• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేపథ్యం: స్వభావం కవిత్వం

By Pratap
|
Krishnudu
(సాహిత్య ప్రపంచానికి కృష్ణారావు కన్నా కృష్ణుడే ఎక్కువగా తెలుసు. జర్నలిజానికి కృష్ణారావు తెలుసు. నిజానికి వీరిద్దరు వేర్వేరు కావచ్చు అని అనుకునేవారు కూడా ఉన్నారు. ఇద్దరూ ఒక్కటే. సాహిత్యం, జర్నలిజం కృష్ణుడు అలియాస్ కృష్ణారావుకి రెండు కళ్లు. కవిత్వాన్ని గుండెకు హత్తుకునే విధంగా ఎంత అద్భుతంగా రాయగలరో, రాజకీయాలను అంత విశ్లేషణాత్మకంగా రాయగలరు. నిజానికి, ఈ రెంటికీ పొత్తు కుదరదేమో.. మంచి కవి మంచి జర్నలిస్టుగా రాణించలేపోవచ్చు. జర్నలిస్టు కవిని నిర్మూలించవచ్చు. కవిత్వాన్ని, సాహిత్య సృజనను కొనసాగించాలంటే గుండె తడిని కాపాడుకోవాల్సిందే. దానికి నిరంతర తపన, తండ్లాట కావాలి. ఆ గుండె తడి, తండ్లాట ఉంది కాబట్టే, ఆధిపత్యాలను ప్రశ్నించే ఆగ్రహజ్వాల రగిలిస్తుంది కాబట్టే ఆయన సాహిత్య సృజనలో ఉన్నత స్థాయిని అందుకున్నారు. ఆయన సాహిత్య నేపథ్యాన్ని చదువుదాం...)

ఎందుకో గాని కవిత్వం నా స్వభావమైంది. కవిగా, రచయితగా, సాహిత్య విమర్శకుడుగా మొదలు పెట్టి నేను జర్నలిస్టుగా స్థిరపడిపోయాను. కవిత్వం, రచనలే నన్ను జర్నలిస్టు వృత్తిలోకి నెట్టివేశాయి.

మా తాత అప్పరుసు లక్ష్మీ నరసింహారావు గోలకొండ కవుల్లో ఒకరు. వీరరాఘవా అన్న శీర్షికతో ఆయన కవిత్వం గోలకొండ సంచికలో కనపడుతుంది. మా ముత్తాత ఒకప్పటి కర్ణాటకలో భాగమైన గద్వాల సంస్థానంలో మంత్రిగా ఉండేవారట. మా ఇంటిపేరులోని అరుసు చూస్తే కర్ణాటక మూలాలు ఉన్నాయేమో అన్న అనుమానం ఉన్నది కాని నాకు పరిశోధించే తీరిక లేదు. ఊహ తెలిసినప్పటి నుంచీ మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలంలోని వింజమూరు, ఆ ఊరుకు వెళ్లే ఏరు, ఎడ్లబండి, కల్వకుర్తి, మక్తల్, మహబూబ్‌నగర్ జిల్లాలోని బేసిక్ ప్రాక్టీసింగ్ స్కూల్ ఇవే నా మనసుల్లో మెదలుతూ ఉంటాయి.

మా నాన్నగారు తెలంగాణ పోరాటంలో మఖ్ధూమొహియిద్దీన్ ప్రభృతులతో కలిసి పాల్గొన్నారు. ఆయన ఉర్దూ కవితలు రాసేవారు. కొంతకాలం సియాసత్ పత్రికలో పనిచేశారు. మా పెద్దన్న విజయరామారావు సంస్క­ృత ప్రియుడు. మా తాత నరసింహారావు ప్రభావం ఆయనపై ఎక్కువగా ఉన్నది. వీటన్నిటితో పాటు పాతబస్తీలోని అభినవ కళాసాహితి, హైదరాబాద్ పాతనగర రచయితల సంఘం కార్యక్రమాలు, అక్కడి గ్రంథాలయాలు నాపై ప్రభావాన్ని చూపాయి. అందువల్ల నాకు ప్రాచీన,ఆధునిక సాహిత్యాలపై అభిరుచి చిన్నప్పటినుంచే ఏర్పడింది. మా నాన్నగారి వల్ల ప్రశ్నించే తత్వమూ ఏర్పడింది.

నా తొలి కవిత కలువ పూవుపై. . కటిక చీకటిలోన కలువమా, కాంతి చెందెందవేలచెపుమా, నిశీథిలో అసురుడివలె ఎసరేక ఎల పెరిగెదవో.. అన్న కవిత 12 ఏళ్ల వయస్సులోనే రాశాను. ఘంటసాల చనిపోయినప్పుడు కూడా నేను ఒక కవిత రాశాను. మా నాన్నగారు ఉద్యోగ నిమిత్తం వరంగల్ వచ్చిన తర్వాత అక్కడి సామాజిక వాతావరణం నాలో తీవ్రమైన మార్పులు తెచ్చింది. మొదట్లో ఇంటర్‌లో వాణివి, వీణాపాణివి.. అంటూ సరస్వతీదేవిపై కవిత రాశాను. ఆ తర్వాత ధర్మవస్త్రం పేరుతో జనధర్మ పత్రికలో ఏదో గిలికాను. గుంటూరు శేషేంద్ర శర్మ కవిత్వానికి ప్రభావితుడనై ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను. మనుచరిత్రను ప్రవరాఖ్యోపాఖ్యానం పేరిట పద్యాల్లో రాశాను. శ్రీపాద రాసిన వడ్లగింజలు చదవడం నేను చెస్ నేర్చుకోవడానికి ప్రోద్బలం కలిగించింది. ఇంటర్‌లో ఉండగానే సాంస్క­ృతీ సమాఖ్య నిర్వహించిన మినీకవితల పోటీలో పాల్గొన్నాను. వాళ్లు రాష్ట్రస్థాయిలో బహుమతి గెలుచుకున్నాను. ఆ తర్వాత సృజన సాహితీ మిత్రులతోను, విరసంతోనూ సంబంధాలు ఏర్పడ్డాయి. వచనకవిత్వంపై నా తొలి సాహితీ వ్యాసం 80లోనే సృజనలో వచ్చింది. ఆ తర్వాత వరంగల్ నిర్బంధాన్ని చిత్రిస్తూ రాసిన నగరం కవిత కూడా సృజనలోనే వచ్చింది. మరెన్నో కవితలు ఆ తర్వాత వివిధ సాహితీ పత్రికల్లో వచ్చాయి. త్రిపురనేని మధుసూధన రావు గతితార్కిక సాహిత్య భౌతిక వాదం తర్వాత నా దృష్టి సాహిత్య విమర్శపై మళ్లింది. త్రిపురనేని, అద్దేపల్లి, మందలపర్తి కిషోర్ మొదలైన అనేకమందితో నిరంతరం ఉత్తరాలతో సాహిత్య, సైద్దాంతిక చర్చ చేసేవాడిని. మా ఇంగ్లీషు లెక్చెరర్ జెసి, బాలగోపాల్, సుబ్బారావు(సురా)లతో నిరంతరం చర్చ, అధ్యయనం, రచనలు సమాంతరంగా సాగాయి.

మొదట్లో సిర్పూర్ పేపర్ మిల్స్, తర్వాత హైదరాబాద్‌లో బ్రిస్టల్ ఫార్మసుటికల్స్‌లో పనిచేశాక, ఉదయం ప్రారంభమైనప్పుడు అందులో చేరాను. అప్పటికే 1983లో ఆం«ధ్రభూమిలో సాహితీ చౌరస్తా అన్న పేరిట ఒక సాహితీ కాలమ్ నిర్వహించాను. సాహితీ సభల్లో మాట్లాడడం కూడా ప్రారంభించాను. సాహిత్య విమర్శకుడుగా రావిశాస్త్రి, గుంటూరుశేషేంద్ర శర్మ, వరవరరావు, వెల్చేరు, శివారెడ్డి, సిధారెడ్డి, అఫ్సర్, సీతారామారావు, ప్రసేన్ మొదలైన హేమాహేమీల పుస్తకాలు సమీక్షించాను. వీరేశలింగంతో ప్రారంభమైన సాహితీ ప్రక్రియలను విశ్లేషించాను. పఠాభి లాంటి వారిని ఇంటర్య్యూ చేశాను. చేరాతో తలపడ్డాను. ఆరుద్రను ప్రశ్నించాను. తెలుగుసాహితీ విమర్శకు ఒక అయిదారేళ్లు ఒరవడిగా నిలిచాను. కొత్త గొంతుకల ప్రత్యేకతను తెలిపాను. అప్పటి సామాజిక భావోద్వేగం అలాంటిది. ఉదయంలో ఎబికె ప్రసాద్, వాసుదేవరావు, పతంజలి ఒకవైపు, బయట శివారెడ్డి, సిధారెడ్డి బృందం మరో వైపు నా ఆలోచనాధోరణిని విస్తృతం చేశారు.

ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలు ప్రదానంగా చైనా, సోవియట్‌ యూనియన్, జర్మనీ దేశాల్లో వచ్చిన మార్పులు, మన రాష్ట్రంలో అప్పుడప్పుడే తలెత్తుతున్న అస్తిత్వ వాద ధోరణులు, సంస్కరణల పూర్వయుగం నాలోనూ మార్పులు తెచ్చాయి. స్తబ్దత సమయంలో రామ్మోహనరాజుతో కలిసి జంట కవిత్వం రాసిన నేను ఆ తర్వాత అఫ్సర్ ప్రభృతులతో కలిసి క్రితం తర్వాత పేరుతో గొలుసు కవిత్వమూ రాశాను. విరసంలో దాదాపు ఒక దశాబ్దకాలం ఉన్న అనుబంధమూ అప్రయత్నంగా విడివడింది. మన కలలే వాస్తవాలని అనుకుంటే ఎక్కువకాలం సాగదు కదా.

1992లో ఢిల్లీ వచ్చాక దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక వాతావరణం మారిపోయింది. నా ఆలోచనల విస్త­ృతీ పెరిగింది. అయితే పునాది మాత్రం చెక్కుచెదరలేదు. ఒక ప్రగతిశీల దృక్పథంలో ప్రపంచాన్ని చూడడం అలవోకగా అలవాటైంది. జర్నలిస్టుగా బాబ్రీమసీదు విధ్వంసం, గుజరాత్ అల్లర్లు స్వయంగా చూశాను. ఆర్థిక సంస్కరణలు జీవితాలపై తెచ్చిన మార్పులు, ప్రపంచ పరిణామాలు గమనించాను. స్టాక్ మార్కెట్. రక్షణ కుంభకోణాలు, పార్లమెంట్‌లో ముడుపులు, ప్రజాప్రతినిధుల తీరుతెన్నులు నాకు వ్యవస్థపై ఒకరకమైన ఏహ్యభావాన్ని ఏర్పరిచాయి. రాష్ట్రంలో సాహిత్య, సామాజిక రంగంలో వచ్చిన మార్పులు, కుల అస్తిత్వ సంఘర్షణలనూ గ్రహించాను. జాతీయ, ప్రపంచ సాహిత్య అధ్యయనంతో పాటు సామాజిక శాస్త్రాలు, చరిత్ర అధ్యయనం కూడా నాకు జర్నలిస్టుగా, కాలమిస్టుగా అవసరమైంది. నేను అప్పుడప్పుడూ, ఎదమండినప్పుడల్లా రాసే కవిత్వంలోకానీ, పత్రికలో రాసే ఇండియాగేట్ కాలమ్‌లో కాని ఇప్పుడేవీ సందేశాలు లేవు. ఆశావహ వ్యాఖ్యలూ లేవు. పోరాట స్ఫూర్తీ కనిపించదు. ఇవన్నీ చేసి చేసి యాంత్రికమై, ఇప్పుడు ఆలోచన, ఆవేదన, ఆర్ద్రతను గాఢంగా చిత్రించడం అలవాటైంది. కాని స్వభావం మాత్రం కవిత్వమై మిగిలింది.

-ఎ.కృష్ణారావు అలియాస్ కృష్ణుడు

కృష్ణుడు కవిత 'మృత్యుకేళి' మచ్చుకు చదవండి..

ఎండతో కాలిపోయే
నేలకు తెలియదు
తనపై చితి
నినదిస్తూ
ప్రవహిస్తుందని

విద్యుత్ లే దని
విశ్రాంతి తీసుకుంటున్న
స్తంభానికి తెలియదు
తనపై వ్రేళ్లాడుతున్న
మనిషి నరాల్లో
విద్యుత్ ప్రవహిస్తోందని

రహదారిపై
వేగం పుంజుకున్న
వాహనానికి తెలీదు
వాడే తనను ఢీకొని
మృత్యు ప్రయాణాన్ని
ఆహ్వానిస్తాడని

ఇండియాగేట్ వద్ద
పిల్లల ఆటల్ని చూసి
సంతోషిస్తున్న
పచ్చటి చెట్టుకు తెలియదు
రాత్రి నిద్రపోయిన తర్వాత
అతడు
తన క్రింద శవం
నీడవుతుందని

పరీక్షాకేంద్రంలో
ఆమె రాకకోసం
ఎదురుచూస్తున్న
ప్రశ్నాపత్రాలకు తెలియదు
పోరాటపరీక్షలో ఓడి
ఆమె
చావు పుటల్ని
స్ప­ృశించిందని..

శవ వ్యాపారుల
చరిత్రహీనుల చట్టసభల్లో
మృత్యుకేళి
పదవీసోపానమైనప్పుడు
ప్రతి నినాదం ఒక ఆర్తనాదం!
ప్రతి ఉద్యమం ఒక భౌతిక కాయం !

English summary
As a Krishna Rao he is a prominent journalist working for a Telugu daily from Delhi, as a poet he is Krishnudu known for his immense creativity. Krishna Rao alias Krishnudu literary back ground is worth reading.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X