వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొంత ఇష్టం, కొంత అనిష్టం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kasula Linga Reddy
నాకు కొంత అనిష్టంగానే వుంది. మా తమ్ముడు కాసుల లింగారెడ్డి విమర్శలోకి అడుగు పెట్టడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకు రెండు కారణాలు.. ఒకటి- తెలుగు సాహిత్యంలో విమర్శ Thankless job.. రెండోది- నా వ్యక్తిగతమైంది. నేను పొందిన వ్యక్తిగత అనుభవాలకు వాడ్ని దూరంగా వుంచే ప్రయత్నం చేశాను. మొదటి విషయానికి వస్తే- విమర్శనారంగంలోకి అడుగు పెట్టడం ద్వారా కొత్తగా సమస్యలు కొన్ని తెచ్చుకోవడం ఎందుకనేది నా భావన. కవిత్వం, అంతగా అయితే కథలు రాసుకుంటే ప్రయోజనకరంగా వుంటుంది అని నమ్ముతూ వచ్చాను. అందుకే, సమీక్షలు, విమర్శనా వ్యాసాలు రాస్తానంటే నిరుత్సాహపరుస్తూ వచ్చాను. విమర్శకుడిగా పేరు పడితే- మనం రాసిన కవిత్వంపై, కథలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

జనగాంలో ఉంటూ సాహిత్య ప్రపంచానికి దూరంగా ఉంటున్న లింగారెడ్డికి కవిత్వంలో ని క్లుప్తతా ప్రాధాన్యం, వాచ్యరహిత పాదాల ప్రాధాన్యం, ఒక కవి తనను తానే brake చేసుకోవాల్సిన అవసరం మునుపటికన్నా ఎక్కువ తెలిసివచ్చిందని నమ్ముతుంటాను. అయి తే, లింగారెడ్డికి తన కవిత్వానికి మూలాలు ఎక్కడున్నాయో తెలుసు. అందుకే ఈ సంకలనంలోని 'కవిత్వానికి దండం పెడతా' అనే ప్రసంగ వ్యాసం అంత బలంగా వచ్చింది. కవిత్వ మర్మం వాడికి పూర్తిగా ఒంటబట్టింది. విప్లవ రాజకీయ కవిత్వానికి 'ఎన్నాద్రి' ఓ బలమైన నమూనాగా ముందుకు వచ్చింది. బలమైన విప్లవ రాజకీయ కవిత్వ భవిష్యత్తుకు ఇద్దరు ఆశను కల్పిస్తున్నారు. (నా దృష్టికి రాని మరికొంతమంది ఉండవచ్చు) వారిలో ఓ కవి లింగారెడ్డి కాగా, రెండో కవి ఎస్ జగన్ రెడ్డి. ఈ పుస్తకంలో జగన్ రెడ్డి తెచ్చిన కవితా సంకలనం 'జులూస్' మీద కూడా ఓ సమీక్షా వ్యాసం వుంది. జగన్ రెడ్డి రాసిన ముందుమాటపై లింగారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు జగన్ రెడ్డి సాహిత్య వ్యక్తిత్వాన్ని పట్టిస్తాయి.

జగన్ రెడ్డి కవిత్వం ఎవరికీ అనుకరణ గానీ, అనుసరణ గానీ కాదు. అతని కవిత్వ రూపం అప్పుడే వికసించిన పూల తాజాదనంలా ఉంటుంది. ఆ రకంగా అతను తెలుగు కవిత్వంలో నిత్యనూతనుడు. జగన్ రెడ్డి కవిత్వం శూలం చేతబూని మహోదగ్ర తాండవమాడే శివుడి ఉగ్రరూపం. రక్తకాసారం. అందులో లీనమై పాఠకుడు కొట్టుకుపోతాడు. అర్థం, ఆలోచన ద్వితీయమవుతాయి. ఆ రకంగా అత్యంత బలమైన కవిగా జగన్ రెడ్డి మిగిలిపోతాడు. లింగారెడ్డి కవిత్వంలో మృదు మధురంగా చెప్పే బోధకుడు కనిపిస్తాడు. కవిత్వ నిర్మాణ వ్యూహాల వల్లనే కాకుండా వ్యక్తిత్వాల వల్ల కూడా వారి కవిత్వాలకు భిన్నంగా కనిపించే ఏకరూపత వచ్చింది. కవిత్వానికి వచ్చేసరికి అంత బలంగా కనిపించే జగన్ రెడ్డి వచనంలో వైరుధ్యాలుగా కనిపించే వాక్యాలు ఎందుకు కనిపిస్తాయనేది ప్రశ్న. వాటిని లింగారెడ్డి అనార్కిజంలో కలిపేశాడు.

లింగారెడ్డి 'ఇరువాలు' సంకలనంలో ఎక్కువగా పుస్తక సమీక్షలే వున్నాయి. అయితే, వ్యాసాలు సమీక్ష పరిమితులను దాటి విమర్శనా స్థాయిని అందుకున్నాయి. రచనల్లో ఏం లేవో అని కాకుండా ఏం వున్నాయో చెప్పడం ఈ వ్యాసాల మంచి గుణం. ఆ రచనలు అలా వుండడానికి గల కారణాలను చెప్పిన వ్యాసాలు కూడా. తాను నమ్మిన సిద్ధాంతం వెలుగులో లింగారెడ్డి రచనలను విశ్లేషించే పని చేశాడు. అతను రాసిన వ్యాసాలను చదివితే రచనలను విశ్లేషించడానికి అవసరమైన పనిముట్లను, జ్ఞానాన్ని సంతరించుకున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సమీక్షను అతను ఆషామాషీగా తీసుకోలేదు. 'మునుం' కవితల గ్రంథాన్ని విశ్లేషించిన తీరు చూస్తే అతను ఎంతగా పరిణతి సాధించాడో అర్థమవుతుంది. తెలంగాణ ఉద్యమ పరిణామ క్రమాన్ని మూడు దశలుగా చెప్పి ఆ మూడు దశల్లో తెలంగాణ కవిత్వం ఏ విధమైన పరిణామాన్ని సంతరించుకుందో వివరించాడు.

లింగారెడ్డి రచనలను నేను నా రచనల కన్నా ఎక్కువే ప్రేమించాను. అయితే, వాడితో నాకు విభేదాలు లేవని కాదు. నాకు సంబంధించిన విషయాల్లో నేను ఎలా కచ్చితంగా వుంటానో, తన విశ్వాసాల పట్ల కూడా వాడు అంతే కచ్చితంగా వుంటాడు. ఈ విషయాల పట్ల మా ఇద్దరి మధ్య ఎప్పుడూ చర్చ జరుగుతూనే వుంటుంది. అందువల్లనే ఈ వ్యాసాల్లో కొన్ని విషయాల పట్ల నాకు విభేదాలున్నాయి. సుంకిరెడ్డి నారాయణరెడ్డి 'తెలంగాణ చరిత్ర'పై చివరగా లింగారెడ్డి ఓ కామెంట్ చేశాడు. ఆ వ్యాఖ్య వాడి విశ్వాసాల నుంచి వచ్చిందే. తెలంగాణ సాయుధ పోరాటం మీద సుంకిరెడ్డి సీతకన్ను వేశాడనేది ఆ వ్యాఖ్య. అయితే, తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి పునర్విశ్లేషణ జరగాల్సి వుంది. తెలంగాణ రెండు లేదా రెండున్నర జిల్లాలకు పరిమితమైన ఆ పోరాటాన్ని తెలంగాణ సమాజం మొత్తానికి అన్వయింపజేయాలా అనే దగ్గర నుంచి ఆ విశ్లేషణ ప్రారంభం కావాల్సి వుందనేది నా అభిప్రాయం. శ్రీకాకుళ పోరాటం, గోదావరిలోయ పోరాటం అని పిలిచినట్లు కాకుండా మొత్తం తెలంగాణకు అన్వయించడం వెనక పనిచేసిన శక్తులు ఏవి, ఆ శక్తులు ఆశించిన ప్రయోజనాలు ఏమిటి, ఆ ప్రయోజనాలను ఆ శక్తులు ఏ మేరకు పొందాయి వంటి విషయాలను తెలంగాణ ప్రాంతీయ లేదా స్థానిక ఉద్యమ నేపథ్యంలో బేరీజు వేయాల్సి వుంటుందని నేను ప్రస్తుతం చేస్తున్న ఆలోచన. బహుశా సుంకిరెడ్డి నారాయణరెడ్డి వివాదాలకు దూరంగా వుండి అక్కడ ఆగిపోయి వుంటాడేమో, చూడాలి.

ఇక, మరో విషయం- అస్తిత్వ ఉద్యమాల పట్ల లింగారెడ్డికి వున్న అవగాహన సరైందా, కాదా అనేది చూడాల్సే వుంది. అస్తిత్వ ఉద్యమాలు వేటికవే విముక్తం కావని, ఆయా సామాజిక శ్రేణులు పాలక వర్గాలకు ఉపయోగపడతాయని, వాటి విముక్తి ఉమ్మడి పోరాటంలో భాగంగానే జరగాలని అంటాడు. వాటి పుట్టుక, వాటి వికాసం, ఉమ్మడి పోరాటాల్లో అవి నిర్వహించే పాత్రలపై ఒక స్పష్టమైన అవగాహనకు రావాల్సే వుంది. లాటిన్ ఆమెరికాలోని ప్రజాస్వామిక రాజకీయాల ప్రయోగం (అవి పూర్తిగా కమ్యూనిస్టు ఉద్యమాలు కాకపోవచ్చు కూడా) భారతదేశానికి మార్పులు చేర్పులతో అన్వయించుకోవడానికి కుదురుతుందా, కుదరదా అనే ఆలోచన ఎంత అవసరమో, అస్తిత్వ ఉద్యమాల పట్ల సానుకూల వైఖరి కూడా అంతే ముఖ్యమని నా భావన. నిజానికి, లింగారెడ్డి బలపరుస్తున్న తెలంగాణ ఉద్యమం కూడా అస్తిత్వ పోరాటమే. అన్ని అస్తిత్వాలు విడివిడిగా తమ ఉనికి, మనుగడ, ఆత్మగౌరవం కోసం పోరాటం సాగిస్తూనే ఉమ్మడి ఉద్యమాల్లో ఉన్నాయా, లేదా అనేది చూడాల్సి వుంది. కొంతమంది అస్తిత్వ పోరాటాలను కెరీర్ కోసం వాడుకున్నారు కాబట్టి వాటి ప్రయోజనం అంతకు మించి వుండదనే నిర్ధారణకు రావడం సరైంది కాదని నేను అనుకుంటూ ఉన్నాను.

వి.చంద్రశేఖరరావు దళిత ఉద్యమ నేతపై రాసిన 'మోహనా, మోహనా' కథను 'దారి తప్పిన మోహనరాగం' శీర్షికతో గుడిపాటితో కలిసి విశ్లేషించే విషయంలో నేను దీన్నే ప్రాతిపదికగా తీసుకున్నాను. అన్ని ఉద్యమాల్లోనూ కెరీరిస్టులు వుంటారు, వారు చిత్తశుద్ధితో వ్యవహరించేవారి కన్నా దూకుడుగా కూడా వుండవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాలను చూస్తూనే వున్నాం. అందువల్ల సుంకిరెడ్డి పుస్తకంపై రాసిన సమీక్షావ్యాసంలోనే కాకుండా మిగతా కొన్ని వ్యాసాల్లో లింగారెడ్డి అస్తిత్వ ఉద్యమాల పట్ల వ్యక్తం చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఇదంతా రాయాలనిపించింది.

- కాసుల ప్రతాపరెడ్డి

(కాసుల లింగారెడ్డి ఇరువాలు పుస్తకానికి రాసిన ముందుమాటలోంచి కొన్ని భాగాలు.. ఈ నెల 17వ తేదీన జనగాంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరుగుతోంది. ఈ సందర్భంగా...)

English summary
As poet, Dr kasula Linga Reddy is powerful in Telugu literature. His Telugu literary criticism poses few questions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X