టినప్పుడు ఎందుకో నచ్చలేదు. స్వామి లాంటి రచయిత ఇలాంటి కథా నిర్మాణ పద్ధతిని ఎందుకు ఎంచుకున్నాడా అని సందేహం కలిగింది. ఒక రకంగా విసుగు కూడా వచ్చింది. కానీ, కథ చదువుతూ పోతుంటే కథ ఎత్తుగడలోని మాయ విడిపోతూ వచ్చింది. సాధారణమైన ఎత్తుగడతో మొదలై అసాధారణమైన ముగింపు కాకపోయినా ప్రతిభావంతమైన ముగింపును రచయిత ఇచ్చాడు. ఆ విధమైన ఎత్తుగడ వల్లనే ముగింపు అంత ప్రతిభావంతంగా వచ్చిందనేది కథ చదివిన తర్వాత అర్థమవుతుంది. ఇతివృత్తం సాధారణమైందే. తెలంగాణలోనైనా, అనంతపురం జిల్లాలోనైనా వర్షాధార ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమనే కలియుగ ధర్మం కొనసాగుతూ వున్నది. రైతుల ఆత్మహత్యల పరంపరకు ప్రభుత్వ విధానాలు కారణం కాదా? సేంద్రియ ఎరువులు, సొంత విత్తనాలు వంటి స్థానాల్లో రసాయనిక ఎరువులు, బడా కంపెనీలు విత్తనాలు, పురుగు మందులు ప్రవేశించి సాంప్రదాయిక వ్యవసాయాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేసిన తర్వాత, వ్యవసాయాన్ని మానవ జీవన మనుగడకు ప్రాణాధారమనే భావనతో కాకుండా వ్యాపారం దృక్పథంతో చూడడం ప్రారంభించిన తర్వాత అంతా తలకిందులైంది. అందరి జీవితాలను శాసించిన రైతుకు తన జీవితం మీద తనకే పట్టు లేకుండా పోయింది. వినాశకాలం దాపురించి రైతు ప్రాణాలను బలికొంటోంది.

స్వామి ఈ కథలో నీళ్లను గురించి, ఆ నీటిని అందించే ప్రాజెక్టుల గురించి, ఆ ప్రాజెక్టు నిర్మాణ రాజకీయాల గురించి కూడా ప్రస్తావించాడు. తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలను ఆయన నేరుగానే ప్రస్తావించాడు. హంద్రీనీవా ప్రాజెక్టు రాజకీయాలను ఆయన ప్రస్తావించాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రమే కాకుండా రాయలసీమలో స్వర్గీయ ఎన్‌టి రామారావు ప్రభుత్వం తలపెట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల గురించి చాలా విషయాలే మాట్లాడుకోవచ్చు. అలాగే తెలంగాణ ప్రాంత ప్రజలు తాజాగా దేవాదుల ప్రాజెక్టు అనుభవాన్ని చూస్తూనే ఉన్నారు. నీరు వచ్చి వ్యవసాయం ఫలితాలు ఇస్తుందని భావించిన దేవరప్పకు ఆశాభంగం కావడం ఊహించనిదేమీ కాదు. దాని మీద ఆశలు పెట్టుకున్న దేవరప్పదే తప్పు కానీ ప్రభుత్వాలదో, రాజకీయ నాయకులదో కాదని చాలా మందే చెప్పవచ్చు. కానీ రైతు అంతరంగం వేరు. రైతు ఆత్మ వేరు. భూమిని అంటిపెట్టుకునే రైతు ఏనాటికైనా భూతల్లి గట్టెక్కుస్తుందనే విశ్వసిస్తాడు. ఆ విశ్వాసమే అతని పాలిట శాపంగా మారిన వైనం 'రంకె' కథలో చూస్తాం.

స్వామి తన కథలో ఆ మాత్రమే చిత్రించి వదిలేయలేదు. తాను ఆత్మహత్య చేసుకోవడం ద్వారా లోకధర్మాన్ని, సామాజిక ధర్మాన్ని నెరవేర్చని విషయాన్ని దేవరప్పకు అర్థమయ్యేలా చేశాడు. తాను నిర్వర్తించాల్సిన ధర్మాన్ని వదిలేయడం సరి కాదనే అవగాహన కల్పించాడు. ఆ రకంగా ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని ఆయన సూచించాడు. భూమి రుణం తీర్చుకోవాలంటే రెండు ధర్మాలు నెరవేర్చాలని దేవదేవుడు చెప్పిన మాటను దేవరప్ప అంగీకరిస్తాడు. తొలుత మనిషి కోసం పోరాడి మొదటి ధర్మాన్ని నెరవేర్చి, తర్వాత మనిషికి సేవ చేసుకుంటూ బతికే రెండో ధర్మాన్ని నెరవేర్చడానికి రాతిగిట్టలతో తన ఇంటి అవుకే దూడగా పుడతాడు.

మొదటి ధర్మం నెరవేర్చడానికి యాగంటి బసవయ్యలో పరకాయ ప్రవేశం చేస్తాడు. వృత్తికి అదనంగా నాలుగైదు వ్యాపారాలు చేసే రాజకీయ నాయకులను మట్టుబెడుతాడు. అనంతపురం జిల్లా నాయకుడొకడు కర్ణాటకలో తన వ్యాపారాన్ని సాగించే వైనాన్ని వ్యంగ్యాత్మకంగా చెప్తాడు. అందరు రాజకీయ నాయకులు బసవయ్య కుమ్మితే రక్తం కక్కుతూ మరణిస్తే కర్ణాటక రాజకీయ నాయకుడు నోట్లోంచి నోట్ల కట్టలు కక్కుతాడు.

కథ ముగింపునకు ఎత్తుగడ న్యాయం చేకూర్చింది. దానివల్లనే కథ ముగిసే సరికి మనం తీవ్రమైన అనుభూతికి లోనవుతాం. స్వామి ఈ కథ ముగింపునకు మార్మికతను ఎంచుకున్నాడు. సమకాలీన రాజకీయాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ మార్మికత ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బాధితులకు న్యాయం చేయడానికి అది అవసరమైంది కూడా. కవితాత్మక న్యాయం (Poetic justice) చేయడం దాని వల్లనే సాధ్యమైంది. దేవరుప్పకే కాకుండా మొత్తం సమాజానికే న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అలాంటి న్యాయాన్ని అందించడం రచయితగా తన బాధ్యత అని కూడా స్వామి భావించి ఉంటాడు. భౌతిక పరిస్థితులు ఆ న్యాయం జరగడానికి పరిపక్వం కాలేదు. అందుకే ఆ రచయిత కవితాత్మక న్యాయం అందించడానికి మార్మికతను పనిముట్టుగా వాడుకున్నాడు. దీనివల్ల కథా వస్తువు సాధారణమైందే అయినా ప్రత్యేకమైన కథగా 'రంకె' నిలబడుతుంది.

- కాసుల ప్రతాపరెడ్డి

English summary
Swami, a short story writer in Telugu literature, writes about a farmer, who commits suicide, in Ranke. He ends rhe story with mystic element.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X